Saturday, October 3, 2015

కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||

కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||
మొహమాటంలేకుండా
ఏకిపారేసుడులో పెద్దన్న
తప్పుడు పాలకులెవరైనా
తన మాటల వేటుకు తప్పించుకోలేరన్న!
రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయమన్న,
దూర్జటికి కంటే నాలుగాకులు మస్తుగ సదివిండు!
పోతనకుమల్లే రాచరికపు భజన కాదని
ప్రజాస్వామ్యమే వంటపట్టించుకున్నోడు గనుకే
ప్రజా కైతల సేద్యం చేసిండు!
శిశుపాలుని తప్పులలెక్కపెట్టి
సర్కారుచెవుల సిల్లువడాల్సిందే కాని
గిసుమంత కూడ వెనుకడుగేయలేదు!
సప్పుడు ఎక్కువే - ఘాటైన మాటలతో
ముక్కు సూటిదనం చూపుకూడా సూదంటిరాయే!
ప్రజల సోయి యాదమరిస్తే
బొందపెట్టేది నిక్కమన్నాడు
కౌన్సిల్లో సర్కారుకు చాకిరేవు పెట్టిండు
బొక్కసానికి చిల్లుపెడితే
డొక్క చించుతానన్నాడు
కాళమునకు ఖలేజా అద్దినట్టుండే
కైతల రైతుబిడ్డ కాళోజి!
నోరెత్తటం ఏ సర్కారుకీ యిష్టముండదు
నోరెత్తకపోతే కాళోజి కలం నడువదు!
రెంటికెపుడూ గొడవే
పోరాటంచేయకతప్పదు
పోయేవి బానిస సంకెళ్ళు అన్నట్టు
రాష్ట్ర, దేశ పాలకవర్గాలపై
పదునెక్కన పాటలా
అదునుచూచి పేలే తూటాలా
ఎందరికో స్ఫూర్తినిచ్చిండు!
బడుల యిజ్జతు, దవఖాన్ల తీరు,
చట్టసభల తగువులాట
నీటికాడ, కూటికాడ
బతుకుతెరువు పాకులాట
పెత్తనాల తగాదాల గొడవెలెన్నో
నీ, నా గొడవగా చేదీపమందించి
దోపిడి చేస్తే దోస్తానాలుండవు
తోటోడైనా సంజోతాలుండవ్
ఏ పార్టీ వాడైనా వాడు ఏ పాటివాడో
తీరుమానం చేయాలంటాడు!
మంచి సబ్బరిలేకుండా
పాలన చేసేటోడు
మావోడైనా, మీవోడైనా
మావో చెప్పినా మార్క్స్ చెప్పినా
మంచి మంచే, చెడు చెడే
బేరీజువేసుకోమన్నాడు!
గసుమంటోడు కాబట్టే
తాను బతికున్నన్నాళ్ళు
మూడోనేత్రంతోనే లోకాన్ని చూసాడు!
మనలనీ చూడమన్నాడు!
ప్రజల పక్షం వహించమన్నాడు!.
9849535033

No comments: