Tuesday, November 24, 2015

డా. వై.ఆర్.కె.సాహితీ పురస్కారాలు - దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

కపిల రాంకుమార్‌ ||నివేదిక ||దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

డా. వై.ఆర్.కె. సాహితీపురస్కారాలందుకుంటున్న ఈ సభ ఒక ప్రత్యేకత సంతరించుకున్నదని, దేశమంతటా కవులు సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి యిచ్చివేస్తున్న సందర్భంలో, ఒక సాహిత్య అభిమాని, ప్రజావైద్యుడు కీ.శే. డా. వై.ఆర్.కె. గారి పేర అవార్డులు ఖమ్మం జిల్లాకు చెందిన వారు అందుకోవటమంటే, ఇవి  ప్రజా అవార్డులని తెలంగాణా సాహితి రాష్ట్ర కన్వీనర్ కె. ఆనందాచారి అన్నారు.

తెలంగాణ సాహితీ ఖమ్మ జిల్లా ఆధ్వర్యంలో 10.11.2015న దీపావళి కవి సమ్మేళనం మరియు సాహితీ పురస్కారాల సభకు తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు  కన్నెగంటి వెంకటయ్య అధ్యక్షతన స్థానిక బోడేపూడి  విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో పలువురు వక్తలు మాట్లాడారు. డా. రాధాకృష్ణమూర్తి వ్యక్తిత్వం, ప్రజాసేవా, అధ్యయన శీలత, సాహితి అవగాహన పలు అంశాలను ప్రముఖులు తమ జ్ఞాపకాలను  గుర్తు చేసుకున్నారు. అత్యంత ఉత్సాహ వాతావరణంలో నిర్వహించబడింది.  ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు, విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు, విశ్రాంత ఆచార్యుడు డా. పి.వి.సుబ్బారావు,
జన విజ్ఞావేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్ర రావు, తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనరు కె. ఆనందాచారి వేదికపైఆశీనులయ్యారు.

తన అధ్యక్షోపాన్యాసంలో కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ ఒక ప్రత్యేక సందర్భంలో జరుపుకుంటున్న  సభ, ఒక తాత్త్విక కవితా విశ్లేషణను కలిగించి,వక్తగా, ప్రజా వైధ్యుడుగా, నడయాడే గ్రంథాలయంగా, ప్రజల మనిషిగా, పరిణితి చెందిన రాకజీయ వేత్తగా, అంతకంటే సామాజికవేత్తగా గొప్ప మానవహక్కుల పోరాట నేతగా, సామాజిక దార్శినికునిగా పేరొందిన మహా మనిషి కీ.శే.డా. వై.రాధాకృష్ణమూర్తిని స్మరించుకుంటూ ప్రథమ వర్థంతిజరిగిన సందర్భంలో పురస్కారాలు అందుకోవటం, మిగతా ప్రభుత్వ పురస్కారాలకు  భిన్నమైనదని చెప్పవచ్చునన్నారు.తెలంగాణసాహితి రాష్ట్ర కన్వీనరు కె.ఆనందాచారి మాట్లాదుతూ పురస్కారాలు అందుకుంటున్న కవులకు మొదటగా అభినందనలు తెలిపారు.గతంలో ఖమ్మం సాహితీ గుమ్మంలో సాహితీ సేద్య చేసిన మహామహులతో మహా కవి శ్రీశ్రీ స్మారక సభను నిర్వహించిన తీరు అద్వితీయమైనదని,దాని నిర్వహణలో అంతా తానై డా. వై.ఆర్.కె. ప్రత్యేక సంచికలో ఒక వ్యాసం  రాస్తూ '' చంద్రునికో నూలుపోగు '' శీర్షికలో  శ్రీశ్రీ బహుముఖ కోణాల్లో వర్ణించిన వారి వ్యాస శైలి వారి మేథోపాఠవానికి తార్కాణమని, ఎందరినో ఆలోచింపచేసిన వ్యాసమని కొనియాడారు.ప్రస్థుత సమాజంలో సర్కారు వైఖరిపై నిరసనగా కవి ద్రష్ట కాబట్టి 100 మంది కవులు తమ అవార్డులు వాపసి యిచ్చేయడంలో '' కవులంటే ఏమనుకుంటున్నారు - కవులకు వేయి కళ్ళుంటాయి '' అనే కవితను చదివి రసజ్ఞులను ఉర్రూతలూగించారు.

డా.పొత్తూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తనకు డాక్టరుగారికివున్న అత్యంత సాన్నిహిత్యంగురించి ఎన్నో విషయాలుతెలియచేసారు.క్రిటిక్ డాక్టర్ వై.ఆర్.కె ను ప్రస్థుతిస్తూ ఎల్లపుడూ, కవి ధర్మాగ్రహాన్ని ప్రదర్శించకలగాలని ఉద్బోధించారు. 1645 లో జాన్మిల్టన్ రాసిన పుస్తకం పత్రికా స్వేచ్ఛకు ఒక బైబిల్ లాంటిదని. కవికి వశ్యవాక్కుంటుంది. కేవలం కవులు, కళాకారులు మాత్రమే ప్రతీపశక్తులను
ఎదుర్కొంటారనేది అక్షర సత్యమని తెలిపారు.

జనవిజ్ఞానవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్రరావు ప్రజాసైన్స్ ఉద్యమంతో డాక్టరుగారికున్న నిబద్ధత, నిజాయితీని గుర్తుచేసారు.సమాజం ఎల్లపుడు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పథంవైపే చూస్తూవుంటూందని, దాని నుండే ప్రజాహితం ఆశిస్తుందని. తిరుగులేని విజ్ఞానమే ప్రగతికి సోపానమని డాక్టరుగారు నొక్కి చెప్పేవారని తెలిపారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మతోన్మాదుల ఆగడాలు,
దుశ్చర్యలు ఎక్కువైనాయని, కాని ప్రజలే చరిత్ర నిర్మాతలనేదిచరిత్ర చెప్పే వాస్తవమని, యదార్థమని ఉటంకించారు.

ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు మాట్లాడుతూ తన పుస్తకావిష్కరణ సభే డాక్టరుగారితో అఖరిదవటం కొంచెం బాధకలిగించినా, వారిచ్చిన ప్రోత్సాహం నేనెన్నటికి మరువజాలనని, వారి సూచనలతోనే నా కథలను ఎక్కువగా క్షేత్రపరిశీలన పిదపే ఆరంభిస్తుంటానని. ఈ మధ్యనే 
హంపీ వెళ్ళటం తటస్థించిందని, ఆ నేపథ్యంలో త్వరలో ఓ కథకు రూపకల్పన చేస్తున్నానని, పరిసరాల అవగాహన కవులకు అవసరమని తెలిపారు.

ప్రముఖ విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ 1989 నుండి 2000 వరకు వై.ఆర్.కె.తోనున్న అవ్యాజానుబంధాన్ని నెమరు వేసారు. ఎన్నో రాత్రుళ్ళు ఇద్దరం సుదీర్ఘ సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాలపై గంటలతరబడి చర్చించుకునేవారమని తెలిపారు. నేను  రాసిన ' సమాంతర
ఛాయలు ' వై.ఆర్.కె. గారి చివరి రోజుల్లో అందించాను. వారిసాహచర్యంలోనే నాకీ హృదయస్పందన అలవదిందని అన్నారు. వస్తువుని నిజ దర్శనం చేయకలిగినవాడు మంచి కవి అవితాడం, ప్రతిపక్షం లేకపోయినా, కవులుంటే చాలని అంటూ, '' నాకు నమ్మకమివ్వండి '' అనే ఆలూరి బైరాగి
కవితను ఉటంకించారు.
డా. పిల్లలమర్రి సుబ్బారావు మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురియయ్యారు. కొడుకులా ఆదరించి, వైద్యవిధానంలో మెళుకువలు నేర్పి, ఒక వైద్యుడిగా ఇలా నిలబెట్టిన మహానుభావుని సాహచర్యం జన్మ జన్మలకు మరువలేనిదని గద్గద స్వరంతోతన బాధను అందరితో పంచుకున్నారు.  30 సంవత్సరాలు పైగా వారితో నడిచాను కాబట్టే, వారన్నట్టు  నేను కింద పడినా జెండాను కిందపడనివ్వనని, పైకేవుంచుతానని వారికి మాటిచ్చాను. అది నిలబెట్టుకుంటానని, వారి పేర సాహితి వార్డులు వారి పరోక్షంలో నేను అందించే కార్యక్రమాన్ని తలెత్తుకున్నందుకు కొంత మనశ్శాంతిగావుందని తెలిపారు. కవులకు అభినందనలు తెలిపి ముగించారు. 

కథా రచయిత శిరంసెట్టి కాంతారావు,  కథా రచయిత రాచమళ్ళ ఉపేందర్, సంపటం దుర్గా ప్రసాదరావు, గద్దపాటి శ్రీనివాసారావు, కవయిత్రులు  శ్రీమతి సునంద, సుభాషిణి తోట, నవతెలంగాణా ఖమ్మ జిల్లా అక్షరం సారథి, పాత్రికేయ కవి నామాపురుషోత్తం, కటికోఝ్వల రమేష్, కపిల రాంకుమార్లకు అమరజీవి డా. వై.ఆర్.కె. సాహితీ పురస్కారాలు అందచేసారు.
మేడగాని శేషగిరి, సంపటం దుర్గా ప్రసాదరావుల సమన్వయంలో దీపావళి కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తికరంగా, దీపావళి టపాసుల్లా, ఆటంబాంబుల్లా, మార్మ్రోగి రసజ్ఞులైన శ్రోతలను అలరించింది. కవిసమ్మేళనం సినారె గజల్ తో శేషగిరి ఆరంబించి తన గాత్ర మాధుర్యంతో అందరిని మంత్ర ముగ్ధుల్ని చేసారు. దీపావళికీ కవుత్వం రాయొచ్చు అనే కవితలో గద్దపాటి శ్రీనివాసరావు '' పెరిగిపోతున్న పాపాలమీద,సంఘాలమీద, సంఘ్పరివార్లమీద, రాని పరిహారాలమీద,రాజకీయ పరిహాసాలమీద '' కవిత్వం రాయొచ్చంటారు. చిరునామా ఎక్కడ అనే కవితలో తాళ్ళూరిరాధ - మానవత్వాన్ని ప్రతిబింబించే స్త్రీమూర్తి వర్ణన చేసారు.  జనం అనే కవితలో పొత్తూరి సీతారామారావు అమృత హృదయాల్లో
నేడలజడులు రేగుతున్నాయని మదనపడ్డారు. తిరగబడ్డ అక్షరం అనే కవితలో సుభాషిణీ తోట  గంగాయమునలంత పవిత్రం మన సాహిత్యమన్నారు. ఆటవికయుగపుటంచులనే కైతను ఆరంభించిన జీవన్ కూరుకుపోతున్న సంక్షుభిత సందర్భాన్ని ఆవిష్కరించారు. డా. వై.ఆర్.కె.తో అనుబంధాన్ని
శ్రోతలకు పంచారు. ఏ సభలోనైనా మాట్లాదవల్సివస్తే అంశాలన్నీ గుదిగుచ్చుకుని, ప్రసంగం పక్కదారి పట్టకూండా చెప్పవలసింది అందరికి స్పష్టంగా చేరేలా తయారయివచ్చే పద్ధతి అందరూ  అలవర్చుకుంటే మంచిదన్నారు.  దీపావళి పర్వదినమనే కవితను జయప్రద '' మన మధ్య నరకాసురులెందరో ఇంకా మిగిలేవున్నారని ఆవేదనవ్యక్తం చేసారు. హేతువాద ఉద్యమనాయకుడు క్రాంతికార్  తన కవితలో మతోన్మాదాన్ని నిరశిస్తూ చెణుకులు విసిరారు.అక్షరం అనే గేయంలో రౌతురవి '' రంగు పూస్తే అక్షరకిరణం మసగబారిపోదురా'' శ్రావ్యంగా వినిపించి శ్రోతలను ఉత్తేజితులను చేసారు. బ్రతుకు వెలుగుల బాట అనే కవితలో కె. రమేష్  బతుకులను దోపిడి చీకటి గుహల్లోకి నెట్టేసే విధానాన్ని
తన ముద్రతో ఆకట్టుకున్నారు. సత్యభామ అనే కవితలో నందిగామ నిర్మలాకుమారి పౌరాణిక అంశానికి సామాజిక స్పృహ కలిగించే కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ యిప్పుడు సత్యభామల అవసరం యెంతైనా వుందనేలా చదివి వినిపించారు. ఖమ్మం జిల్లా ఆధునిక కవిత్వంపై పరిశోధన చేస్తున్న తెలుగు జూనియర్ లెక్చరర్ నిజామాబాద్, పరిశోధనకు సంబంధించి తన అనుభవాలను కొన్నింటిని  శ్రోతలతో పంచుకున్నారు. అమ్మా నీకోఉత్తరం అంటూ దేవయ్య తన కవితలో భ్రూణ హత్యలను గర్హిస్తూ ఆర్ద్రత కలిగించారు. అవసరం అనివార్యమై అనే కవితలో వురిమళ్ళ సునంద  కోట్లాది ప్రశ్నలకు కొడవళ్ళే సమాధానాలి మొలవాలన్నారు. సరికొత్త దీపావళి అనే కవితలో రాచమళ్ళ ఉపేందర్ '' నేడు నరకాసురనికి నకలుగా మనిషి తయారవుతున్నాడని నేటి మనిషిపై చురకత్తులాంటి పదాలు విసిరారు.  కలం గొప్పదనమనే గీతాన్ని ఆవుల వీరభద్రం ఆలపిస్తూ '' పెన్నుమీద మన్ను పొయ్యద్దురా - అది గన్నై మొలుస్తుందిరా '' అంటూ అందరిని ఉత్తేజపరిచారు. భూప్రకంనల్లో అనే కవిత ఆలపిస్తూ ముచ్చర్ల ఇబ్రహీం '' పాటై పోటెత్తుతున్నాయి - భూ కంపనలన్నారు '' ఛాందసం సింహాసనమెక్కితే అనే శీర్షికతో  బండారు రమేష్  '' బుద్ధి జీవాలను శుద్ధి చేయడం కుదరదని, మట్టి పెళ్ళలా సంకెళ్ళను తెంచుకుంటాయని '' ఆక్రోశించారు. హెచ్చరిక అనే కవితతో జయరాజ్ తీవ్ర నిరసన స్వరాన్ని వినిపించారు '' వాడిపొట్ట అబద్ధాల పుట్ట '' ఏలికలని పీలికలను చేయాలన్నారు. మధ్యలో విజయ కళాశాల ప్రధానాచార్యుడు జంపాల మధుసూదనరావు మాట్లాడుతూ '' ఆవేశం లేకపోతే కవిత్వం రాదని, కవులు ఇతరులతో అనుభవాలను పంచుకోవాలని, ఆవేశంతో పాటూ ఆలోచన ఎంతో అవసరం అని వక్కాణించారు.   దివ్వెలు అనే కవితలో కపిల రాంకుమార్ ''రాయిని పగలకొట్టవు/ ఒక్క రాజుని మార్చలేవు/వందలు వెచ్చించి  టపాసులు ఎన్నైనా కాలుస్తారు కాని/చూస్తూ చూస్తూ పదిరూపాయల
నోటును కాల్చమనుండ్రి చూదాం!/గద్దెనెక్కిన నాయాళ్ళ  దిమ్మ తిరిగేలా భూచక్రాలు తిప్పి,ఆవుని అడ్డపెట్టుకునే రాచకీయం చేసేవాళ్ళను, /కుక్కకున్న విశ్వాసం లేకుండ గెలిపించినోళ్ళను కరిచేవాళ్ళను కుళ్ళపొడవాలనివుంది!'' వర్తమానసమాజాన్ని తన సహజమైన స్వరంతో  దీపావళితో అనుసంధానంచేస్తూ బాణసంచాలంటి పదాలతో పోల్చటం వాటిని కాల్చినంత ఆనందం కలిగింది.
 శ్రోతలకు. శ్రీమతి ఉరిమళ్ళ సునంద వందన సమర్పణ కావించారు.
- 24-11-2015



Wednesday, November 18, 2015

BHASKAR: కవి పరిచయం -1

BHASKAR: కవి పరిచయం -1: శిష్ ట్లా ఉమామహేశ్వర రావు ( 1912 – 1953) మారో మారో – మారో మారో ఒకటి రెండూ – మూడు నాలుగు మారో మారో – మారో మారో .................

Tuesday, November 10, 2015

కపిల రాంకుమార్‌ || మనాది ||

కపిల రాంకుమార్‌ || మనాది ||
బువ్వకే గతిలేదు
యిగ దివ్వెల పండుగొచ్చి మీదపడుటేంది!
మనాదితో ఏడుకండేల బావిలో
పునాది తవ్వుకున్నాట్టు బతుకు
కునారిల్లుతుంటే
కాకరపూల సోయగమేమెక్కుతాది?
పసికూనల ముఖాలువాడివత్తలైతావుంటే
తాగ పాలు లేవు, అయితే మాన్లే
గంజినీరు కరువాయే!
మతాబులు కాల్చే తీర్కేడిది
యింటి సుట్టు మురుగుతో
దోమలతోలేటందుకే సరిపోతుంటే
పైసలువెట్టి పండగేట్టా సేత్తాననుకున్నావు?
సర్రున తారాజువ్వలెగరేసే దమ్ములేదు
అవేమీ అంబరాన్ని తాకలేవు
భళ్ళున కిందవడుడేకాని,
పైకెళ్ళిన ధరల్ని దింపేటివి కావుకదా
కర్సుదండగ!
ఒక్కమాట సెప్పాలే
కుదిరితే విష్ణు చక్రాలు తిప్పాలనివుంది
లోకమంతా తలబిరుసునాయాళ్ళ తలలు నరకాలిగంద!
చిచ్చుపెట్టే బుద్ధులున్న జనాల మధ్య
తుస్‌ బుస్సుమని చిచ్చుబుడ్లు యేం సరిపోతాయి ?
మట్లాడితే గయ్‌గయ్‌మని పైకి ఎగరటమే కాని
ఆకాశాన్ని అందుకోలేరు,
ఆవకాశాల్ని దొర్కబుచ్చుకోలేరు
మనకుర్రకారు రవ్వల రాకెట్టు లాగా పైకి ఎగిరినట్టే
ఎగిరి కిందపడటమే కదా!
అప్పుడప్పుడు చిటపటమంటూ ధర్నాలు
బందులు సేసుడే కాని సీమటపాకాయంత విలువావుండది
అఁ.. సెవులు  సిల్లులుపడేలా దేబురింతలు, డాబుసరి డప్పులా
కొద్ది ఔట్లు, మరొకొన్ని ఆటంబాబులు
ఆకాశరామన్న ఉత్తరల్లా డబాయించుడే కాని
ఒక్క రాయిని పగలకొట్టవు
ఒక్క రాజుని మార్చలేవు
వందలు వెచ్చించి  టపాసులు ఎన్నైనా కాలుస్తారు కాని
చూస్తూ చూస్తూ పదిరూపాయల నోటును కాల్చమనుండ్రి చూదాం!
గద్దెనెక్కిన నాయాళ్ళ దిమ్మ తిరిగేలా
భూచక్రాలు తిప్పి,
ఆవుని అడ్డపెట్టుకునే రాచకీయం చేసేవాళ్ళను,
కుక్కకున్న విశ్వాసం లేకుండ గెలిపించినోళ్ళను కరిచేవాళ్ళను
కుళ్ళపొడవాలనివుంది!
తాటి బుర్రలో పటాసు మందు దట్టించి
తోలు లేచేలా దిష్టి యంత్రాలు పెట్టాల్నుంది.
ఎన్ని సట్టాలు సేసినా, ఎన్ని డేగకళ్ళు నిఘా కాసినా
ఆగని అత్యాచారాలమీద మన్నువడ
దాష్టీకం చేసేటోళ్ళ హంసలను లేపేయ్యాలనివుంది
కాని హింస మార్గం కాదు కాని
దుమ్మెత్తిబోసి శాపనార్థాలుకు తప్పులేదు
అప్పుడు కాని నా మనాది
కుదుటపడదు.!

 

Saturday, November 7, 2015

కపిల రాంకుమార్‌ || తెగింపు కావాలి!||

కపిల రాంకుమార్‌ || తెగింపు కావాలి!||
'' ఆడది అంటే
అలుసా
ఆడించినట్టు ఆడుతుందనా?
కాని
నేటి
ఆడది
'' ఆడ '' ది కాదు ఇక్కడిదే,
ఇప్పటిదే!
నీ జాఢ్యం వదిలించే
పెద్ద బాడిశవుతుంది
మదాన్ని చిత్రిపట్టి పొరలుగా చెక్కుతుంది
అతిచేస్తే
ఉత్తుత్తిగా కాదు
తిత్తితో సహా
కత్తిరిస్తుంది ''
తెగించిన వాడికి తెడ్డే లింగమయితే
తెగింపు కలిగినదానికి అరచేయే
ఖడ్గంమవుతుంది! ''
ఈ నాకల నిజంకావాలని
కలాన్ని, గళాన్ని
మహిళలన్ని కోరుకుంటాను!
7.10.2015