Saturday, April 27, 2013

| మీ కోసం||

కపిల రాంకుమార్|| మీ కోసం||

సామాన్యుడి గొంతులో రాగం లేదు
పేదవాడి బతుకులో జీవంలేదు
తెలుసుకోని మసలుకోను -తెలివిగాను బతుకగాను
అచ్చరాల బాటలోన – వెలుగుపాట పాడనిదే !

పీడితుడని తాడితుడని బుజ్జగింప చూసేరూ
హరిజనుడని, గిరిజనుడని ముద్దుపేరు పెట్టేరు
వెనుకబడిన జాతంటూ తమవెంటే తిప్పేరు
అడుగు ముందుకేయగా ఆదుగునకే తొక్కేరు ..1

మీ బాగు కోసమే మేమున్నామంటూ
సొరకాయ కోతలు చెరుపలేవు రాతలు
రాజ్యాంగం అందించిన సౌకర్యాలందకుండా
అడ్డుపుల్ల వేయుటలో దొడ్డబుద్ధి దొంగలు! .. 2
విగ్రహాల స్థాపనకు – స్మారక సభలకు
సావనీరు ముద్రించి మైల స్నానం చేసే్రు
చిత్తశుద్ధిలేని వారి వెనుకబడుటేలర!
విద్యనేర్చి తెలివిపొంద ముందడుగు వేయవేల …3

ఊరి చివరి కాపురాలు, స్వేచ్చలేని పావురాలు
ధనస్వామ్యపు కోరల్లో మాటాడని కోయిలలు
పరిసరాల పరిశుభ్రం మీ శక్తుల నైపుణ్యం
మీ కోసం గొంతు కలిపి మీరంతట అడుగనిదే …4

ఋతువులెన్ని మారినా బతుకులేమి మారవులే
అప్పువాత పడకుండా తిప్పలింక తప్పవులే
మీ పిల్లల ఆరోగ్యం -మీ బతుకున సమతుల్యం
బినామీల పేరు మీద కైంకర్యమవుతుంటే …. 5

మీ పేరున నిధులన్ని దొడ్డి దారిమళ్ళకుండ
ఊరేగే చట్టానికి గట్టి కాపలా లేకుంటే!
సామాన్యుడి గొంతులో రాగం లేదు
పేదవాడి బతుకులో జీవంలేదు!
27.4.2013

Wednesday, April 24, 2013

కుహురవాల వేడుక

కపిల రాంకుమార్|| కుహురవాల వేడుక||

అంతర్జాలపు యంత్ర సాయం
సంతరించిన పరిమళాలు
సొంతగొంతుక నెత్తినాయి
అంతరాలను కత్తిరించగ

ఓనమాలు దిద్దుతున్న కూనలారా స్వాగతం
వేలు పట్టి నడకనే్ర్పె నేస్తగాళ్ళు సిద్ధమిక్కడ

కొత్త పాతలు సంగమించి
చెట్టు నీడకు ఎగిరివచ్చె
ఐకమత్యపు సమర నాదం
నియమబద్ధపు హేతువాదం

చెలిమి చెలమల ఊటనీరై
సింధు భైరవి ఆలపించగ
వెరపు లేకను కదలిరండి
మెరుపు కవితల పల్లవించగ

పరిసరాలకు పులకరిస్తూ
పరికరాలను పలుకరిస్తు
అను నిత్యం తపనపడుతు
అక్రమాలను యెండకడుతూ

కొత్తలోకపు తోరణాలై -
తెలుగు వాణికి ప్రేరకాలై
కవితలిపుడు అంకురించగ -
కలములన్ని కదలిరాగ

'మానవత్వం వెల్లివిరియగ -
మా 'నవతే' పరిఢవిల్లగ
అచ్చరాల పుష్ప గుచ్చపు -
అందమైన సోయగాలకు
నీడనిచ్చే పచ్చ చెట్టై - విస్తరించిన వేదిక
కలలు కనే కవుల - కుహురవాల వేడుక!

24.4.2013 ఉదయం 11.37

Monday, April 22, 2013

మనకంటె మెరుగైన వాడు|

కపిల రాంకుమార్| మనకంటె మెరుగైన వాడు|
వాడొకి నోరే లేదు కాని 
కళ్ళు మాట్లాడతాయ్

చెవులు చూస్తుంటాయ్ 
రహస్య శక్తి వానికెక్కడిదో
కాని అంతు పట్టకున్నది!
కళ్ళతో చూసింది కాళ్ళతో రాసేస్తాడు
చెవులు వినపడకున్నా
సంగీత సుస్వరాలు పలికేస్తాడు!
కాళ్ళసలే లేవు చేతులే అధారం

సంగీతానికి తగ్గట్టు
నృత్య విన్యాసం చేస్తాడు!
శారీరక వైకల్యమే కాని
భావాని, అనుభవానికి తీస్పోని
బహుముఖ ప్రజ్ఞాశాలి
మనకంటె మెరుగైన మేధావి!

జాలి పడటం కాదు
తగిన ప్రోత్సాహమిద్దాం!
మనలో ఒకడిగా మన వాడుగా గుర్తిద్దాం!

21-4-2013 ఉదయం 6.10

కపిల రాంకుమార్|| వ్యత్యాసాలు - కరుణశ్రీ కవిత ||
పరిచయం
మా కండలు  పిండిన నెత్తురు
మీ పెండ్లికి చిలికిన అత్తరు!
మా మొగాలకీ కన్నీరూ
మీ మొగాలకీ పన్నీరూ!

మా నోట్లో ఆకటి భగ భగ
మీ నోట్లో సిజర్సు భుగ భుగ!
మాకీ పడిపోయిన గోడలు
మీకేడంస్తుల మేడలు!

చింపిగుడ్డ సింగారం మాకూ
ఒళ్ళంతా బంగారం మీకూ!
మేము మండుటెండల్లో మాడుతూ
మీరు పండు వెన్నెల్లో ఆడుతూ!

మీ కార్లకు పనికి రాని టైర్లు
మా కాళ్ళను కాపాడే జోళ్ళూ
మా బ్రతుకిది మళ్ళి మళ్ళి
మీ బుగ్గ తిరిగే కిళ్ళీ

బాబు గారి పాకీ దొడ్లో
పట్టపగలు ఎలక్ట్రిసిటీ
పాకీవాడి పూరి పాకలో
కార్మబ్బుల కటిక చీకటి

మా లోపల అగ్ని జ్వాలలు
మీ లోపల అజీర్ణ శూలలు
మీ మోటర్ లేపిన ధూళి
మా నుదిటికి గులాబి పౌడర్.
(కరుణశ్రీ కవితా కౌస్తుభం నుండి 1.1.1993 ముద్రణ)













Friday, April 19, 2013

| తుఫాను కోసం ||

కపిల రాంకుమార్|| తుఫాను కోసం ||
మన కళ్ళముందు
అన్యాయం జరుగుతున్నా
నోరు మెదపలేని
స్వరం పెంచలేని
బలహీనులం!
దానికీ కారణాలు లేకపోలేదు
అదుగో
అలా నోరెత్తినవాడ్డి మొత్తుతున్న
రాజ్యషింస తాలూకు సవ్వడి
మనలో భయాన్ని పెంచి,
ధైర్యాన్ని చంపేస్తోంది!
తెగించిన వాడికి తెడ్డె లింగమన్నారని
చావుని సైతం కౌగిలించుకుని
చిరునవ్వు రువ్వకలిగే
స్థిర చిత్తం వుంటే తప్ప
వాటిని నిలువరించలేమా?
మనకెందుకులే అనే మౌనమే
దురాగతాల కొనసాగించడానికి ఊతమిస్తున్నాయి!
ఆందుకే ఒంటరి పోరుతో కాదు
సమూహ ఘర్జనగా మారాలి!
ఉద్యమం ఉప్పెనలా పోటెత్తాలి!
ప్రజాగ్రహం ముందు
కొద్ది సేపు మొండిగా మొరాయించినా
వివిధ నిర్బంధాలు ప్రయోగించినా
నిరశన ప్రదర్శనలపై తరువాతైనా
సర్కారు మెత్తపడక తప్పదు
భవిష్యత్తు లెక్కలు తేడారాకూడదుగా
అధిష్ఠానం మొట్టికాయలు వేయకుండా
గోచీ సర్దుకోవాలి - కాకుంటే పలచబడరూ?
బతికుంటే బలుసాకు తినొచ్చని,
సీటు పోతే పరువు గోవిందా అని మాత్రమే
తగ్గుతారు పెద్ద యోచనాపరులు
జనాలకు భయపడి కాదు!
వారి జనానాలకు దడిసి!
ఖజానాలకు బొక్కపెట్టడంలో
యోజనాలు సైతం ఔపోసన పట్టే
ఘోటక రాజకీయ ఋత్వికులుకదా!
పదవులు, పందేరాలు,
వాటాలు లాబీలు సక్కగుండాలి!
అల్లుడి కోసమో, బుల్లిల్లు కోసమో
అధికారమోజేతి నీళ్ళు అమృతంలా తాగి
చొంగా కార్చుకుంటా లొట్టలేసుకున్న నాయాళ్ళు
ఇప్పుడు మెడమీదకొచ్చేసరికి
వృద్ధ జంబూకంలా నీతులు చెబుతూ
అయ్యగారి రహస్య చిట్టాలు
గోసాయి మంత్రాలు
చర్చాగోష్టుల్లో పాల్గొన్న వివరాలు
పుత్ర రత్నాల హారాలు
ఉంపుడుకత్తెల దింపుడు పళ్ళాలు
ముత్యాల పేరుల్లా అందిస్తారు అప్రూవరులై!
గొంగట్లొ తిన్న సామే
గొంతుకడ్డం పడి,యెంట్రుకొచ్చిందని
చెప్పినంత తేలికగా వదిలించుకోగలరా యీ కర్రు (మరక)
చట్టానికి లోబడి కాదు, చుట్టంగా లోబర్చుకొని
చేసేన  దందాలు, చందాల రూపంలో
అనర్హులసైతం అందలమెక్కీస్తే
అరదండాల సన్మానం తప్పదు కదా
స్వార్థం - అవినీతి జోడు గుర్రాల స్వారి
తత్కాలిక విజయ కేతనాలెగరేసినా
నికార్సైన  దుర్భిణి ముందు
గర్భ నిర్థారణ దుర్బేధ్యమైనదేమీ కాదు!
అవాంచిత శిశోదయాన్ని
విచ్చిన్నం చేయక తప్పదు!
నూరు గొడ్ల తిన్న రాబందు
తుఫానుగాలికి కూలినట్లు
ప్రజాగ్రహం వెల్లువై
అనివార్యంగా ప్రకృతి ప్రకోపానికి మించిన
శూన్యమేర్పడి శరవేగపు మేఘపు
ఝంఝా మారుతం ప్రజాతుఫానై రావాలి 
వేచి చూడడం కాదు సృష్టిద్దాం! -
19.4.2013 సాయంత్రం 3.45






Thursday, April 18, 2013

శత హస్తాక్షర కవిత|

కపిల రాంకుమార్ || శత హస్తాక్షర కవిత||

నేను నాటిన విత్తనం 
వెళ్ళిపోతూ
గమ్యం యెదురుగా
ఊయలనుండి సమాధివరకూ
హృదయాలనుండి హృదయానికి
కొలతలేసి కట్టిన
పచ్చ పచ్చ మైదానాల్లో
ఒక దృశ్యానికేసి చూపుతూ
కవిత్వం మొహర్రం అంది!

బెంగంటే బెంగా కాద
నడుస్తూనే
ఉక్కపోత ఒకటే ఉక్కపోత
గుళ్ళో దేవుడు
యేదైతేవద్దనబడిందో తెలీదు
నాలో నేనుగావుంటే
' కప్ప' లా
ముఖం నిండా మాయకత్వం నింపుకుని
కవీ నీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే
నేనేమీ నీతో స్నేహం చెయ్యలేను!

