Wednesday, June 22, 2016

కపిల రాంకుమార్‌ || పోడుపోరు ||

కపిల రాంకుమార్‌ || పోడుపోరు ||
ఆదివాసి గూడేలకు
ఆనుకున్న అడివి వారికి జీవాధారమై
అక్కున చేర్చుకుంటుంది
సహజాతమైన హక్కుతోనే
పోటకత్తి, గడ్డపలుగు
చేతపార, చెంగున గింజలు
చెట్టు చెరిగి, పుట్ట తవ్వి
చదునుచేసి మోడు కాల్చి
విషజంతువుల తరిమి
ఋషిలా సేద్యతపమాచరించే
నేతల్లి బిడ్డలపై కర్కశత్వమా!
మేకల పుల్లరి, గొడ్లపుల్లరి
మెక్కుతూనే అధికారపు
జులుంలా అణిచితివేతలెందుకు?
జంగిల్‌ జమీన్‌ జల్‌ నినాదాల కొమరం భీం వారసులు
శ్రీకాకుళపు పాణిగ్రాహి పాటల కోరసులు
మా ఖమ్మం గిరిజన నేత సోయం గంగుల అడుగుజాడలు
నమ్మిన నేలను వదలరు
గిరిపుత్రుల గురి తప్పదు
బరితప్పి నర్తించిన ఉరితప్పదు
ఆవిడిపడగానే జొన్న, సజ్జలాంటి
ధాన్యాలను జల్లి ప్రాణపదంగా పెంచి
చేలోనే మంచెపైన కావలివుంటూ
పగటి పిట్టలను, రాత్ర్రి జంతువులను
పంటపైకి రాకుండా కాపాడి
కైలు చేసుకొని పొట్ట పోషించుకునే వాళ్ళే గాని
భూబకాసురుల్లా కబ్జాలు చేసి
రియలెస్టేటు వ్యాపారులు కారు కదా!
కనిపించే వాస్తవాలు చూడలేని
పాలకవర్గాల కొమ్ముకాసేలా
బడుగులపైనా మీ ఆక్రోశం, దాష్టీకం?
విప్పసారా, తాటికల్లు,పందిమాసం
రుచుల కక్కుర్తికై వారితో
విందులు చేసుకుంటూనే
గుబులు పుట్టినప్పుడల్లానో
వాతావరణమార్పులు చోటుచేసుకున్నట్లు
తాకీదుల అలజడికి
తాబేదార్ల లంచాలకి మరిగి
విశ్వ రూపం చూపించాలనుకుంటే
నిరశనాగ్నికి మసికావల్సిందే
ఎన్నికలవాగ్దానాలను తుంగలో తొక్కి
నది దాటిన పిదప బోడమల్లయ్యలను చేయాలనుకుంటే
పప్పులో కాదు నిప్పులో కాలేసినట్లే కబడ్దార్‌!
పోడు రైతుల తీవ్రాగ్రహానికి శలభాలవ్వాల్సిందే !
పిడికిళ్ళు బిగించి కొడవళ్ళు పట్టినవాళ్ళే
తమను తాము కాపాడుకునే ఎర్రజండాలౌతారేకాని
నమ్మిన నేల తల్లిని మాత్రం వదలరు!
అమ్మకోసం ప్రాణాలనైనా ఫణంగా పెట్టి
అటవీహక్కును కాపాడుకుంటారేకాని
అధికారపక్ష అహంకారానికి సమాధికట్టి
సాగనంపక పోరు జాగ్రత!
ఇది మీ ''పోకడ''లకు అద్దంపట్టే పోడు పోరు
ఇది మీ ''పోకదల''కు అద్దంపట్టే పోడు పోరు

Friday, June 17, 2016

కపిల రాంకుమార్‌ \\ వృక్షో రక్షతి \\

కపిల రాంకుమార్‌ \\ వృక్షో రక్షతి \\
పూల చెట్లు పండ్ల చెట్లు యింటికేమొ అందం
సామాజిక అడవులు రాష్ట్రానికి అందం
గులాబీల అందం మరుమల్లెల మకరందం
ఆనందం విల్లివిరియ బృందావన జీవనం
చెట్టునీడ విశ్రమించ వేపచెట్టు మెరుగు
ఆరోగ్యం సంతరింప అరటి జామ మేలు!

నీలగిరి సుబాబులు ఈ నేలలోన యెదుగు
వంటచెరుకు పశుగ్రాసం ప్రతియింట మిగులు
డబ్బులోటు సర్దుబాటు - గిట్టుబాటు కాగలదు
గట్ల కోయు మట్టినింక జారకుండ కాపాడు!
గాలిపీల్చి ఆరోగ్యం - పూలు ముడిచి ఆనందం
ఆడుకునే పిల్లలకు చెట్టునీడ ఉయ్యాలలు
చెట్లు నరికి, కాల్చి వేసి - కాలుష్యం పెంచబోకు
రాబోవు కాలానికి వర్షాలే దూరమగును
సమతుల్యం కాపాడగ - పచ్చదనం విప్పారగ
యింటి చుట్టు ఊరు ఊరంతా ముచ్చటగ చెట్లు పెంచు!

Monday, June 6, 2016

'' కవిత్వంలో కొత్త అంశంపై మూడో స్వరం ఆహ్వానించతగినదే ''


'' కవిత్వంలో కొత్త అంశంపై మూడో స్వరం ఆహ్వానించతగినదే ''

థర్డ్‌జెండర్‌ పై తెలుగు సాహిత్యంలో కవితా సంకలన రూపంలో ఇంతవరకు ఎవరూ ప్రాచుర్యం చేయలేదు. బహుశ: రచించివుండరేమో కూడ .అటువంటిది ఖమ్మానికి చెందిన   కంచర్ల శ్రీనివాస్‌, సుభాషిణి తోట సంయుక్తంగా ఒక సంకలనం '' థర్డ్‌ వాయిస్‌ '' పేర వెలువరించడం, అహ్వానించతగ్గది. ఆ సంకలనం నేను పరిచయం చేయటం ఒక కవిత్వంలో  కొత్త  ఒరవడికి పెద్ద పీఠం వేసినట్లే నని ప్రముఖ కవి, సాహితి
విమర్శకుడు డా. సీతారాం పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా తెలంగాణ సాహితి నెలనెలా నవకవనం ప్రథమ సమావేశం స్థానిక మంచికంటి భవన్‌లో అధ్యయన వేదిక నిర్వాహకుడు కపిల రాంకుమార్ అధ్యక్షతన జరిగింది. మువ్వా శ్రీనివాసరావు , డా. సీతారాం, కె. ఆనందాచారి,కెన్నెగంటి వెంకటయ్య, పాల్గొన్న సమావేశ ప్రారంభంలో ఇటీవలే మే 24 న మరణించిన ప్రముఖ అభ్యుదయ వాది, అనువాదకుడు నీరుకొండ హనుమంతరావు మృతికి సంతాపం ప్రకటించారు. కిషన్‌ చందర్‌ నవలను తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిన గొప్ప కవిగా వారిసేవలను స్మరిస్తూ వక్త్రలు మాట్లాడారు.

ఈ సాహితీ సమావేశంలో కంచర్ల శ్రీనివాస్‌, సుభాషిణితో సంయుక్తంగా వెలువరించిన ''థర్డ్‌ వాయిస్‌ '' కవితల సంకలనాన్ని  మువ్వా శ్రీనివాసరావు ఆవిష్కరించగా, డా. సీతారాం పరిచయం చేస్తూ '' ఎన్నో రకాలుగా భిన్నమైన కవితలు క్లుప్తంగా, ఆప్తంగా, ఆర్దంగా ఆలోచింపచేసేవిగా వున్నాయన్నారు. ఇలాంటి కవిత్వాన్ని కాని, ఇలాంటి వ్యక్తుల గురించిగాని తలచేవారు చాల తక్కువ.  సమాజంలో పాతుకుపోయిన వివిక్ష వలన  ఈసడింపబడే  వారి జీవన విధానం, బాధలు, గాథలు, ఆర్తిని చిన్న చిన్న కవితలుగా మలచి రెండు పార్శ్వాలుగా ఇద్దరు కవులు మనముందుంచడానికి సఫలమయినట్టే. అందరూ చదవండి వారిగురించి తెలుసుకోండి. ఆరికి సమాజంలో ఒక గౌరవ స్థానం వుందని గుర్తించండని అంటూ
రచయితలు ఇంకా కొద్ది శ్రద్ధ తీసుకుంటే ఇదిగొప్ప కావ్యమనడానికి సందేహంలేదని అన్నారు. అసలు ఈ ప్రయత్నమే అభినందనీయమని అన్నారు. కవితలలో ఒక ధర్మాగ్రహం వుంది. అది పలు ప్రాంతాలలోకి విస్తరించాలి. అన్నారు. మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకరి కవిత్వం స్త్రీ సమస్యలపైన, ఒకరి కవిత్వం అణిచివేతకు గురై ఆ మగవారి సమస్యలపైన, కవనం పంచుకుని రాసినట్లు అనిపించింది అన్నారు. సానుభూతికి,సహానుభూతికి ఒక స్పష్టమైన రేఖ ఈ కవిత్వంలో కనిపిస్తుందని అంటూ  కంచెర్ల శ్రీనివాస్‌ కవిత్వంలో కవితాగ్రహావేశం కొట్టొచ్చినట్టు కనబ్డుతోందని, సుభాషిణి కవిత్వం కూడా ఆ స్థాయికి ఎదగాటానికి చేసిన ప్రయత్నం హర్షించతగినదేనని, మరింత కృషి చేయగలరనే నమ్మకంతో మనస్పూర్తిగా అబినందనలు తెలిపారు. ముందుమాటలో ప్రస్థాఇంచినట్లుగానే ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, బహుళ ప్రచారం అందిస్తామని, హైదరా్బాద్‌లో కూడ ఈ పుస్తక ఆవిష్కరణ పరిచయ సభ నిర్వహిస్తామని, తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనరు కె. ఆనందాచారి కవులిద్దరిని అభినందించారు.   తదుపరి ఇల్లందుకు చెందిన  బైరి ఇందిర రాసిన తెలంగాణా గజల్‌ కావ్యం కన్నెగంటి వెంకటయ్య పరిచయం చేసారు. తెలంగాణ చరిత్ర నేపథ్యంగా కవిత్వంలో యిమడ్చటం కష్టమీన ప్రక్రియ అని, అందునా గజల్‌ రూపంలో తేవడం మరింత క్లిష్తమైనదని, అలాంటి ప్రక్రియను ఆసాంతం విజయవంతమయేలా   మహిళా గజల్‌ రచయిత్రిగా ఒక చరిత్రను గ్రంథస్థం చేసిన ఘనత తెలుగు రాష్ట్రాలలో ఇందిరకే ఆ స్థానం దక్కుతుందని అన్నారు. తెలంగాణ సాహితి ప్రతినెల నెల నెలా నవకవనం పేర నిర్వహించే కార్యక్రమంలో కవితా పఠనం, విశ్లేషణ, కొత్త పుస్తకం పరిచయం, విశ్లేషణ,   సాహిత్య ప్రసంగాలు క్రమం తప్పకుండా ప్రతి నెల మూడవ ఆదివారం జరుగుతాయని, ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని కె.ఆనందాచారి అన్నారు. చివరిగా సుభాషిణితోట, ఇందిర, కంచర్ల శ్రీనివాస్‌లు రచయతలుగా ప్రతిస్పందించారు. ఈ కార్యక్రమంలో
కటుకోజ్వల రమేష్‌,ఇబ్రహీం నిర్గుణ్‌, తాళ్ళూరి రాథ, సంపటం దుర్గా ప్రసాదరావు, రాచమళ్ళ ఉపేందర్‌. ఎం. సుబ్బారావు, జిగీష, తదితర సాహితీ అభిమానులు,పాల్గొన్నారు.  కంచర్ల శ్రీనివాస్‌ వందన సమర్పణ చేసారు.