Wednesday, February 18, 2015

||నీల్లు తాపియాలేమా! ||


కపిల రాంకుమార్ ||నీల్లు తాపియాలేమా! ||
నాకు తెల్వకడుగుతా
గీడ గింతమంది జమయిండ్రేంది?
ఏంది కత?
మీ రెవరూ యివరం సెప్పకపోతే
నే బోయి వైనం తెల్సుకుంట కదా!
ఎంత నిశానీదారునైనా
పసికూనను కాదుకదా!
గీడ ఆడోళ్ళు, మగోళ్ళు
ఒక్క తీరుగ మొత్తుకుంటున్నరేంది?
అఁపోరగాడ్నెవన్నోపీకుతున్నట్టున్నరు
యేఁజేసిండో బాడకావ్
తీరా బోయి చూద్దు కదా
ఆ దొంగ నాకొడుకు
కాలేజీ పోర్ని ఆగంజేయబోయిండట!
మరిక దంచరూ!
ముట్టెపొగరును యిక వంచరూ!
ఈ పోరగాళ్ళకేం పోయేకాలమొస్తదో
తెల్వదుకాని మీసాలొచ్చిన సంది
అంబోతులౌతరా యేమొ?
ఆడది బజార్న అగబడితే
ఆబగా మీద పడుడేందో!
ఈళ్ళ జిమ్మడ బయటకెల్తే
పానం సిక్కబట్టుకోవాల్నాయేంది?
అక్కా సెల్లి లేని బేవార్సులేమో!
గిసుమంటి పిదప సేట్టలు సేత్తావుంటరు!
యిక ఊకుంటే లాబంలే
కొడవలి లిక్కితో సొరకాయ తెగ్గొట్టాల్సిందే
యిక జూసుకో జనమలో
ఆడదాని ఊసెత్తకుండ
గమ్ముని యింట్ల కోసోవాలి
లేదా యేసెర్ల వడి సావాలి.
దీనమ్మ జీవితం...ఓటుకుండ తీర్ల
లొడలొడమంటది కాని,
ఆడ తూర్పు బజార్ల
కచేరీ కాడ ఈ లొల్లేందివారి?
సమజయింది బిడ్డా!
యింటి జాగాల కోసం
ఆసరాలకోసం లైను కట్టినట్టున్నరు!
ఆ ''గిర్దావారు'' నాకొడుకు
పైసలు ముట్టజెప్పంది
''మోత్మీను'' కాడ పెట్టేటట్టులేడంట
యీడి కంట్లో మన్నువడ!
సర్కారు జీతం బొక్కుకుంటానే
మందినార్చే రోగమేందో!
గా ''సియెం'' యేమో ఒక్క ఫోను కొట్టమంటడు
ఈ యాళ్ళేమోపైసలుకొట్టమంటరు!
రోకలబండతో ఓ మునుంపెడితేకాని
దారికి రానట్టుందల్లా!
సూత్తరేందే సూరక్కా కానిండి
రోట్లోయేసినట్లు దంచండి!
పెజలంటే లెక్కలేనట్టుంది
మరీ కని కట్టం సేత్తన్నరు!
గీయవ్వారం మనూళ్ళనేకాదు –
దేశమంతవున్నదే!
మనమింక తెల్విపట్టకపోతేగెట్ట్నే వారి!
జర కొంగు నడుముకు చుట్టి
నా కొడుకుల్ని వంగపెట్టిదంచినగాని
పురిటి నాటి దొండాకు పసరు బయలెల్లదు!
సెత్తా సెదారం నూక్కపోతే
గుడెసె గబ్బు కొట్తది,
ఊరు, వాడ, దేశం జబ్బుపడ్తది!
ఇక షురూ చేసుడే
ఆల్ల వంటికి, యింటికి పట్టిన బూజులను నూకుడే నూకుడు!
నైజాములసుమంటోళ్ళను
మట్టికరిపించిన జాతోళ్ళం!
నయా నవాబులనుగాబుల్లోముంచి నీల్లు తాపియాలేమా!
బయపడొద్దు బిడ్డా, మన యెనక సంగముంది!
అద్గదిగో కొడవ లెక్కిన సుక్క మెరుస్తలేదూ!
అగపడ్తలే మన ఎర్రజెండ!
అదే మనకు అండదండ!

(నిన్న కవితల జాతర - హైదరబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రం మిని హాల్‌ లో చదివినది.)
17 – 2 -- 2015/ 18.2.2015

Tuesday, February 10, 2015

కపిల రాంకుమార్‌ || ఢిల్లీ ఓటరు ||

కపిల రాంకుమార్‌ || ఢిల్లీ ఓటరు ||
కమలాలు ఎన్ని మల్లగుల్లాలు పడి
పేలాలు వేగించినా,
ఎన్ని మాయలు, మంత్రాలు
చేసి ప్రజాస్వామ్యాన్ని
ఈడ్చిపారేస్తామన్నా ,
తెలుసుకున్నారు జనం!
**
ఏ సర్కారైతేనేం
అన్నింటిదీ ఒకే వర్గ స్వభావం కదా!
అనుకున్నారు స్థిరంగా!
మెజారిటీని చూసుకుని
అహంకారంతో పేట్రేగితే
పాలనలో చేతగాని అరకొర వైకుంఠాలు చూపితే
సహిస్తారా!
**
పూడ్చిపెడతాం అని విర్రవీగి,
రోజుకో తీరుగా
విధానాలు మార్చుకుపోతే
సన్నిధానం మొత్తం పునాదులతో
సహా ఊడ్చి పారేసారు  కదా  మార్చురీకి!
**
జనాల్ని గందరగోళపరిచి
తదుపరి నాలిక కరుచుకునేం లాభం!
**
అన్ని అవరోధాలను గమనించారు  కాబట్టే
ఆవిరైపోతున్న ఆశల్లో చిగుళ్ళు పల్లవించడానికి
జనఘోష వినిపించడానికి
గాలికి ఎగిరిన పేలపిండి ప్రభావాన్ని
ఊడ్చి ఆరేసి ఇలా కూడా ప్రజాస్వామ్యాన్ని
గెలిపించవచ్చుననే ఢిల్లీ ఓటర్లు
దేశంలోని గల్లీ గల్లీకి తెలిసేలే
ఒక ముద్ర వేసి పాతాళానికి
పూడ్చి పెట్టారు!
జయహో సామాన్య ఓటర్లకు!
జయహో!
10.06.2015