Saturday, October 3, 2015

కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||

కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||
మొహమాటంలేకుండా
ఏకిపారేసుడులో పెద్దన్న
తప్పుడు పాలకులెవరైనా
తన మాటల వేటుకు తప్పించుకోలేరన్న!
రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయమన్న,
దూర్జటికి కంటే నాలుగాకులు మస్తుగ సదివిండు!
పోతనకుమల్లే రాచరికపు భజన కాదని
ప్రజాస్వామ్యమే వంటపట్టించుకున్నోడు గనుకే
ప్రజా కైతల సేద్యం చేసిండు!
శిశుపాలుని తప్పులలెక్కపెట్టి
సర్కారుచెవుల సిల్లువడాల్సిందే కాని
గిసుమంత కూడ వెనుకడుగేయలేదు!
సప్పుడు ఎక్కువే - ఘాటైన మాటలతో
ముక్కు సూటిదనం చూపుకూడా సూదంటిరాయే!
ప్రజల సోయి యాదమరిస్తే
బొందపెట్టేది నిక్కమన్నాడు
కౌన్సిల్లో సర్కారుకు చాకిరేవు పెట్టిండు
బొక్కసానికి చిల్లుపెడితే
డొక్క చించుతానన్నాడు
కాళమునకు ఖలేజా అద్దినట్టుండే
కైతల రైతుబిడ్డ కాళోజి!
నోరెత్తటం ఏ సర్కారుకీ యిష్టముండదు
నోరెత్తకపోతే కాళోజి కలం నడువదు!
రెంటికెపుడూ గొడవే
పోరాటంచేయకతప్పదు
పోయేవి బానిస సంకెళ్ళు అన్నట్టు
రాష్ట్ర, దేశ పాలకవర్గాలపై
పదునెక్కన పాటలా
అదునుచూచి పేలే తూటాలా
ఎందరికో స్ఫూర్తినిచ్చిండు!
బడుల యిజ్జతు, దవఖాన్ల తీరు,
చట్టసభల తగువులాట
నీటికాడ, కూటికాడ
బతుకుతెరువు పాకులాట
పెత్తనాల తగాదాల గొడవెలెన్నో
నీ, నా గొడవగా చేదీపమందించి
దోపిడి చేస్తే దోస్తానాలుండవు
తోటోడైనా సంజోతాలుండవ్
ఏ పార్టీ వాడైనా వాడు ఏ పాటివాడో
తీరుమానం చేయాలంటాడు!
మంచి సబ్బరిలేకుండా
పాలన చేసేటోడు
మావోడైనా, మీవోడైనా
మావో చెప్పినా మార్క్స్ చెప్పినా
మంచి మంచే, చెడు చెడే
బేరీజువేసుకోమన్నాడు!
గసుమంటోడు కాబట్టే
తాను బతికున్నన్నాళ్ళు
మూడోనేత్రంతోనే లోకాన్ని చూసాడు!
మనలనీ చూడమన్నాడు!
ప్రజల పక్షం వహించమన్నాడు!.
9849535033

అల్విదా || కౌముది ( కీ.శే.||షంషుద్దీన్‌-ఖమ్మం ]

అల్విదా || కౌముది ( కీ.శే.||షంషుద్దీన్‌-ఖమ్మం ] ||
గీత శిల్పి వెళ్ళిపోయాడు - గీతం తెగిపోయింది
ఏ సంకేతమూ లేకుండా - ఎవ్వరికీ చెప్పకుండా
అనుకోకుండా తెగి గాలిలో - కరిగిపోయే నక్షత్రంలా
అకస్మాత్తుగా జారి - మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా
ఉన్నట్టుండి హఠాత్తుగా - సభలో మధ్యలో తలవంచుకొని
షాయర్‌ వెళ్ళిపోయాడు - ముషాయరా ఆగిపోయింది
పరువం పోయింది - పరిమళం పోయింది
కవి హృదయం పోయింది - కవి ఉదయం పోయింది
సొగసు పోయింది - సోయగం పోయింది
ఆదమరచి నిద్రపోతున్న బీదరాలి వక్షస్థలం మీద
సామాన్యుడు భద్రంగా దాచుకున్న
చిర రుచిర స్వప్నాల కెంపుమీద కవిత్వం సొంపు మీద
తిలంగన్‌మీద తెలుగువాడిమీద -
భాగమతిమీద అభాగ్యులందరి నడినెత్తిమీద
మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ను విరిగి పడిపోయింది.
గీత శిల్పి వెళ్ళిపోయాడు - జ్యోతి ఆరిపోయింది
జైళ్ళను, కన్నీళ్ళను, రైఫిళ్ళను, రాపిళ్ళను
సోదరులందరితో కలిసి - సాదరంగా పంచుకున్నవాడు
రాళ్ళను కవ్వించినవాడు - మోళ్ళను నవ్వించినవాడు
పరిస్థితుల కఠిన శిలా వర్షాలకు -
పగిలిపోనిమాదర్శాల గాజుమేడ కట్టినవాడు
వర్గాలు, వర్ణాలు వైషమ్యాలులేని - స్వర్గాలకోసం కలగన్నవాడు
అరుణధ్వజానికి అరుణోషస్సుకని -
ఎర్ర ఎర్రటి ఆశలకు - ఎర్రటి కలలకు
అంకితమైనపోయిన దీన బంధువు -
బిందువులో ఇమిడిపోయిన సింధువు
అవనిని ఆకాశానికి ఎత్తినవాడు -
ఆకాశాన్ని అవనిమీదకు దింపినవాడు
నిప్పులో మంచును - మంచులో నిప్పును పుట్టించినవాడు
ఆడవాళ్ళ చొల్లులో అబద్ధాలలో - సానివాడల్లో సారాయి కంపుల్లో
నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి - అగ్ని భిక్ష పెట్టినవాడు
ఉడుగనాల చెక్కిళ్ళమీది ఉజ్వలమైన వెలుగును
వసంతాలకాంతినీ, క్రాంతినీ మేళవించి
సంధ్యారాగసలిలాన్నీ జ్యోత్స్నాద్రవాన్నీ కలిపి
అపురూపమైన శిల్పాలకు రూప సృష్టిచేసినవాడు
శబ్దాలకు ప్రాణంపోసి సమరాలకు నడిపించిన కవి
అపరాత్రి ఆకాశంమీద పొడచూపిన అర్ణఛవి
కలంవిడిచి, కలల్ని విడిచి, కలకలం విడిచి
రక్తం కక్కుతున్న క్షోభనూ, క్షామాల్నీ విడిచి
అట్టకట్టిన చెక్కిళ్ళానూ, క్రక్కటిల్లుతూన్న పెదవుల్నీ విడిచి
ఆకాశాన్ని చిల్లులు పొడిచే నిట్టూర్పుల్ని విడిచి
దు:ఖాల కొండల్నిమోస్తూ తిరిగే చిన్నచిన్న గుండెల్ని విడిచి
ఉదయాల్ని విడిచి
సాహిత్యపదాల్ని విడిచి
వెన్నెల పువ్వుల్నీ, పువ్వుల నవ్వుల్నీ విడిచి
ఇంద్ర ధనుస్సుల్నీ, మందమారుతాల్నీ, తోటల్నీ, తూనీగల్నీ విడిచి
సొంతగుండెలు దగాచేసే సంఘాన్ని విడి
స్వరాన్నీ, సంగీతాన్నీ జీవిత సర్వస్వాన్ని విడిచి
గీత శిల్పి వెళ్ళిపోయాడు!
గీతం తెగిపోయింది.
********************************
స్మృతికవిత - తెలంగాణా మహాకవి మఖ్దూం మొహియిద్దీన్‌ మృతికి
స్పందన)
( కాకతీయ యూనివర్శిటి డిగ్రీ - తెలుగు పాఠ్యాంశం )
----------------------------------------------------