Sunday, April 2, 2017

||కపిల రాంకుమార్|||హేళనెందుకు హేవిళంబి ||

||కపిల రాంకుమార్|||హేళనెందుకు హేవిళంబి ||
దుర్ముకి ఏం వెలగబెట్టలేదని
వెక్కిరించకు –
చిట్టా విప్పుతున్నా కాసుకో
జనాల్ని ముప్పు తిప్పలు పెట్టి
ఒక్క నోటు రద్దుతో
అంతా అతలాకుతం చేసి
ఎందరినో పొట్ట పెట్టుకుంది!
ఎందరినో అనర్హుల్ని అందలమెక్కించింది
దీనమ్మ జీవితమని విసుగుపుట్టించింది
జనాల అంచనాలను తలకిందులు చేసి
తాను మాత్రం రయ్యిమని
ఆకాశాన విహరిస్తోందని ఉడుక్కోటం కాదు
నువ్వేమైన పెద్ద తోపువా చెప్పు !
పైకెళ్ళిన ధరల్ని దింపుతావా!
20 నిముషాలకొక సారి నిత్య కృత్యంగా
జరుగుతున్న మాన భంగాలని ఆపుతావా!
బడుగు జీవులకు బతుకులో
మెతుకు భరోసా యిస్తావా!
రాజకీయ అవినీతి కుంభకోణాలు
వరుస మరచిన సంబంధాల ఎన్నికల వివాహాల్ని
గాడితప్పిన ఆర్థిక వ్యవస్థని
ఏమైనా సరిచేయగల దమ్ముంటే
హేళన చేసేందుకు అర్హత వుంది
..
ఉత్తరాన జెండా ఎగరేసిందిగా
అని సంబరపడకు
ఉత్తర చూసి ఎత్తర గంప –
జొన్న పంటకు నానుడైతే
గత్తర బిత్తర రాజకీయ ప్రక్షాళనకు
జనం జెండలెత్తి తిరుగడతారు
ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా మీరందరు ప్రభవ మొదలుకొని
ఒక తాను ముక్కలే-ఒక గూటి పాటే పాడుతారు
కోయిలను స్వేచ్ఛగా గానం చేయనీరు
బాధలను చెప్పుకునేందుకు
జనాలకు అవకాశాం యివ్వరు
ఎందుకమ్మా పండుగలా వచ్చి
దండగమారి వరాలు కుమ్మరించి
అరచేతి వైకుంఠాలు చూపిస్తారు
ఇక్కడ ఎవరి చెవుల్లో కాబేజీలు లేవు
నీ దారి చూసుకొని గడువు కాగానే వెళ్ళు చాలు
నువ్వొచ్చి ఒరగ పెట్టేది లేదు
మా చింకి సొరుగులు నిండేది లేదు
ఏ పూటకాపూట శ్రమ చేయందే
కూలోడికి కడుపు నిండదు
మా వాడే అనుకున్న ప్రధానే
మన నెత్తిన
సరళను నెత్తిమీద పెట్టాను
ఒకరి తరువాత ఒకరు కొనసాగించారే కాని
గ్లోబలిని తరుమలేదు కదా
మరింత దానికి గాఢ పరిష్వంగంలో దూరిపోయి
సార్వభుమాధికారాన్నే తాకట్టుపెట్టి
ఒట్లేసిన జనాల సంక్షేమం గాలికొదిలి
గాలి గాళ్ళ దారిలో గాలిపటాలెగరేస్తూ
అంబారీలూగుతూ,
రియల్గా చెప్పాలంటే ఊడిగం చేస్తూ
పబ్బం గడుపుతున్నారుగా
ఏవరెట్ట చస్తే మాకెందుకు
రైతైనా, మగువైనా, చదువైనా
మా కుర్చీలు కదలకుంటే చాలనుకునే వాళ్ళే కదా
మీ అరవై మంది
వెళ్ళవమ్మా వెళ్ళు
ఎటకారాలు మాని నీ పని చేసుకో
జనాలకు కాక రాకముందే
జన నేతలకు కళ్ళు తెరిపించు సంతోషిస్తాం
పందుగ రోజు కషాయం ఉగాది నాడే కాదు
యుగాదిగా రోజూ సేవిస్తూనేవున్నాం
చాలు నాకు నీతో మాట్లాడే మక్కువలేదు
కలం కాండ్రించి ఉమ్మే ముందే
నీతులు చెప్పడం మాని వెళ్ళూ!
---------------------------------
29 మార్చి 2017 ఉగాది కవిత

No comments: