Sunday, April 2, 2017

l5.(.ఆ) టుమ్రీలు

l5.(.ఆ)   టుమ్రీలు
1. మనసు రాయైతే......
మాటలు కాదు...
తాటలు తీసే
తూటాలౌతాయ్‌
2. తలలు బోడులైన.
తలపులు బోడులౌనా..
తలుపులు మూసినా
తలపులు ఆగునా
3.మనసు చైతన్యంగా
వుండాలే గాని
ఎన్ని భావాలైనా పలికిస్తుంది,
ఒలికిస్తుంది
4.మరచిపోయినవారికి
గుర్తుచేయగలం
కాని
గుర్తించటం మానేస్తే
మరలించటం ఎలా
5.నగవులే
ఎదురొస్తే
తగవులన్నవి
పారిపోవా!
6.పెదవులే
మరులైన
పృధివిలో
ఆనందమే!

||కపిల రాంకుమార్|||హేళనెందుకు హేవిళంబి ||

||కపిల రాంకుమార్|||హేళనెందుకు హేవిళంబి ||
దుర్ముకి ఏం వెలగబెట్టలేదని
వెక్కిరించకు –
చిట్టా విప్పుతున్నా కాసుకో
జనాల్ని ముప్పు తిప్పలు పెట్టి
ఒక్క నోటు రద్దుతో
అంతా అతలాకుతం చేసి
ఎందరినో పొట్ట పెట్టుకుంది!
ఎందరినో అనర్హుల్ని అందలమెక్కించింది
దీనమ్మ జీవితమని విసుగుపుట్టించింది
జనాల అంచనాలను తలకిందులు చేసి
తాను మాత్రం రయ్యిమని
ఆకాశాన విహరిస్తోందని ఉడుక్కోటం కాదు
నువ్వేమైన పెద్ద తోపువా చెప్పు !
పైకెళ్ళిన ధరల్ని దింపుతావా!
20 నిముషాలకొక సారి నిత్య కృత్యంగా
జరుగుతున్న మాన భంగాలని ఆపుతావా!
బడుగు జీవులకు బతుకులో
మెతుకు భరోసా యిస్తావా!
రాజకీయ అవినీతి కుంభకోణాలు
వరుస మరచిన సంబంధాల ఎన్నికల వివాహాల్ని
గాడితప్పిన ఆర్థిక వ్యవస్థని
ఏమైనా సరిచేయగల దమ్ముంటే
హేళన చేసేందుకు అర్హత వుంది
..
ఉత్తరాన జెండా ఎగరేసిందిగా
అని సంబరపడకు
ఉత్తర చూసి ఎత్తర గంప –
జొన్న పంటకు నానుడైతే
గత్తర బిత్తర రాజకీయ ప్రక్షాళనకు
జనం జెండలెత్తి తిరుగడతారు
ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా మీరందరు ప్రభవ మొదలుకొని
ఒక తాను ముక్కలే-ఒక గూటి పాటే పాడుతారు
కోయిలను స్వేచ్ఛగా గానం చేయనీరు
బాధలను చెప్పుకునేందుకు
జనాలకు అవకాశాం యివ్వరు
ఎందుకమ్మా పండుగలా వచ్చి
దండగమారి వరాలు కుమ్మరించి
అరచేతి వైకుంఠాలు చూపిస్తారు
ఇక్కడ ఎవరి చెవుల్లో కాబేజీలు లేవు
నీ దారి చూసుకొని గడువు కాగానే వెళ్ళు చాలు
నువ్వొచ్చి ఒరగ పెట్టేది లేదు
మా చింకి సొరుగులు నిండేది లేదు
ఏ పూటకాపూట శ్రమ చేయందే
కూలోడికి కడుపు నిండదు
మా వాడే అనుకున్న ప్రధానే
మన నెత్తిన
సరళను నెత్తిమీద పెట్టాను
ఒకరి తరువాత ఒకరు కొనసాగించారే కాని
గ్లోబలిని తరుమలేదు కదా
మరింత దానికి గాఢ పరిష్వంగంలో దూరిపోయి
సార్వభుమాధికారాన్నే తాకట్టుపెట్టి
ఒట్లేసిన జనాల సంక్షేమం గాలికొదిలి
గాలి గాళ్ళ దారిలో గాలిపటాలెగరేస్తూ
అంబారీలూగుతూ,
రియల్గా చెప్పాలంటే ఊడిగం చేస్తూ
పబ్బం గడుపుతున్నారుగా
ఏవరెట్ట చస్తే మాకెందుకు
రైతైనా, మగువైనా, చదువైనా
మా కుర్చీలు కదలకుంటే చాలనుకునే వాళ్ళే కదా
మీ అరవై మంది
వెళ్ళవమ్మా వెళ్ళు
ఎటకారాలు మాని నీ పని చేసుకో
జనాలకు కాక రాకముందే
జన నేతలకు కళ్ళు తెరిపించు సంతోషిస్తాం
పందుగ రోజు కషాయం ఉగాది నాడే కాదు
యుగాదిగా రోజూ సేవిస్తూనేవున్నాం
చాలు నాకు నీతో మాట్లాడే మక్కువలేదు
కలం కాండ్రించి ఉమ్మే ముందే
నీతులు చెప్పడం మాని వెళ్ళూ!
---------------------------------
29 మార్చి 2017 ఉగాది కవిత

వారసత్వం

ఈ లెక్కన బ్రొటన వేలే కాదు
ఏ అంగమైనా బలి ఔతుంది!
దక్షిణగానో,
అశాస్త్రీయ శిక్షాస్మృతిగానో
--
(ఆధిపత్యాలే మనువు వారసత్వం!)

|| కపిల రాంకుమార్‌ ||మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?||

మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?
'' అన్నదాతా సుఖీభవ ''
కంచం ముందు చేయికడిగినప్పుడల్లా
యాది చేసుకుంటున్నది సత్యం!
సుఖ జీవనమన్నది మృగ్యముతున్నదీ నగ్న సత్యం!!
**
వరైనా, మరేదైనా
దినదినగండం నూరేళ్ళాయుసులా
పంట కొరకెన్ని తంటాలో
పెంట వేస్తే పంటొస్తాది
అది సాగు ధర్మం
ఎరువులు బరువులై విత్తులకు
ఎత్తుల చిత్తులలో
మిత్తి మీదేసుకుంటే
చివరకు  నెత్తి మీద గుడ్డకూడ మిగలదేమి?
పుట్టుదలకొరకు కాళ్ళరిగినా
పుట్టినదానికి చెలక తనఖాపెట్టితేకాని
సాలిరవాలు దుక్కులు
అదును పదునుకోసం దిక్కులు చూడక తప్పదు
మడినారు వడలిపోవుండా
ఆకుల ఆశ్రమం కట్టి సాదుకుంటేనే
తరుణ వయసులో మొక్కనాటితేనే
పూత, పింది కాయలొచ్చేది
ఆకు ముడత రాకుండా సశ్యరక్షణ్ చేసి
కైలు చేయ కూలీల వెతుకులాట
మండే ఎండలు, ధరలు పోటీలో
తనూ కుటుంబంతో చేయి వేస్తేనే
ఎర్రబంగారం గంపల చేరి
కళ్ళంలో తివాసీగా మారేది.
రంగు పోకుండా పెళపెళ మన్నపుడే
మంచుపదునులో గోనెలోకి చేర్చాఅలి
మొదటి కాత కొచ్చేది నాణ్యమైనదే అయినా
మార్కెట్‌ మాయాజాలంలో రవాణా మోతతో
గిట్టేదెంతో, చేతిలో పడేదెంతో
గుమ్మంకాడే కాసుక్కూచున్న షావుకారి వాటాపోటే
మిగిలేనో లేక
మడిసి మాత్రమే కుమిలేనో ?
ప్రపంచంలో ఉత్పత్తీ అయ్యే సరుకులన్నీ
తయారీ దారుడే ధర నిర్ణయిస్తే
ఈ ధరలో మాత్రం రైతు ఉత్పత్తికికి మాత్రం
ధర నిర్ణయ హక్కెందుకు లేదో
ఆ పెరుమ్మాళకెరుక!
తులనాత్మక ఆదాయం రాక
తులాభారంలో మొగ్గలేక
తలాపున దీపమెట్టించుకునే
గతికి కారణమెవరు?
శ్మశానాలలో ఖాళి లేక పెరటిలోనే
భస్మమయ్యే వ్యవసాయ కమురు కంపు
ముక్కుకు సోకలేదా?
రైతు నిష్క్రమణలకు ఎవరిని శిక్షించాలో
పంట అనుభవదారులూ తేల్చి చెప్పండి
అన్నం తిన్నపుడె కాదు
నిత్యం సుఖీజీవుడుగా రైతును బతికించండి!
ఎర్ర బంగారం/ తెల్ల బంగారం
కళ్ళార చూడలేక కళ్ళు మూసేసుకుంటున్న
కల్లం యజమాని గోడు పట్టించుకోండి!

కపిల రాంకుమార్‌