Friday, March 21, 2014

|\అక్షర క్షిపణి|\

కపిల రాంకుమార్|\అక్షర క్షిపణి|\
ఓ అక్షరానికి మరో అక్షరం పేర్చటం కాదు
అది క్షిపణిలా పేలినపుడే కవిత్వం!
పళ్ళగొర్రుతో దమ్ము చేసిన చేలో వరినాట్లు
చదరంగపు గళ్ళున్నట్టుండాలి!
గాలికి వూగే జొన్నకంకులమీద వాలిన పిట్టలాగుండాలి
మబ్బులను అహ్వానిస్తూ ఆకాశంలో విన్యాసం చేసే తూనీగల్లాగుండాలి!
కొండరాళ్ళ మధ్య సెలయేటి సవ్వడిలా
నాట్యమయూరి సిరిమువ్వల ఝరిలా
యుద్ధభేరీ నినాదంలా వుండాలి కవిత్వం!
నైపుణ్యం సంతరించుకున్న శిల్పంలా
విప్లవ శంఖంలా
వసంతకాలపు వెచ్చని సూర్యోదయంలా
శారద రాత్రుల మలయ మారుతంలా
కొబ్బరిచెట్టునీడలో వాల్చిన పడకుర్చీలా
గండుతుమ్మెద రెక్కల సవ్వడిలా
పొగరెక్కి పొలంగట్టుమీద రంకేలేసే ఒంగోలు గిత్తలా!
ఎలకోయిల మధుర గానంలా!




జామాకు వగరులా!
వేపాకు చిగురు అనుపానంలా!
చెరుకుపానకంలో అద్దుకునే మినప రొట్టెలా!
రోమాంచిత సాహితీ స్పర్శలా!
వీర తిలకం దిద్దే పత్నిలా!
ధైర్యపు  భుజంమీది సంధించిన ఆయుధంలా!
శత్రు స్వప్న  సింహంలా !
జతగూడే అక్షరమే జతగాడౌతుంది!
పదాలతో పదాతిదళానికి మొనగాడైన అధిపతౌతుంది!
అసమర్థిని ఎంపికకు విరోధి అవుతుంది!
సమర్థునికి జయకేతనమౌతుంది!
నిత్య ప్రకాశ సత్యమై
నిబద్ధత కలిగివుంటుంది!
జన చైతన్య వికాసమై
ఎగిరే ఎర్రజెండాలా
భూతకాలపు జల్లెడై
వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ

భవిష్యత్తరుణ పతాకమౌతుంది.!

No comments: