Thursday, November 29, 2012

పచ్చి నిజం

కపిల రాంకుమార్ //పచ్చి నిజం // ***

ప్రసవించి
పక్షం రోజులు కాకముందే
రక్తం స్రవించేలా
రక్కస రతితో దాహం తీర్చుకుంటున్న
యిటు పతిని వారించనూ లేక
వక్షం నుండి క్షీర బిందువుల బదులు
కేవల స్వేదబిందు్వులే కారుతుంటే
రక్తం పిండిన బాధను భరిస్తూ

బిక్కమొహపు పసివాడ్ని అటు లాలించనూ లేక
ఆ తల్లి తల్లడిల్లుతున్నది.!

పిల్లగాడి బలానికి మందులు తెమ్మని
దుడ్డులిస్తే
తేకపోగా పైపెచ్చు
ఇంకో జిలవర్థక ' మందు ' కొట్టివచ్చిన
పశుపతి కాదు పతి పశు బలానికి
నీరసంగా లొంగిపోతున్న దయనీయ స్థితి ఆమెది.!

నియంత్రణల హోరుకు కాలం చెల్లిందో
నియమ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందో
అర్థంకాక
అర్థనగ్న అచ్చాదనతో
సరిపెట్టుకోలేక
సరిపెట్టుకుంటూనే
రోదిస్తున్నదామె!

ఆకలి తీర్చగ అన్నం లేకపోయినా
ఆ-ఆకలికి కరవులేదని
పరువుకోసం
బరువుగా కాలం దొర్లిస్తున్నది !

పురుషాధిక్యతకు నలిగిపోతూ
ఏ ఆపన్న హస్తమైనా ఆలంబన యివ్వదా అని
ఎదురుచూస్తున్నది!!

29.11.2012
_________________________________________
*** ఇది 10.7.1991 రాత్రి 8.15 లకు
ఆలిండియా రేడియో కొత్తగూడెం ఎఫ్.ఎం. ద్వారా ప్రసారమైనది.

Wednesday, November 28, 2012

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-ఆఫ్ఘన్‌లో తిష్టకు అమెరికా పన్నాగం

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-ఆఫ్ఘన్‌లో తిష్టకు అమెరికా పన్నాగం

Tuesday, November 27, 2012













మనసు విరిగితే?

కపిల రాంకుమార్//మనసు విరిగితే??//

ఆకాశం - అవకాశ శూన్యం!
ఆర్ణవం - అఘాతం!
జీవితం - అవకాశరహితాల అఘాతాల సమ్మేళనం!

ఆలోచనా బంధనాల కాసారంలో, అతల స్పర్శగా ఈదలేక
తహతహలాడే ప్రాణంతో కొట్టుకు రావాలి!

గ్రీష్మంలో - ప్రత్యోదను కిరణాల తిగ్మంతో
ఝంఝామారుతాల తాకిడికి తట్టుకోవాలి!

ఆగ్రహాయిణిలో, జలధరుని సౌదామిని కళలనుండి
ప్రచేతజ్జనిత వజ్రనిర్ఘోషధారాసంపాత శీకరాల్ దెబ్బలకు నిలబడాలి!

ప్రావృట్కాల శైతవాయువుల బిగింపులకు
గజగజలాడినా సర్దుకు పోవాలి! ఉన్ని రగ్గులతోనో,
నెగళ్ళ సెగళ్ళతోనో!

ఎప్పుడో ఎక్కడినుండోి చల్లగా, మెల్లగా వీచిన
గంధవాహకుడ్ని మెచ్చుకోవాలి!

సరోవిహారంలో మృణాలను ఆరగించే రాయంచకు
రాజీవాల్ పరాగా్న్నాస్వాదించే అళిపుంగవుడ్ని
సుధాంశుని హస్తలాఘవంచేత
ఆనందపరవశియై కువలయ విన్యాసం సూస్తూ
ప్రక్కగా జాలువారే సెలయేటీ విపంచిక నిక్వణక్వణ స్వనాలను
వింటూ పరవశం చెందాలి!....కాని

ఎన్నో సమస్యలతో, తెగని ఆలోచనలతో
సతమతమవుతున్న మానవుడికి
ఏ మిథ్యాభిశంసనంవల్లో మనో వికల్పం కలిగి
ప్రాపంచిక విషయాలకు దూరంగా
అదృశ్యమవడానికి దారదం కోసం
ఏ తామస రాత్రో, నిశీథిలో, మరొకరి ప్రమేయంలేకుండా...
నిష్క్రమిస్తాడు!1 అస్తమిస్తాడు!!!.

27-11-2012

**ఇది ఈ రోజు పోస్టు చేసినా దీని రచనాకాలం 1969 - ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం (కొవ్వూరు ప.గో.జిల్లా)
అప్పటి కాలంలో వాడిన పదాలు కాబట్టి కొంచెం సంస్కృత భాషపై అనురాగం మెండుగా ఉన్నట్టు గ్రహించగలరు.

Friday, November 23, 2012

తిరగబడ్డ తెలంగాణ : దొరలను దించాం నిజాంను కూల్చాం - డా. ఇనుకొండ తిరుమలి

తిరగబడ్డ తెలంగాణ : దొరలను దించాం నిజాంను కూల్చాం - డా. ఇనుకొండ తిరుమలి


తెలంగాణా ప్రజా ఉద్యమ చరిత్రను వివరించే రచనలు ఎన్నో వచ్చాయి. వాటిలో కొన్ని ఎంతో ప్రాముఖ్యాన్నీ సంతరించుకున్నాయి. కానీ అవన్నీ చాలా వరకు ఆ ఉద్యమాన్ని నడిపించిన కమ్యూనిస్టు పార్టీ దృక్పథం నుంచి, పార్టీనే కేంద్రంగా చేసుకుని సాగిన రచనలు. వీటికి భిన్నంగా ఆ ఉద్యమంలో నిమగ్నమై వీరోచితంగా పోరాడిన ప్రజలను కేంద్రంగా చేసుకుని నిజాంనూ, దొరలనూ ఇరువురినీ దించాలన్న కృతనిశ్చయంతో సాగిన అపూర్వ ప్రజా పోరాటానికి అద్దం పడుతుందీ రచన. తెలంగాణా పోరాట చరిత్ర రచన కోసం మొట్టమొదటిసారిగా అధికార/ప్రభుత్వ రికార్డులను విరివిగా ఉపయోగించుకోవటం ఈ పుస్తకం ప్రత్యేకత. ఇది లోతైన పరిశోధనాత్మక కృషి మాత్రమే కాదు, అప్పటి దృశ్యాలను సాక్ష్యాధారాలతో సహా మనముందు అసక్తికరంగా అవిష్కరించే సజీవ చారిత్రాత్మక కథనం .

తిరగబడ్డ తెలంగాణ పుస్తకంపై ఆంధ్ర జ్యోతిలో 23-6-2008 నాడు వెలువడిన సమీక్ష:

అపూర్వ ప్రజాపోరాటానికి సజీవచిత్రం

కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైనప్పటికీ సంప్రదాయ కమ్యూనిస్టు రైతాంగ పోరాటాలకు భిన్నంగా జరగడం వల్లే తెలంగాణ ప్రజల సాయుధ పోరాటానికి ప్రపంచ రైతాంగ పోరాట చరిత్రలో ఒక ప్రత్యేకస్థానం ఉంది. సంప్రదాయ కమ్యూనిస్టులు భావించినట్టుగా ఈ ఉద్యమం మధ్యతరగతి రైతాంగం లేక పట్టణశ్రామికవర్గం అధిపత్యంలో జరగలేదు. ఈ వర్గాల పాత్ర తెలంగాణ ఉద్యమంలో మచ్చుకైనా కనిపించదు. ఇది కేవలం పేదరైతుల, రైతు కూలీల ఉద్యమం. అక్షరం ముక్కరాని పేదరైతుకూలీలు కుల గ్రామ సమాజంలో ఇమిడి వున్న పోరాట సంప్రదాయాన్ని పోరాట పటిమను ఆధునిక రాజకీయ భావ జాలంతో జోడించి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా మహత్తర ఉద్యమాన్ని నిర్మించారు. ఈ కారణంగానే ఈ పోరాటం దేశ విదేశీ పరిశోధకుల, మేధా వుల దృష్టిని ఆకర్షించింది. అయితే వీరి రచనలు ప్రజల పోరాట పటిమను గుర్తించకపోవడమే కాకుండా కించపరిచే విధంగా ఉన్నాయి. ఈ ఉద్యమం కమ్యూనిస్టు పంథాలో జరగలేదన్న నెపంతో ఇది ఆధునిక రైతాంగ పోరాటమే కాదని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు-ముఖ్యంగా ట్రాట్స్కీ యిస్టులు ఈ పోరాటాన్ని విఫలపోరాటంగా అభివర్ణించారు. ఇంకొంతమంది పరిశోధకులు మరో అడుగు ముందుకువేసి తెలంగాణ అణగారిన కులాలు బానిసత్వానికి అలవాటు పడ్డవారని వారికి పోరాటపటిమ మచ్చుకైనా ఉండ దని తేల్చిచెప్పారు. ఇటువంటి అనేక అభిప్రాయాలకూ వాదనలకూ మంచి సమాధానమే ఇనుకొండ తిరుమలి రచించిన తిరగబడ్డ తెలంగాణ దొరలను దించాం... నిజాంను కూల్చాం చారిత్రక (ఆర్కైవ్స్‌లూ ఉన్నవాటిని) మౌఖిక ఆధారాలతోపాటు స్వీయ అనుభవాలను జోడించి ప్రజలపక్షాన నిలబడి తిరుమలి ఈ పుస్తకాన్ని రాశా రు. ఉత్పత్తికులాలు ఈ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన విషయాన్ని ఆయన బలంగా చెప్పారు. ఉద్యమం మొదటి దశలో (1939-46) గ్రామ సముదాయాల సంబంధాలను పునాదులుగా చేసుకుని పోరా టం చేస్తే రెండవ దశలో (1946-51) కమ్యూనిస్టు భావజాలంతో పోరాటా న్ని నడిపించారు.

మొదటి దశ కేవలం దొరల పెత్తనానికి వ్యతిరేకంగా జరిగిం ది. రెండవ దశ అంటే ఈ ఉద్యమం ఎప్పుడైతే ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల ఆధిపత్యంలోకి వెళ్ళిపోయిందో- అప్పుడది నిజాం రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రూపుదిద్దుకుంది. అనాదినుండి భారతదేశ గ్రామ సమాజంలో బ్రాహ్మణీయ హిందూధర్మంతో పాటు నీతిసూత్రాలు కూడా ఉన్నాయి. గ్రామ సమాజం రోజువారీ వ్యవహారంలో హిందూధర్మం కంటే ఈ నీతిసూ త్రాలే ఎక్కువ పాత్ర పోషించాయి. తిరుమలి ఈ పుస్తకంలో ఉద్యమ నిర్మాణ పునాదులను వివరిస్తూ కుల >గ్రామ సమాజంలో ఉండే సహజ నీతివిలువలు గ్రామ సమా జాన్ని రెండు వర్గాలుగా విభజించిన విషయాన్ని చాలా చక్కగా వివరించారు.
ఈ నీతి సూత్రాల ఆధారంగానే గ్రామ సమాజం దొరలదోపిడీని అరాచకాలను నీతిలేని చర్యగా దొరలను నీతిలేనివారుగా పరిగణించి వారిని శత్రువర్గంగా ప్రకటించుకుంటుంది. గ్రామ నీతిసూత్రాల న్యాయం ప్రకారం నీతిలేనివారికి గ్రామంలో స్థానం ఉండదు. ఈ నేపథ్యం నుంచే మొదటిదశలో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్నీ దొరలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమా న్నీ అర్థం చేసుకోవలసివుంటుంది. తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలం రాకముందే ఇక్కడి ప్రజలు దొరలదోపిడీని పెత్తనాన్ని అర్థం చేసుకున్నారు. అంతేకాదు దొరలకు వ్యతి రేకంగా వీరోచితమైన పోరాటాలను కూడా నడిపించారు. ఈ రకమైన చైతన్యం పోరాట స్ఫూర్తి మనకు సాయుధపోరాట కాలంలోనూ విరమణ తరువాత కాలంలోనూ కూడా కని పిస్తుంది. పోరాటం హోరాహోరీ కొనసాగుతున్న కాలంలో కూడా ప్రజలు కమ్యూనిస్టు పార్టీకి సంబంధం లేకుండా గ్రామస్థాయిలో అనేక ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉత్పత్తి కులాలు కమ్యూనిస్టు భావజాలంవల్లనే చైతన్యం పొంది దొరల దోపిడీ వ్యవస్థను నిజాం రాచరిక వ్యవస్థను అర్థం చేసుకోగలిగారన్న సాయుధపోరాటాన్ని నిర్మించారన్న వాదనలో వాస్తవం లేదని రచయిత ఈ రకమైన విశ్లేషణ ద్వారా తేల్చిచెప్పారు.
నిజాం పాలనని ఒక భూస్వామ్యవ్యవస్థగా బూజుపట్టిన వ్యవస్థగా అభివర్ణించడం పరిపాటి. అయితే వ్యవస్థను ఎవరు బూజుపట్టించారు నిజాం రాజులా వాస్తవా నికి తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ 19వ శతాబ్దం చివరిదశకంలోనే పురుడుపోసుకుంది. అంతకుముందు రాజ్యంలో ఎక్కడా ఈ రకమైన వ్యవస్థ మనకు కనిపించదు. భూమిమీద రాజ్యానికి కానీ శిస్తు వసూలు చేసే అధికారులైన వతన్‌దారులు, జాగీరుదారులు, దేశ్‌ ముఖ్‌లు, దేశ్‌పాండ్యలకు కానీ ఎటువంటి హక్కూ ఉండేది కాదు. అయితే బ్రిటిష్‌ ఇండి యా రైతువారీ విధానం రావడంతో పరిస్థితి తారుమారైంది. వేల సంవత్సరాలుగా భూమి సాగుచేస్తున్నవారు కౌలుదారులుగా రైతుకూలీలుగా మారిపోయారు.

సాంప్రదాయికంగా రెవిన్యూ వసూలు చేస్తున్నవారు అగ్రకుల రైతులు వేల ఎకరాల భూమిని తమ పేర పట్టా చేయించుకొని భూస్వాములుగా అవతారమెత్తారు. వడ్డీవ్యాపారం ధాన్యం కొనుగోలు ద్వారా అక్రమంగా వేల ఎకరాల భూములను సంపాదించుకున్నారు. గ్రామాల్లో దొరలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను నడిపించారు. వారి గడీలు కచేరీలుగా మారాయి. 19వ దశాబ్దంనుంచి దొరల పెత్తనం గ్రామ సమాజంమీద అంచెలంచెలుగా బలపడుతూవచ్చింది. పాత కొత్త రెవిన్యూ గ్రామ అధికారులూ అగ్రకుల రైతులూ భూస్వాములుగా అవతరిం చిన తీరునూ నూతన రెవిన్యూ విధానంలో పెట్టుబడిదారీ వ్యవస్థలో మారిన దోపిడీ ఉత్పత్తి సంబంధాలనూ రచయిత వివరించారు.
ఈ దొరల దోపిడీ చాలా ఆలస్యంగా నిజాం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. గ్రామాల్లో ఈ దోపిడీని గ్రహించిన నిజాం ప్రభుత్వం మొదట్లో ఉద్యమకారుల పట్ల సానుకూల వైఖరితోనే ఉంది. అంతేకాదు ఉద్యమ కారుల డిమాండ్‌ చాలా న్యాయమైనదిగా భావించింది. కానీ ఎప్పుడైతే ప్రజల ఉద్యమం కమ్యూనిస్టుల ఆధి పత్యంలోకి వెళ్ళిందో అప్పుడు ప్రభుత్వం దానిని రష్యన్‌ బోల్షివిక్‌ ఉద్యమంతో పోల్చుకుని నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వమూ ప్రత్యేక ముస్లిం రాజ్య స్థాపనానినాదంతో ఆవిర్భవించిర రజాకారులూ భూస్వాములకు అండగా నిలచి ఉద్యమ అణచివేతను ఉధృతం చేశారు. దొరల గూండాలు పోలీసులు రజాకార్ల దోపిడీ హింసలు ప్రజలను మరింతగా ఉద్యమంవైపు నడిపించాయే తప్ప నీరసపరచలేకపో యాయి.

రాజ్యహింసను ప్రజలు ప్రతిఘటించిన వివిధ సంఘటనల వివరణ పుస్తకానికి అదనపు ఆకర్షణ. ఉద్యమంలో కీలకపాత్ర వహించిన నాయకుల సామాజికవర్గాన్ని సుందరయ్యగారు తన స్వీయచరిత్రలో అక్కడక్కడ ఉటంకించినప్పటికీ ఉత్పత్తికులాల పాత్రను సమగ్రంగా వివరించలేదు. వడ్డెర లంబాడి చాకలి గొల్లకుర్మలు మొదటగా దొరల దోపిడీకి పెత్తనానికీ వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేసిందీ తదనంతరం సాయుధపోరాట నిర్మాణంలో సంఘం కీలకపాత్ర గురించి ఈ పుస్తకం వివరించింది. దొరల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల ను చైతన్యపరచడంలో ఆంధ్ర ప్రజానాట్యమండలి కీలకపాత్ర వహించింది. ఈ మండలి ప్రచార కార్యక్రమాల్లో ఉత్పత్తికులాలే ప్రధాన భూమిక నిర్వహించాయి.
గొల్లసుద్దులు వీర వస్తి, పగటివేషాలు, బుర్రకథ, ఒగ్గుకథ, జానపద పాటలు ఈ ఉద్యమ నిర్మాణంలో ప్రచారంలో ప్రముఖ పాత్ర వహించాయి. సాధారణంగా సాయుధపోరాటాలు పురుషాధి పత్య స్వభావాన్ని కలిగివుంటాయి. అటువంటి పోరాటంలో కూడా తెలంగాణ స్త్రీలు అనేక దశల్లో వీరోచితమైన పాత్ర నిర్వహించారు. మనకు తెలియని మన చరిత్ర పుస్తకంలో అగ్ర కుల స్త్రీల భూమిక గురించి మనకు కొంత తెలుస్తుంది. కానీ ఉత్పత్తికులాల స్త్రీల పాత్ర ఏ రచనలోనూ మనకు కనిపించదు. ఈ పుస్తకంలో రచయిత ఆ లోటును భర్తీచేసేందుకు ప్రయత్నించారు. ఉత్పత్తికులాల పోరాట పటిమనుఆవేశాన్ని సాయుధపోరాటంగా మలచడంలో కమ్యూనిస్టుపార్టీ విజయం సాధించినా సాయుధదళాల్లో వారి ఆధిపత్యమే నడిచింది. ఉత్పత్తికులాలవారు కార్యకర్తలుగా రెండవ శ్రేణి నాయకులుగా మాత్రమే రాణించగలిగారు. ఒకానొక దశలో ఉద్యమం మొత్తం తెలంగాణ రెడ్ల , ఆంధ్ర కమ్మల ఆధిపత్యంలోకి వెళ్ళిపో యింది. ముఖ్యంగా కదంపట్టించే కార్యక్రమంలోనూ భూ పంపిణీ విషయంలోనూ ఈ కులస్తుల పక్షపాత బుద్ధి అనేక సందర్భాల్లో బైటపడింది. భూ పంపిణీ విషయంలో కేవలం దేశ్‌ముఖ్‌ జాగీరుదారుల భూములనే పంపిణీ చేసేవారు. అనేకమంది రెడ్డి, వెలమ భూస్వాముల భూములను పార్టీ సానుభూతిపరులనే నెపంతో పంచకుండా వదిలి పెట్టేవారు. సైనికచర్య తరువాత కమ్మ, భూస్వాములు మా రాజ్యం వచ్చేసిందం టూ పంపిణీ చేసిన భూములను రైతులనుండి తిరిగిలాగేసుకుంటున్నప్పుడు పార్టీ మౌనం గా ఉండిపోయింది. సాయుధ ఉద్యమ విరమణలోనూ విశాలాంధ్ర ఉద్యమం చేపట్టడం లోనూ రెడ్డి, కమ్మ కులస్తుల ఎజెండా దాగి ఉందన్న విషయాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.

తిరగబడ్డ తెలంగాణ
దొరలను దించాం నిజాంను కూల్చాం
రచయిత డా. ఇనుకొండ తిరుమలి
తెలుగు అనువాదం ప్రభాకర్‌ మందార
కాపీ రైట్‌ రచయిత
మూలం ఎగెనెస్ట్‌ దొర అండ్‌ నిజామ్‌ పీపుల్స్‌ ముమెంట్‌ ఇన్‌ తెలంగాణ
ముద్రణ : జనవరి 2008
266 పేజీలు, వెల : రూ. 80/-

Wednesday, November 21, 2012

వాక్యం రసాత్మకం కావ్యం

నాగరాజు పప్పు
(కళాతత్త్వ శాస్త్ర విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని వ్యాసాలను నాగరాజు పప్పు గారు రాస్తున్నారు. వాటిని వారి పేరుతోనే ఇక్కడ పునర్మిద్రిస్తున్నాను - దార్ల )


Sunday, February 04, 2007

వాక్యం రసాత్మకం కావ్యం
వాక్యం రసాత్మకం కావ్యం -- మొదటి భాగం(ఈ వ్యాసం - ప్రాచీన కవిత్వం దగ్గర నుంచి, ఆధునిక కవిత్వం వరకూ గల విభిన్నమైన కవితా రీతుల గురించి, వస్తు వర్ణన మొదలుకొని రసావిష్కరణ వరకూ గల రకరకాలైన భావ వ్యక్తీకరణ పద్దతుల గురించి, ఈ మధ్య వస్తున్న అనుభూతి కవిత్వాన్ని గురించి విశ్లేషించడానికి చేసిన ప్రయత్నం. ఇందులో కవితలు రాయదానికి కొన్ని చిట్కాలూ, పద్దతులూ కూడా - నాకర్ధమైనంతలో చెప్పడానికి ప్రయత్నించేను. అలాగే, అనుభూతి కవిత్వాన్ని ఆస్వాదించటం ఎలాగో కూడా చెప్పే ప్రయత్నం.)మా ఇంటిలో రమారమి అందరూ - `రాతా'సురులే. కొందరు పద్య కవిత్వం రాస్తే, కొందరు గేయకవిత్వం, మరికొందరు కధలు, వ్యాసాలు రాస్తారు. అన్ని ప్రక్రియలలో చెయ్యి కాల్చుకొన్న వాడు మా మావయ్య ఒక్కడే. సుమారు పాతికేళ్ళ క్రితం - అప్పటికింకా బాగా చిన్న వాణ్ణి - "మావయ్యా - కవితలు రాయడం సుళువా, కధలు రాయడం సుళువా" అని అడిగా. ఆయనొక క్షణం ఆలోచించి, ఓ సిగరెట్టు, దానితో పాటుగా ఇంకో చిరునవ్వు వెలిగించి - "రాయడం వరకే అయితే - కవితలే సుళువు" అని చమత్కరించేడు. ఆ చమత్కారంలో ఉన్న మడత పేచీ నాకీ బ్లాగు మొదలుపెట్టే దాకా తెలిసి రాలేదు.కవితల జోలికెళ్ళే ఉద్దేశ్యం మొదట్లో నాకే కొసనా లేదు. మేధావి వర్గం వాళ్ళం కదా - మాకు మెదడు పెద్దదీ గుండె చిన్నదీను. అందుచేత, ప్రేరణ ఎక్కువ స్పందన తక్కువ. ఈ అనుభవించి పలవరించడం లాంటి గొడవలు మనకెందుకులే - ఊకదంపుడు ఉపన్యాసాలు మనకి వెన్నతో పెట్టిన విద్యే కదా - హాయిగా ఏవో వ్యాసాలు, కథలు రాసుకొందాం అనుకొన్నాను. మొదలెట్టిన తర్వాత తెలిసింది - పెద్దపెద్ద వ్వాసాలు 'రాయటం' ఎంత కష్టమో. ముందు ఆలోచించాలి - ఇది అన్నిటికీ ఉన్నదే, ఆలోచించిన దాన్ని ముందు 'draft version' రాయాలి, ఆ తర్వాత దానికి మెరుగులు దిద్దాలి. ఆ పైన `అప్పుతచ్చులు' సరిదిద్డాలి. తెలుగు రాసి చాలా కాల మైందేమో - అచ్చుతప్పులు చాలానే దొర్లుతాయి - సత్యాలు శివాలై పోతూంటాయి. ఒక అక్షరం కింద ఉండాల్సిన ఒత్తులు, పక్క అక్షరం మేదికి ప్రేమతో ఒరిగిపోయి, జరిగిపోతూంటాయి. మరికొన్నైతే లేచిపోతాయి కూడ. ఈ బాధలన్నీ పడిన తర్వాత, కంప్యూటర్ లోకి ఎక్కించడం ఇంకో తలకాయ నోప్పి. ఎడం చేతి చిటికెన వేలితో నిమిషానికి పదిసార్లు 'shift' key నొక్కాలంటే - చేతులు నొప్పి. మొత్తం మీద రెండు వ్యాసాలు పూర్తి చెయ్యడానికి ఆరు మాసాలు పట్టింది. అందుకని ఈ 'రాయటం' బాధలు పడలేక కవిత్వం 'చెప్పేద్దాం' అనుకొన్నాను - కవితలైతే ఒక ఐదారు లైన్లలో కొట్టేయ్యచ్చు కదా!కాని, కవిత్వం మనకి చెప్పడం రాదే - మొదట్లో రాసిన కవితలు - నర్సు ఆపరేషన్ చేసినట్టుండేవి - వాటిని చదివితే నాకే చిరాకేసేది. ఇప్పటికీ అలానే ఉంటాయ్ అని మీరనుకోవచ్చనుకోండి - మీ అభిప్రాయం మార్చడానికే మరి ఈ ప్రయత్నం.కవితలు రాయాలంటే - ముఖ్యంగా - వస్తువు, శైలి, శిల్పం కావాలి. వస్తువంటే - స్నేహం గురించి రాయొచ్చు. ప్రేమ గురించి రాయచ్చు, ప్రేయసి గురించి, ప్రకృతి గురించి రాయొచ్చు - కాకపోతే, పేదల బాధల గురించి కూడా రాయొచ్చు. ఇలాంటి వస్తువులన్నీ ఇప్పటికే మహామహులెందరో తుక్కు తుక్కుగా దున్నేసారు. కొత్తగా చెప్పడానికి ఏం కనిపించ లేదు. అదీగాక, మన తెలుగు కవులకి (ముఖ్యంగా ఆధునిక కవులకి)రెండు రకాల కామెర్లు - ఒకటి పచ్చకామెర్లు (ప్రకృతినీ, ఆకులనీ, కోయిలని చూసి మహా ఇదై పోతూంటారు - భావకవులన్న మాట), ఇంక రెండో తరహా వాళ్ళకి ఎర్రకామెర్లు - వీళ్ళు సామాజిక స్పృహంటూ బిచ్చగత్తెల మీదా, ఉంపుడుకత్తెలమీదా, కూలీల మీదా, కర్షకుల మీదా ఏదేదో రాసేసి, పాఠకుల మీద కవితల కేకలేస్తుంటారు. ఇంకపోతే, కాలేజి అమ్మాయిల కవితల తరహా వేరు - ప్రేమలు, దోమలు, వలపులు, విరహాలు, ఏడ్పులు, వీడ్కోళ్ళు - మొదలైన వాటి గురించి తెగ ఫీలైపోతుంటారు.ఈ తరహా కవిత్వం అంటే నాకు చచ్చేంత రోత. ఎంత ఆలోచించినా ఏం రాయాలో, ఎలా రాయాలో తెలీలేదు. అందుకని, రాయటం కట్టి పెట్టి, ఓ సంవత్సరం పాటు - అన్ని రకాల కవిత్వాలని చదవటం, విశ్లేషించటం మొదలెట్టేను. మంచి కవితలు రాయాలంటే ముందు మంచి కవితలు చదవాలి కదా?కవిత్వాన్ని మూడు కోణాల్లోంచి మనం విశ్లేషించ వచ్చు - వీటిని Structural, Metaphorical, Stylistic అందాం. Structural గా చూస్తే, తెలుగు కవిత్వం - పద్య కవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం అని స్తూలంగా మూడు రకాలుగా విభజించ వచ్చు. పద్య కవిత్వం అందరికీ తెలిసిందే - చెప్పదల్చుకొన్న విషయాన్నో, వస్తువునో - చంధస్సులో నిబద్దం చేస్తే అది పద్య కవిత్వం. ఇపుడు పద్య కవిత్వం చెప్పే వాళ్ళున్నారు కాని చాల తక్కువ. గేయ కవిత్వం అంటే పాడు కోవడనికి అనువుగా ఉండేది - సినిమా పాటలు, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలు చాలవరకు గేయ కవిత్వం అనచ్చు. ఇకపోతే వచన కవిత్వం - చాలవరకు కుర్రకారు కవిత్వం అంతా వచన కవిత్వమే. ఆత్రేయ, తిలక్ వీరిద్దరివీ వచన కవిత్వంలో అందెవేసిన చేతులు, ఈ ఇద్దరికి తప్పిస్తే వచన కవిత్వం చెప్పడం మరెవ్వరికీ సాధ్యం కాలేదేమో అనిపిస్తుంది. Structural గా చూస్తే, వచన కవిత్వం గేయ కవిత్వం కన్నా, గేయ కవిత్వం పద్య కవిత్వం కన్నా తేలికగా అనిపించొచ్చు. కాని, కవితకు భావం ప్రాణం అయితే, లయ ఊపిరి. లయంటే - కవిత చదువుతున్నపుడు దానికో ఊపు, తూపు ఉండాలి. ఈ లయని సాధించటంలోనే ఉంది కవి తాలూకు ప్రజ్ఞ్న అంతా. లయని తీసుకురావటం వచన కవిత్వంలో చాలా కష్టం. గేయ కవిత్వంలో కొంత కష్టం. పద్య కవిత్వం లో నైతే - లయ చంధస్సులో అంతర్లీనంగా ఉండనే ఉంటుంది - అందుకని పద్య కవిత్వంలో లయ గురించి ప్రత్యేకంగా కృషి చెయ్యక్కరలేదు.గేయ కవిత్వంలోనైతే - లయ సాధించటానికి కవి ఒక తాళాన్ని ఎంచుకోవచ్చు. ఆ తాళానికి - ఆది తాళమో, రూపక తాళమో - దానికి తగ్గట్టుగా పదాలని ఎంచు కొంటే - కొంత వరకూ లయని సాధించినట్టే. శ్రీశ్రీ లయని సాధించటంలో సిద్ధహస్తుడు. భావానికి తగ్గ ఉద్రేకాన్ని, శక్తిని తను ఎన్నుకొనే చంధస్సులో, పదాల అమరికలో సాధిస్తాడు. ఉదాహరణకి, మహా ప్రస్థానం మొదటి కవితలో ......పదండి ముందుకుపదండి తోసుకుపోదాం పోదాం పైపైకి ...ఇది చదువుతున్నప్పుడు - అందులో ఊపిరాడని ఉద్రేకం, విప్లవం ఉన్నాయి. అవి మనన్ని ఊపేస్తాయి. ఇదే కవితని, పదాలు అమరిక మార్చిరాస్తే.....ముందుకు పదండితోసుకు పదండిపైపైకి పోదాం పదండి..అన్నాం అనుకోండి - ఎలా ఉంది? బస్సు కండక్టరు ప్రయాణీకులని అదిలిస్తున్నట్టు లేదూ?కొత్త కవులూ, కుర్ర కవులూ - లయని సాధించటంలో సాధారణంగా పప్పులో కాలేస్తుంటారు. అంత్యప్రాస ఒక్కటే వీళ్ళకున్న పాసుపతాస్త్రం మరి - నారాయణ రెడ్డీ అనగానే బంగారు కడ్డీ అంటారన్న మాట.లయ మీద పట్టు సాధించటం వచన కవిత్వంలోనూ గేయ కవిత్వంలోనూ కష్టం అని ఎందుకన్నానంటే - పద్యానికైతే ముందే నిర్ణయించిన చంధస్సు, నియమాలు ఉన్నాయి. మనం చంధస్సుని సృష్టించుకోనక్కరలేదు. ఉన్నదాన్ని అర్ధం చేసుకొని ఉపయోగించుకోగలిగితే చాలు. ఉదాహరణకి, ఓ దండకం చెప్పాలనుకోడి - ఒక సగణం మీద వరసగా తగణాలు వేసుకొంటూ పోతేసరి. ఉదాహరణకి - పొగాకు మీద దండకం చెప్పాలనుకోండి - "కోటలో బైరుగావించి, ఒప్పుగా నిప్పు దెప్పించి మిక్కిలిన్ ప్రేమతో ధూపముల్ త్రాగువారెంత పుణ్యాత్ములో యెంత ధర్మాత్ములో" ఇలా చెప్పుకొంటూ పోవచ్చు.కాని, అదే గేయకవిత్వంలో, కవి తనకి కావల్సిన చంధస్సు, సాధించాల్సిన లయని తనే తయారు చేసుకోవాలి. ఇది కష్ట సాధ్యమైన పనే. కేవలం అంత్యప్రాసలతోనో, శబ్ధాలంకారాలతోనే అయ్యేపని కాదు. కొన్ని `చిట్కాలు' మాత్రం ఉన్నాయి. తెలుగులో, `క చ ట త ప' ల కీ, `గ స డ ద వ'ల కీ మధ్య చక్కటి సంభంధం ఉంది. మొదటి పాదంలో ఉన్న పద్యాల్లో `క చ ట త ప' లుంటే, రెండో పాదంలో అదేచోట `గ స డ ద వ' లొచ్చేటట్టు చూస్తే - కవితకి అంత్యప్రాసలతో దొరకని అందం వస్తుంది. చదువితున్న వాడికి `ట్రిక్కు' వెంటనే అందదు కాబట్టి ఇంకా రంజుగా ఉంటుంది. ఉదాహరణకి కరుణ శ్రీ పుష్ప విలాపం చూడండి. శ్రీశ్రీ, కృష్ణ శాస్త్రి, వేటూరి అందరూ చాల అందంగా ఈ ప్రయోగం చేస్తారు. ఇంక రెండో ట్రిక్కు, గేయ కవితల్లో, ప్రతి పాదం లోనూ పదాలు చాలా తక్కువగా ఉంటాయి - సాధారణంగా మూడుకి మించి ఉండవు. శ్రేశ్రే అయితే, చాలా వరకూ ఒక పాదంలో ఒక్క పదాన్నే వాడతాడు. వచన కవితని, గేయ కవితగా మార్చదలచు కొంటే, ప్రతి వాక్యంలో ఉన్న పదాలని తగ్గించి చూడండి - చాలావరకూ లయని సాధించవచ్చు. ఉదాహరణకి, ఈ మధ్య నే రాసిన `అనుభూతి కనువాదం' కవిత, మొదటి సారి రాసినపుడు ........నా కిటికీలోంచి తొంగి చూసేచిట్టి చిట్టి చిన్నారి ఉడతలునా మదిలో తొణికస లాడేచిన్ని చిన్ని ఊహల తలపులునా నుదుటనీ వద్దినచిరు ముద్దులు ....ప్రతి పాదాన్ని కొంచెం కుదిస్తే .....కొమ్మల్లోనారెమ్మలమీదఊయలలూగేఉడతల్లారానిలకడలేనినామదిలోనాతొణికిసలాడేఊహలుకారామొదటి దాని కన్నా రెండో దాంట్లో ఊపుంది కదా?అందంగా వచన కవిత్వం చెప్పడం అన్నిటి కన్నా కష్టం. ఒక రకంగా తిలక్ వచన కవిత్వాన్ని ప్రవేశపెట్టి తెలుగుసాహిత్యానికి తీరని ద్రోహం చేసేడేమో అనిపిస్తుంది అపుడపుడు. వచన కవిత్వాన్ని అందంగా రాయడం ఆయనొక్కడికే తెలుసు. కాని, ఆయన ప్రవేశ పెట్టిన ఒరవడిని అనుకరించి పప్పులో కాలేసిన వాళ్ళే ఎక్కువ.ఇక అసలు విషయానికొద్దాం. కవతకి భావం ప్రాణం అని ముందే చెప్పుకొన్నాం కదా. All poetry is metaphorical and allegorical. కవి గులబిమొక్కలాంటివాడు. ఎలాగైతే ఓ గుప్పెడు మట్టిని, గ్లాసుడు నీళ్ళనీ అందమైన గులబీపువ్వుగా రూపొందించడానికి మొక్క ఎంత మధన పడుతుందో అలాగే కవి కూడా బాహ్యప్రపంచంనుంచీ అందిన ప్రేరణని, అది తనలో రేపిన స్పందనని కవితగా మలచడానికి అంతే తపన పడతాడు. ఈ తపనని రసనిర్దేసం అని అందాం ప్రస్తుతానికి. రసావిష్కరణ చెయ్యడానికి కవికున్న ముఖ్యమైన సాధనం - మెటాఫర్.గత 1500 సంవత్సారాల తెలుగు కవిత్వ చరిత్రలో, పోయటిక్ మెటాఫర్ లో చాలా మార్పులూ, చేర్పులూ వచ్చేయి. ఈ కోణంలోంచి, తెలుగు కవిత్వాన్ని- వస్తు విషయ వర్ణన, భావ వ్యక్తీకరణ, అనుభూతి చిత్రీకరణ అని స్తూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.ఈ పద్దతుల గురించి విపులంగా - తరువాత చెప్తాను.
 
 

వాక్యం రసాత్మకం కావ్యం -- రెండో భాగం
కవిత్వంలో మెటాఫర్ ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసం.గత 1500 సంవత్సారాల తెలుగు కవిత్వ చరిత్రలో, పోయటిక్ మెటాఫర్ లో చాలా మార్పులూ, చేర్పులూ వచ్చేయి. ఈ కోణంలోంచి, తెలుగు కవిత్వాన్ని- వస్తు విషయ వర్ణన, భావ వ్యక్తీకరణ, అనుభూతి చిత్రీకరణ అని స్తూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.ఈ వ్యాసం మొదటి భాగంలో Structural Aspects ని వివరిస్తూ, తెలుగు కవిత్వాన్ని మూడురకాలుగా విభంజించేంకదా - పద్య కవిత్వం, గేయకవిత్వం, వచన కవిత్వం అని. Metaphoric Aspects లో ఈ మూడింటినీ పద సౌలభ్యం కోసం - ప్రబంధ కవిత్వం, భావ కవిత్వం, అనుభూతివాద కవిత్వం అని అందాం.నిజానికి సాంకేతికంగా, ఈ వర్గీకరణని పండితులు ఒప్పుకోరు. ప్రాచీన కవిత్వాన్నంతా ప్రబంధ కవిత్వం అనడం నిజానికి కుదరదు, అలాగే, గురజాడ నుంచి, మొన్నటి తిలక్ దాకా వచ్చిన కవిత్వాన్నంతా భావ కవిత్వం అనడం కూడా సమంజసం కాదు. నిన్నటి నగ్నముని నుంచి ఇవాల్టి సీతారామ శాస్త్రి వరకు ఉన్న కవులందరినీ అనుభూతి వాదులనడం కూడా తప్పే. అయితే ఈ పదాలని నేను సౌలభ్యం కోసం వాడుతున్నాను. తెలుగు కవిత్వ చరిత్రని మెటాఫర్ కోణం లోంచి, విశ్లేషించడానికి, ఈ వర్గీకరణ సరిపోతుంది.ఇంతకు ముందు చెప్పుకొన్నట్టుగా, కవి గులాబిమొక్కలాంటివాడు. ఎలాగైతే ఓ గుప్పెడు మట్టిని, గ్లాసుడు నీళ్ళనీ అందమైన గులాబీపువ్వుగా రూపొందించడానికి మొక్క ఎంత మధన పడుతుందో అలాగే కవి కూడా బాహ్యప్రపంచంనుంచీ అందిన ప్రేరణని, అది తనలో రేపిన స్పందనని కవితగా మలచడానికి అంతే తపన పడతాడు. అందుకే All poetry is metaphorical and allegorical. ప్రేరణ బాహ్య ప్రపంచానికి సంబందించినదైతే స్పందన అంతర్లీనమైన భావ ప్రపంచానికి సంబందించినది.ఉదాహరణకి, విశాఖపట్నం రామకృష్ణా బీచ్ దగ్గర (ఆంధ్రా యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ దగ్గర) ఓ అందమైన అమ్మాయి కనిపించిందనుకోండి. ఇది అబ్బాయిలందరికీ చాల చక్కటి ప్రేరణ. చాలమందికి స్పందించే హృదయాలు కూడా ఉండొచ్చు. కాని, ఆ స్పందనని ఎలా వర్ణిస్తారు? ఓ చురుకైన గడుగ్గాయి "అబ్బా - అచ్చు కేలండర్ లో లక్ష్మీ దేవి బొమ్మలా ఉంది కదరా" అంటాడేమొ. ఆ మాట, ఆ వయ్యారి చెవిన పడి, ఆవిడ చెయ్యి పైకెత్తుతే - కాసులు రాలకపోయినా, మన గడుగ్గాయ్ పళ్ళు మాత్రం రాలతాయి. రసికరాజుల సంగతటుంచి, ఆ సమయానికి అక్కడ ఓ ముగ్గురు కవిరాజులు - ముక్కు తిమ్మన, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషేంద్ర శర్మ ఉన్నారనుకోండి - అదే - ఉన్నారని ఊహించుకోండి.సాయంకాలం, సాగరతీరం, ఆపైన సౌందర్య దర్శనం - ఇంకాగుతారా?ముక్కు తిమ్మనగారు వెంటనే, బిలహరి రాగంలో గొంతెత్తి:"నానాసూనవితానవాసనల నానందించు సారంగమేలాననొల్లదటంచు గంధఫలి పల్కాకన్ దపంబొంది యోషా నాసాకృతి దాల్చి సర్వసుమస్సౌరభ్య సంవాసియైపూనెం బ్రేంఖణమాలికా మధుకరీపుంజబు నిర్వంకలన్"అంటూ పరవశించిపోతారు. (నిజానికీ పద్యం, ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ ముక్కుని వర్ణిస్తూ రాసిన పద్యం కాదు. రామరాజభూషణుని వసుచరిత్రలోనిది. కాని, సాహితీలోకం ఎందుచేతనో ఈ పద్యాన్ని ముక్కు తిమ్మనగారికే అంటగట్టింది)దీనర్దం ఏమిటంటే - పూలన్నిటినీ వాసన చుసే తుమ్మెద తన దరికి రాదెందుకని సంపెంగె పువ్వు కినుకబూని, ఘోరమైన తపస్సుచేసి, చక్కదనాల చిన్నదాని ముక్కుగా అవతారమెత్తి, తానే పూలన్నిటినీ వాసన చుస్తూ, చూపులతూపులనే తుమ్మెదగుంపులని తనకిరుపక్కలా ఎల్లప్పుడూ ఉంచుకొందట.మహానుభావుడు నాలుగు పాదాల్లో ఎంత మందు దట్టించేడో గమనించేరా? ఇదీ మెటాఫరంటే. తెలుగు సాహిత్యంలో ఎన్నదగిన పద్యాలలో ఇదొకటి. అందుకు కారణాలు లేకపోలేదు. మొదటి కారణం - అందమైన ముక్కుని సంపెంగె పువ్వుతో పోల్చడం అదే మొదటిసారి. అంతవరకూ, ఆంధ్రదేశంలోని ఆడవాళ్ళ ముక్కులన్నీ అచ్చుగుద్దినట్టు ఒక్కలాగే ఉండేవి పాపం - కోటేరుల్లాగ. ఒకటిరెండు వేరే రకాలున్నా, ఆ నాసికలు వాసికెక్కలేదు.ఇక రెండో కారణం - మహాకవెప్పుడూ, తను చెప్పేదానికంటే, చెప్పకుండా మనకి స్పురింపచేసేదే ఎక్కువుంటుంది. దీన్నే, 'ధ్వని' అంటారు. ధ్వని మెటాఫర్ కి పరాకాష్ట. కినుకబూనిన సంపంగెకదా - మరుజన్మలో కూడా ఆకోపం రవ్వంత ఉంటుంది - పూర్వజన్మ వాసనలనుకోండి - సంపంగెకి వాసనెక్కువ కదా? అందుకే చక్కని చుక్కకి కోపం ముక్కుమీదుంటుందంటారు.తనని తప్ప మిగతా పువ్వులన్నింటినీ వాసన చూస్తుందని కదా ఈ సంపంగె కినుక? ఇందులో స్త్రీ సహజమైన ఈర్ష్య ధ్వనించటంలేదూ? అందుకనే, ఆ పూలన్నిటినీ తురిమేసి, తన జడలోకి తరిమేస్తుంది (అంటే తన ముఖానికి వెనకవైపుకి). తనుమాత్రం ఆ అందమైన ముఖానికి కొట్టచ్చేటట్టు - కొలువుదీరి కూర్చుంటుంది దర్జాగా.ఇకపోతే, వొయ్యారి చూపులని తుమ్మెదలతో పోల్చడంలోనే అసలు చమత్కారం అంతా ఉంది. అంతకు ముందు దాకా, చూపులని మన్మధబాణాలనే వారు. కాని, చూపులని తుమ్మెదలనడంలో ఒక చక్కటి 'చిత్రం' (ఫొటోగ్రాఫ్) ఉంది. ఇలా అనడం ద్వారా కవి మనకి ఆవిడ కళ్ళు ఎలా ఉంటాయో, చుపులెలా ఉంటాయో, ఆ చూపుల ప్రభావం ఎటువంటిదో - అన్నీ ఒక్క ఉపమానం ద్వారానే కళ్ళకి కట్టినట్టు తెలియజేసేడు. ఈ చంచలాక్షి కళ్ళు చాలా నల్లగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, ఎప్పుడూ అటూ ఇటూ చూస్తూంటాయి. ఆ చూపు తగిలినవాడికి కలిగే గిలిగింత తుమ్మెద కాటులా ఉంటుది - ఒళ్ళు జలదరిస్తుందన్నమాట. తుమ్మెదకాటులో ఒకరకమైన విషం ఉంటుదికదా - దాని ప్రభావం వల్ల మైకం కమ్మి, మత్తెక్కుతుంది కూడాను.ఇన్ని రకాల మెటాఫర్లున్నాయి ఈ పద్యంలో. ఇలాంటి పద్యాలు ప్రబంధ సాహిత్యంలో కోకొల్లలు. ఐతే, అవన్నీ ప్రదానంగా వస్తు వర్ణనలే - అంటే, అమ్మాయి అందాన్ని వర్ణించడం ఈ పద్యంలో కవితా వస్తువు. ప్రబంధ సాహిత్యంలో మెటాఫరంతా సుమరుగా వర్ణనకి సంబందించినదే. భావ కవిత్వంలో, బాహ్యమైన వస్తువుని కాకుండా, మానసిక ప్రపంచాన్ని - కంటిక్కనిపించని భావాలని వ్యక్తపరచడం ముఖ్యమైన కవితావస్తువు.అయితే, భావకవిత్వం ఏదో ఒక్క సారిగా పుట్టుకు రాలేదు. ఈ మార్పు చాపకింద నీరులా చాలా నెమ్మదిగా వచ్చింది. నన్నయ్యతో ప్రారంభమైన తెలుగు కవిత్వం, శ్రీనాధుడి కాలానికి ప్రబంధ కవిత్వం రూపులని సంతరించుకొంటే, పోతన కవిత్వంలో భావకవిత్వానికి అంకురార్పణ జరిగింది. ఈ పరిణామాన్ని కొంచెం క్లుప్తంగా ఇక్కడ చెప్పుకొని, ఆ తర్వాత భావకవిత్వంలోకి దూకుదాం.ప్రాచీన కవిత్వంలో మొత్తం కథంతా పద్య రూపకంగానే చెప్పేవారు. అందుచేత వర్ణనలెక్కువ. అంతమాత్రంచేత కేవలం వర్ణనలే ఉన్నాయనుకొంటే పొరపాటే. ఒక కథలో పాత్రలని, వాళ్ళ వ్యక్తిత్వాలని పరిచయం చేయాలంటే - కంటికి కనిపించని మనస్తత్వాన్ని మనకు చూపించ గలిగే భావ వ్యక్తీకరణ కావాలి కదా?ఉదాహరణకి, తిక్కన మహాభారతంలో ఏ వ్యక్తినీ కేవలం భౌతికమైన వర్ణన చెయ్యడు. ఆ వ్యక్తి కదులుతున్నప్పుడో, ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడో, పూలుకోసుకొంటున్నప్పుడో - ఇలా కదలికతోనే ఆయన మనుషులని మనకి పరిచయం చేస్తాడు. అందుకే, తిక్కన భారతం శ్రవ్య కావ్యం ఐనప్పటికీ, దృశ్యకావ్యంగా కూడా ప్రసిద్దికెక్కింది. ఉదాహరణకి, ధర్మరాజు - రాజశూయం చేసిన చక్రవర్తి. సామ్రాట్టులకి సామ్రాట్టు, అయినా కూడా వినయ గుణ సంపన్నుడు. మాములు కవైతే, రాజాది రాజ, రాజపరమెశ్వర అంటూ పొగడ దండల దండకం చెప్పేవాడేమో - తిక్కన మహాకవులకి మహాకవి. అందుకే ఆయన "ఎవ్వనివాకిట నిభమదపంకంబు రాజభూషణరజో రాజి నడగు" అంటూ మొదటి పాదంలోనే కొండలని పిండిగొట్టెస్తాడు. ఆ తర్వాత, పాదం మీద పాదం పెంచుకొంటూపోయి, చివరకి:నతడు భూరిప్రతాప మహాప్రదీప దూరవిఘటిత గర్వాంధకార వైరివీరకోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితులుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడుఅంటూ ధర్మరాజు గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన యశోవైభవాన్ని మన కళ్ళకి కట్టినట్టు చెప్తాడు.ఇక్కడ నన్నయ్య భారతానికి, తిక్కన భారతానికి మద్యగల మెటాఫర్ లోని తేడాని కుడా ఒకసారి చెప్పాలి. నన్నయ్య భారతంలోని వ్యక్తులందరూ ఉదాత్తంగా మనకి కనిపిస్తారు - వాళ్ళు మనకందనంత ఎత్తులోనే ఎప్పుడూ ఉంటారు. నన్నయ్య భీముడు ఎవరిమీదనైనా కోపంవస్తే - మూఢమతీ అనో, మూర్ఖుడా అనో గంభీరంగానే తిడతాడు - తిక్కన భీముడైతే - పోవోయ్ తువ్వాయ్ అనగలడు. ఇంకా 'తిక్క'రేగితే - లకారాలు కూడా అందుకోగలడు. తిక్కన భారతంలోని పాత్రలు మనలాగే భూమిమీదుంటారు, మాములు మనుషులు, వాళ్ళ కోపతాపాలు కూడా మనకి బాగా అందుబాట్లొ ఉంటాయి. ఈ తేడా ఇక్కడ ఎందుకు చెప్పేనంటే - ఈ తేడా కేవలం వర్ణనలో ఉన్న వైవిద్యంకాదు, వీరిద్దరి పొయిటిక్ మెటాఫర్ లోఉన్న తేడా.ఇక, పోతన భావకవులకి చాల దగ్గరగావచ్చే ప్రాచీన కవి. గజేంద్రుడిని రక్షించడానికి మహావిష్ణువు వైకుంఠంలోంచి ఎలాఉన్నవాడు అలాగే బయలు దేరిపోయేడట. సిరికిన్ చెప్పడు అన్న పద్యం అందరికీ తెలిసిందే కదా? భక్తులని రక్షించడానికి భగవంతుడు ఎంత తొందరపడతాడో చెప్పడానికి పోతన కనిపెట్టిన మెటాఫరది.అలాగే, వామనచరిత్రలో - వామనుడు - ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆకాశానికి, అక్కడనుంచి అంతరిక్షానికి ఎదిగి పోతున్నాడు. అలా ఎదిగి పోతున్న త్రివిక్రముడి ఎత్తు మనకి చెప్పడానికి - కాదు - మన కళ్ళకి కట్టినట్టు చూపడానికి - పోతన ఒక కొత్త మెటాఫర్ కనిపెట్టేడు. అది సూర్యబింబాన్ని కొలతబద్దగా స్వీకరించటం:రవిబింబం బుపమింప బాత్రమగు చత్రంబై శిరోరత్నమైశ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమైఛవిమత్కంకణమై కటిస్తలి నుదంచద్ఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడు దాబహ్మండమున్ నిండుచోన్ఆదిలో, పెరుగుతున్న వామనమూర్తికి సుర్యబింబం గొడుగుగా కనిపించింది, ఆ తర్వాత శిరోమణిగా అయింది, తర్వాత క్రమక్రమంగా, చెవికమ్మగా, కంఠాభరణంగా, భుజకీర్తిగా, కరకంకణంగా, మొలగంటగా, కాలికడియంగా, చివరకు పాదపీఠంగా మారిపోయింది. మొదట ఛత్రంగా ఉన్న సుర్యుడు ఆఖరికి పాదపీఠంగా అయినాడంటే, స్వామి ఎంత ఎత్తు పెరిగిపోయేడో మనలనే ఊహించుకోమన్నాడు మహాకవి. ఇందులో రవిబింబానికుపయోగించిన ఉపమానాలన్ని - గుండ్రంగా ఉండడం మరో ఎత్తు.సాగరమదనం కథలో, దేవగణాలన్నీ ప్రార్ధించటంతో శివుడు హాలాహలాన్ని తాగడానికొప్పుకొన్నాడు. ఉబ్బు శంకరుడు కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు, కాని ఆయన భార్య పార్వతి అందుకుఎలా సమ్మతించిందో? సాధారణంగా, మొగవాడు గొప్పలకిపోయి దారి తప్పుతూంటే - ఆడది అతనికి బుద్ధి చెప్పి దారికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది కదా? మరి పార్వతి తన మొగుడు విషం తాగుతానంటే అందుకు ఎలా ఒప్పుకొంది?మ్రింగెడువాడు విభుండనిమ్రింగెడునది గరళమనియు మేలన్ ప్రజకున్మ్రింగుమనె "సర్వమంగళ"మంగళసూత్రంబు నెంత మదినమ్మినదోప్రజలకు మేలుకాబట్టి, తన మంగళసూత్రాన్ని నమ్ముకొని, మింగమందిట. అందుకనే ఆవిడ సర్వమంగళైందని పొతన కితాబు. ఇక్కడ సర్వమంగళ అన్న ఒక్క పదంలో తన భావకవితా ప్రతిభనంతా ప్రదర్శించేడు పోతన. పార్వతికి ఆపేరు అంతకు ముందునుంచే ఉన్నా - దానికి సార్ధకత పోతన పద్యం ద్వారానే వచ్చిందేమో. శివుడు గరళం మింగడానికి ముందే, ఆవిడ ఎంతో బాధని, ప్రజల మేలుకోరి, మింగిందని ఆవిడమీదే పోతనకెక్కువ అభిమానం. అందరి మేలు కోరేది కాబట్టి ఆయమ్మ సర్వమంగళైతే, అందరికీ శుభం చేసేవాడు కాబట్టి ఆయన శంకరుడైనాడు.ఈరకంగా భావకవిత్వం ఛాయలు ప్రాచీన కవిత్వంలోను, ప్రబంధ కవిత్వంలోనూ ఉన్నాయి - కృష్ణశాస్త్రి కాలానికి అవి బాగా ఊపందుకొన్నాయి. ఇక్కడతో ప్రబంధ కవిత్వానికి స్వస్తి చెప్పి, భావ కవిత్వానికొద్దాం.విశాఖపట్టణం బీచ్ లో ముగ్గురు మరాఠీలని ప్రవేశ పెట్టేం కదా. అందులో, తిమ్మన గార్ని తుమ్మెద కాటేసింది. ఆ గొడవేదో ఆయనకే వదిలేసి, కృష్ణశాస్త్రి సంగతికొద్దాం. కృష్ణశాస్త్రికి అమ్మాయి అందంతో పనిలేదు. చిన్నారి చూపుల తూపుల దెబ్బకి తనలొ కలిగిన స్పందనే ఆయన కవితా వస్తువు:"తీయ తేనియ బరువుమోయలేదీ బ్రతుకు"అంటూ పాపం అక్కడే కూలబడిపోతాడు. ప్రబంధ కవిత్వం నుంచి భావకవిత్వానికొచ్చేసరికి మెటాఫర్ ఎంత మారిపోయిందో చూసేరా? బాహ్యమైన వస్తువుని చెప్పడానికి వర్ణన సరిపోతుంది, కాని మదిలో మెదిలిన మధురమైన ఊహని చెప్పడానికి 'abstraction' కావాలి. స్పందనకి స్పష్టమైన రూపుండదు కదా?ఇటువంటి భావకవిత్వానికి ప్రాణంపోసింది పెర్షియన్ మాహాకవులు - హఫీజ్, జామి, రూమి, అత్తర్, హకిమ్ సినాయ్, ఒమార్ ఖయ్యామ్ మొదలైన రసరాజులు. ఆ తర్వాత, ఉర్దూలో - గాలిబ్,ఫిరదౌసి లాంటి కవిరాజులు. దీన్ని తెలుగులోకి తెచ్చిన వాళ్ళు - రాయప్రోలు, అబ్బూరి మొదైలైన వాళ్ళు. తెలుగులో భావకవిత్వానికి ప్రాణంపోసి, దాన్ని సజీవ ధారగా చేసిన భాగిరథుడు కృష్ణశాస్త్రి.విరుద్దమైన, వ్యతిరేకమైన పదాల కలియకతో అద్భుతమైన ఒక కొత్త మెటాఫర్ని తయారు చేయడంలో కృష్ణశాస్త్రి - సిద్దహస్తుడు. రాగిని బంగారంగా మార్చే పసరువేదుంది ఆయన దగ్గర. విరుద్దమైన పదాలకలియకతో కృష్ణశాస్త్రి సృష్టించే ఇంద్రజాలం చూడండి:"మురళి పాటకు రగిలిమరుగునీ వెన్నెలలుసొగయి నా ఎదకేలతగనీ సౌఖ్యజ్వాల?"తీయ తేనియ బరువు, రగిలిపోయి, మరిగిపోయే వెన్నెలలూ, సౌఖ్యజ్వాలలూ - ఇవన్నీ, కొత్త మెటాఫర్లు - అంతకు పూర్వం ఏకవి తెలుగులో అలాంటి expressions వాడలేదు. ఒక కొత్త మెటాఫర్ సృష్టించడంలోనే కవి గొప్పదనం అంతా ఉంది. ఇలాంటి మెటాఫర్లు మనకి కవి మనసులోని స్పందనని మనకు అందచేస్తాయి. మరిగిపోయే వెన్నెలలని మనం ఒక దృశ్యంలాగ ఊహించుకోలేం, కాని కవి చెప్పదలుచుకొన్న ఊహని మనం ఆశ్వాదించగలం.చాలవరకు, కృష్ణశాస్త్రి కవిత్వంలో, Conscious Suffering అనేది ప్రదానమైన కవితా వస్తువు."మలిన భాష్ప మౌక్తికమ్ముమిలమిల నీ కనుల మెరియతళతళ మని తారలు నటయించునురా పాపి""భరియింపగరాని లజ్జశిరము వంగి కృంగినంతతెరలదాటి చందమామ నవ్వునురా పాపి"ఇంత అందంగా Longing & Conscious Suffering ని చెప్పే కవితలు ప్రపంచ సాహిత్యంలోనే బహుఃసా చాలా అరుదుగా ఉంటాయేమో!అలాగే, ఇంకో కవితలో - ఆరాధనలో ఉండే Constant Remembrance ని కృష్ణశాస్త్రి చాల చిత్రమైన, విరుద్దమైన మెటాఫర్ లో చెప్తాడు:"నీ పిలుపు వినక గాఢనిదురలోన మునిగియున్ననిష్ఠురాఘాతముతోనీవే మేలుకొలిపి, ప్రభూమరలి వెడలిపోకుమాకరుణ క్షణము నిలబడుమా"చెట్టునో, పువ్వునో వర్ణించవచ్చు, అందాన్ని కొంతవరకూ వర్ణించవచ్చు, వసంతాన్ని, వెన్నెలలని వర్ణించవచ్చు. కాని, గర్వాన్ని, వినయాన్ని, మన మనసుకు హత్తుకొనేలా ఎలా వర్ణించడం? పూలజాతర అనే కవితలో:పచ్చనాకుల రాణివాసపుపడతినే, నే సంపంగెనేసరసులను సామంతులను నాస్వాదువాసన పిలుచునేఅని ఒక సంపెంగ పువ్వు బీరాలు పోతుంటే, ఇంతలో ఒక గడ్డి పువ్వు:దారి పక్కను గడ్డిసజ్జెనుదాగిఉండే బీదను, నిరుపేదనుపూజకంటే వస్తిని, ఏ మోజులేనిచిన్నివిరిని, ప్రభువు కొలువునదాసిని, శ్రీపదములకు తివాసినిఅంటుంది. "Ego, Humility" అనే concepts ని, మన మెదడుకి కాకుండా, మన మనసుకి direct గా అందేలా చేస్తుందీ కవిత. కవి మనకి అందచేద్దామనుకొన్న 'feeling' ఎంత abstract ఐతే, మెటాఫర్ కూడా అంత abstract గా ఉంటుంది మరి. గొప్ప భావకవిత్వంలో మన అంతఃప్రపంచానికి సంబందించిన వస్తువుని మనముందు "చిత్రీకరించే" మెటాఫరుంటుంది. భావకవి దృశ్యాన్ని మట్టుకే వర్ణించడు, ఆ దృశ్యంలో నిబిడియున్న నిబద్ధమైన ప్రపంచాన్ని వర్ణిస్తాడు. అందుకే, poetry is felt before it is understood. Logical Analysis కి ఇటువంటి మెటాఫర్ అందదు. తేనియకి బరువేముటుంది? వెన్నెనలు మరగడమేంటి?ఈ మధ్య నేరాసిన ఓ కవిత చదివి, ఒకరు ఆకులు పువ్వులవ్వవు కదండీ - ఇది సైన్స్ కి విరుద్దం అన్నారు. మరి ఆకులు ప్రేమిస్తాయా? Poetry doesn't simply ask for faith - it demands a leap of faith. విశ్వకవి టాగొర్, ఇలాటి విశ్లేషణలతో విసిగిపోయి:If I say the Earth is flat - you tell me that my near vision is falseIf I say that the stars are fire flies in the night forest of the sky, you tell me that my far vision is false.నయనానికి చూపుంది కాని, అది ప్రపంచాన్ని దర్శించ గలదా? నిజాన్ని చూడడంకాదు, సత్యాన్ని దర్శించడం కళల పరమావధి.ఇదీ భావకవిత్వంలో మెటఫర్ గొడవ. ప్రబంధ కవిత్వానికి, భావ కవిత్వానికి ముఖ్యమైన తేడా - వర్ణన ప్రబంధ కవిత్వంలో ప్రదానమైన కవితా వస్తువైతే, కనిపించని, అంతర్లీనమైన భావాలని, స్పందనని వ్యక్తపరచడం భావకవిత్వంలోని ప్రదానమైన కవితా వస్తువు (పొయిటిక్ మెటాఫర్ కోణంలోంచి చూస్తే). అయితే, ప్రాచీన కవిత్వంలో 'abstraction' లేదనీ కాదు, భావ కవిత్వంలో వస్తు వర్ణన లేదనీ కాదు. ఇవి కవిత్వాల తిరుతెన్నులని నిర్వచించే ప్రదానమైన అంశాలు మాత్రమే.ఎలాగైతే, ప్రబంధ కవిత్వంలో అంకురార్పణ చేసికొన్న భావకవిత్వం కృష్ణశాస్త్రి కాలానికి మహావృక్షంగా ఎదిగిందో, కృష్ణశాస్త్రి కాలంలోనే బాలసారె చేసికొన్న అనుభూతివాద కవిత్వం గుంటూరు శేషంద్ర శర్మ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి మొదలైన వాళ్ళ ఆలనా పాలనల్లో పెరిగి పెద్దదైంది.భావకవిత్వంలో మెటాఫర్ ముఖ్యమైన కవితా వస్తువైతే, అనుభూతివాద కవిత్వం - allegorical గా ఉంటుంది. నయనానికి, దృశ్యానికి మద్యనుండే అనంతమైన ఆకాశాన్ని, దానిలో నిగూఢమైన రహస్యాలని అందుకోడానికి అనుభూతివాది ప్రయత్నిస్తాడు.ఆ గొడవంతా మరికొద్ది రోజుల్లొ -
మూడో భాగంలో చెప్పుకొందాం.
అప్పటిదాకా శేషేంద్ర శర్మతో ఈ వ్యాసం సశేషం.
 
