Thursday, November 30, 2017

కపిల రామ్‌కుమార్‌ || పంచాగం బద్దలు కావాలి||

కపిల రామ్‌కుమార్‌ || పంచాగం బద్దలు కావాలి||
అద్దం మీద వాలి
ముక్కుతో పొడుస్తున్న చందంగా
అతివల కుచాలపై కీచక గోళ్ళు
వికారంగా గాట్లు పెడుతున్నచప్పుడు
పాడే విషాదరాగమెవరికీ వినిపించదు
ఎత్తి కుదేసి బలంగా ఒదేసిన గునపపు రాపిడికి
నరాల స్వరాలు చిట్లిపోయి
గుంతలోంచి పైకి చిందిన బురదలా
లావాలారక్తస్రావమౌతున్నా
ఎవరి మనసూ చలించదు
వశమై, వివశమై పోరాడి శవమై
కళ్ళు తేలేసినపుడు మాత్రం
కామగర్వంతో వికటాట్టహాసం చేస్తూ
రవంత భయపు పొరకమ్మకపోగా
మగాడిననే కాలపుకౌర్యపుకేతనం ఎగరేస్తుంటే
పొగరు దించడానికి
అపరకాళిక కావాలి, లొంగి ఒరిగిపోవటం కాదు,
ఒంగి పంచాగాన్ని బద్దలుచేయడమే నేర్వాలి
పిరికితనపు మేలిముసుగు తొలగించి
చురుకైన శౌర్యాన్ని చూపడమే నేటి నారీ కర్తవ్యం
30.11.2017

Tuesday, November 28, 2017

కపిల రామ్‌కుమార్ || ప్రేయసి అలక ||

కపిల రామ్‌కుమార్ || ప్రేయసి అలక ||
దగ్గరకు రా అన్నప్పుడల్లా
ససేమిరా కాదంటూనే
ఆమడదూరం పరిగెత్తేది తను
ముద్దపెడతానంటే పరుగన వచ్చేది
ముద్దిస్తానంటే మాత్రం
ఏమైంది అంటే
పెదవులు ఎంగిలైనా పర్వాలేదు కాని
యెదపొంగులు నలిగితే
శరీరం ఎంగిలైతే ఒప్పుకోనుగా అంది
ఇన్నాళ్ళ ప్రయాణం
ప్రణయంకాదా
కావొచ్చు - మరో ప్రళయం కాకూడదంటూ
గాలిలోనే ఓ ముద్దిచ్చి తుర్రుమంది
అమలిన శృంగారదేవతగానే
మనో ఫలకంపై నాట్యమాడే
కవితా చెలి.
గ్లోబలీకరణ ప్రభావంతో శీలం చెడగొట్టుతావేమో
లోభాలకు లొంగి ప్రజావ్యతిరేకుడవౌతావేమో
సవాలక్ష సవాళ్ళను నా మెదడులో జొనిపి
ఎగిరిపోయింది ఊహాలకు, ఉద్దేశాలకు
ఆశయాలకు
ఆచరణకు
వైవిధ్యం, వైరుధ్యం లేని నాడు
నీ ఒడిలో వాలిపోతానంటూ
28.11.2017