Saturday, August 22, 2015

కపిల రామ్‌కుమార్‌|| ఘర్షణ||

కపిల రామ్‌కుమార్‌|| ఘర్షణ||
ఊహ కళ్ళు తెరిచేలోగా
ఒళ్ళు విరుచుకుంటోంది కుతంత్రం!
లోచనాల ఆలోచనలను
రక్షించుకునేలోగానే
అంధత్వం పురుడుపోసుకుంటోంది!
గోడలకున్న రహస్యనేత్రాలు మాత్రమే
ఇలాంటి ఛిద్రాలకు ఒడికట్టుతాయ్‌!
అమాయకంగా ప్రతీసారి
ప్రజాస్వామ్యం
మోసగించబడుతూనేవుంటుంది!
నిర్బంధాలనెన్నో సహిస్తూనే
ఉద్యమం కొత్తదారి వెతుక్కుంటూవుంటుంది!
నిఘా కుక్కలుకూడ
తేనెపూసిన కత్తులవుతూ
అదును చూచి దెబ్బకొట్టడానికి
రెచ్చకొట్టే క్రీడానైపుణ్యం పెంచుకుంటూంటాయి!
నిబ్బరంగావుంటేనే నిజాయితి
బట్టకట్టి తలెత్తుకోకలుగుతుంది!
లేదా అన్యాయం వంచనా పథంలో
మిడతలదండునాదర్శంగా
పంటచేల నాశన కార్యం మొదలెట్టుతుంది!
నిరంతర ఘర్షణల్లో తలమునకలువేస్తూ
ఎత్తుగడల పంథా అనుసరించకపోతే,
అన్ని వర్గాలను సమకట్టకపోతే
గమ్యం గగనకుసుమమే అవుతుంది!
వైరుధ్యాల పొత్తుల పోటాపోటీలో
సమైక్య గమనమే అక్షర క్షిపణుల సాయంతో
సాంస్కృతిక విప్లవ చైతన్యంతో
పావులు కదిపితేనే
ప్రగతిశీల పావురం
స్వేచ్ఛగా ఎగరకలుగుతుంది!
సరళీకృత పడమటిగాలిని
నివారించకలుగుతుంది!
దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై
మనమే కొత్తరూపమెత్తాలి !
================
22 ఆగష్టు 2015 ఉదయం 9.45

Thursday, August 20, 2015

కపిల రాంకుమార్‌||స్వప్నీకరణం||

కపిల రాంకుమార్‌||స్వప్నీకరణం||
--------------------------------------
శబ్ద చిత్రాలు
నిశ్శబ్దపు పరుగులతో
భావచిత్రాల్లా సింగారించుకుని
పాపిడి పిందెలతో పోటీగా
ముంగురులు సవరించుకుంటూనే
పద చిత్రాల లేజిగుర్లకై
వెంపర్లాడే కోకిలచానలౌతుంటే
రెండువేళ్ళ మధ్య ఓ కలం
కూచిపూడినాట్యం చేస్తూ
ఆరంగ్రేట్రం మొదలెట్టినపుడు
సుష్టుగా భుక్తాయాసం తీర్చుకుని
తాపీగా కుదుటపడ్డ కవి మానసిక స్థితికి
సాహిత్యపు సాయంకాలపుతెర
సీతమ్మవారి చీరలా అంబరాన
రంగులతో మురిపుస్తూ
మెరుస్తూ అందమైన
అపరంజి పద్యమై,హృద్యంగమమై
ఆహ్లాదపరుస్తున్నప్పుడు
కొంపలంటుకున్న రీతిలో
భీకర తుఫానులా
సమస్యల తోరణాలను తెగ్గొట్టే
నిబద్ధత తలకెత్తుకుని
నిమగ్నతతో
ధిక్కారస్వరమొకటి
సర్కారీ దివాళాకోరుతనంపై
సంధించిన కవితాశరంలా
విప్లవస్వరాలతో ఉత్తేజాన్నిస్తూ
నినాదమై, విధానమై గానమౌతున్నప్పుడు
అరుణారుణ కిరణాలకు
తక్షణ ప్రేరణపొందిన
పద్మాలన్ని శిరమెత్తిన కంఠంతో
జయహో కవిత్వంగా నినిదిస్తాయ్‌
రాబోయే మార్పును స్వప్నీకరణం చేసుకుంటూ!
-------------------------------------------------