 నాగరాజు పప్పు ( వ్యాసకర్త)

Sunday, February 11, 2007

వాక్యం రసాత్మకం కావ్యం -- మూడో భాగం
తెలుగులో అనుభూతి కవిత్వంయొక్క (ఎల్లిగారికల్ పోయిట్రీ) స్వరూప స్వభావాలు.(ఇంతవరకూ, ప్రబంధ కవిత్వం గురించీ, భావ కవిత్వం గురించీ - వాటి మధ్య తేడాలను గురించీ, లక్షణాలను గురించీ చెప్పుకోన్నాం కదా. ఇంక, ఇక్కడ నుంచీ అంతా అనుభూతి కవిత్వం (అర్ధంకాని కవిత్వం అనే పర్యాయ పదం కూడా ఉంది దీనికి) స్వభావం గురించి, లక్షణాల గురించిన గొడవ.)వర్ణనని ప్రబంధ కవులూ, స్పందనని భావకవులూ తన్నుకు పోయేరు కాదా - మరింక అనుభూతికవికి చెప్పడానికేం మిగిలింది పాపం అనుకొంటున్నారా? నిజమే - చాలా కాలం ఏంచెప్పాలో తెలియక చాలా మంది కవులు పక్క దారులు తొక్కేరు. ఈ మధ్యనే, మనో వైజ్ఞానికశాస్త్రం అందుబాట్లోకొచ్చేక - ఆ స్పందన ఎక్కడ నుంచి పుడుతుందో, ఎలా పుడుతుందో, దాని స్వరూప స్వభావాలెట్టివో వెతికి, వెతికి, శోధించి ఏదో సాధించేద్దామని తెగ తాపత్రయపడిపోతున్నారు. అందుకే అనుభూతి కవిత్వాన్ని వంటబట్టించుకోవాలంటే కొంచెం కష్టపడాలి.మరి ఆ గొడవంతా సావధానంగా ఆలకించండి మరి:శేషేంద్రశర్మగారు - పాపం చాల రోజుల నుంచీ రామకృష్ణాబీచ్ లోనే ఉండి పోయేరు కదా? ఆయన్ని అక్కడ అంతకాలం ఉంచడానికి కారణం ఉందిలెండి - అనుభూతి కవితలు రాయడానికి చాలా టైం పడుతుంది మరి.తుమ్మెదకాటుకి కైపెక్కిపోయింది తిమ్మనగార్కి, తీయతేనియ బరువుతో కూలబడిపోయేరు కృష్ణశాస్త్రి. కాని అలాటి బాధలు శర్మగారి దరిచేరవు. వీళ్ళిద్దరూ ఎందుకిలా అయిపోయేరు అని ఆయన చాలసేపు ఆలోచిస్తాడు - ఈ కైపెందుకు కలుగుతోంది, ఆ బాధ ఎందుకింత తియ్యగా ఉంది అని కొన్ని రోజులు తపస్సు చేస్తాడు, ఆ తర్వాత:నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందికన్నుల్లొ నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చిందిఅని అందు కొంటాడు. ఏంటీ శేషేంద్రజాలం? తోట నిదురించటం ఏమిటి? తోటలోకి పాట రావటం ఏమిటి? ఇంతకీ ఎవరికి కన్నీళ్ళు - తోటకా? పాట కన్నిళ్ళు తుడవటమేమిటి? ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు మనం అడిగేలోపే, ఆయన ఇంకాస్తా ముందుకు జరిగి:రమ్యంగా కుటీరాన రంగవల్లుల్లల్లిందిదీనురాలి గూటిలోన దీపంగా నిలిచిందిఅంటాడు. ఇంతకీ తోట ఏమైనట్టూ? పాటేమైనట్టూ? అంతటితో ఊరుకోంటాడా?కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారానది దోచుకు పోతున్న నావను ఆపండీరేవు బావురు మంటుదోందని నావకు చెప్పండీఅని ముక్తాయిస్తాడు. నది నావను దోచుకుపోవడమేంటి? దాన్ని పక్షులూ మబ్బులూ ఎలా ఆపగలవు?దీన్ని మొదటిసారి చదివితే ఒక చరణానికి మరో చరణానికి ఉన్న సంబంధం ఏమిటో బోధపడదు. కవితలో మెటాఫర్ చాలా లోతుగా ఉంటుంది. కవిత మెత్తంఅంతా ఒక విషయం గురించి రాసినట్టుండదు. ఒకంతట అర్ధంమయి చావదు. కవిత్వం చదువుతున్నపుడు మీకు ఇలాంటి ప్రశ్నలే వస్తాయా? మరైతే వీటి రహస్యం చెపుతా వినండి. విన్న తర్వాత - ఛీ - ఇంత అందమైన పాటని ఇలా ఖునీ చేసెస్తావా అని నన్ను తిట్టకండి.అందానికి అర్ధంవెతక్కు అని మీకు ముందే వార్నింగిచ్చేను - మీరు వినలేదు. కావున - పొరబాటు నాది కాదు.ముత్యాలముగ్గు సినిమాలో ఈ పాట మీరందరూ వినే వుంటారు. కె.వి.మహాదేవన్ - కాదు కాదు - మహిమదేవన్ - ఈ కవతని అందమైన పాటగా కూర్చేడు. ఒక్కనిమిషం సుసీలమ్మ గొంతునీ, మధురమైన మహిమదేవన్ సంగీతాన్నీ మరిచిపోయి, ఈ పాటని కవితలా చదివి చూడండి.ఇది అసలు సిసలు పదహారణాల వచన కవిత. వార్తా పత్రికలో వార్తలాగ దీన్ని చదివేసుకోవచ్చు. ప్రతి చరణం పూర్తి పేరాగ్రాఫ్ లాగా, పూర్తి వాక్యంలాగా ఉంటుంది. మీకింకా మహిమ దేవన్ మత్తు వదిలినట్టులేదు కదూ. అయితే, ఇంకోసారి చదవండి:విశాఖపట్న, ఫిభ్రవరి - ౯: నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లొ నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. రమ్యంగా కుటీరాన రంగవల్లుల్లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా నిలిచింది. కొమ్మల్లో పక్షులని గగనంలో మబ్బులని, నది దోచుకు పోతున్న నావను ఆపమని, రేవు బావురు మంటుదోందని నావకు చెప్పమని శేషేంద్ర శర్మ గారు రామకృష్ణాబీచ్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు.అనుభూతి కవిత్వం అంతా దాదాపుగా ఇలాగే ఉంటుంది. ప్రబంధ కవులు తమ శక్తినంతా వర్ణించడంలోనూ, ఆ వర్ణనకి కావలిసిన భాష, పదాలు, ఛందస్సుకోసం కొత్త కొత్త సమాసాలు సృష్టించడంలోనూ కేంద్రీకరించేరు. భావకవులు మధురమైన ఊహలని మనకందించడానికి కొత్త కొత్త మెటాఫర్లు కనిపెట్టడంలో తమ శక్తినంతా కేంద్రీకరించేరు - కాబట్టి, భావకవిత్వానికొచ్చేసరికి - భాష తేలికయ్యి, భావం బరువైంది. అదే, అనుభూతివాదుల దగ్గరకొచ్చేసరికి - అర్ధగాంభీర్యం ఇంకా ఎక్కువైపోయి, భాష ఇంకా తేలికైపోయింది.ప్రబంధకవిత్వాన్ని అర్ధంచేసుకోడానికి భాషతో ఎంత కుస్తీలు పడాలో, అనుభూతికవితల లోతులందుకోడానికి అంతకన్నా అవస్తలు పడాలి - అందుకనేమో, చాలమంది భావకవిత్వానితో ఆగిపోతారు.శేషేంద్రశర్మ కవితనే తీసుకోండి - అందులో అర్ధం అందినట్టే ఉంటుంది కాని మనకి పూర్తిగా చిక్కదు. అందుకోడానికి మనమో అడుగు ముందుకేస్తే, అది మరో పదడుగులు పరిగెత్తి మనలని పరిహసిస్తూంటుంది.Allegory ని తెలుగులో ఎమనాలో నాకు తెలియదు. అనుభూతికవితలన్ని ఎల్లిగారికల్ గా ఉంటాయి. అయితే, నిజానికి వీటినర్ధంచేసుకోడం అంత కష్టమేమీ కాదు. సుమారుగా, మంచి అనుభూతి కవితలన్ని ఒక ప్రణాలిక ప్రకారం ఉంటాయి - అంటే, వీటన్నిటిలో ఒక స్ట్రక్చరుంటుందన్నమాట. అంతర్లినమైన, మానసికమైన, ఆథ్యాధ్మికమైన, ఆత్మపరమైన భావాలని ఒక భాహ్యచిత్రానికి అన్వయం చేసి, అంతఃచిత్రానికి భాహ్యచిత్రాన్ని ప్రతీకగా చూపడతాయన్నమాట. అంటే, మనలోపలి Sub-Conscious and Psychological Processes కి ఫొటోగ్రాఫ్ తియ్యడన్నమాట.నిదురించే .. పాట మీద ఓవంద పేజీల వ్యాఖ్యానం రాయొచ్చు. ఇక్కడ కొంచెం క్లుప్తంగానే చెప్తాను:ఈ పాటలో ప్రతి చరణంలో ఉన్న మొదటి పాదాలన్ని కలిపి చదివితే, ఒక అందమైన చిత్రపటం మన ముందుంటుంది. సుమారుగా, ప్రతి ఇంటిలోనూ, గోడలమీద స్వీట్-హోమ్ చిత్రాలుంటాయి గదా? దూరంగా కొండలు, కింద చక్కటి తోట, ఆ తోటలో చిన్న అందమైన కుటీరంలాంటి ఇల్లు, ఇంటికి పక్కగా - మెల్లగా, తీరికగా పారుతున్న నది, పైన పున్నమి చంద్రుడు, ఆ నదిలో తెరచాపెత్తిన నావ, పైనోరెండు పక్షులు, కొండలమీద మబ్బులు - ఇలాంటి ప్రకృతి పటాలెన్ని చూసుంటారు? ఈ చిత్రమంతా ఈ కవితలో ఉంది. అలాటి ఫొటో చూస్తే మనకెలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఏకాంతామూ, నిశ్శబ్ధమూ, నిశ్చలత కలగలసి - చీకులు చింతలూ, వ్యధలూ స్పర్ధలూ, ఆశలూ మోసాలూ లేని ఓ అందమైన సాయంత్రం గుర్తుకు రాదూ?ప్రతి చరణంలో, రెండో పాదంలో అంతర్లీనమైన మానసిక నిశ్చలతని మొదటిపాదంలోని చిత్రంతో అన్వయిస్తాడు. ఒక ఎరిక మనలో పుట్టి, తలుపుగా మారి, స్మృతిగా ఎదిగి, జ్ఞాపకంగా కరిగిపోయే ప్రక్రియని ( inner process) చిత్రీకరించే కవిత ఇది.నిదురించే తోట: మన సబ్-కాన్సష్. మెత్తం జీవితానుభవాన్నంతా ఒక గ్రంధాలయంలా బధ్రపరిచే బేంకు లాటిది సబ్-కాన్సష్. కాని ఇది మన కంట్రోల్లో ఉండదు. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రేరణ, మన సుఖాలు, ధుఃఖాలు, బాధలూ, నవ్వులూ, ఇష్టాలూ, ప్రేమలూ, ప్రతీకారాలు - సమస్తం మన సబ్-కాన్సష్ అదుపాజ్ఞలలోనే ఉంటాయి. మనకోచ్చే కలలన్నీ దీని ప్రభావమే.మెదడు మొగుడైతే, ఇది పెళ్ళాం లాంటిదన్నమాట. సబ్-కాన్సష్ మాట మనం వినాలిగాని, మన నియంత్రణలో అదుండదు. అది చెప్పేదేదో తిన్నగా, సూటిగా, మనికర్ధమయ్యేటట్టు కూడా చెప్పదు. ఒకసారి క్రీగంట చూస్తుంది, సైగ చేస్తుంది - మనం వినిపించుకీకుండా తప్పుచేసిసేం అనుకోండి - చాలా ఆనందం దీనికి, నేను చెప్పేనా - నువ్వు విన్నావా, వినిపించుకొంటేనా అంటూ సరాగాలు పోతుంది. మరదేదో సరిగా సూటిగా చెప్పచ్చుకదా అని అన్నాం అనుకోండి - నన్ను పూర్తిగా ఎప్పుడైనా చెప్పనిస్తేనా, చెప్పేలోపే పరుగందుకొన్నావు కదా అంటూ దీర్ఘాలు తీస్తుంది.మెదడుకున్న శక్తితో పోలిస్తే, దీని శక్తి అపారం, అనంతం. మనం ఎన్నో విషయాలు మరచిపోతుంటాం - కనీసం అలా అనుకొంటాం, కాని, మన జీవితంలో ప్రతి క్షణాన్ని పదిలపరుస్తుంది మన సబ్-కాన్సష్. హేతుబధ్దమైన ఆలోచనల కందకుండా మనలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి, మీరో చీర కొనాలని చీరలకొట్టుకెళ్ళేరనుకోండి - అక్కడ కొన్ని వేల చీరలుంటాయిగదా - అందులో ఒక చీర మ్మిమ్మల్నాకర్షిస్తుంది - ఎందుకో చెప్పగలరా? అలగే, ఎదో లెక్కలు చేస్తున్నారునుకోండి - అది ఒక పట్టాన తేలి చావదు. దాని గురించే ఆలోచించి, తల బద్డ్దలు చేసుకొని, సమాధానం దొరక్క విసిగిపోయి పడుకొంటారు - తెల్లారి లేవగానే, అనుకోకుండా మీకు ఆ లెక్కకి సమాధానం దానంతటదే 'స్పురిస్తుంది' - ఎలాగో చెప్పగలరా? ఒకర్ని చూడగానే, ఎక్కడో చూసినట్టుంటుంది, ఆత్మీయుల్లా అనిపిస్తారు - ఎందుకో చెప్పగలరా? ఇదంతా సబ్-కాన్సష్ చలవే. మన మెదడుకి సంభందించినంతవరకూ ఇదో చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి.పాట: ఎదో ఒక అనుభవం, ఒక ఎరిక, ఒక స్పందన. సాధారణంగా మనల్ని కదిలించే అనుభూతులన్నీ - కొన్ని క్షణాల నిడివి మాత్రమే కలిగుంటాయి. 'అనుభూతిని' మిగిల్చే అనుభవం ఎప్పుడూ గంటలకోద్దీ ఉండదు. ఒక చెట్టునో పుట్టనో చూసినప్పుడూ, ప్రియమైన మనిషిని కలిసినప్పుడూ, మంచి పాట విన్నప్పుడూ, మనల్ని కదిలించే అనుభూతి రెప్పపాటు కాలం మాత్రమే కదా.కుటీరం: మన కందుబాటలో, మన నియంత్రణలో ఉండే మేధా శక్తి (కాన్సష్).రంగవల్లి: అనుభవంగా మారిన అనుభూతి. సాధారణంగా, మనం మనల్ని కదిలించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని, ఆ అనుభూతిని నెమరువేసుకొని, దానికి రంగులు పులిమి, రెక్కలు తొడిగి, ఒక చుట్టలా ఉన్న అనుభూతిని మన ముందు తివాచీలా పరచుకొంటుంటాం. దాన్ని, మన మిగతా అనుభవాలతో రంగరించి, జ్ఞపకాలతో ముడివేసి, ఆలోచనలతో మేళవించి ముగ్గుల్లల్లుతాం. We generate the momentum from the moment. మొదటి చరణంలో పాట రెండో చరణంలో రంగవల్లి అయింది.దీనురాలు: హృదయందీపం: మనలని కదిలించిన ప్రేరణని మనం అనుభవిస్తున్నప్పుడు మనలో జనించే ప్రతిస్పందన. అంటే, పాటని, రంగవల్లిగా మనం మారుస్తున్నప్పుడు మనలో కలిగే పీలింగన్నమాట. ఆనందమో, విషాదమో, మాధుర్యమో, లాలిత్యమో, కోపమో, భాదో - ఇలాంటి ప్రతిస్పందనలు మనలో కలుగుతాయి కదా. ఈ ప్రతిస్పందనలు దీనురాలైన హృదయానికే గాని, సబ్-కాన్సష్ కుండవు. అలాగే, ప్రతిస్పందనలు - స్పందన మనలో జనించినప్పుడు కలగవు, ఆ స్పంధనని మనం అనుభవిస్తున్నప్పుడు కలుగుతాయి. రెండో చరణంలో రంగవల్లి ఇప్పుడు దీపమయ్యింది.నది: జీవన స్రవంతి. జీవితం ఎప్పుడూ ఎక్కడా ఆగదు, నదిలా అన్ని తనలో ఇముడ్చుకొంటూ, సాగిపోతుంటుంది కదా. ఎవరో ఒక గ్రీకు తత్వవేత్త చెప్పినట్టు ఒకే నదిలో నువెప్పుడూ రెండుసార్లు స్నానం చెయ్యలేవు - ఎందుకంటే, మునకేసి లేచేటప్పటికి కొత్తనీరు వచ్చెస్తుంది కదా?నావ: ఇంతకు మునుపు దీపంగా మారిన పాట, కొంత కాలానికి ఒక స్మృతిగా మారి - కాల ప్రవాహంలో కలసిపోయి, మన జ్ఞాపకాల మరుగున పడి కనుమరుగై కొట్టుకుపోతుంది.పక్షులు, మబ్బులు: పాత స్మృతులని హఠాత్తుగా వెలికితీసే ప్రేరణలు.బావురుమన్న రేవు: నిస్సారమైన, మార్పులేని దైనందిన జీవితం.సబ్-కాన్సష్ లో జనించిన ఒక ఎరిక, అనుభవంగా, జ్ఞాపకంగా ఎదిగి, మన ఎదలో ప్రతిస్పందనలు రేపి, స్మృతిగా మారి, చివరికొక జ్ఞాపకంగా కరిగిపోయే ప్రక్రియనంతా ఈ పాటలో ఎల్లిగారికల్ గా - ఒక పాట, రంగవల్లిగా ఎదిగి, దీపంగా మారి, నావగా అదృశ్యం అవ్వడం అనే చిత్రంతో అన్వయించేడన్నమాట. ఈ మధ్యనే కల్హార బ్లాగరి స్వాతికుమారి రాసిన అంతర్వాహిని అనే కవిత కూడా సుమారుగా ఈ థీమ్ మీద రాసిన కవితే.పాట నావగా మారడమేమిటండీ - వింటున్నాంగదా అని మా చెవుల్లో పువ్వులు పెట్టెస్తున్నారు గాని అంటారా? ఏం ఎందుకు మారకూడదూ?గనుల్లొ బొగ్గురాళ్ళు, జలపాతాల్లొ నీటి ధారలు, విద్యుచ్చక్తిగా రూపొంది, మీ ఇంటి దీపాల్లో కాంతి పుంజాలుగా, చూరులపైన పంకాల్లో చలన శక్తిగా, మీ శకటాల్లో గమన శక్తిగా రూపొందటంలేదూ? అంతెందుకు? మీ కంప్యూటర్ తెరమీద కనిపిస్తున్న ఈ అక్షరాలు కూడా విద్యుత్తే కదా - అంటే, ఒకప్పుడు ఈ అక్షరాలు నీటి ధారలో, బొగ్గు ముక్కలో కావా? నల్లటి బొగ్గు అందమైన అక్షరం అయినప్పుడు - పాట నావెందుకు కాకుడదూ?పిండితే త ఫిలాసఫీ ఉంది ఈ పాటలో.అనుభూతి కవిత్వాన్ని పరిచయం చెయ్యడానికి మాత్రమే నేను ఈ పాటనెన్నుకొన్నాను. మంచి అనుభూతి కవితలన్ని సుమారుగా ఇలాగే ఉంటాయి. అయితే, చెత్త కవితలని కూడా, ఉదాహరణకి:మా ఆవిడ శిరోజాలకి శిశిరం వచ్చిందిఅందుకే, నిన్న రాత్రి నిద్దట్లో నేనుహేమంతాన్ని తినీశేనులాంటి కవిత్వాన్ని కూడా అనుభూతి కవిత్వంగా చెలామణీ చేసెస్తున్నారీమద్య. అర్ధంకానిదీ, అర్ధంలేనిదీ ఒకటి కాదు కదా? అర్ధంలేని కవిత్వాన్ని కుడా అనుభూతి కవిత్వమంటే ఏంచెయ్యగలం? చచ్చినవాడి కళ్ళు చేరడేసి అని ఊరుకోవాలంతే.మరైతే, ఈ అనుభూతికవిత్వాన్ని ఆశ్వాదించాలంటే సైకాలజీ అంతా తెలియాలా అని అడుగుతారేమో. నిజానికి, మంచి అనుభూతి కవిత్వాన్ని గుర్తించడం, ఆస్వాదించటమూ అంత కష్టమేమీ కాదు.ఆ విషయాలన్ని తరవాతి భాగంలో చెప్పుకొందాం. వీటిని చదవటం ఎలాగో, రాయటం ఎలాగో - నాకు తెలిసినంత వరకూ - తరువాతి భాగాలో వివరిస్తాను. నాలుగో భాగంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కవితలనో మారు స్పృశించి, డైలాన్ థామస్ గురించీ చెప్పుకొని, అనుభూతి కవితల స్ట్రక్చర్ గురించి, మంచి కవితలనెలా గుర్తించాలో వివరిస్తాను. ఆ తర్వాత, వీటిని రాయడంలో నాకు తెలిసిన చిట్కాలు కొన్ని చెప్తాను.అనుభూతి కవిత్వం గురించి ఇంత విపులంగా ఎందుకు రాస్తున్నానంటే, ప్రబంధ కవిత్వం గురించి, భావ కవిత్వం గురించీ వివరించే వ్యాసాలూ, పుస్తకాలు చాలానే ఉన్నాయి. కాని, నాకు తెలిసినంతలో, అనుభూతి కవిత్వాన్ని నిర్వచించి, వివరించే ప్రయత్నం ఇంతవరకూ తెలుగులో ఇదే ప్రధమమేమో.మీ అభిప్రాయాలని నాకు తప్పకుండా తెలియ చెయ్యండి - ఈ వ్యాసాన్ని మెరుగుపరిచి, ఇందులో తప్పులేమైనా ఉంటే సరిదిద్దటానికి మీ సూచనలూ, అభిప్రాయాలూ నాకు చాలా విలువైనవి....