నాన్నిచ్చే డైరీకి యేడాదిగా యెదురుచూపు!
నువ్వు మా ప్రాణంరా అన్నందుకు
రాయాలి లేకపోతే
తలెత్తకుండా వుండలేం కదా!
కళ్ళుమూసుకుని,
మనసంతా నిండుకున్న
నన్ను నేను
జనన మరణాలకు భయపడను!
ఆడిన చోటనే ఆడుతూ
నే పాడుతూ
వానపిట్టనై వదలనంటుందాకాశం!
వర్షించే వానజల్లున్మీ
ఆరో గదినీ
ఫ్రీ ప్రెస్సునీ
గుడి గంటలనీ
నూతన సనాతనమైనదిగా భావించి
డైరీలో పేజీలై
ఓ సాయంత్రం
ఆమె వచ్చింది!
నా ప్రేమే మరి!
గడీల దొరల చూపులు
యెన్నని చెప్పను?
టపటప చప్పుటేంటని
యీ నిర్జన వంతెన,
అలికిన నేల మీద
ఆ తోటమాలి
జీవితం
స్వేద సముద్రమా> కావొచ్చు!
భావనల పరితపనా? యేమొ?
తాంబూలాలిచ్చాం -యెవరికి?
మీ మాటల మీద
గుచ్చుకునే చూపులై
పూలతోటలోంచి
నాక్కొంచెం బాధ కావాలి!
మధుబాబు షాడో మాత్రం కాదు!

రోజూ లాగె
వాడు
మావూరి మర్రిచెట్టుపై
సంతలో
అప్పటికే కబుర్లాడుతూ
పరమాణువులా
గిక్కడ బూమి పుట్టినసంది
బావిలో
యిన్నాళ్ళు
కలై
కళ్ళుమూసుకుని
సబ్సిడీలో ఇచ్చినదంతా
ఆకుపచ్చ సముద్రాన్ని
వదిలేసినవాళ్ళు
పొద్దున్నే,
నిశీథినీ, నిన్నూ
చచ్చిపడిన
దూరాల
జీవితమంటే!
ఈ హడవుడేమిటి?
తల్లీ భారతీ?
చీకటిని తడిపి.
కవితలు రాయాలంటే
అక్షరాలలో
యే లంచ్ అవరులోనో
అంతర్విలాపమెందుకు?
నేననే ప్రశ్నకు
ఘాటైన శుష్కవచనమెందుకు?
యెన్నేండ్లయిందో కాని,
తడవని తామారాకునై
యింతే - ఓ ఏ.టి.ఎం. కార్డూ
నిరాశ నిండిన చేతుల్ల్లో
మా తాత చర్త ఓకప్పుటి
మరణమయింది!

శబ్దం నిద్రిస్తుంటే
యెప్పటిలాగే
వీడుకోలు ( వేడుకోలు ) చెప్పనా?
నిశ్శబ్దాన్ని చేదించటానికి
ఆయ్ధమై
కొసమెరుపులా
కవితలా
స్పందించమన్న
పల్లె విస్తుపోయింది!

ఎ సాంగ్ అదీ
ప్రేమంటే నీకు తెలుసా!
యిప్పుడు కన్నీళ్ళతో
కాలాన్ని పిల్లనగ్రోవిచేస్తే
నేనంటే నీ కిష్టమేనా?
చెప్పు!
ఒకరిలో ఒకరిమై
నీవు నేను సమం! అవునా
జీవ కాంతి సాక్షిగా
ఓ మనసా!
అడుగు కూడ సాగని నా ప్రయాణం
నీ చల్లని ఒడిలో సేద తీరనా!
ఒకే గూడు
పంచె కట్టు
మది సంద్రమైన
ఓ చలన సూత్రమైంది!

నా శరీరంలోని ఒక్కో అంగానికి
అసలే నేనంటే అమ్మకు ప్రాణం కదూ!
లోపల
యే అలారం మోగుతుందో
యింతకు ముందెన్ని పిరికి ప్రాణాలో!

ఒకప్పుడు
పనిచేస్తుంది ఆరుగాలం
పచ్చని పంటలా!
అయినా నా కెవరు లేరనుకోకు
కాని నా చెప్పులో వాడి కాళ్ళు
అదే నీ పరిచయం
యెప్పుడు? యెక్కడ?
అన్వేషణ - ఎందుకో?
తొలకరి - నిశ్శబ్దం!
అందుకే ఐదు హత్యలా?
ఆది పాడే అమాయక
కవిత్వం కావాలి!
నేనే - మౌనం వీడి
నాయారాడ కోండ స్సాక్షిగా
చిన్నప్పుడు
రాత్రి - నిశారాత్రి,
ఆ భూమి మనుసులు
కట్టిన
దేనితోనో దేనికో తెలియదు కాని
బొమ్మ రాళ్ళ పేగంబంధాలై
భాషతో
ఆడేదే కవికలం!
ఇది కవి సంగమం!

( f కవి సంగమం 2012 కవిత్వం - లో పాల్గొన్న కవులందరి పదాలతో దీర్ఘ కవిత)

18.4.13 ా. 6.22

Wednesday, April 17, 2013


కపిల రాంకుమార్|| బీరయ కోడుకో!

బీరయ కొడుకో
నువు దడవకు బిడ్డా
దయిర్నమె నీకు రచ్చన బిడ్డా
గొర్రెలమ్మి, పెంటనమ్మి - పాలనమ్మి బొచ్చినమ్మి
సంసార మీదకుంటె - బూర్లెముకుడు బోర్ల పడు!
మొండికుంట సెరువుకింద - రెండెకరాల చెక్క మీద
రెక్కలేమొ ముక్కలాయె - పదిమందికి దిక్కాయె
**
దొరగారి బిడ్డడు - గడ్డివాము చాటుగ
అక్కలచ్చి మానము - బుగ్గిచేసినాడని
రక్తమేమొ ఉడికినాద - కర్రతీసి వురికినావు
బుర్రనేలవంచి నీవు - గొర్రెనప్పగించినానని
టపటప చప్పుడుతో - ఆకసాన గద్దలెగిరె
భుగభుగ మంటలతో - అడవితల్లి కోపగించె
గట్టుమీద మైఅసమ్మ - కల్లెర్ర చెశాది
కడుపు మండి కమలమ్మ - ఉరితాడు మింగాది
కాల్లేమొ వనకబట్టె - కల్లలోన నూల్లాయె
అయ్యకేమి చెప్పాలో - పాలుపోక రోదించకు
**
విందులోన తందనాల దొరతనము చిందులేయ
దాకలోన కూరతోటి గొర్రె మనసు పాడుతుండె
పెంచినోడి గుండెలోన పంచనామ చేస్తాంటే
చీకటేల సూరీడు గడ్డివాము మంటాయె
లచ్చితోటి పిచ్చికొడుకు - చిచ్చులోన  గొగ్గులాయె
పుచ్చెలేమొ పగిలాయి - పుచ్చయెన్నలొచ్చాది!
అర్దరాతిరేల యెలుగొచ్చి - పల్లె కీడు తొలిగింది
మంటలేమొ సెగల్లై - పంటసేలు కాసింది
అడివి దుమ్ము రాకుండ అడ్డు కట్ట తానయింది
కష్టాలు కాలువలు యికముందు పారవులె
కాష్టాల మంటల్లో దొరతనము బూదాయె
బక్క జనమికమీదట ఒక్క తాటి నడవాలి
పెత్తనాలు యెదిరింప విద్దెలింక నేర్వాలె!

17.4.2013 సాయంత్రం 3.10

Thursday, April 11, 2013

|| మూలిగే నక్క మీద తాటి పండు! ||

కపిల రాంకుమార్|| || మూలిగే నక్క మీద తాటి పండు! ||

'' ఈ పండక్కైనా పిండాకూడు పెడతావా '' అన్న
అడుక్కునేవాడికీ లోకువయ్యాను!
దీనమ్మ బతుకిట్టా తగలడిందేం?
పెద్దదాని పెళ్ళి చేసి,నిండా అప్పులోకి నెట్టబడ్డనేను
కొలువిడిసిన పిదప నా కొచ్చె పించను
అంచనాకు రాక అంతంత మాత్రమే
కుండ నిండా కూడుంటేం సరిపోని సంసారానికి
నిండుకున్నకుండ యెవడి కడుపు నింపుద్ది!
**
చెట్టంత కొడుకు చేతికొచ్చాడనుకుని
యేనీల్లకు సన్నీల్లని యీ రెండునెల్లూ
సంకగుద్దుకుంటే యేలాబం!
నిన్న రాతిరేల తుపాను గాలికి
కూలబడ్డమానులా నడిరోడ్డున పిడుగువడి
రెండుగా చీల్చి కూల్చేస్తే
అది యిన్న ఆడంగులు కుప్పకూలి సోలిపోతే నేనేంసేసేది!
**
చిన్ననాకొడుకైనా సక్కగున్నడాంటే
దొంగనాకొడుకు పెంచిన యిసాసం లేక
సావాసగాళ్ళ జతకట్టి యింటికి చేటుతెస్తావుంటే
నట్టానికి వున్న జీవాలు రెండు
వూడ్చుకుపోయే పాయమాలు కింద!
**
గుడ్డిలో మెల్లని సిన్న బిడ్డ కంపెనీలో
నౌకరీ లంకించుకున్నదన్న సంబురము నిలవదాయె
నా నెత్తిన పెద్దమ్మోరు కూకున్నదేమో
ఆ మేనేజరు ముండాకొడుకు కసుకాయని చూడaకుండా
నలి్పేసి జాలున్నోడిలా ఆసపతాల్ల పడేసి పోయిండట!
సావు బతుకుల మద్దెన పొర్లుతాందది
**
దీనమ్మ ! మూలిగే నక్క మీద
తాటి పండు పడ్డట్టు, షాక్ మీద షాకు
అమ్మబోతే అడవి కొనబోతే కొరవి
సర్కారోడికేమో జోకు మీద జోకులేస్తడు
యెవరికి నట్టంరానీయనంటూ తిరుక్షవరం చేస్తుండు!
తగ్గించామంటూ గారడీ కబుర్లకు
బుకార్లు తగ్గవు కాని పుకార్లకేంకొదువలేదు!
యిసుమంటపుడే పండగ రావాల్నా
ఆ నా కొడుకు యెగతాలి సేయాల్నా!
నీ తల్లి! రెక్క్ల కట్టం ఒక్కడికే సాలదాయే
నాలుగు కంచాలు లెగటమంటే వొరకటం కాదా!
అడుక్కుతినేటోడికీ యిది తెలవకా....ఆడి కడుపు మంటాడిది!
యింటుముంగల అరిచాడని కాని వానితప్పేముంది.!.
**
యిప్పటి సంది పండగన్నోడి పళ్ళు రాలకొట్టాల్నుంది
కుదేలై, వోటికుండలో నీల్లూ లేక
దిక్కులెంక సూతాంటే అప్పు పుట్టక సూతాంటే,
యింటి దూలం తనని ముద్దాడాలని
పురిపెట్టిన తాడు ' వురి ' కి రమ్మంటాంది!
పచ్చడైన బతుకులో చిచ్చు పెట్టుకోలేక
మిగిలినోల్లు అనాధ లైతారని వూకున్న!
**
సజావుగా సాగినన్నాళ్ళు నాలుగు వేళ్ళు నోట్లోకెళ్ళినియ్ !
యిప్పుడొకడికి కూడ కూడు పెట్టలేని బతుకైందిరా
ఒరేయ్ నువ్వడుక్కొచ్చి నాకూ ఓ ముద్దడయ్
బతికున్న వాల్లం పంచుకూంటాం!
అంతే కాని యింటి ముంగల అరిచి
పరువు తీమాక - అసలుంటేగా?

|ఈ రోజు మంచికంటి భవన్‌- ఖమ్మం - సాహితి స్రవంతి నిర్ఫహించిన ఈరోజు కవి సమ్మేళనంలొ చదివినది||

Wednesday, April 10, 2013

| జానపద గీతం||ముద్దులా మగడాయె|

కపిల రాంకుమార్|| జానపద గీతం||ముద్దులా మగడాయె|\
ఈపొద్దు – నామొద్దు బావ లేవడాయె
పొద్దెక్కి పోతాంది – కూలికెల్లయాలాయె!
మాపిటేల – పటేలింట
పెల్లిసందడాయె
మాటదక్కు  దారిలేదు
బండి యెల్లిపాయె                    \\ఈపొద్దు – నామొద్దు బావ లేవడాయె
మొన్నపొద్దు తిరునాల్లో
ముద్దులిస్తనంతే మరి
ముసుగుతన్ని లెగడాయె
మొక్కజొన్న మంచె  దిగడాయె    \\ఈపొద్దు – నామొద్దు బావ లేవడాయె
జొన్నకూడు తినడానికి
చేయి చాపడాయ్
కందికాయ కొట్టపోతె
చేదులేమొ కందిపాయె              \\ఈపొద్దు – నామొద్దు బావ లేవడాయె
గట్టిగాను అరవబోతే
అత్తతోని తంటాయె
గిచ్చుదామంటె
ముద్దులా మగడాయె             \\ఈపొద్దు – నామొద్దు బావ లేవడాయె
పొద్దెక్కుతున్నా గాని సద్దు చేయలాబమేమి
గట్టిముద్దిచ్చినేను బుగ్గకొరికే లేపుతాను!
ఈపొద్దు – నామొద్దు బావ లేవడాయె
పొద్దెక్కి పోతాంది – కూలికెల్లయాలాయె!….
అముద్రిత జనపద్యం  నుండి……10.4.2013

Wednesday, April 3, 2013

\| సూక్తులు - హితోక్తులు || ' కవిత్వం '

కపిల రాంకుమార్|\| సూక్తులు - హితోక్తులు || ' కవిత్వం '

1. కవులంతా పిచ్చివాళ్ళే .................రాబర్ట్ బర్టన్‌

2. సంతో్షాన్ని సత్యంతో అనుసంధానం చేస్తే కవిత్వమవుతుంది!.......శామ్యూల్ జాన్‌సన్‌

3. ఊహల్ని గొప్ప అనుభూతుల్ని సంగీతపరమైన మాటల్లో వర్ణించటమే కవిత్వం ........జాన్‌ రస్కిన్‌

4. తాను రాసిన కవిత్వం విలువ స్త్హిరమని యే నిజాయితీ పరుడైన కవి నమ్మడు.....టి.య్స్.ఇలియట్

5. మంచి మనుషుల సంతోష సంఘటనలు అద్భుతంగా రాయబడిన గ్రంథమే కవిత్వం..........పి.బి.షెల్లీ

6. అందంలో కలసిన సత్యమే కవిత్వం...............గిల్పినాన్‌

7. కవిత్వానికి పనికిరానిది లేదు........శామ్యూల్ జాన్‌సన్‌

8. కవి తనను గురించే తన బాధ వ్యక్తీకరిస్తాడు........రజనీష్

9. కవి భావకుడు, నవలాకారుడు, యదార్థవాది........గైడి మపాసా

10. కవులు అబద్ధాలకోరులు....................సోలెన్‌

3.4.2013....... సా. 3.09

మిగతావి తదుపరి సమయంలో....

Tuesday, April 2, 2013

||శాసించడం కాదు శ్వాసించడం నేర్చుకో!||

కపిల రాంకుమార్||శాసించడం కాదు శ్వాసించడం నేర్చుకో!|| నా అక్షరం పచ్చదనాన్ని ప్రేమిస్తుంది
నిప్పచ్చరాన్ని ద్వేషిస్తుంది!
సామాజిక స్పృహ నేలంతా కప్పుకున్న
పచ్చని మనిషి నీడ కోరుకుంటుంది!
తనలాంటి మరో అక్షరం కోసం
ఆబగా యెదురుచూస్తుంది- జతకట్టడానికి!
దొరికిందే తడవుగా రెండక్షరాల ‘ ప్రేమ’ పై
దాడిచేసే మబ్బులతో దోబూచులాడుతూ
అక్షయపాత్ర దొరికిందనుకుంటుంది!
అదుగో అక్కడే గొడవ ప్రారంభం
నాదంటే నాదనే వాదన మొదలవుతుంది!
అక్షరానికీ స్వార్థంవుంది
ముందువరసలో తనే వుండాలనే తపనవుంది!
అందుకు యే పద్ధతికైన సిద్ధమే
పద్యం, గద్యం, చంపూ కొరకురాని కొయ్యలైతే
పచనమయ్యే గీతమెనా అవుతుంది!
నిలువెల్ల పులకించే మనిషిని
ఆక్రమించుకుని తనకే సొంతమంటుంది!
తనకే పంచమంటుంది!
ఋతుచక్రంతో పనిలేదంటుంది
పగలు రాత్రి తేడాలేదంటుంది
నోరెత్తటానికి బలముంటె
అక్షరసరాలు యేర్పడతాయంటుంది!
కోయిలకన్న మిన్నగా
కాలాలకతీతంగా – కారణాల సాకుంటే చాలు
యే వేదికనైనా సొంతం చేసుకుని
ఆసాంతం సొంత గొంతుకై వినిపించాలంటుంది!
ప్రేరణలెక్కడవైనా
తెలుగులోపుట్టినవై వుండాలంటుంది
వెలుగుగ దారి చుఫలంటుంది
సృజనకారుదు కనుమరుగైన
సృజనాత్మకత శాశ్వతం కావాలంటుంది
యెంత యెదిగినా
ఒక్క విషయం గుర్తుంచుకోమంటుంది
చెట్టునెపుడు పచ్చగా వుంచమంటుంది
వేరుపురుగులు దరిచేరకుండా
నిఖార్సయిన అక్షర కంచె చెట్టు చుట్టూ
పాతాళందాకా పాతేయకలిగితేనే
మనుగడంటుంది!
చేదుతో యుద్ధంచేస్తూ
మంచిని నిబద్ధం చేస్తూ
అక్షరమై మిగలమంటుంది
ఊగిసలాటలు మాని స్థిరంగా
అక్షరాన్ని శాసించడం కాదు
నిబ్బరంగా
శ్వాసించడం నేర్చుకోమంటుంది!
***
2.4.2013 సాయంత్రం 6.45

Monday, April 1, 2013

శత వసంత సుందరుని ఎర్రెర్ర వందనాలు||

కపిల రాంకుమార్|| శత వసంత సుందరుని ఎర్రెర్ర వందనాలు||

అతనితో మాటాడిన - పూదోటలో తిరుగాడినట్లే
పలుకులందిచిన చిలుకల సరాగము వినినట్లే!

అతని సావాసము కలిగిన గుండె నిబ్బరము పెరిగినట్లే
అతని సారస్వతమాస్వాదించిన - అమృతానుభవమొందినట్లే

అతని తెగువను అనుసరించిన పోరాట పతాకమెత్తినట్లే
దినచర్య గమనించిన ఆదర్శమెంతొ అవగతమ్మగు

చెప్పనెరుగడు యితరులకు కాని తానొప్పుదారి నడిచి చూపునంతె
వృద్ధులయెడ యనురాగము-బిడ్డలయెడ అనునయము
జనులయెడ కారుణ్యము - పట్టుదలకు పాషాణము!
నాయకత్వ లక్షణాలకు ఆయనే సహజ కవచం!

సామ్యవాద పద్ధతులకు సామవేదం
ప్రజాస్వామ్య ప్రతినిధిగ అతడే కలికి తురాయి!
అవరోధమనిపించియే - నిస్సంతుగ జీవించె
లీలతో లాలిగ సహజీ్వి -శతవసంత సుందరుడు

అమరుడు సుందరయ్యకు ఎర్రెర్ర వందనాలు
శతజయంతి సంబరాన ఎర్రెర్ర వందనాలు!

(సుందరయ్య శత జయంతి వత్స రం జరుపుకుంటున్న సందర్భంగా)

1.4.2013 సా. 6.03
కపిల రాంకుమార్|| శత వసంత సుందరుని ఎర్రెర్ర వందనాలు||

అతనితో మాటాడిన - పూదోటలో తిరుగాడినట్లే
పలుకులందిచిన చిలుకల సరాగము వినినట్లే!

అతని సావాసము కలిగిన గుండె నిబ్బరము పెరిగినట్లే
అతని సారస్వతమాస్వాదించిన - అమృతానుభవమొందినట్లే

అతని తెగువను అనుసరించిన పోరాట పతాకమెత్తినట్లే
దినచర్య గమనించిన ఆదర్శమెంతొ అవగతమ్మగు

చెప్పనెరుగడు యితరులకు కాని తానొప్పుదారి నడిచి చూపునంతె
వృద్ధులయెడ యనురాగము-బిడ్డలయెడ అనునయము
జనులయెడ కారుణ్యము - పట్టుదలకు పాషాణము!
నాయకత్వ లక్షణాలకు ఆయనే సహజ కవచం!

సామ్యవాద పద్ధతులకు సామవేదం
ప్రజాస్వామ్య ప్రతినిధిగ అతడే కలికి తురాయి!
అవరోధమనిపించియే - నిస్సంతుగ జీవించె
లీలతో లాలిగ సహజీ్వి -శతవసంత సుందరుడు

అమరుడు సుందరయ్యకు ఎర్రెర్ర వందనాలు
శతజయంతి సంబరాన ఎర్రెర్ర వందనాలు!

(సుందరయ్య శత జయంతి వత్స రం జరుపుకుంటున్న సందర్భంగా)

1.4.2013 సా. 6.03