Saturday, June 28, 2014

కపిల రాంకుమార్ ||రండి-పదండి||

కపిల రాంకుమార్ ||రండి-పదండి||

బొక్కసాలు నిండి
పొర్లిపోయేలా
వీధులు, వాడలు
వాసనొచ్చేలా
మానవత్వం
మంటకలిసేలా
మృగ సంచారాలకి
పచ్చ జెండా ఎత్తిన వేలంపాటల్లో
తలపండినవారే కాదు
నవ యువకులు పోటీ పడి
మద్యవిక్రయాన్ని
అందిపుచ్చుకోవాలని
ఆబగా అంగలార్చుకుంటున్నారు
యెలాగైనా దక్కించుకుని
ఆదాయపు ఆలంబన చేసుకుంటున్నారు
బడుగులను మెట్లగాచేసుకుని
అంతస్ఠులందుకోనున్నారు!
**
మరో ప్రక్క
ముంపు మండలాలు మాత్రం
గ్రామ సభల స్థాయిలోనే
మద్యం వద్దని తీర్మానిస్తున్నారు.
జనాలని మత్తులో వుంచి
ఖజానా నింపుకోటమే
తమ జనానాలకు పసందు భోజ్నాలు
ఓటేసిన జనాలకు ఓటి బతుకులు
మద్యం మహమ్మారిని తరిమేదెలా అని
మరో దూబకుంట ఉద్యమానికి
కొంగులు నడుము చుట్టుకోచూస్తున్నారు!
**
తాగ నీరు లేదు కాని
తాగ బీరు పోస్తామన్నట్టుంది
సర్కారుల తీరు!
**
మెతుకులకు సైతం అల్లాడే
కరువు వాత పడాల్సిందే
జనం రోదన చెవిటివాని శంఖనాదం కాకూడదని
గురితప్పని గిరిజన శరమవ్వాలని
అక్షరాల కత్తులు
నూరుతున్నాను.
సుక్షేత్రంలో పోరాట
విత్తులు నాటుతున్నాను.
సేద్యం చేద్దాం రండి
చేవ చూపుదాం పదండి.
***
28.06.2014

Wednesday, June 18, 2014

సాహిత్య ప్రయోజనం || కీ.శే.డా||కె.హరీష్ (సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షుడు)||

సామాజిక ఉత్పత్తిలో ఓకరినొకరు ఎరుకపరచుకోటానికి వాడేది భాష, మాట, పాటా  మానవశ్రమ నుండి సమిష్టి తత్వం నుండి పుట్టాయనేది నిర్వివాదాంశం. సామాజికపరిణామ క్రమంలో ఉత్పత్తి రూపాలూ, విధానాలు మారాయి. శ్రమ విభజన వర్గవిభజనగా మారింది. అది క్రమేణా సమిష్టీ తత్వం నుండి వ్యక్తి తత్వమయింది/ వ్యక్తులకు సొంత ఆస్తితోపాటు కవిత్వం కొద్దిమంది కవుల, ఛందస్సు గొలుసుల్లో చిక్కువడింది. క్రమేణా కవిత్వం ఆధిపత్య వర్గాల ఆనందం కోసం, ప్రజల్ని అంధవి శ్వాసాల్లో ముంచటం కోసం ఉపయోగపడింది. కవిత్వానికి, కళలకూ కూడ వర్గ
స్వభావం వుంటుంది. అవి కూడ అంతస్థులూ, అంతరాలు, కులాలు పాటిస్తాయి. భాషయొక్క ఉపరితలమే ' కవిత్వం  వర్గాధిపత్యాలతో పాటు కవితారూపాలలో కూడ మార్పు వచ్చాయి. మారుతున్న ఈ కళారుపాన్నే మనం పద్యం అన్నాం. గేయం అన్నాం. వచన కవిత అన్నాం. అభ్యుదయ సమాజానికి రూపాలను సమాంతరంగా కళలు, వాటి రుపాలు ( కాంటెంట్లు) మారుతూనే వుంటాయి. కళా రుఫాలు సామాజిక వృక్షంపై విరబూసి వికసించే పూలు. ఈ గుర్తింపు కలిగిన తరువాత కొన్నీ కళలు ప్రజల పక్షాన నిలబడతాయి. కొన్ని పాలకవర్గాలను అంటకాగి
వాటి కొమ్ము కాస్తుంటాయి. ఈ చారిత్రక నేపథ్యం సాహితీ ప్రియులందరికి తెలుసు. కళకైనా, సాహిత్యానికైనా, మమతం సమత, శాంతి మానవాభ్యున్నతిని మించిన మరొక లక్ష్యం మరొకటి వుండదు, వుండకూడదు. అలాంటి ఉత్తమ సాహిత్యాన్ని, కళా సంస్కృతిని విస్తరింపచేయటమే సాహిత్యకారుల ముఖ్య లక్ష్యం, కర్తవ్యం. '' ప్రజల నుంచి ప్రజల కొరకు '' అనేది ఇక మన నినాదం, విధానం కావాలి. ఈనాడు మనం ఒకానొక సంక్లిష్టమైన  
మలుపులోవున్నాం. సాహిత్యాన్ని, మీడియాను, మోసపూరితం చేస్తున్న వ్యాపారపు విలువలు ఒకవపు, సామ్రాజ్యవాదుల ఆర్థిక సాంస్కృతిక దాడులు మరొక్ వైపు, మత ఛాందస ఆదిమ యుగాల దాడి మరొక వైపు నిత్యం మనం ఎదుర్కోటున్నాం. ప్రపంచీకరణ, ఉగ్రవాదం, మతోన్మాదం ముప్పేట దాడులు చేస్తూనే వున్నాయి. ఈ దాడినుంచి మనలను మనం మన సంస్కృతిని, సాహిత్యాన్ని మనమే కాపాడుకోవలసిన ఆవశ్యకత మరింత పెరిగింది. ఈ విషయాన్ని మానవాభ్యుదయాన్ని కోరే సాజితీ ప్రియులు గుర్తించాలని మరీమరీ కోరుతున్నాను.
ఆ విలువలకు వ్యతిరేకంగా పోరాడవలసిన ఆగత్యాన్ని గుర్తుచేస్తూ సెలవు తీసుకుంటాను.

( సాహితీ స్రవంతి వార్షికోత్సవ సభలో 2001 నాటి గౌరవాధ్యక్షులు డా||కె. హరీష్‌ గారి ప్రసంగం నుండి
కొంత భాగం.....వారి స్వంత నోట్‌ పేడ్ నుండి )
___________
17/6/2014....

సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం||

కపిల రాంకుమార్|\ సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం||

విప్లవాన్ని కవిత్వీకరించిన వాడు, కవిత్వాన్ని విప్లవీకరించనవాడు శ్రీశ్రీ అని నేటి యువకవులకు స్పూర్తిదాయకమైన ఆందించాడని, సముద్రమంత ముద్ర వేసిన కవి శ్రీశ్రీ అని, చరిత్రకు అర్థాన్ని '' ఏ దేశ చరిత్ర చూసిన యేమున్నది గర్వ కారణం ' అనే గేయం ద్వారా ఋజువు చేసాడు. చరిత్రకు నిజమైన అర్థాన్ని తన కవిత్వంలో తెలిపిన మార్గదర్శి. అని కొనియాడారు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి. రౌతు రవి అధ్యక్షతన సాహితీ స్రవంతి ఆధయనవేదిక సమావేశం జూన్‌ నెల మూడవ ఆదివారం ప్రత్యేకంగా శ్రీశ్రీ వర్థంతి సమావేశంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి సభ్యులు ఉదయం 10గంటలకు ఖమ్మం బైపాస్‌ రోడ్‌లోని శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. పట్టణంలోని కవులు మొవ్వా శ్రీనివాసరావు, సంపటందుర్గా ప్రసాదరావు, కపిల రాంకుమార్, రౌతు రవి, కె. ఆనందాచారి, ప్రముఖ విద్యా సంస్థల అధిపతులు రమణారావు, వీరారెడ్డి, రాఘవరావు, ప్రముఖ వైద్యుడు డా. భారవి, ఇతర సాహితీ అభిమానులు, పాల్గొన్నారు. సాయంత్రం బోడేపూడి విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యయన వేదికలో భాగంగా సామావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశ్రీ గేయాలను ఎం.శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, సంపటందుర్గా ప్రసాదరావు ఆలపించారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, ఖడ్గసృష్టి సంకలనంలోని కవితలు సునంద, శైలజ, . సునంద, శైలజ, టి.లక్ష్మి, జయప్రద మున్నగువారు చదివారు. శ్రీశ్రీపై నాగభైరవకోటేశ్వరావు రాసిన గేయాన్ని కపిల రాంకుమార్ చదివారుశ్రీశ్రీ సాహిత్య ప్రక్రియల అన్నింటిలోను ఆల్‌రౌండర్‌ అంటూ విమర్శ, అనువాదం, కవిత్వ, చందోరచన, వ్యాసాలు, కథలు, నాటికలు, అంతేకా విదేశీ భాషాలలో పట్టు, శాసనమండలి సభ్యుడిగా తన పాత్రను నిర్వహించాడని అన్నారు. కె.ఎల్‌.యూనివర్సిటి అనువాద విభాగంకు చెందిన మోహనాచార్యులు మాట్లాడుతు నేటి పాఠశాలల మరియు కళాశాల విద్యార్థులకు శ్రీశ్రీ కవిత్వాన్ని పరిచయం చేయవలసివుందని తెలిపారు. నేటి సాంకేతిక విజ్ఞాన సంపాదన మాటున సాహిత్యం, చరిత్ర, రాజకీయం, ఆర్థిక శాస్త్రాల అధ్యయనం లోపించిందని, దానిని అధిగమించేలా ఎంతో కృషిచేయాలిసివుందని అన్నారు. డా. పి. సుబ్బారావు గారు మాట్లాడుతూ కవిత్వాన్ని విశ్వజనీనం చేయటంలో అతని కృషి అనితర సాధ్యం, దానిని ఎవరూ అధిగమించలేదు. విశ్వనాధను గౌరవించినట్లే, గురజాడను, తిక్కనను, వేమనూ గౌరవించాడు. పద్య చందస్సు, మాత్రాచందస్సు, గేయం, వచన కవిత,అంతే కాక కవిత్వంలో విభిన్న ధోరణులను సృజించినవాడు. అధివాస్తవికత, సర్రలియజం, లాంటి ప్రక్రియలు, లిమరిక్కులు, ప్రాసక్రీడలు ఇలా చెప్పుకుంటేపోతే సమయం చాలదు. మహా ప్రస్థానం ఒక భగవద్గీతలా కొత్తగా కవిత్వం రాసేవారు చదవాల్సివుందని నొక్కివక్కాణించారు. డా.||కవితాంజనేయులు శ్రీశ్రీ కవితలలోని కొన్ని సోదాహరణగా వివరించారు. ఎం.శేషగిరి '' ఏ దేశ చరిత్ర చూసినా ''గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేసారు.

17.6.2014

Saturday, June 14, 2014

కపిల రాంకుమార్ || చమక్‌||

కపిల రాంకుమార్ || చమక్‌||

గరుకు కాగితం
చిట్లిన పాళీ
చిద్రమైన బతుకు!

14.6.2014 ఉదయం 5.51

Monday, June 9, 2014

కపిల రాంకుమార్ || **ఆంగ్ల కవితకు స్వేచ్చానుసరణ |

కపిల రాంకుమార్ || **ఆంగ్ల కవితకు స్వేచ్చానుసరణ ||
While wandering in terrace
A wonder ring on trees
made me surprise along with sunshine
Bird flow over head
stone fall on my shoulder
wounded me with shock
appeared an angel from heaven
recognised her to be my old friend
bend downwith love
__________________________________
**1604-1780 మధ్య ఓ కవి రాసిన పోయెం కు
నా స్వేచ్చానుసరణ కవి పేరు మరిచిపోయాను.
___________________________________
ఒక శుభోదయాన
అంతస్తులో సంచారం చేస్తూంటే,
చెట్లపై ఒక అద్భుతం వలయం
మెరుపులా కనపడింది సూర్యరశ్మి పాటు
ఆశ్చర్యచకితుడయ్యాను
నా తలపై ఓ పక్షి ఎగిరినట్లైంది
ఇంతలో నా భుజం మీద
రాతిముక్క బలంగా తాకినట్టుంది
దిగ్భ్రాంతి తో నేను గాయపడ్డాను
తేరుకుని చూస్తే
స్వర్గం నుండి దిగివస్తున్న
ఒక దేవదూత కనిపించింది
ఆమె నా పాత స్నేహితురాలై ఉందని గుర్తించా!
నా తనువు ఒంగిపోయిది ప్రేమతో!
________________________
9 జూన్‌ 2014

Thursday, June 5, 2014

కపిల రాంకుమార్ || జై తెలంగాణ సిరుల గిరుల కోన ||

కపిల రాంకుమార్ || జై తెలంగాణ సిరుల గిరుల కోన ||

జై తెలంగాణ - సిరుల గిరులకోన - జై తెలంగాణ - నదుల నిధులసీమ
వడివడిగా ఎదగాలి కలలన్ని నెరవేర - సకల జనులు మెచ్చేలా మా తెలంగాణ !

గలగల మంజీర పెన్‌గంగ ప్రాణహిత- ఇంద్రావతినాట్యాన జూరాల తుంగభద్ర
కిన్నెరసాని హొయలై ఉరకెత్తే గోదారై, - పాలేరుతొ మున్నేరుగా కృష్ణవేణి పరవళ్ళై !

శాతవాహన కాకతీయ బహమనీ కుతుబ్‌షాహీ - రాజ్యమేలిన నేలరా! వీరులకు పుట్టిల్లురా!
కవులకు కాణాచిరా నా తెలంగాణ - జానపద కళల నెలవురా నా తెలంగాణ

నల్లమల గిరుల లోయల సహజీవనాలు - పాపికొండల రమణీయ దృశ్యాలు
నల్లపసిడికి సింగరేణి నేల కొలువు - శైవ, వైష్ణవ బౌద్ధ జైనాల ఆనవాలురా!

చారిత్రిక సురవరం - సదాశివ సంగీతం - అచ్చ తెలుగు పాలకురికి సోముడు
హలం పట్టిన భాగవతకవి పోతన - పల్లెపదాల హనుమంతు సుద్దులు


ఆడుబిడ్డల బతుకమ్మలాటతో - బంజారడప్పుల రంగేళి హోలిరా
ఆదివాసీకూనలలరారు తల్లిరా - రేలపాటలతొ పులకించు నేలరా

ఏ యోధుని కదిపినా చాలు - బందగీ ఐలమ్మ త్యాగాల కతలు
నైజాము నెదిరించి సాగినా సమరం - ఒగ్గుకథలాగ కదలాడు కనువిందు

కాలాలు గడిచినా మారని బతుకుల - నీటి మూటల గత నేత చేతలు
అరువదేండ్ల పట్టుదల సాక్షిగా - రాష్ట్రమై తెలంగాణ అవతరించెరా!

నీటమునిగే ఆటపాటల నేల - సంకటాల బారిపడకుండ
గిరిపుత్రుల సంప్రదాయ గురుతులు - పదిలింగా నిలిచేలా

పథకాల మార్పుతో పరిసరాలు పరిమళించ - కాకుల తరిమి గద్దల మేపే లోక కంటక పద్ధతులాపి
పోలవరం పేర జనపదం నీటిపాలు కాకుండ - అనవతరం పచ్చదనపు పంట సిరులవాన కురిసేలా

గతకాలపు నష్టాలను దోషపు చట్టాలను - సవరించుకు ముందుకు సాగేందుకు
ఆశలు, తీరేలా విరామమెరుగక - అనునిత్యం పోరాడుట తెలంగాణ ఆన!

అమరుల త్యాగాలు మనమున నిడుకొని - బడుగుల బతుకువీణ కొత్తరాగాలెత్త
చేయి చేయి కలిపి చేవతనమూచూపి - నిర్మించుకుందాము మనదైన తెలంగాణ!

01.06.2014/5.6.2014