Sunday, November 18, 2012

మా మట్టివేళ్ళకు స్వాగతమిస్తూ ! ! !

కపిల రాంకుమార్//మట్టి వేళ్ళు//

మా మట్టివేళ్ళకు స్వాగతమిస్తూ ! ! !
ఈ మట్టిలో వేళ్ళూనికొని చెట్లపై మొన్నటిదాకా
కి్చ కిచలాడిన ఓ పూరేడు పిట్ట
సత్తుపల్లి నుండి భాగ్యనగరానికి వలసెళ్ళింది!
సంచిలోని విత్తుకు తడి తగిలిందేమో
చిన్నమొక్కైంది!

గతంలో సత్యాన్వేషిగా మొదలై
సాహితీ స్రవంతి నీడలో కాస్త సేదతీరి
ఇక్కడి రాత కోతల్నీ దాచుకున్న కవితల్నీ
కట్టకట్టిన దస్త్రాన్ని విప్పీ
తోటి పక్షులకు ఎరవేసే క్రమంలో
కారేపల్లి యాకూబ్ పిలుపు బుజానవేసుకొని
కాశీరాజు తోడుచేసుకొని విత్తనాలు ఎరగాచల్లింది
ఆదర్వు దొరకాలేకాని వలలో వాలిన  పిట్టలను కూడేసి
కవి సంగమంలొ  కట్టిపడేసేలా
ఫంజరం ఏర్పాటుచేస్తే అంతర్జాలంలో చిక్కుకొని
అంతర్థానమై పోతున్న గమ్యరహిత కొత్త పిట్టల్ని
సాన పట్టలని తలచి, వారికి తోడుగా చేయి తిరిగినవాళ్ళను
జతకలిపే క్రమంలో ఓ చోటుకు చేర్చి,
ఇప్పుడు తన మట్టివేళ్ళ సత్తువని సత్తుపల్లిలో
వ్యంగ్య, హాస్య, అభ్యుదయ భావజాలాన్ని
చూపించడానికి
ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు
కష్టపడి, కట్టుబడిచేస్తున్న
కట్టానికి తొ్లి ఫలం
గట్టి వేళ్ళూనుకోవాలని ఆశిస్తూనే
ఆ వాసన ఖమ్మం బోడేపూడి విజ్ఞానకేంద్రంలో
గ్రంఠాలయంలో గ్రంథం పరిచయవవడం
ఆనందకరం! ఆభినందనీయం!

18.11.2012 ఉ.6.27.
ఈ రోజు సాయంత్రం ఖమ్మం మిత్రులు పరిచయ సభను బొడెపుడి విజ్ఞాన కెంద్రం లొ ఎర్పాటు చెసారు.. అందుబాటులోవున్న వారందరికి స్వాగతం!



Saturday, November 17, 2012

అభినయ దర్పణము – తెలుగుసేత -లింగముగుంట మాతృభూతయ్య

అభినయ దర్పణము – తెలుగుసేత -లింగముగుంట మాతృభూతయ్య
More articles by మల్లిన నరసింహారావు »
Written by: మల్లిన నరసింహారావు
Tags: Abhinaya Darpanam

2010వ సంవత్సరం డిశెంబరు నెల 24 -26 తేదీల మధ్య భాగ్యనగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సిలికానాంధ్రవారు ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ కన్వెన్షన్ ను నిర్వహించారు. దానిలో ప్రేక్షకునిగా పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. ఆ నిర్వహకులు వచ్చిన వారికందరికీ సిలికానాంధ్ర వారు ప్రచురించిన ”సుజన రంజని – నాట్యమంజరి” అనే పేరుతో ఆ సందర్భంగా విడుదల చేసిన సావనీరును బహుమతిగా పంచిపెట్టారు. ఆ సావనీరులో చివర అనుబంధంగా “అభినయదర్పణము” అనే పేరుకల – లింగముగుంట మాతృభూతయ్య కవి విరచితమైన – ఓ చిరుపొత్తాన్నిచేర్చటం జరిగింది. ఈ అభినయ దర్పణము బహు సుందరమైనది. నాట్యాభ్యాసకులకు, నాట్యంలోని అభినయ ముద్రలను గుఱించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అనిపించింది. దీనిని మన పుస్తకం.నెట్ చదువరులకు పరిచయం చేస్తే బాగుంటుందని అనిపించి ఇక్కడ దానిని పొందు పరుస్తున్నాను. ఇది 3 ఆశ్వాసాలతో కూడి ఉన్నది. పద్యాలు చాలా సరళంగానూ మంచి ధారాశుద్ధి కలిగిన్నీ ఉన్నాయి. ఓ 6-7 భాగాలుగా దీనిని పరిచయం చేద్దామని ప్రయత్నం. మొదటి భాగాన్ని క్రింద ఇస్తున్నాను.
అభినయదర్పణము – 1
— వ్రాసిన కవి లింగముగుంట మాతృభూతయ్య
శ్రీకరమై చెలంగు సరసీరుహమిత్రుని పాదపద్మముల్
సేకొని వందనంబులను జేసి ముదంబున యాజ్ఞవల్క్యులం
బ్రాకట మొందఁగాను మఱి ప్రార్థనచేసి ముదంబు మీఱఁగా
నైకవిధాల నామహుని నారసి యేఁ ప్రణమిల్లి గొల్చెదన్. 1

శ్రీ విలసిల్లుపార్వతికిఁ జెన్నుగఁ బుత్రుఁడుగా జనించి యా
భావజుభావ మై దనరి భక్తులపాలిటి పారిజాతమై
యీవగ నెల్లలోకముల నేలెడి యా గణనాథు కెప్పుడున్
సేవ యొనర్చెదన్ మిగులఁ జిత్తములో నను బాయ కుండఁగన్. 2

సరసిజనాభ ! దేవమునిసన్నుత ! మాధవ ! భక్తపోషణా !
పరమదయానిధీ ! పతితపావన ! పన్నగతల్ప ! కేశవా !
కరివరదాప్రమేయ ! భవఖండన ! యో జగదీశ ! కావవే
మురహరి ! వాసుదేవ ! యఘమోచన ! కస్తురిరంగనాయకా! 3

శారద ! నిన్ను గొల్చెదను సారెకు, నా మనవాలకింపవే
నారదుఁ గన్నతల్లి ! కృప నాయెడ నుంచి వరంబు లియ్యవే
నీరజనేత్రి ! విద్యలకు నీవె గదా మఱి వేల్పు ధాత్రిలోఁ
గూరిమి మీఱఁ గొల్చెదను, గోర్కెలొసంగు మదంబ ! వేఁడెదన్. 4

ధరలోన రామచంద్రుని
చరితము గావ్యంబుగాను సల్పి జగంబుల్
వెరగందఁ జేయు మౌనిని
నిరవుగ భజియింతు నేను నింపుగ ధాత్రిన్. 5

సకలపురాణంబులు నిలఁ
బ్రకటంబుగఁ జేసి, మిగుల భారత కథయున్,
రకముగఁ దెల్పిన మౌనికి
నిఁక నే వందన మొనర్తు నింపలరంగన్. 6

పరఁగ నల కాళిదాసుని బాణు నెలమి
దండి భవభూతి మాఘుల మెండుగాను
ధరను సజ్జనులగు వారి కరుణఁ గోరి
సరస సత్కవులను నేను సన్నుతింతు. 7

అవని భాగవతోత్తముఁ డనఁగఁ బరఁగు
పొంకముగఁ జాల బమ్మెర పోతరాజు
సొరిది శ్రీనాథుఁ దిక్కన సోమయాజి
భాస్కరుని సన్నుతింతును బాగు మీఱ. 8

ఎలమి నిరక్షరకుక్షులఁ
బలుమఱు నే ధిక్కరించి ప్రభవ మొప్పం
జెలు వొందఁ గృతియుఁ జెప్పెద
సలలితసత్కవులు సూచి సన్నుతి సలుపన్. 9

సరవి లింగమగుంట శంకరనారనా
ర్యునకుఁ బౌత్రుండ నయి దనరు వాఁడ
ననువుగా మృత్యుంజయార్యుపుత్రుండ నై
నిరతంబుఁ గీర్తిచే నెగడువాఁడఁ
బరమపావనుఁ డైన కరిరాజవరదుని
వరముచే జనియించి పరఁగువాఁడ
ననువుగఁ జెలు వొందు యాజ్ఞవల్కాచార్యు
కరుణకుఁ బాత్రమై మెఱయువాఁడ.

నమరఁ గాశ్యపగోత్రజుఁ డైనవాఁడఁ
జేరి హరిదాసులకు సేవ చేయువాఁడ
నవనిఁ గవి మాతృభూత నామాన్వితుఁడుగఁ
జెలగువాఁడను శ్రీహరి గొలుచువాఁడ. 10
వ. అని యిట్లు కమలమిత్రుఁ డైన మార్తాండునికి వందనంబు గావించి, మదీయ కులాచార్యులైన యాజ్ఞవల్కులకు బ్రణమిల్లి, గణనాధునిం బూజించి, యిష్ట దేవతా ప్రార్థనంబు సేసి, భారతిని బ్రణుతించి, యాదికవీంద్రులైన వాల్మీకి వ్యాసాది మునీంద్రులం బ్రస్తుతించి, వరకవి కాళిదాసాదులన్ సన్నుతించి, యాంధ్రకవి పితామహులైన బమ్మెరపోతరాజు, శ్రీనాథులం గొనియాడి, కుకవి తిరస్కారంబునుం జేసి, మదీయ వంశావలంబులన్ సన్నుతించి, యొకానొక ప్రబంధంబు రచియింపంబూని యున్న యవసరంబున, నొక్కనాడు మదీయ స్వప్నంబున, 11
నీలమేఘము వంటి నెమ్మేను గలవాఁడుఁ
డంబైన పీతాంబరంబువాఁడు
నీరజారిని గేరునెమ్మోము గలవాఁడుఁ
గరమున శంఖచక్రములవాఁడుఁ
గస్తూరితిలకంబు సిస్తు మీఱినవాఁడుఁ
గమలంబులను గెల్చు కనులవాఁడుఁ
శ్రీవత్సకౌస్తుభాంచిత వక్షుఁడగువాఁడుఁ
బక్షివాహనుఁ డయి పరఁగువాఁడుఁ

చెలఁగి యొకనాఁడు స్వప్నమం దెలమి వచ్చి
యెనసి యభినయదర్పణం బనఁగ నిలను
ఘనప్రబంధము నొక్కటి గరిమ మీఱఁ
బూని రచియింపు మనుచును నానతిచ్చె. 12

శ్రీకరగుణహార ! శ్రితజనమందార !
హరి ! వాసుదేవ ! మహానుభావ !
చారుమోహనగాత్ర ! సన్మునిస్తుతిపాత్ర !
యినకోటిసంకాశ ! యిందిరేశ !
గోవర్ధనోద్ధార ! గోబృందపరివార !
భావనాసంచార ! భవవిదూర !
యరవిందలోచన ! యఘభయమోచన !
పంకజాసననుత ! భవ్యచరిత !

వరద ! యచ్యుత ! గోవింద ! హరి ! ముకుంద !
భక్తజనపోష ! మృదుభాష ! పరమపురుష !
సరసగుణహార ! శ్రీరంగపురవిహార !
రాక్షసవిరామ !కస్తూరిరంగధామ ! 13
షష్ట్యంతములు
కమలాప్తతేజునకు నా
కమలాసనవందితునకు గమలాపతికిం
గమలారివదనునకు మఱి
కమలజదళ నేత్రునకుఁ గరివరదునకున్. 14

కువలయదళనిభనేత్రుకుఁ
గువలయదళగాత్రునకును గుణశీలునకుం
గువలయపరిపాలునకును
గువలయనాథునకు మదనగోపాలునకున్. 15

హరిసుత పరిపాలునకును
హరివైరితురంగునకును హరివదనునకున్
హరిధరునిమిత్రునకు నా
హరిరూపముఁ దాల్చినట్టి హరిరంగనికిన్. 16
వ.
అభ్యుదయ పరంపరాభివృద్ధిగ నా యొనర్పఁబూనిన యభినయదర్పణంబను మహాప్రబంధమునకు లక్ష్యలక్షణంబు లెట్టి వనిన. 17

అభినయ దర్పణము -2

అభినయ దర్పణం సంస్కృతంలో నందికేశ్వరునిచే రచింపబడిన గ్రంథం. Digital library లో దొరుకుతుంది. లింకు ఇదిగో. http://www.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0012/538&first=1&last=119&barcode=2020120012533

తరువాత మాతృభూతయ్య గారి అనువాదం ఇలా సాగింది.
ధరను విలసిల్లునభినయదర్పణంబు
గరిమ నిది పద్యకావ్యంబు గా నొనర్తు
సరవి మీఱంగఁ గరుణింపు, సన్నుతాంగ !
రాక్షస విరామ ! కస్తురి రంగధామ ! 18

ఇక్కడితో ఉపోద్ఘాతం పూర్తవుతుంది. ఇక్కడినుండి నందికేశ్వరుని సంస్కృత అభినయ దర్పణానికి తెలుగు పద్యాలలో మాతృభూతయ్య గారి అనువాదం కొనసాగుతుంది.
నందికేశ్వరుని మూలం
కంఠే నాలమ్బయేత్ గీతం హస్తే నార్థం ప్రదర్శయేత్ !
చక్షుర్భ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళ మాచరేత్!! 1

యతో హస్తః తతో దృష్టిః యతో దృష్టిః తతో మనః!
యతో మనః తతో భావః యతో భావః తతో రసః!! 2
(నటించు పాత్రము కంఠముచేత గానమును, హస్తాభినయముచే దాని అర్థమును, నేత్రములచే అందలి భావమును, కాళ్ళతో తాళమును నడుపవలయును.
ఎచ్చట హస్తము వినియోగింపబడునో అచ్చట దృష్టియు, ఆ దృష్టియున్నచోటనే మనస్సును, ఆ మనస్సు ఉన్నచోటనే భావము ఉండునెడల ఆ రసము పుట్టును.)
దీనికి మాతృభూతయ్యగారి ఆంధ్రానువాదం.

చెలు వొంద గీతంబు చెన్ను మీఱఁగఁ బాడి
యర్థంబుఁ గరముల నమర బట్టి
పరఁగఁ గన్నులయందు భావంబుఁ దగ నుంచి
పదములఁ దాళంబు బరగదీర్చి
హస్తంబు పొడచూపునచట దృష్టియు నుంచి
మఱి దృష్టి గలచోట మనసు నిల్పి
మనసు నిల్పినయెడ నెనయ భావము నుంచి
భావంబుతో రసం బలరఁజేసి

యెలమి నివియెల్ల నొక్క టై మెలఁగుచుండ
నట్టిదే సూడ నిలలోన నభినయంబు
నెనసి భరతజ్ఞు లిది మెత్తు రింపు మీఱ
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 19

వ.
ఇట్లు, ఋగ్యజుస్సామవేదంబులచేత బోధింపబడిన నాట్యశాస్త్రంబు బ్రహ్మదేవుం డను భరతజ్ఞునివలన గంధర్వులు నప్సర స్త్రీగణంబులు బోధింపఁ బడిన వారలైరి. వారలచేత దేవలోకంబున నీ భరతశాస్త్రార్థంబు విశదమై గనఁబడుచుండె. నంత. 20
సరగున నొక్కనాఁ డలరి శంభుడు మిక్కిలి ప్రేమతోడుతం
జెలువుగ నాట్యశాస్త్రమును జెన్నుగఁ బార్వతిదేవి కొప్పుగం
బలుమరు బోధచేయుచును భావములన్ వివరించునంత, నా
నెలఁత ముదంబు జెందె, మఱి నిక్కము, గస్తురి రంగనాయకా ! 21

అంతట, నార్య ధాత్రిఁ గల యా ముని సంఘముతోడఁ బ్రేముడిన్
వింతగ నాట్యశాస్త్రమును వేమఱు భావము వీడఁ దెల్పినన్,
సంతస మంది యా మునులు సారెకు నార్యకు మ్రొక్కి వార ల
త్యంత వినోదయుక్తులయి రంబుజలోచన ! రంగనాయకా !22

నాట్య శాస్త్రంబు మునులు సౌరాష్ట్రదేశ
స్త్రీలకును దెల్ప, వారిచేఁ జెలువు మీఱి
సకల దేశంబు లందెల్ల సాగి మహిని
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 23

అలరు నీ నాట్య శాస్త్రంబు నరసి యజుఁడు
వెలయ మఱి దాని మహిమలు విశదముగను
దెలియఁ బల్కెను జగమెల్లఁ దేటపడఁగ
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 24

తనరు నీ నాట్య శాస్త్రం బభ్యసించినఁ
బొలుపొంద సంపద ల్వొందియుండుఁ
బరఁగను సౌఖ్యంబుఁ బ్రౌఢత్వమును జెంది
ధర నుదారంబుగా మెఱయుచుండుఁ
బలుమాఱు సత్కీర్తి వడసి సంతస మొంది
యెలమి సద్గుణముల వెలసియుండు
స్థిరధైర్యమునఁ జాలఁ జె న్నొంది మిగులను
జెలఁగి సుజ్ఞాని యై వెలుగుచుండు

భోదములు లేక నెమ్మది మోద మలర
నొనరి యేవేళ సద్గోష్టి నెనసియుండు
ననుచుఁ బల్కిన నా ధాత ఘనత మీఱ
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 25

నారదారి మునీంద్రు లీ నాట్యశాస్త్ర
మందుఁ జిత్తంబులను నుంచి యద్భుతముగ
నెనసి యానందపరులయి రింపు మీఱ
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 26  

అభినయ దర్పణము – 3
సభా లక్షణము:
సంస్కృత కావ్యం నుండి:
శ్లో!!
సభాకల్పతరుర్భాతిః వేదశాఖోపశోభితః !
శాస్త్రపుష్పసమాకీర్ణోః విద్భద్భ్రమరసంయుతః !!

( సభ యనెడి కల్పవృక్షము వేదములనెడి కొమ్మలచేత ప్రకాశించునదియు, శాస్త్రములనెడి పుష్పములచేత నిండుకొన్నదియును, విద్వాంసులనెడి తుమ్మెదలతో గూడినదియునై వెలుగుచున్నది.)
శ్లో!!
సత్యాచారసభా గుణోజ్జ్వలసభా సద్ధర్మకీర్తి స్సభా!
వేదాలంకృత రాజపూజితసభా వేదాన్తవేద్యాసభా!!
శ్లో!!
వీణావాణివిశేషలక్షితసభా విఖ్యాతవీరాసభా!
రాజద్రాజకుమారశోభితసభా రాజత్ప్ర కాన్తిస్సభా!!

(సత్యముతప్పక నడపువారు గలదియును, సద్గుణములచే మెరయునదియును, మంచి దర్శనమును కీర్తియును గలిగినదియు, వేదము చదివిన రాజులచేత పూజింపబడినదియు, వేదాంతము నెఱిగినదియు, వీణాగానము, వాచిక గానము మొదలగువానితో గూడినదియు, ప్రసిద్ధవీరులు గలదియు, తేజస్సుచేత వెలుగుచున్న రాజకుమారుల చేత ప్రకాశించునదియు, ప్రకాశించుచున్న కాంతి గలదియు సభ అనబడును. అనగా సభ యనునది యిన్ని లక్షణములు గలదయి యుండవలయుననుట.)

మాతృభూతయ్యగారి సభాలక్షణము:
తనరు సభ యను నల కల్పతరువునకును
శ్రుతులు శాఖలు, శాస్త్రముల్ సొరిది విరులు
చెలఁగు, విద్వాంసు లల తుమ్మెదలుగఁ బరఁగు,
రాక్షస విరామ ! కస్తురి రంగధామ ! 27

సభా సప్తాంగ లక్షణములు:
సంస్కృత దర్పణము:
శ్లో!!
విద్వాంసః కవయోః భట్టాః గాయకాః పరిహాసకాః !
ఇతిహాస పురాణజ్ఞాః సభా సప్తాఙ్గ లక్షణమ్ !!
(విద్వాంసులు, కవులు, పెద్దలు, పాఠకులు, పరిహాసకులు, ఇతిహాసములను తెలిసినవారు, పురాణములను తెలిసినవారు, అనునవి యేడును సభయొక్క యేడు అంగములు అగును)
కవులు విద్వాంసులును బట్లు గాయకు లితి
హాసహాస్యపురాణజ్ఞు లలరి యెలమి
వెలయ సభకును సప్తాంగములును నివియె
రాక్షస విరామ ! కస్తురి రంగధామ !! 28

సభానాయక లక్షణమ్:
శ్లో!!
శ్రీమాన్ ధీమాన్ వివేకీ వితరణనిపుణోః గానవిద్యాప్రవీణః !
సర్వజ్ఞః కీర్తిశాలీః సరసగుణయుతోః హావభావేష్వభిజ్ఞః !
మాత్సర్యా2ద్యైర్విహీనః ప్రకృతిహితః సదా2చారశీలోదయాళుః !
ధీరోదాత్తః కలావాన్ నృపనయచతురోసౌ సభానాయకస్స్యాత్ !!
(సంపద గలవాడును, మంచిబుద్ధిమంతుడును, యుక్తాయుక్తవివేకము గలవాడును, దానశీలుడును, గానవిద్య యందు నేర్పు గలవాడును, అన్నియు తెలిసినవాడును, కీర్తిచేత ఒప్పినవాడును, సరసగుణములు గలవాడును, హావభావముల యందలి తెలివి గలవాడును, మాత్సర్యాది దుర్గుణములు లేనివాడును, ఆయాకాలములకు తగిన మంచి నడవళ్ళ నెరిగినవాడును, దయ గలవాడును, ధీరోదాత్తుడును, విద్వాంసుడును, రాజనీతియందు చతురుడును అగువాడు సభానాయకుడు అగును. బుద్ధి యనగా అప్పటికి తోచునట్టిది.)

మాతృభూతయ్యగారి సభాపతి లక్షణము:
శ్రీమంతుఁడై చాలఁ జెన్నొంది ధీరుఁడై
వితరణశీలుఁ డై వెలయువాఁడు
గానవిద్య దెలిసి ఘనకీర్తి శాలి యై
సరససద్గుణములఁ బరఁగువాఁడు
నిరు వొంద సత్కవిహృదయంబు లరయుచు
ధాతయై మిక్కిలి తనరువాఁడు
భావజ్ఞుఁ డనఁగను బరమదయాళుఁ డై
మఱియు సర్వజ్ఞుఁ డై మెఱయువాఁడు

నెలమి శృంగారలీలల మెలఁగువాఁడు
నెనసి సౌందర్యవంతుఁ డై దనరువాఁడు
నిల సభాపతి యనఁగను వెలయువాఁడు
రాక్షస విరామ ! కస్తురి రంగధామ ! 29

అభినయ దర్పణము -4
(“అభినయ దర్పణము” గ్రంథానికి సంబంధించి వస్తున్న వ్యాసాల్లో నాలుగవది ఇది. ఈ శీర్షికలో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవవచ్చు)

నాట్యప్రశంస:

మెఱయు సభాపతి ముందఱ
సరవిగ నాట్యంబు నవరసంబులుఁ దొలఁకన్
మఱి సత్కవి సన్నుతముగ
గరిమను సలుపంగవలయుఁ గస్తురిరంగా! 30

నాట్యవినియోగము:

ఇరవుగ నుత్సవాదులను నింపుగఁ బట్టము గట్టువేళలం
బరఁగ వివాహవేళ మఱి బాగుగ శోభనవేళలందునున్
మెఱయ గృహప్రవేశమున మేల్మిని బుత్రుడు గల్గువేళలన్
సరవిగ నాట్యమున్ సలుప సంతసమొప్పును, రంగనాయకా ! 31

సంస్కృత దర్పణములో రంగ లక్షణమును గుఱించి ఇలా చెప్తారు.

రఙ్గలక్షణమ్:

శ్లో!! ఏవంవిధస్సభానాధః ప్రాజ్ఞ్ముఖోనివసేన్ముదా!
వసేయుః పార్శ్వతత్తస్య కవిమన్త్రిసుహృజ్జనాః!!
(ఇట్లు సభానాయకుడు సంతోషముతో తూర్పుముఖముగా గూర్చుండగా వానిప్రక్కలను కవి, మంత్రి, సుహృజ్జనము లుండవలయును)

శ్లో!! తదగ్రే నటనం కార్యం తత్స్థలం రఙ్గముచ్యతే !!
(ఆ రాజున కెదుట నటనము చేయవలయును. ఆ స్థలము రంగము అనబడును)

(సంస్కృత దర్పణమునకు లింగముగుంటవారిది యథాతథానువాదము కాదు. నందికేశ్వరుడు, మాతృభూతయ్య వీరిరువురూ కూడా భరతార్ణవమో మరొకటో సంస్కృతమూలాన్ని అనుసరించి స్వతంత్రముగా రచన చేసారని ప్రాజ్ఞులంటారు. ఎందుకంటే కొన్ని కొన్ని ఇందులో ఉన్నవి అందులో ఉండవు. ఇంకొన్ని అందులో ఉన్నవి ఇందులో కనబడవు.)

మాతృభూతయ్యగారి రంగపూజ:

చెలఁగుచు రంగపూజ మఱి సేయక దేవళమందు నైనఁ దాఁ
బలుమఱుఁ బట్నమం దయినఁ బాటిగ నాట్యము లోలి సల్పుచో
నెలమిని నాస్థలంబులకు నెప్పుడు నగ్నినిరోధ మంచునన్
వెలఁయగ శాస్త్రముల్ పలుకు వేమఱుఁ గస్తురిరంగనాయకా ! 32

రంగపూజా యంత్రలక్షణము:

నాల్గుకోణంబులు నయ మొప్పఁగా వ్రాసి
మొనసి యా నాలుగుమూలలందు
బాగుగా నాలుగు పద్మంబులను వ్రాసి
వశముగా నాలుగు దిశలయందుఁ

బ్రక్కకు రెండేసిపద్మంబులును గాను
జెలఁగ నెన్మిదిపద్మములను వ్రాసి
యందు మధ్యంబున ననువుగా వృత్తాలు
మఱి మూడు గుంపుగాఁ బరఁగ వ్రాసి

సొరిది వృత్తాలచుట్టును సొంపు మీఱ
వరుసఁ జతురంబుగా గీఁత వ్రాయఁగాను
జాలు నది రంగయంత్ర మై, మేలు దనరు
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 33

రంగపూజా యంత్రాధిదేవతలు:

పరగఁ దూర్పునను దిక్పాలకు లాగ్నేయ
మందంగ దేవత ల్పొందుగాను
యమదిశయందును నలరఁ ద్రిమూర్తులు
నైరృతియందు వినాయకుండు

వరుణభాగంబున మఱి షణ్ముఖుండును
వాయుదిక్కున క్షేత్రపాలకుండు
నుత్తరదిక్కున నొగి నాందిదేవతల్
సప్తమాతృకలు నీశానమునను

జెలఁగి యధిదేవతలు గాను జెలువు మీఱి
యలచతుర్వింశ దేవతల్ వెలసి మిగుల
నలరియుండుదు రీ రంగయంత్రమునకు
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 34

రంగపూజా ద్రవ్యములు:

గణనాథునికి మంచిగరికె సమర్పణ
శ్రీషణ్ముఖునకు నక్షింతలొప్ప
నిల క్షేత్రపాలున కిం పొంద జాజులు
దిలలును నల నాందిదేవతలకు

సరవి మీఱంగను సప్తమాతృకలకుఁ
గూరిమి యగు జపాకుసుమములును
సరగఁ ద్రిమూర్త్యాది సకలదేవతలకు
మల్లెలు మొల్లలు మంచివిరులు

నెనసి యీరీతి వారి కర్చన మొనర్చి
వెలయుఫలముల నైవేద్యములను సల్పి
వందనంబుల నొనరింపవలయుఁ జుమ్ము!
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 35


అభినయ దర్పణము-5
More articles by మల్లిన నరసింహారావు »
Written by: మల్లిన నరసింహారావు

(“అభినయ దర్పణము” గ్రంథానికి సంబంధించి వస్తున్న వ్యాసాల్లో ఐదవది ఇది. ఈ శీర్షికలో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవవచ్చు)

భూమ్యుద్భవ లక్షణము

సరవిగా నంబరశబ్దంబువలనను
వాయువు పుట్టెను వరుసగాను
సరగ నవ్వాయుసంస్పర్శంబువలనను
బొలు పొందఁ దేజంబు గలిగె నంతఁ
గూర్మిఁ దేజసత్త్వగుణమువలనఁ జాల
నొప్పుగఁ నటు ధాత్రి యుద్భవించెఁ

బంచృశత్కోటియోజనపరిమిత మది
పరఁగ బంగారువర్ణమై పరిఢవిల్లు
సరసగుణహార ! శ్రీరంగపురవిహార !
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 36
(ఇక్కడి సీస పద్యంలో 6 చరణాలే ఉన్నవి, 8 చరణాలకు బదులుగా)

భూమి లక్షణము

చెలఁగ సుభద్రయు భద్రక
తుల లేనటువంటి పూర్ణధూమ్ర యనంగా
నిల మఱి నాలుగునిధములు
గలిగియు శోభిల్లుచుండుఁ గస్తురిరంగా ! 37

సుభద్రాభూమి లక్షణము

నయ మొప్ప ధాత్రియు నాల్గుకోణంబు లై
వైపుగా బంగారు వర్ణ మమరి
ప్రియ మొందఁగ లకారబీజసంయుక్త మై
పరమేష్ఠి దేవతై పరఁగుచుండు
సరవిని మఱి చరాచరములు ధరియించి
తగ సమస్తమున కాధార మగుచు
సలలితంబుగఁ బంచశత్కోటియోజన
విస్తీర్ణముం గల్గి వేడ్క మీఱ

గరిమ నాధారశక్తి గాఁ గమఠ మమరి
యష్టదిగ్దంతులను బైని నలరఁగాను
బరఁగ శేషునిపైని సుభద్ర మెఱసె
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 38

భద్రకాభూమి లక్షణము

సరగ మఱి విష్ణుశక్తిచే శంఖవర్ణ
మొదవి నవరత్నమయముగా ముదము మీఱి
భద్రక యనెడియాధాత్రి పరఁగుచుండు
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 39

పూర్ణాభూమి లక్షణము

వెలసి శంకరుశక్తిచే నలరి మిగుల
రక్తవర్ణంబునున్ బహురత్నములను
గలిగి శోభిల్లి పూర్ణయుం జెలువు మీఱు
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 40

ధూమ్రభూమి లక్షణము

పరఁగఁ ద్రిమూర్తిశక్తియును బచ్చనివర్ణముఁ గల్గి ధాత్రియున్
గరిమను నారికేళక్రముకంబులు వృక్షము లెల్లఁ బర్వఁగా
నిరవుగ భూసురోత్తములు నెల్లెడలన్ వసియింప మిక్కిలిం
బరఁగును ధూమ్ర యీవగను బాగుగఁ గస్తురిరంగనాయకా ! 41


అభినయ దర్పణము -6

(ఈ శీర్షికలో వస్తున్న వ్యాసాలు ఇక్కడ చూడండి)

తాళ లక్షణము

అంబరంబున నల తకారంబు పుట్టె
ధారుణిని నుద్భవించె ళకార మెలమి
దనరి యీ రెండునుం గూడిఁ దాళ మయ్యె
రాక్షసవిరామ ! కస్తురిరంగధామ ! 42

తకార ళకారములకు స్వరూపదేవతలు
పరఁగఁ దకారమె యీశుం
డరయ ళ కారంబె శక్తి యా శివశక్తుల్
పరఁగఁగ, వారల కూటమి
గరిమను దాళంబు నయ్యెఁ గస్తురిరంగా ! 43

తాళాధి దేవతలు

అల తకారంబునకు వేల్పుఁ దపనుఁ డయ్యెఁ,
గోరి శశి దేవతయ్యె ళ కారమునకు,
నిలను దాళంబునకు వేల్పు లినుఁడు శశియు,
రాక్షసవిరామ ! కస్తురిరంగధామ ! 44

తాండవ నృత్య లక్షణము
అల తకారంబె తాండవ మయ్యె మిగుల
మఱి ళ కారంబె నృత్యమై మహిని వెలసె
దనర నీ రెండుఁ గూడినఁ దాళ మయ్యె
రాక్షసవిరామ ! కస్తురిరంగధామ ! 45

నట్టువు లక్షణము

సారజ్ఞుఁడై నాట్యచర్యుఁడు నై నృత్య
శిక్షయందలి నేర్పు చెలఁగువాఁడు
సూళాదిసంకీర్ణ తాళాదుల నెఱింగి
భావజ్ఞుఁ డగుచును బరఁగువాఁడు
హస్తభేదంబులు నల మండలాదులు
నంగరేఖలుఁ దెల్పి యలరువాఁడు
గాయకుఁ డై తాను ఘనకీర్తిశాలి యై
కాలనిర్ణయములు గలుగువాఁడు

మఱి నవరసములు నెఱింగి మెఱయు వాఁడు
బండితుం డన సుగుణి యై ప్రబలువాఁడు
ధరను నట్టువు గాఁ జెల్లుఁ దగవు గాను
రాక్షసవిరామ ! కస్తురిరంగధామ ! 46

నట్టువున కంగదేవతలు

విను బాహుమూల వాణియు
ననువుగ నదె బాహుమధ్యమం దిందిర దా
నెనయఁ గరాగ్రమునన్ మృడ
ఘన వామకరంబునందుఁ గస్తురిరంగా ! 47

మఱి బాహుమూల బ్రహ్మయు
హరువుగ నా బాహుమధ్యమందున హరియుం
బరఁగఁ గరాగ్రం బీశుఁడు,
గరిమను దక్షిణ కరాన కస్తురిరంగా ! 48

గాయకుని లక్షణము

ఎలమి స్వరజ్ఞానంబును
సరవి లయజ్ఞానమును సుశారీరంబున్
గలపండితుఁడై ధైర్యముఁ
గలవాఁడగు గాయకుండు, కస్తురిరంగా ! 49

పాత్ర లక్షణము

సరసిజ నేత్రియై సౌందర్యశాలియై
చెండ్లను గెల్చు పాలిండ్లతోను
సరవిగా రత్నభూషణములు ధరియించి
చిఱునవ్వు మోమునఁ జెలువు మీఱఁ
గాల నిర్ణయములు గలిగి భావ మెఱింగి
గాననృత్యములందు ఘనత మీఱి
నవరసచాతుర్యనయమును సంపద
దగువిలాసమును శాంతంబు గల్గి

కూర్మి దాతృత్వమును గల్గి గుణము గల్గి
మెలఁత తొలకరిమెఱుపు నెమ్మేనితోడఁ
జెలఁగునది పాత్ర యనఁ జెల్లు, శ్రీనుతాంగ !
రాక్షస విరామ! కస్తురిరంగధామ ! 50

పాత్ర దశప్రాణములు

నిరతము రూపు రేకలును నిల్కడ వేగముఁ గల్గి కాంతియుం
బరఁగఁగ దృష్టిభేదమును బాటయు వాగ్జరి గల్గి మిక్కిలిన్
అరుదుగ సంతసం, బొదవి యంతట వేసటలేక యుండుటల్
బరువిడి యీ పదిం జెలికిఁ బ్రాణము, గస్తురిరంగనాయకా ! 51

పాత్రాంగ దేవతాలక్షణము

బ్రహ్మరంధ్రానకుఁ బరఁగ సదాశివుల్
ఫాలంబునకు క్షేత్రపాలకుండు
సరవి గంఠానకు శాస్త్రాయనీశక్తి
యెలమి వక్షంబునం దీశ్వరుండుఁ
బరఁగఁగా గౌనందుఁ బరమేష్ఠి విష్ణువుఁ
గనుఁజూపులకును శృంగారరసము
నుదరంబునందున నొనరంగా గణపతి
గర నాభియందును దారలమర !

వరుణ వాయువు లూరులవైపుగాను
దరుణినెమ్మోమునందు సుధాకరుండు
నంగదేవత లివి పాత్ర కనువుగాను
రాక్షస విరామ! కస్తురిరంగధామ ! 52

బాహుమూలంబునఁ బరమేష్ఠి యాబాహు
మధ్యమందునను శ్రీమాధవుండు
ఘనముగా బంధమందున నుమాపతియుఁ గ
రాగ్రమందునను బార్వతియుఁ దనరె
నదె బాహుదండంబునందుఁ ద్రిమూర్తులు
గోవిందుఁ డమరె నంగుష్ఠమందుఁ
దగె షణ్ముఖుండును దర్జనియందునఁ
బరఁగె మధ్యమున భాస్కరుండు

మారుతుఁ డనామికందు నమరెఁ గనిష్ఠ
కందు గురువును గరతలమందు శశియు
నలరెదరు పాత్రకున్ వామహ స్తమునను
రాక్షస విరామ! కస్తురిరంగధామ ! 53

భుజమూలమున ధాత్రి భుజమధ్యమున వాణి
బాహుదండంబునఁ బార్వతియును
మణిబంధమున రవి మఱి కరాగ్రం బింద్రుఁ
డంగుష్ఠమునను దా నంగజుండు

తర్జనియందునఁ దనరఁ బావకుఁడును
గరిమ మధ్యమునను గమలభవుఁడు
నరయ ననామిక కంబర మే వేల్పు
దగఁ గనిష్ఠికకు గంధర్వు లరయ

నెలమిఁ గరతలమందున నిద్ధరయును
నమరి పాత్రకు దక్షిణహ స్తమునను,
వెలసియుందురు వేల్పులు వేడ్క మీఱ
రాక్షస విరామ! కస్తురిరంగధామ ! 54

పాత్రగమన లక్షణము

హరిహంసదంతిలావక
వరశిఖి కుక్కుట బకాదివరగమనములున్
నిరతంబు దెలిసి పాత్రయు
గరిమను వెలయంగవలయుఁ గస్తురిరంగా! 55

నేత్రభేద లక్షణము

అలోకితావలోకిత
జాలప్రలోకితవిలోక సమసాచియునున్
ఉల్లోకి తానువృత్తముఁ
గా లలి నేత్రములు చెలఁగుఁ గస్తురిరంగా ! 56

ఇక్కడ సంస్కృత అభినయ దర్పణం నుండి కొన్ని విషయములు –

శ్లో!! ఆఙ్గికో వాచిక స్తద్వాహార్య స్సాత్త్వికః పరః !
చతుర్థాభినయ స్తత్రచా2జ్ఞికో2జ్గైర్నదర్శితః !
వాచావిరచితః కావ్యనా2టకాదిషువాచికః !
ఆహార్యోహారకేయూరవేషాది భిరలఙ్కృతిః !
సాత్వికస్సాత్వికైర్భావైర్భావ్ఙజైశ్చనిదర్శితః !!

ఈ అభినయము , ఆంగికము, వాచికము, ఆహార్యము, సాత్వికము అను నాలుగు విధములు కలది. అందు అంగములచేత చూపబడునది ఆంగికము, మాటలచేత తెలుపబడినది వాచికము, ఇది కావ్యనాటకాదులందు గానబడుచున్నది, హారకేయూరాదుల నలంకరించుకొనుట ఆహార్యము. సాత్వికాది భావములచేత అభినయించెడు పదభావము సాత్వికము, అని భావజ్ఞులచేత చెప్పబడుచున్నది.

శ్లో!! అజ్ఞికా2భినయత్రైవిధ్యమ్

శ్లో!! అత్రాఙ్గికో2ఙ్గప్రత్యఙ్గోపాఙ్గభేధాత్త్రిధామతః

ఆంగికాభినయము – అంగాభినయము, ప్రత్యంగాభినయము, ఉపాంగాభినయము అని మూడు విధములు కలది.

అఙ్గలక్షణము

శ్లో!! అంగాన్యత్రశిరోహస్తౌకక్షఃపార్శ్వకటీతటౌ
పాదావితిషడుక్తానిగ్రీవామప్యపరేజగుః!!

ఈ అంగాభినయమందు తల, చేతులు, చంకలు లేక పార్శ్వములు, నడుము, పాదములు ఈ యారును అంగములనబడును. కొందరు కంఠమును సయితము అంగమని చెప్పెదరు.

ప్రత్యఙ్గలక్షణము

శ్లో!! ప్రత్యంగానిత్వథస్కంథౌ బాహుప్రుష్ఠం తథోదరమ్!
ఊరూజఙ్ఘెషెడిత్యాహు రపరే మణిబన్థకౌ!
జానునీకూర్పరమితిత్రయ మప్యధికం జగుః!!

ప్రత్యంగాభినయమందు మూపులు, చేతులు, వీపు, కడుపు, పిక్కలు ఈ యారును ప్రత్యంగములు. కొందరు మణికట్లు, మోకాళ్ళు, మోచేతులను కూడా ప్రత్యంగములని చెప్పుదురు.

ఉపాఙ్గలక్షణము

దృష్టిభ్రూపుటతారాశ్చకపోలౌనాసికాహనుః !
అధరోదశనాజిహ్వాచుబుకం వదనం తథా !
ఉపాంగాని ద్వాదశైతే శిరస్స్యంగాన్తరే తథా !
పార్ష్ణిగుల్ఫౌ తథాంఙ్గుళ్యఃకరయోఃపదయోస్తలే !
ఏతాని పూర్వశాస్త్రానుసారేణోక్తానివైమయా !!

చూపు, ఱెప్పపాటు,నల్లగ్రుడ్డు,చెక్కిళ్ళు, ముక్కు, దవుడలు, అధరము, దంతములు, నాలుక,గడ్డము,మొగము,శిరస్సు – ఈ పండ్రెండును ఉపాంగములు. వీని అంగాంతరములుగా గుదికాలు,చీలమండ, కాళ్ళచేతుల వ్రేళ్ళు, అరచేతులు – ఇవి పూర్వశాస్త్రము ననుసరించి నాచేత చెప్పబడినవి.

