Thursday, August 20, 2015

కపిల రాంకుమార్‌||స్వప్నీకరణం||

కపిల రాంకుమార్‌||స్వప్నీకరణం||
--------------------------------------
శబ్ద చిత్రాలు
నిశ్శబ్దపు పరుగులతో
భావచిత్రాల్లా సింగారించుకుని
పాపిడి పిందెలతో పోటీగా
ముంగురులు సవరించుకుంటూనే
పద చిత్రాల లేజిగుర్లకై
వెంపర్లాడే కోకిలచానలౌతుంటే
రెండువేళ్ళ మధ్య ఓ కలం
కూచిపూడినాట్యం చేస్తూ
ఆరంగ్రేట్రం మొదలెట్టినపుడు
సుష్టుగా భుక్తాయాసం తీర్చుకుని
తాపీగా కుదుటపడ్డ కవి మానసిక స్థితికి
సాహిత్యపు సాయంకాలపుతెర
సీతమ్మవారి చీరలా అంబరాన
రంగులతో మురిపుస్తూ
మెరుస్తూ అందమైన
అపరంజి పద్యమై,హృద్యంగమమై
ఆహ్లాదపరుస్తున్నప్పుడు
కొంపలంటుకున్న రీతిలో
భీకర తుఫానులా
సమస్యల తోరణాలను తెగ్గొట్టే
నిబద్ధత తలకెత్తుకుని
నిమగ్నతతో
ధిక్కారస్వరమొకటి
సర్కారీ దివాళాకోరుతనంపై
సంధించిన కవితాశరంలా
విప్లవస్వరాలతో ఉత్తేజాన్నిస్తూ
నినాదమై, విధానమై గానమౌతున్నప్పుడు
అరుణారుణ కిరణాలకు
తక్షణ ప్రేరణపొందిన
పద్మాలన్ని శిరమెత్తిన కంఠంతో
జయహో కవిత్వంగా నినిదిస్తాయ్‌
రాబోయే మార్పును స్వప్నీకరణం చేసుకుంటూ!
-------------------------------------------------

No comments: