5.10.2025 విశాలసాహితి పత్రికలో వచ్చిన చిన్న కథ.
"పెద్దలకంటే పిల్లలు నయం"
గత సంవత్సరమనుకుంటా
శాస్త్రిగారబ్బాయి సైకిల్ తొక్కుతుంటే
పక్కింటి మస్తాన్ కొడుకు రఫీ
బంతి విసిరితే తగిలిందని
మీనాక్షమ్మ ఒకటే యాగిచేసి
కాలనీలో పంచాయతీ పెట్టింది
"పిల్లలు కదా ఎందుకంత పెద్దది
చేస్తున్నా"రనడిగితే
"సైకిల్ పడి మా వాడి కాలిరిగితే ఎవరు బాధ్యులంది"
కాసేపు వాళ్ళూ వీళ్ళూ రెండు గుంపులై
అరుచుకొని తర్జనభర్జనలు పడి
ఒకరికొకరు సమాధానపడ్డారు
పిల్లలమీద అతి ప్రేమతో పెద్దలు
జగడాలాడకూడదని..జ్ఞానోదయమే అది.
రంజాన్ పాయసం, ఉగాది పచ్చడి
అటూఇటూ పంచుకున్నారు.
***
ఏడాది తర్వాత నిన్ననుకుంటా ఇంజనీరు రెడ్డి గారబ్బాయి కుర్రాళ్ళందరితో సరదాగా
ఎవరికి చెప్పకుండా సాగరు కాల్వలో ఈతకెళ్ళారు. అక్కడేమయిందో గాని
ఈతరాని ఇంజనీరు గారబ్బాయి మునిగిపోతూంటే మన మస్తాన్ కొడుకు రఫీ
ఒడ్డుకు తెచ్చి రక్షించాడన్న విషయం
రాత్రి దాక ఎవరికి తెలియదు
అదీ తడిసిన పిల్లాడు తుమ్ము తుంటే
బయటపడ్డది అసలు విషయం.
మళ్ళీ అందరూ ఒకచోట చేరారు
ఏం గొడవ జరుగుంతోనని భయపడ్డారు
అందరూ చేరిన పిదప ఇంజనీర్ రెడ్డి గారు
అబ్బాయి రఫీ ఇలారా అనగానే
వణుకుతూ వచ్చి నిలబడ్డవాడ్ని
ఆప్యాయంగా భుజం తట్టి
"అరే రఫీ భయపడకు...మావాడిని
రక్షించినందుకు ఇదుగో తోఫా" అంటూ
కొత్త బట్టల జత చేతులో పెట్టి
"ఆవ్ బేటా" అంటూ కౌగలించుకొన్నారు.
...
అందరూ చప్పట్లు కొట్టారు
"మనకు అంతరాలు కాని
పిల్లలకు ఉండవు
వాళ్ళని అలాగే సఖ్యతగా
మెలగనిద్దాం" అన్నారు రెడ్డి గారు.