శ్లో!!
నృత్యమాత్రోపయోగ్యాని కథ్యం తే లక్షణం క్రమాత్!
ఫ్రథమంతు శిరోభేధః —

ఈవిధంగా సాగిపోతుంది. ఉత్సాహం పట్టలేక వ్రాస్తూపోతున్నాను. అన్యథా భావించరని తలుస్తూ–

Friday, November 16, 2012

పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు

పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు

More articles by సౌమ్య »
Written by: సౌమ్య
Tags: ,
ఈపుస్తకం కొన్నాళ్ళ క్రితం ’ఆంధ్రజ్యోతి’ లో వారంవారం ఇదేపేరుతో వచ్చిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలన్నీ నెల్లూరు జిల్లా చారిత్రక విశేషాలను తెలియజేసేవే.
పుస్తకాన్ని – ’ఒంగోలు వెంకటరంగయ్య’ గారికి అంకితమిచ్చారు. ఈపుస్తకంలోకి తల దూర్చాకే అలాంటి ఒక మనిషి ఉన్నాడని తెలిసింది కానీ, ఆయన గురించి చదువుతూ ఉంటే ఆసక్తికరంగా అనిపించింది. ఇక పుస్తకం గురించి – వి.యస్. రామచంద్రరావు గారి ముందుమాటలో – నెల్లూరు జిల్లా విశేషాలను తెలుపుతూనే, ఈపుస్తకంలో రాసిన విషయాల గురించి కూడా చెప్పారు. బాగా రాసారు.
పుస్తకం లోపలికెళ్తే – నెల్లూరు జిల్లా తొలి గ్రాడ్యుయేట్, తొలి ఎమ్మే పట్టాదారుడు, నెల్లూరుకు థెరిసా రాక, నెల్లూరు లో తొలి బ్యాంకు, తొలి ట్రావెలర్స్ బంగళా వంటి విషయాలతోపాటు దాదాపు వందేళ్ళ క్రితం నాటి వ్యవసాయం, తూకాలు-కొలతలు, ధరలు, నీటిపారుదల, డ్రైనేజీ వ్యవస్థ; అలాగే, నెల్లూరు లోని – మూలపేట, సంతపేట, ఆర్.ఆర్.వీథి వంటి స్థలాల కథలు, నెల్లురుకు ప్రముఖ సాహితీపుత్రుల రాక, నెల్లూరీయులే అయిన ఎందరో గొప్ప సాహితీవేత్తల పరిచయం (ఈ వ్యాసాలు పుస్తకం.నెట్ లో ప్రచురిస్తూ ఉన్నాము. అవి ఇక్కడ చూడవచ్చు), నెల్లూరులోని పాత స్కూళ్ళ కథ, బ్రిటీషు కాలంనాటి ఆహ్వాన పత్రాలు, రాయలకాలం తెలుగు శాసనాలు – ఇలా ఒక విషయమని కాక, నెల్లూరు గురించిన సమస్త విషయాల గురించీ రాసారు.
నెల్లూరుతో నాకు ఉన్న అనుబంధం అది మా అమ్మమ్మ, తాతల తరానికి సొంతూరు కావడమే. ఎప్పుడో చిన్నప్పుడు మూణ్ణాలుగు సార్లు వెళ్ళిన జ్ఞాపకమంతే. కానీ, నాకు సహజంగానే ఏదన్నా పాత ఊరి గురించిన కథలను తెలుసుకోడంపై ఉన్న ఆసక్తి వల్ల ఈపుస్తకం బాగా నచ్చింది. నెల్లూరీయులు మరింత బాగా ఆస్వాదించగలరనుకుంటాను. మనం ఓ ఊర్లో కొన్నాళ్ళుంటే, పుట్టింది మొదలు అదే ఊర్లో ఉంటున్న పక్కింటాయన అడపాదడపా గోడ మీదుగా మనకి ఆ ఊరి కథలు, అక్కడి మనుష్యుల కథలూ చెప్తూ ఉంటే ఎలా ఉంటుందో, ఈ పుస్తకమూ అలాగే ఉంటుంది.
పుస్తకంలో ప్రధాన లోపాలు:
-ఒక విషయ సూచిక లేకపోవడం. కొన్ని పుస్తకాలకి ఎందుకు విషయసూచికలుంచరో మరి, అసలర్థం కాదు!!
-తరుచుగా అసంపూర్ణ/అస్పష్ట వాక్యాలు తారసపడ్డం.
-ఒంగోలు వెంకటరంగయ్య గారికి అంకితమిస్తూ రాసిన వ్యాసం మినహాయిస్తే దాదాపు వ్యాసాలన్నీ అసమగ్రంగా ఉండటం. ఆ వ్యాసంలా మిగితా వ్యాసాలు రాసి ఉంటే, ఈ భావన కలిగేది కాదేమో.
-ఒక్కటంటే ఒక్క రిఫరెన్సైనా ఇవ్వకపోవడం. ’చరిత్ర’ అని క్యాప్షన్ పెట్టాక కనీసం ఆమాత్రమన్నా ఇవ్వకుంటే, ఒకవేళ ఎవరి గురించన్నా వివరంగా తెలుసుకోవాలనిపిస్తేనో? కనుక, రిసర్చీయులకి పుస్తకం పనికిరాదు కానీ, మామూలుగా చదివి క్యూరియాసిటీ పెంచుకోడానికి పనికొస్తుంది.
పుస్తకం వివరాలు:
పెన్నాతీరం
రచయిత: ఈతకోట సుబ్బారావు
తొలి ముద్రణ: సెప్టెంబర్ 2008
కాపీలు: ఈతకోట సుబ్బారావు, H.No. 24-1175, 2nd Street, Ravindra nagar, Nellore – 524004.
మొబైల్: 9440529785
వెల: వంద రూపాయలు
పేజీలు: 200

పరిశోధనా తృష్ణ – బంగోరె

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
’ఇటీజ్ నాట్ మై షర్ట్ దట్ ఐ క్యాస్ట్ ఆఫ్ టుడే బట్ స్కిన్ విత్ మై ఓపెన్ హ్యాండ్స్’ - అన్న ఖలీల్ జిబ్రాన్ కవిత్వ చరణాలతో ఒక దౌర్భాగ్య పత్రికకు అద్భుతమైన సంపాదకత్వాన్ని నిర్వహించిన బంగోరె తన పాఠకులకు వీడ్కోలు చెప్పుకున్నాడు. బంగోరెగా కీర్తిశేషుడైన బండి గోపాలరెడ్డి (1937-82) నెల్లూరు జిల్లా వాసి అని మనము చెప్పుకుంటే సాహిత్య పరిశోధనరంగమే చిన్నబుచ్చుకుంది. ఎందుకంటే బంగోరె ’రైతులో కూనిరాగాలు’ శీర్షికలో – నెల్లూరు ప్రాంత స్థానికచరిత్ర, సుబ్రమణ్యభారతి చంద్రిక కథ, తెలుగులో జర్నలిజం, తొలకరిజల్లులు, బ్రౌన్ లేఖలు, బ్రౌన్ సేకరించిన తాతాచార్ల కథలు, కన్యాశుల్కం మొదటి ముద్రణ ప్రతి, మాలపల్లిపై నిషేధాలు, వేమన పద్యాల్లో ప్రక్షిప్తాలు, సి ఆర్ రెడ్డి రచనలు – ఎన్నింటినో ఆయన తవ్వి తీశారు. ఆ పత్రిక సంపాదకత్వం అస్థిరమైన తన నలభై ఐదేళ్ళ జీవితంలో బంగోరె చేసిన అసంఖ్యాకమైన ఉద్యోగాల్లో ఒకటి. ఎప్పుడూ కుదురుగా ఒకచోట ఉద్యోగం కూడా చేయని, విరామం లేని ఆయన జీవితంలో ఒక ఏకత్వం లేకుండా పోలేదు. అదే ఆయన పరిశోధనాతృష్ణ. తెలుగుదేశంలో పరిశోధన ప్రస్తుతం నిలిచిపోయింది. ఈ శతాబ్ది మొదటిభాగంలో ప్రతి విషయంలోనూ మౌలికమైన పరిశోధనను, మొదటితరం అగ్రగణ్యులను వదిలేస్తే సుమారు అన్నిరంగాల్లో ప్రస్తుత పరిశోధన ఈస్థితికి చేరువౌతుంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రెండు విశ్వవిద్యాలయాలు అయ్యాయి. అకాడమీలు, భాషాసమితులు ఏర్పడ్డాయి. భారతీయ,సామాజిక,శాస్త్ర పరిశోధనా మండలి, భారతీయ చరిత్ర పరిశోధనామండలి, కోర్టు ఫౌండేషన్, రీసర్చ్ గ్రాంట్లు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పరిశోధనల ఆదరణ పెరిగి, పరిశోధన పేరుతో కోట్ల రూపాయలు నీళ్ళలా పరిగెడుతున్నాయి. ఈవ్యవహారాలు వ్యవహరించేందుకు పెద్ద పాలనా యంత్రాంగం రాక్షసిలా పెరిగి పరిశోధనలపై నిర్ణయాత్మక అధికారాన్ని చెలాయిస్తుంది. ఈ యంత్రాంగంలో ఉన్న అధికారులతో వ్యక్తిగత పరిచయాలు, పైరవీలు చేయగలశక్తి ఉండటమే ఈరోజు పరిశోధకుడికి ఉండవలసిన ప్రాథమిక అర్హత. బంగోరెకు ఈ పరిశోధనావృత్తి చట్రంలో ఇమడగల సమర్థత లేకుండానే మరోవైపు ఆ ప్రాజెక్టులలో పని చేస్తూ ఒక పాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు మార్చబడుతూ వచ్చిన విరామం ఎరుగని పరిశోధకుడు. పరిశోధన ఒక తీరని దాహంగా ఆయన పడిన శ్రమే విద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనపై ఆయనకు అసహనాన్ని కలుగజేసింది. చరిత్రకారులకు పనికివచ్చే ముడిసరుకును ఆయన ఒక్కడే తవ్వితీసి అందరికీ పంచి ఇచ్చాడు. ఆ మహానుభావుడే -బంగోరె!

Monday, November 12, 2012

జన వేమన -3 వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా

జన వేమన -3 వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా

    జన వేమన -3
                                             వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా 
ఇప్పటి వరకు మనం వేమన భావాలను స్థూలం గా పరిశీలించి చూశాం .ఇప్పుడు కొంత సూక్ష్మ పరిశీలన చేసి ,ఆయన భావ దీపికా ప్రకాశాన్ని పొందుదాం .అజ్ఞాన తిమిరం లో ఉన్న మాన వాలికి ఆయన అందించిన జ్ఞాన తేజస్సు ను పరికిద్దాం .ముందుగా ఆయనకు మతం మీద ఉన్న అభి ప్రాయాలను తెలుసు కొందాం .ఇది తెలుసు కోవటానికి ముందు అసలు మతం అంటే ఏమిటో తెలియాలి కదా .”రెలిజియన్ ఈస్ రియలైజేషన్ ”అన్నారు .మతం అంటే మనం ఎవరో తెలుసుకొనే ;;ఎరుక. ”దాన్ని తత్వ శాస్త్ర అన్వయం అన్నారు .ఇంతకీ తత్త్వం అంటే /ఆధ్యాత్మికం గా మానవుని పెరుగుదలే తత్వ శాస్త్రం .ఎలా జీవించాలి ,ఎలా చని పోవాలో చెబుతుంది .ప్రకృతి ,మానవుల మధ్య సంబంధాన్ని తెలియ జేస్తుంది .జరిగి పోయిన దాన్ని గురించి కాక ,జరుగుతున్నదీ ,శాశ్వత మైన దాని గురించి చెబుతుంది .దీన్ని బట్టి చూస్తె మతం చాలా పవిత్ర మైనది గానే కనీ పిస్తుంది .అపూర్వ ,గౌరవ స్తానం కలిగి ఉంది .అలాంటి మతాన్ని ప్రవచించిన ప్రవక్తలు ,తాము సన్మార్గం లో నడిచి ,అనుయాయులకు చక్కని మార్గాన్ని చూపించారు .అయితే కాల క్రమం లో ప్రవక్తలు చూపిన మార్గాన్ని వదిలేసి ,తప్పు దొవలు పట్టి మతాలు కొంత చెడు చేశాయి .ఉత్కృష్ట జీవన విధానం సడలి పోయింది .ప్రలోభాలూ మూధా చారాలు అమలు లోకి వచ్చాయి .మత పెద్ద పెద్దరికం వదిలి హక్కు కోసం ,అణచి వేతకు పాల్పడ్డాడు .అప్పుడే మతం అంటే ఏవగింపు కలిగింది .ఇలాంటి సమయం లో సామాన్యులకు విలువ లేకుండా పోయింది .మాన్యులకే అన్నీ హక్కు భుక్తాలైనాయి .ప్రజల కష్ట సుఖాలను పట్టించుకోకుండా మతం సంఘం తయా రైనాయి .ఎవరు పూనుకొని దీన్ని మళ్ళీ గాడి లో పెట్టాలి ?అందుకే ఆ బాధ్యతను కవులూ ,కళా కారులూ తీసుకొన్నారు .నెమ్మదిగా చెప్పారు .కళాత్మకం గా చెప్పారు .హితం గా ,మితం గా చెప్పి  చూశారు .అయినా మార్పు వచ్చే సూచన కనీ పించ లేదు .మార్పు రాక పోతే సమాజం పతనా వస్థ కు చేరుతుంది .అదిగో అలాంటి సమయం లోనే వేమన లాంటి మహనీయుని అవసరం కలిగింది
.అవినీతి ,చెడు ,దుష్టా చారం మాంసాన్ని దాటి ,ఎముకలకు పట్టేసి  వదలని స్తితిలో ఉన్నాయి .కనుక చెప్పాల్సిన విషయాన్ని చాలా బలం గా ,తీవ్రం గా ,కఠినం గా చెప్పాల్సిన పరిస్తితి కల్గింది .ఆ పనే వేమన చేశాడు .యే కులాన్నీ ,యే మతాన్నీ వదిలి పెట్ట లేదు .అన్నిటిని ఝాడించి వదిలాడు .ఉతికేసి ,పిండేసి ఆరేశాడు .యే చెడ్డ విధానాన్ని వదిలి పెట్ట లేదు .చాలా ఆవేదన తో ,మనసు పై సుత్తి తో కొట్టి నంత బలం గా చెప్పాడు .మార్పు రావాలంటే ,ఆ మాత్రం ఆఘాతాలు తప్పవు అని భావించి చెప్పాడు వేమన్న .ఏదో ఎవరో అనుకుంటా రనే భయం ఆయనకు లేదు .బాధా లేదు .మార్పు రావాలి అంతే ఆయన ధ్యేయం .చీకటి లోంచి సమాజం వెలుగు లోకి రావాలి .అందరి సుఖమే అయన ధ్యేయం .అందుకే ఆయన మాట వేదం అయింది .వేదం లా శాసించింది .ఖచ్చితం గా అమలు చేయాల్సిన పరిస్తితి కలిగింది  .
       హిందూ మతం 
సనాతనం గా హిందూ మతం మన దేశం లో ఉంది .హిందూ మతం లేదు -అదొక జీవన విధానం అంటారు .అయినా కాల గతం గా ఎన్నో మార్పులు వచ్చాయి .విగ్రహారాధన ,యజ్న యాగాలు ,మంత్రాలు ,మాయలు ,మాయ స్వాములు ,తంత్రాలు ఎక్కువై ధార్మిక మార్గం పక్క దారి పట్టింది .ధర్మం కను మరుగైంది .సాటి మనిషికి విలువ నివ్వని సమాజం తయారైంది .గుడులు ,గోపురాలు ,దేవతలు ,పీథాది పతులు ,ప్రాచుర్యం పొందారు .మానవత్వం మృగ్య మైంది .మనిషిని మనిషి గా మార్చాల్సిన మతం కుహనా విధానాలకు నిలయ మైంది .అందుకే వేమన కు ఈ పద్ధతి నచ్చలేదు .గమ్యాన్ని మరచి ప్రవర్తించే వారి పై పద్యాల పిడి గుద్దులు ప్రహారం చేశాడు .”రాళ్ళన్నీ దేవుల్లయితే ,రాసులు మింగవా ?అని నిలేశాడు .”కూడు ,గుడ్డ ను కోరడు దేవుడు ”అని గట్టిగా చెప్పాడు .అంతా ”రాయి మయం ”అయితే ,దేవుడేవడో భక్తుదేవడో తెలుసు కోవటం ఎలా ?శిలకు మొక్కితే మనమూ ఆ శిలలు గా మారి పోతామేమో ఆలోచించ మన్నాడు .దేహమే దేవాలయం అన్న మాట ను వదిలి మంచిని ,సోదర భావాన్ని గాలికి వదిలేసి ,ప్రసాదాలు తీర్ధాలు మరిగి ,బొజ్జలు పెంచుకోవటం హేయం గా భావించాడు .”గుడి దేహ మాత్మ దేవుడు -చెడు రాళ్ళకు వట్టి పూజ సేయకు వేమా ”అని హెచ్చరించాడు .చీకటి గర్భాలయం లో ,దేవుడు అనే రాతిని ప్రతిష్ట చేసి ,మొక్కులు సమర్పిస్తూ ,కాలక్షేపం చేస్తారు కాని ,తమ లోని పర బ్రహ్మాన్ని గుర్తించరు మనుషులు అని ఆవేదన చెందాడు .”ఉల్ల మందు బ్రహ్మ ముందుట తెలియరు ”అన్నాడు అందుకే .ముక్తి కోసం చేసే ప్రార్ధనలు సత్ఫలితాలివ్వవు అంటాడు .
”యుక్తిగా నెరుకై తోచును -ముక్తికి నిలయమ్పు దారి మానుకొని వేమా ”.ఎరుక ఉంటేనే ,పరమ పదం సాధ్యం .మిగిలినవేవీ పనికి రావు .అసలు మర్మం తెలియ కుండా మతాలను సృష్టించారని ఈస డిస్తాడు .ఇలాంటి వారి భావాలన్నీ ”గాజుటింట కుక్క కళవళ పడి నట్లు ”ఉంటాయట .”పూజ కేమి వచ్చే ,బుద్ధి ప్రధానము ”అన్నాడు .పరమాత్మ విశ్వంభరుడై ,విశ్వం లో వెలుగుతూ ఉంటాడు.”అతన్ని చూడండి  అన్నాడు .”క్షేత్రంబున క్షేత్రజ్నుని ,-గాత్రంబును జూచి నియతి గల లక్ష్యంబున్ –రాత్రిం బవలును నొకటిగ -సూత్రించిన ముక్తి సులభము వేమా ”అని ముక్తికి సులభ మార్గాన్ని చెప్పాడు .రాతి ప్రతిమను రాజసం లో ఉంచి పూజించే వాడు బుద్ధి మాలిన వాడు.అలాంటి వాడు ”భావమందు పరము భావించ నేరడు ”అని వాడిఅవి వేకాన్ని జాలి పడతాడు ”శిలలు శిలలే కాని ,శివుడు కాదని -తనదు లోని శివుని దానేల తెలియడో ”అని నిట్టూరుస్తాడు .
హిందూ మతం లో ఉన్న యజ్న యాగాలు దారి తప్పి హింసకు పట్టం కట్టాయి .కాలజ్నులు వాటిని సహించ లేక పోయారు .ప్రత్యామ్నాయాలు చూపించారు .మార్పు వచ్చి పశు హింస తగ్గింది .తన కాలం లో ఇంకా అమలు లో ఉన్న పశు హింస పై’- విమర్శ వజ్రాయుధాన్ని ప్రయోగించాడువేమన యోగీంద్రుడు .”సోమయాజి –మేక పోతును బట్టి మేడలు విరవటం ”ఆయన్ను కలిచి వేసింది .”జీవ హింసకు చిక్కునా మోక్షంబు ”అని తీవ్రం గానే ప్రశ్నించాడు .ఇక్కడ యజ్ఞం చేస్తే స్వర్గం లో రంభాదుల పొందు విందు లభిస్తుందనే ఆశ మాత్రమె యజ్ఞానికి కారణం అన్నాడు .సోమయాజి, కామ యాజి అవటం సహించ లేక పోయాడు .పక్క వాడు ఆకలితో అలమటించి చస్తుంటే పట్టించుకోని జనం తల్లి దండ్రుల శ్రాద్ధా లకు వేలు ఖర్చు చేయటం బాధించింది .”పిండములను జేసి పితరుల దల పోసి –కాకు లకు బెట్టు గాడిద లారా –పియ్య తినెడి కాకి పితరు డేట్లాయేరా “‘అని మందలించాడు .ఇంతకీ పిండాలు కాకులకే ఎందుకు పెడతారు / అనే సందేహం వస్తుంది .ఉత్తర రామాయణం లో దీనికి ఒక కధ ఉంది. మరుత్తుడు అనే రాజు యజ్ఞం చేస్తుంటే ,రావణుడు రాక్షస సైన్యం తో వచ్చి ఇంద్రాది దేవతలను భయ పెట్టి పార దోల్తాడు .అప్పుడు వాళ్ళు అందరు పశు ,పక్షాది రూపాలు పొంది పారి పోతారు .పితృదేవత లకు ప్రభువైన యముడు కాకి రూపం దాల్చి అక్కడే ఉంటాడు .అప్పటి నుంచి పితృదేవతలకు వేసే పిండాలను కాకులకు పెట్టటం అలవాటు లో ఉంది .అప్పటి దాకా పక్షుల్లో చాలా హీనం గా చూడ బడిన కాకి అప్పట్నించి పవిత్రత సాధించింది .”కాకి పెండ్లి నెవరు కానరు భువిని –కాకికి అన్నముంచి కాళ్ళకు మొక్కరు ”అని ఆశ్చర్య పోయాడు వేమన్న .”సంజ్ఞా మది యందు బూనూట సాధు  వ్రుత్తి -మనసు మగ్నము నొందుట మనన వ్రుత్తి ”అంతే కాని ,యజ్న యాగాదుల వల్ల ప్రయోజనం లేదు అన్నాడు.
చేసిన పాపం చెడని పదార్ధం అని తత్వ గీతం .ఎన్నెన్నో పాపాలు చేసి వాటి పరిహారం కోసం తీర్ధ యాత్రలు చేసి పాపాన్ని పోగొట్టు కోవాలను కొంటాము .పిల్లిని చంపిన పాపం వేరు గుడి కట్టిన పుణ్యం వేరు అని తెలుసు కో లేం .హృదయాలను కడుక్కోవాలి శరీరాలను కాదు .శారీరక మాలిన్యం కంటే మానసిక మాలిన్యం చాలా ప్రమాదం .దాన్ని వదిలిన్చుకోక పోతే ఉత్తమ గతులుండవు .పశ్చాత్తాప దగ్ధం తోనో ,పరోప కారం తోనో సహనం తోనో ,సానుభూతి, సహవేదన ,దయా ,దాక్షిణ్యం ,కరుణ లతోమనో  మాలిన్యం పోతుంది .గంగాది నదుల్లో స్నానం వల్ల ఆత్మ సంస్కారం రాదు .సద్గురు కటాక్షం వల్లనె సాధించాలి .”తిరుపతికి బోవ తురక దాసరి కాడు–కాశి కేగ లంజ గరిత గాదు–కుక్క సింహమగునే గోదావరికి బోవ “”అని వితర్కిస్తాడు .కల్మషాలన్నీ ,కడుపు  లో పెట్టు కొని ,నదీ స్నానాలు ,భగవద్దర్శనాలు చేస్తే ప్రయోజనం లేదంటాడు .మానసిక మార్పు రావాలి .ఒక వేళ ఆ పవిత్ర స్తలాల వల్ల మార్పు వస్తే వేమన్న కంటే సంతోషించే వాడు లేడు .కొన్ని స్థలాలు పవిత్రాలు కొన్ని అపవిత్రాలు అని భావించటం తప్పు అనేదే వేమన్న చెప్పిన వేదం లాంటి విషయం .”పుణ్యమనగ నేమి ? చేసిన పుణ్యమే ”అని చక్కని సమాధానం చెబుతాడు .
సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –20-8-12-కాంప్–అమెరికా

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం
More articles by అతిథి »
Written by: అతిథి
Tags: K.V.S.Ramarao, Velcheru Narayanarao
velcherubook

వ్రాసిన వారు: కే.వి.యస్.రామారావు
********
(ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు ఎంతోకాలం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్ సిన్, మేడిసన్ కేంపస్ లో కృష్ణదేవరాయ పీఠం ఆచార్యునిగా పనిచేసి అక్కడి నుంచి పదవీవిరమణ చేసి ప్రస్తుతం అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయంగా గుర్తింపూ, ఖ్యాతి తెచ్చే గురుతర బాధ్యతని ఏకాకిగా వహిస్తూ, భరిస్తూ నిరంతర కృషి సాగిస్తున్న ఈ ఎనభై ఏళ్ల యువ విమర్శకుడి శోధన, సాధన అనితరసాధ్యాలు. ఇప్పటికి ఎన్నో లోతైన పరిశోధనల్ని పుస్తకాలుగా, పరిశోధనా పత్రాలుగా ప్రచురించారు. నారాయణ రావు గారి గౌరవార్థం “సింపోజియా” లు కూడ జరిగాయి. ఆయన ఈమధ్యనే ఎనభై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా “పుస్తకం” పాఠకులకు ఆయన పరిశోధనా గ్రంథాల్ని కొన్నిటిని పరిచయం చెయ్యటం ఈ శీర్షిక లక్ష్యం.)

