కపిల రాంకుమార్ ||తాగి కసిగా తిట్టుకుంటున్న యువకుని ఆత్మ ఘోష ||
అరవై ఏండ్ల కష్టాలకు
చరమగీతం పాడాలని
ఏ వర్గాలైతే ఇన్నాళ్ళు
దోచుకున్నాయో
ఆ వర్గ నేత యెనకాల
గొర్రెల్లా భుజాలెగరేసుకుంటూ
తిరిగినా
బుర్ర రామకీర్తన పాడినా
సర్రున వాతలు పడినా
ఎర్రని మంటల్లో కాలిపోయినా
సమిధల్లా దూగిన గుంపులో
యువకులు, విద్యార్థులు
బలిదానం చేస్తే!
ఒరిగిందేమిటి ?
సానుభూతి వొలకబోసి
మీరే రాబోయే నిర్ణేతలంటే
నిజమే కామోసు అనుకుని
ఇల్లు వాకిలి చదువు చట్టుబండ
ఉద్యోగాలు వదులుకుని
ముందేమిటోసూడకుండ లాఠీల దెబ్బలు మంటవెట్టినా,
కేసులంటూ ఠాణాలెమ్మటి తిరుక్కుంటూ
కోర్టూ వాయిదాలకు కాళ్ళరిగినా
రాజ్యం మనదేనని నమ్ముకుంటే ఏం జరిగింది
ఓ పాలి యెనక్కి తిరిగి చూడండి!
మీ వోడే గద్దెనెక్కేదంటూ
మీ అర చేతిలో వైకుంఠం చూపినారా
తీరా కడకొచ్చినంగ అంజనం వేసిన మాట
జమ్మిచెట్టుకే కట్టేసి థూ నాబొడ్డు లెక్కన
తరిమికొట్టింది యాదికొస్తలేదా
సామాజిక తెలంగాణ కావాల్నని మొత్తుకుంటే
వినవడలే....వెనవెనకనే దూరి
తాయిలాలకమ్ముడుబోయి
మూతబడ్డ నోర్లు ఇకనైనా తెరువుండ్రి
పంచె లూడగొట్టాలె
ముక్కు నేలకు రాయాలన్నోడు
ఈడ నగరం మండుతవుంటే
ఆడ బంగారం దానం చేస్తండు
సొమ్ము మనది, పేరు ఆయనది
సుఖం ఆయనది కష్ట నష్టాలు మనయి
థూ! నీ బతుకుచెడ!
అని మనకి మనమే బండనూతులు తిట్టుకోవాలె
దీనమ్మ జీవితాన్ని ఆరి యెనక కాక
సబ్బరచెప్పే నీల్ లాల్ జెండా లెనక
దిరిగినా జనం మెచ్చుకునేటోరు
పదవులుచ్చుకుని పాచిమాటలు మాటాడబోకండ్రి
జనం యెట్ట సత్తే మనకేం
మన జనానా మెచ్చుకుంటే చాలకునే
కొత్త పదవీ బిచ్చగాళ్ళారా
నోటికి యేసిన కుట్లు తెంపుకు వస్తారో
జనం ఉమ్మేసే వరదలో కొట్టుకు పోతారో తేల్చుకోండి