Monday, November 17, 2014

కపిల రాంకుమార్||సాహితిస్రవంతి అధ్యయన వేదిక మూడవ ఆదివారం 16.11.2014 ||


కపిల రాంకుమార్||సాహితిస్రవంతి అధ్యయన వేదిక మూడవ ఆదివారం 16.11.2014 ||
ప్రతీ ఒక్కరు సాహిత్య అధ్యయన కావించనదే కొత్త కొత్త సాహిత్య ఒరవడిని అందిపుచ్చుకోలేరు. నిరంతర అధ్యయనం కవులకు అవసరం అని చెబుతూ సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి రౌతు రవి '' సాహితీ స్రవంతి అధ్యయనవేదిక '' జరిపే మూడవ ఆదివారం సమావేశంలో అన్నారు. కవులే కాదు ప్రతీ విద్యార్థి, యువకుడుచదివితీరవలసిన '' మాలాలా '' పై ప్రజాశక్తి వారు ప్రచురించిన పుస్తకమని అన్నారు. ఆమే ఏ విధంగా అఫ్ఘన్ తాలిబన్ల క్రౌర్యానికి, దాడులకు ఎదురునిలబడి ప్రతి ఒక్కరు చదువుకోవాలి అనే నినాదమొక్కటే ధ్యేయంగా నిలబడిందో, ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొందో ఆ పుస్తకంలో వివరంగా వున్నాయని, ఆమె పటుదల, నిబద్ధతే '' శాంతి '' పురస్కారానికి మార్గం వేసిందని అన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం గ్రంథాలయంలో ఆదివారం సాయంత్ర సాహితీ స్రవంతి ప్రతినెలా జరిపే మూడవ ఆదివారపు అధ్యయన వేదికలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. '' నవ తెలంగాణా నిర్మాణంలో కవుల పాత్రపై ఉపన్యాసకుడుగా కవితా డిగ్రీకాలేజి ఉప ప్రధానచార్యుడు డా. సి.హెచ్.ఆంజనేయులు ని వేదికపైకి సాహితీ స్రవంతి ఖమ్మం పట్టణ అధ్యక్షుడు సంపటం దుర్గా ప్రసాదరావు అహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు కన్నేగంటి వెంకటయ్య, గ్రంథాలయ నిర్వాహకుడు, అధ్యయనవేదిక ప్రధాన బాధ్యుడు కపిల రాంకుమార్, శ్రీమతి సునంద వేదికపైకి ఆసీనులైనారు. కన్నెగంటి వెంకటయ్య అధ్యక్ష ఉపన్యాసం కావిస్తూ ప్రతి నెల మూడవ ఆదివారం క్రమం తప్పకుండా సాహితీస్రవంతి అధ్యయనవేదిక నిర్వహించబడటంలో గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ కృషి అభినందనీయమని ఇది 14 వ ఆదివారమని గుర్తుచేసుకుంటు సాహిత్య శిల్ప సమీక్షలు, సిద్ధాంత విమర్శలు, పుస్తక అధ్యయనాలు, కవితా పఠనాలు, గేయాలాపనలు ఇన్నాళ్ళుగా కొనసాగిస్తూవున్నమని. ఇది నిరంతరం కొనసాగాలని, ఇంకా సమావేశాలకు సమయాన్ని పాటించాలని, కొత్త వారిని రాబట్టుకోవాలని, శిక్షణాతరగతులకు ప్రణాళిక వేసుకుని మరింత ముందుకు పోతూ తెలంగాణా జిల్లాలలో మనది అదర్శంగా నిలవాలని కోరారు. విశ్రాంత ఇంజనీర్-ఇన్-ఛీఫ్ శ్రీ పి. సాంబశివరావు గారు ఎంతో ఓపికతో తన వార్థక్యాన్నికూడ లెక్కచేయక హాజరు అవటం విశేషం. వారు మాట్లాడుతూ పాత కొత్తల మేలు కలయికగా ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను తడుముతూవూండాలని అంటూ కొన్ని ప్రముఖ ప్రాచీన కవుల పద్యాలను, సంస్కృత శ్లోకాలను, హాస్య శతక పద్యాలను వినిపించి, చివరగా అధునిక రీతిలో '' గడచిన విద్యార్థి జీవితాన్ని నా కొకసారి ఇవ్వు '' అనే గేయాన్ని వినిపించి అందరిని అలరించారు. సాహితీ స్రాంతికి ఆర్థిక వనరులు చేకూరే విధంగా కొన్ని సూచనలు చేసారు. వాటిని పరిగణనలోకి తీసుకును అందుకు కావలసిన ప్రయత్నాలు నలుగురితో చర్చిస్తామని కపిల రాంకుమార్ హామీ యిచ్చారు.'' నవ తెలంగాణా నిర్మాణంలో కవుల పాత్ర '' అనే ఆంశంపై వివరణాత్మక ప్రసంగం చేస్తూ పాల్కురికి సోమనాథుడు, పోతనల సాహిత్యాలలో దేశీయ పలుకుబడులు, తెలుగు నుడికారాలు, మనకు కనబడతాయని, బుర్రకథలు ఒగ్గుకథలు, పల్లెసుద్ధులు లాంటి కళారూపాలు ఆవిర్భవించాయని, పండుగులు, తిరునాళ్ళు, సాంస్కృతిక చైతన్యంద్వారా నిజాము నెదిరించే గేయ సాహిత్యం సుద్దాల హనుమంతు, యాదగిరి లాంటి సంపన్నంచేసారని, నేటికాలాని వస్తే గోరేటి వెంకన్న అశోక్తేజ,అందెశ్రీ, మరెందరో కవులు, కళాకారులు, కన్నభూమి తెలంగాణా. దాశరథి సోదరులు, రావెళ్ళ , కవిరాజమూర్తి, పుల్లాభొట్ల, హీరాలాల్ మోరియా లాంటి ఉద్దండులు ఎంతో ఉత్తేజకరమైన సాహిత్యాన్ని అందించారు. పల్లెల జీవనాన్ని ఆలంబనగా ఎన్నో పోరాట గీతాలు, కవిత్వం, నాటకం, నవల కథానిక ప్రక్రియలు వెలిసాయి. మాభూమి, ముందడుగు వంటి నాటకాలు నాటి తెలంగణ పోరాటానికి వత్తాసు పలికాయని, పడమటి గాలి ధాటికి తట్టుకునే రీతిలో సాహితీ స్రవంతి లంటి పలు సాహితీ సంథలు ప్రపంచీకరణ, ఉగ్రవాదం, మతోన్మాదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించి కృషిచేస్తున్నాయని, అలాంటి సాహితీ స్రవంతి కార్యక్రమాల్లో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తానని అన్నారు. పీడిత తాడిత జనావళికి మేలు జరిగేలా మార్క్సిజమే అధారంగా సాహిత్యం అవిర్భవిస్తేనే నవ తెలంగాణాలో ప్రజా కవిత్వానికి సరియైన స్థానం పొందగలదని, అందుకు నిత్యం సమాజ శ్రేయస్సును ఆలంబనగాచేసుకునే సాహిత్య సృజన చేయాలని కోరారు. తన సాహిత్య అభిలాషకు సుబ్బారావు పాణిగ్రాహి గేయం ప్రేరణ అంటూ వారి గేయం '' ఎన్నాళ్ళీ కాపురాలు '' గుర్తు చేసారు రాంకుమార్ దానిని కన్నెగంటి వెంకటయ్య చక్కగా భావయుక్తంగా ఆలపించి అందరిని ఉత్తేజపరిచారు. సునంద బాలలపై ఒక గేయం చదివి వినిపించారు. శ్రీమతి సునంద వందన సమర్పణ చేసారు...
17.11.2014

Sunday, November 16, 2014

సాహితీ-యానం: చదువులు

సాహితీ-యానం: చదువులు: స్వచ్ఛమైన సెలయేరు పొర్లుతూ దొర్లుతూ నదిని చేరేసరికి నిలువెల్లా మురికి మురికి బొల్లోజు బాబా

Saturday, November 15, 2014

కపిల రాంకుమార్|| వెలుగు ఎపుడు ? ||
చాచా నెహ్రూ పుట్టినరోజంటే
బాలల దినోత్సవమని అందరికీ ఎరుకే!
ఆటలు, పాటలు, గురువుల్లా పాత్ర పోషణలు
బహుమతులు ఉపన్యాసాలు
రోటీన్‌గా రేడియో, దూరదర్శన్‌ అన్ని మీడియాల్లో
పోటాపోటీ వార్తలు
మార్మోగటానికెన్ని పాట్లో!
బడిలోని బాలల భవితకే
బడ్జట్‌లో నిధులు అరకొర కేటాయింపైతే
వీధిబాలల, బాల కార్మికుల గోడు పట్టించుకునేదెవరు!
వేళ్ళమీద లెక్కపెట్టగల స్వచ్చంద సంస్థలు తప్ప!
సర్కారు శాఖలో విద్యా విభాలెన్నెన్నో వున్నా
నిబద్ధత కరువైంది
ప్రతి సంవత్సరం
ఒక కొత్త ఆశ!
కాని నిరాశగానే మిగిలిపోతోంది
శివాలయం సందులో
బచ్చాగాళ్ళు బచ్చాలాడుతోనో
ఆవారా పిల్లలు బారులో తాగేవాళ్ళకి
'' నంజు ముక్కలు '' సరఫరా చేస్తొనో
బలిసిన దొరసాని పిక్కలు పిసుకుతోనో
కామాంధుడైన కామందుగారి చుంబన క్రీడలో
పెదాలు రక్తమోడుతోనో
రైల్వే భోగీల్లో ఓ మూలగా దాక్కుని
భంగు పట్టిస్తూనో
మత్తునిచ్చేది అస్వాదిస్తూ
చొక్కా చిరిగినా, లాగూబొత్తం వూడి పోస్టాఫీసులైనా
కాలం ఆకలిని తింటూంటే,
వీరు దుప్పి భోజనం చేస్తోనో
భావిపౌరులు కాలేని వారికి దిక్కెవరు?
ఎవరి దయా దాక్షిణ్యాలకోసమో ఎదురుచూస్తోనో
అర్థంకాని భేతాళ ప్రశ్నలా
మరల మర్రిచెట్టెక్కిన శవంలా
వేలాడుతూనో వుంటే.....
వెలుగు ఎపుడు ?

14.11.2014 / 15.11.2014
 

Thursday, November 13, 2014

కపిల రాంకుమార్ ||ఆసరా||

కపిల రాంకుమార్ ||ఆసరా||
'' నేనిప్పుడు
ఓ జీవిత భాగస్వామిని
ఆహ్వానించబోతున్నాను
ఈ నెల రెండో ఆదివారం

తప్పకుండా రాగలవ'' న్న
నాన్ననుండి కబురొచ్చినప్పుడు
కొంత ఆశ్చర్యం మరికొంత నమ్మకం
కలిగింది.
**
నాకు బాగా గుర్తు
అమ్మ మరణం!
అన్నయ్యకు 16 నాకు 14 వచ్చిన రోజు!
ఆ రోజే నేను వ్యక్తురాలవ్వటం!
మాయదారి గుండెపోటుతో
అమ్మ కన్నుమూయటం!
ఆ దృశ్యం కళ్ళలో మెదిలినప్పుడల్లా
కన్నీరు మున్నీరవుతుంటాను!
**
షష్ఠి పూర్తికి కొత్త వధువుతో
రెండో పెళ్ళి
ఇన్నాళ్ళు ఒంటరిగా తన భుజాలపై
శ్రమనంతా మోసిన నాన్న
ఆఖరి రోజుల్లో ఆసరా కోసం
తోడుకోరునుంటున్నాడే కాని వేరేకాదని
అర్థమైంది!
**
అన్నయ్య అమెరికాలో స్థిరపడ్డాడు
నాన్న బాగోగులు చూచేవారుండాలి కదా!
నేనేదో చుట్టపు చూపుగా
నాలుగురోజులుండిపోయేదాన్నే
శాశ్వతంగా నాన్నను అంటిపెట్టుకుని వుండలేను కదా!
అందుకే నాన్న నిర్ణయం
సమంజసమనిపించింది
చివరి రోజుల్లో ఆసరా దొరుకుతున్నందుకు
సంతోషమనిపించింది!
అందుకే మనసారా నాన్నను
అభినందిస్తున్నాను.
**
13.11.2014.....2.35 pm