1974 లో నారాయణ రావు గారు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పి.ఎచ్.డి. పట్టా కోసం రాసిన సిద్ధాంత వ్యాసాన్ని పొడిగించి 1978 లో పుస్తకరూపంలో ప్రచురించారు. అదే ఈ “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం“. ఆ తర్వాత మరో రెండు ముద్రణలు అయ్యాయి. చివరిది 2009లో. ఎన్నో కోణాల్లో విప్లవాత్మకమైన రచన ఇది. అంతకు ముందు అలవాటుగా ఆచారంగా వస్తున్న సిద్ధాంత వ్యాసాల గ్రాంధిక భాషని తోసిపుచ్చి సరళమైన భాషలో రాయటమే కాదు, మరీ ముఖ్యంగా వాడే ప్రతి పదానికి స్పష్టమైన, నిర్ద్వంద్వమైన నిర్వచనాన్ని వాడారు. అంటే, వాడుక మాటలకి కవిత్వంలో వేరే అర్థాలు ఎలా ఉంటాయో అలాగే సాహిత్య విమర్శలో కూడ విమర్శకి సంబంధించిన విస్పష్టమైన అర్థాలు ఉండాలని ప్రతిపాదించి, ఆచరించి చూపారు. కనుక ఈ గ్రంథంలో మాటలు మామూలుగానే అనిపించినా వాటి అర్థాలు మాత్రం వాడుక అర్థాలు కావని వేరే సాంకేతికార్థాలు ఉన్నాయని మనం గ్రహించాలి. అలా గ్రహించి చదివితే తెలుగు కవిత్వం గురించిన విప్లవాత్మక ప్రతిపాదనలు ఎన్నో కనిపిస్తాయిక్కడ.

ఈ గ్రంథం లక్ష్యం తొలినాళ్ల నుంచి నాటివరకు తెలుగు కవిత్వంలో వచ్చిన మౌలికమైన మార్పుల్ని నిగ్గుతీసి ఆ మార్పులకు దారి తీసిన ప్రాథమిక కారణాల్ని స్పష్టంగా లెక్కతేల్చి ఈ వ్యవస్థ అంతటినీ ఒక సైద్ధాంతిక వ్యూహనిర్మాణం ద్వారా వివరించటం. ఇంతటి బృహత్తరమైన పనిని సాధించటంలో అంతకుముందున్న పరిశోధనలు అంతగా సహకరించకపోగా ఎక్కువభాగం అయోమయానికి, జారుడుతనానికి నిదర్శనాలుగా ఉన్న సందర్భంలో వాటినుంచి దూరంగా నిలబడి కొత్తచూపుతో వెయ్యేళ్ల పైగా విస్తరించిన తెలుగు కవిత్వాన్ని వీక్షించి ఎప్పుడెప్పుడు ఏయే సందర్భాల్లో ఏయే కారణాల వల్ల పెనుమార్పులు సంభవించాయో గుర్తించి సహేతుకంగా వాటన్నిటినీ వివరించటానికి ఒక సరళమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఈ గ్రంథం.

ఈ సిద్ధాంతం చూపిన ఒక ముఖ్యమైన ఫలితం – కవుల వల్ల విప్లవాలు రావని, కవిత్వ సందర్భంలో కలిగే పెద్ద మార్పులు మాత్రమే కవితా విప్లవాలకు దారితీస్తాయని. అలాగే కవి ఎంతటి ప్రతిభావంతుడైనా కవిత్వసందర్భానికి వ్యతిరేక దిశలో నడవటానికి ప్రయత్నిస్తే ఆ కవి రచనలు అప్పటి కవితావిప్లవంలో పాలు పంచుకోలేవని సోదాహరణంగా నిరూపిస్తుంది. గురజాడ ఇందుకు ఒక ముఖ్యమైన దృష్టాంతం. తర్వాతి కవులు గురజాడని ఎంతగా పొగిడారో అంతగానూ ఆయన కవిత్వాన్నుంచి పారిపోయారనేది కనిపించే సత్యం – ఎంతమంది ముత్యాలసరాలు రాశారు? ఎంతమంది గురజాడ జాడలో పాటలు రాశారు? ఇలా ఎందుకు జరిగిందో ఖచ్చితంగా వివరిస్తుంది నారాయణ రావు గారి కవితావిప్లవ సిద్ధాంతం. అలాగే తిరుపతి వెంకటకవులు ఎందుకు ఎవరికీ మార్గదర్శకులు కాలేకపోయారో వివరిస్తుంది.

విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు ఎలా ఉండాలో ఇప్పటికి మనకి ఒక స్పష్టమైన అవగాహన వుంది – ఏ సిద్ధాంతమైనా దాని పరిధిలోని విషయాలన్నిటినీ సమగ్రంగా సమూలంగా సూటిగా డొంకతిరుగుడు లేకుండా వివరించగలగాలి, అప్పటి వరకు తెలియని కొత్త విషయాల్ని ప్రతిపాదించగలగాలి. కవితావిప్లవ సిద్ధాంతానికి ఈ గుణాలున్నాయి. అలా కవిత్వవిమర్శకి కూడ విజ్ఞానశాస్త్ర స్థాయిని కలిగించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈ గ్రంథం.

ఇలాటి విస్తృతమైన సిద్ధాంతంతో పాటు “బోనస్” గా నారాయణ రావు గారు మరో ముఖ్యమైన పని కూడ చేసిపెట్టారీ గ్రంథంలో – అది ఒక్కో విప్లవ కాలం లోని పద్యాన్ని ఎలా చదివి అర్థం చేసుకోవాలనేది ఉదాహరణలతో చూపించటం. నన్నయ గారి పద్యాన్నీ శ్రీశ్రీ పద్యాన్నీ అర్థం చేసుకునే పద్ధతి ఒకటి కాదని అందరూ ఆలోచించకుండానే ఒప్పేసుకుంటారు; ఐతే ఖచ్చితంగా తేడా ఏమిటి అంటే చెప్పగలిగే వాళ్లు చాలా కొద్దిమంది, ఉద్దండ పండితుల్లో కూడ. కవితా విప్లవం అంటే అన్ని కవిత్వపార్శ్వాల్లోనూ మార్పులు వస్తాయని, కవిత్వభాష, కవిత్వ శ్రోత (లేదా పాఠకుడు), కవిత్వానుభవం, కవిత్వాస్వాదన, కవిత్వ విషయం – ఇవన్నీ మారతాయని గుర్తించి స్పష్టీకరించటమే కాకుండా ఏయే విప్లవంలో ఇవన్నీ ఎలా మారాయో కూడ చూపిస్తుందీ గ్రంథం.

“ఇది నా యుగం, నేనే ఈ యుగకవిని, నా వెనక ఇప్పటి కవిత్వం నడుస్తుంది” అని ఎప్పటికప్పుడు భుజాలు చరుచుకునే కవులు వస్తూనే వుంటారు. ఏ కవీ యుగకర్త కాడని, యుగాలే (అంటే కవితావిప్లవాలే) కవుల్ని తయారుచేస్తాయని, ప్రతిభ వున్న కవులు ఆ యుగధర్మానికి అనుగుణంగా కవిత్వం రాసి పేరుతెచ్చుకుంటారని ప్రతిభ లేని వారు యుగధర్మాన్ని గుర్తించకపోవటమో లేక గుర్తించినా దానికి ఎదురీదటానికి ప్రయత్నించటమో చేసి వెనకబడి పోతారని చాటుతుందీ సిద్ధాంతం. అలా, కవితావిప్లవాల్ని గుర్తించటానికి, ఆ విప్లవకాలాల్లో ప్రతిభావంతులైన కవుల్ని గుర్తించటానికి అవసరమైన సాధనాల్ని పాఠకులకి అందిస్తుందీ గ్రంథం. అంతేకాకుండా గత రెండు మూడు దశాబ్దాల్లో వచ్చిన కవిత్వమార్గాల్లో ఏవైనా విప్లవాత్మకమైనవి వున్నాయా, వుంటే వాటిలో ప్రధాన కవులెవరు? అప్రధాన కవులెవరు? అన్న ప్రశ్నలకు ఎవరికి వారే సమాధానాలు చెప్పుకోగలిగిన సాధనసంపత్తిని అందిస్తుంది. చివరగా, ముందుముందు తెలుగు కవిత్వంలో ఎలాటి విప్లవాలు రావచ్చో ఊహించటానికి అవసరమైన పరికరాల్నిస్తుంది.

తెలుగు కవిత్వం గురించి, సాహిత్యం గురించి ఏమాత్రం ఆసక్తి వున్నవారైనా తప్పక చదివి తీరవలసింది ఈ గ్రంథం. ఒకసారి కాదు, ఎన్నో సార్లు చదవాలి. ప్రతిసారి కొత్తవిషయాలు, రహస్యాలు బయటకు వస్తాయి. ఆషామాషీగా కాదు, పదపదాన్ని జాగ్రత్తగా విచారిస్తూ వివేచిస్తూ చదవవలసిన గ్రంథం. ఆలోచనామృతమైన పుస్తకం.

నవోదయ, విశాలాంధ్ర, తదితర పుస్తకవిక్రేతల దగ్గర ప్రతులు దొరుకుతాయి. వెల వంద రూపాయలు.
———————

పుస్తక పరిచయ కర్త: కె. వి. ఎస్. రామారావు, శాన్ రమోన్, కేలిఫోర్నియా, యు. ఎస్.

రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ

రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ

(ఇది డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వారి చర్చ సారాంశం. ఈ చర్చ 2008లో వారి సమావేశంలో జరిగింది. ప్రచురణకు అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
సమీక్షకుడు: బసాబత్తిన శ్రీనివాసులు
రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ
రచయిత: వల్లంపాటి వెంకట సుబ్బయ్య

సమావేశ స్థలం: ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంధాలయం, ఫార్మింగ్టన్ హిల్స్, మిచిగన్.
తేదీ, సమయం: ఆదివారం, జూన్ 8, 2008, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు
పాల్గొన్నవారు: ఏపూరి హరనాథ్బాబు (చికాగొ), మెట్టుపల్లి జయదెవ్ (చికాగొ), వేములపల్లి రాఘవేంద్రచౌదరి, శంకగిరి నారాయణస్వామి, మద్దిపాటి కృష్ణారావు, పన్నూరు నారాయణ (కందుకూరు, ప్రకాశం జిల్లా), ముసునూరు ఆనంద్,
ఆరి సీతారామయ్య, తెలంగాణా జయప్రకాశ్, చెక్కిళ్ళ చైతన్య, వెలగా రవి, బసాబత్తిన శ్రీనివాసులు (ముఖ్య చదువరి), అడుసుమిల్లి శివ, ఆళ్ళ గణేష్, ఉండవల్లి అనూరాధ, సిద్దం రావు, చేకూరి విజయ్, ముఖ్య అతిధులు నెల్లుట్ల
వేణుగోపాల్, సి. వనజ.

రాయలసీమలో పుట్టినటువంటి నాకు రాయలసీమ పుట్టు పూర్వోత్తరాలకు సంబందించిన ఈ పుస్తకాన్ని చదవడానికి అవకాశమిచ్చిన డిట్రాయిట్ లిటరరీ క్లబ్ కి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే ఈ మహత్తరమైన పుస్తకాన్ని రాసిన స్వర్గీయ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారికి నా అభివందనలు! ఇక పుస్తకం మీద నా అభిప్రాయం విషయానికి వస్తే వల్లంపాటి గారు రాయలసీమ చారిత్రక చిత్రం లో రాయలసీమ ఏర్పాటు గురించి మంచి వివరాలు అందించారు. రాయలసీమలో బళ్ళారి
లేకుండా పోవడం తద్వారా తుంగభద్ర ప్రాజెక్టు పోవడం ఇంకా ఆంధ్రభోజుడూ పరాయి వాడయిపోవడం గురించి చర్చించారు. సీమలో ప్రజలు బాదామి చాళుక్యులు, కంచి పల్లవుల మధ్య యుద్ధాలవల్ల ఎలా నలిగిపోయారో వివరించారు. విజయనగర సామ్రాజ్యంతో రాయలసీమ సంబంధాలు, మరాఠాలతో నైజాం నవాబుల పోరాటాలు సీమ ప్రజల జీవితాలను అతలాకుతలం చేయడాన్ని గుర్తుచేశారు. పాలెగాళ్ళని విజయనగర రాజులు పొషించడం, దత్త మండలాల ఏర్పాటు గురించి వివరించారు. రాయలసీమ సాహిత్యంతో కరువు సాన్నిహిత్యాన్ని వల్లంపాటి గారు స్పష్టంగా వివరించారు. ఇక కోస్తా ప్రాంతంలో ఆనకట్టలు, తద్వారా బాగా పంటలు పండడం దానివల్ల అక్షరాస్యత బాగా పెరిగిందని సీమ ఇటువంటి మార్పుకి దూరమైందని వల్లంపాటి గారి అవేదన మనకి పుస్తకమంతా కనిపిస్తూనే ఉంటుంది. పాతరోజుల్లో పాళెగాళ్ళు, ప్రస్తుత కాలంలో ఫాక్షనిస్టుల మధ్య సీమ ఎలా నలిగిపోతుందో చెప్పారు. రాజకీయనాయకులు రాయలసీమకి అన్యాయం జరుగుతుండగా చూస్తూ ఉన్నారే కానీ అన్యాయాన్ని ఎదుర్కోలేదని వాపోయారు.
ఇక సాహిత్యంలో రాయలసీమ చైతన్యం గురించి వివరిస్తూ శ్రీకృష్ణదేవరాయలు రచించిన “ఆముక్త మాల్యద” లో సామాన్య జీవితాలు మరియు వాటి వర్ణన పేర్కొన్నారు.గురజాడ “కన్యాశుల్కం” రాస్తున్న సమయంలో సీమలో వావిలకొలను సుబ్బారావు “ఆంధ్రవాల్మీకి రామాయణం”,”ఆర్య కథానిధి” మరియు “పతివ్రతా హితచర్య” వంటి గ్రంధాలను రాస్తున్నారని తెలిపారు. ఆధునిక సాహిత్యం సీమలో ప్రారంభం కాకపోవటానికి కవి పండితుల ప్రతిభా రాహిత్యం ఎంత మాత్రం కారణం కాదన్నారు. 19వ శతాబ్దం మధ్య భాగం నుంచి కోస్తా జిల్లాల ఆర్ధిక స్వరూపం మారిపోవడం, తద్వారా మంచి బడుల ద్వారా అక్కడి ప్రజల అక్షరాస్యత పెరగడం గుర్తు చేసారు. బెంగాల్ లో పుట్టిన సంఘ సంస్కరణోద్యమం గోదావరి జిల్లాలను ఎలా తాకిందో వివరించి, ఈ ప్రభావం రాయలసీమను తాకలేదన్న వాస్తవాన్ని గుర్తు చేసారు.
ఆధునిక కవిత్వంలో రాయలసీమ చైతన్యం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ “పెనుగొండ” అన్న పాటతో ప్రారంభమయిఉండచ్చని వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు అభిప్రాయపడ్డారు. విద్వాన్ విశ్వం గారి “పెన్నేటి పాట” మాహాప్రస్థానం కి కవితావేశంలో ధీటైన కావ్యం అన్నారు. విశ్వం గారి మాటల్లో చెప్పాలంటే రాయలసీమ ఆధునిక కవిత్వంలో “శుకపిక శారికారపరుచుల్వినిపించవు”. ప్రేమలు, విరహాలు కనిపించవు. రాయలసీమ కవిత్వం రాయలసీమ బతుకంత భయంకరంగా, నిర్జీవంగా, శుష్కంగా, అలంకార రహితంగా ఉంటుంది. అన్నమయ్యను తొలి సంకీర్తనాచార్యుడిగా గుర్తిస్తే తెలుగులో సంకీర్తనా సాహిత్యం రాయలసీంలోనే ప్రారంభమయిందని అన్నారు.
1872లో అచ్చయిన “శ్రీ రంగరాజు చరిత్ర” మొదటి నవల తొలి తెలుగు నవల అయి ఉండచ్చని చాలా మంది వాదించారని వల్లంపాటి గారు అన్నారు. ఈ నవలని చారిత్రక నవలగా ఎలా పరిగణించలేమో విశ్లేషించారు. అలాగే ఈ నవలలో కధా వస్తువు లేదు అని చెప్పారు. 1915 నుంచి 1950 వరకు సీమలో నవలా సాహిత్యం సంచలనం ఎందుకు లేదో వివరించారు. సబా, నాదమునిరాజు నవలలో ప్రారంబించిన సమకాలీన జీవితచిత్రణను తరువాత తరం కొద్దిగా విస్త్రుతం చేయగలిగిందన్నారు. ప్రసిద్ధ కధారచయిత పి.రామక్రిష్ణారెడ్డి 1975లో రాసిన “నత్తగుల్లలు” సంచలనం కలిగించిందన్నారు. రాలసీమ నవలను నిశ్చితమయిన మలుపు తిప్పి దళిత, నిమ్నవర్గాలకూ, వర్ణాలకూ అంకితమిచ్చిన వాడు కేశవరెడ్డి అని చెప్పారు వల్లంపాటి గారు.
“దళితుడి పయనం” రెండవ ముద్రణకు ముందు మాటలో కేశవరెడ్డి “గత 22 సంవత్సరాలలో దళితపోరాటం వివిధ ప్రాంతాలలో సాగి, ఎన్నో దశలను దాటింది.నేడు దళితుడు తన సంకెళ్ళను కళ్ళకు అద్దుకోవటం లేదని నిస్సంకోచంగా అంగీకరిస్తున్నాను” అని చాలా స్పష్టంగా చెప్పారన్నారు.
గురజాడ “దిద్దుబాటు” ని మొదటి కథగా గుర్తిస్తే ఆ తరువాత 30 ఏళ్ళకు గానీ రాయలసీమలో మొదటి కథ రాలేదు. ఈ 30,40 సంవత్సరాల కాలంలో కొస్తా జిల్లాలలో గురజాడ, చింతా దీక్షితులు, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, వేలూరి శివరామ శాస్త్రి, మల్లాది రామక్రిష్ణ శాస్త్రి, గోపీచంద్, చలం, బుచ్చిబాబు, కరుణకుమార, కొడవగంటి కుటుంబరావు వంటి మహోన్నత కథా రచయితలు ఉద్భవించారని, అదే సమయంలో రాయలసీమలో సమకాలీన జీవితాన్ని
గురించిన సామజిక అవగాహన కనిపించలేదన్నారు వల్లంపాటి గారు. రాయలసీమలో కరువు గురించి రచయితలు గొప్ప కథలు రాశారని, నేటి యువతరం వీరి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతారన్న విశ్వాసాన్ని వ్యక్త పరిచారు.