Thursday, March 27, 2014

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం||

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం||

పదవి రాదని - పరువు కోసం 
ప్రజల సైతం- మభ్యపెట్టి
లాభ నష్టపు - లెక్కలేస్తూ
గోతికాడి - నక్కలాగ
అదునుకోసం - ఎదురుచూసే
దొంగచూపులు - పట్టుకుని
చేరేదీసే - బుజ్జగింపులు .1

ఇంతకాలం - అంటకాగి
కొంతమూల్యం - వెనకవేసి
కంటకాలను - తాళలేక
సొంత గూటిని - కూల్చివేయ
పరుల పంచకు పరుగులిడుతు
గొర్రె దాటు సాకుల వెన్నుపోట్లు! .2

తెలిసి తెలిసి బూదిలోనె
పడుకొనే కుక్కవోలె
ముక్కచూసి తోకవూపులు
మొక్కవోని నమ్మకాలతో
చొంగకార్చె కేతిగాళ్ళు
ఎన్నికల కలలలోనే
పగటివేషగాళ్ళు
ఎన్నికలవేళలోనే
మన్నికైన నృత్యాలు
ఖర్చులేని వినోదంనీలి చలన చిత్రం!
కొత్తబిచ్చగాడు
పొద్దెరుగని చందాన
ఎక్కే గుమ్మం - దిగే గుమ్మం!
ఎక్కడో పడతాడు
తాతీసిన గోతిలో
కోలుకోలేని మచ్చలా!
మిగిలిపోతాడు! 3.

ప్రమాణాలు పాటించడు
ప్రణామాలు పెడుతుంటడు!
పరిణామాలూహించడు
పరిమాణమే హద్దంటడు! .4
నే చెప్పింది వేదంనన్ను అనుకరిస్తే పాపం!
మీరెట్టపోతే నాకెందుకు
అడ్డదారైనా సిగ్గువదిలైనా
గద్దెక్కటమే నా గురి!
తెగ బొక్కటమే తదుపరి! .5

చొక్కా మార్చటం
చక్కగా యేమార్చటం
చెక్కభజన చేయటం
తార్చైనా కుర్చీ ఎక్కటం!
రానివాడికి చోటులేదు
రాక్షసత్వం అబ్బనోడికి
రాజకీయ మనుగడుండదు! .6

27.3.2014

Friday, March 21, 2014

ఎవరు? అమ్మ కొడుకు||

కపిల రాంకుమార్|| ఎవరు? అమ్మ కొడుకు||

మానవ జన్మ మహత్తరమైనదని
వచిస్తూనే తోటి మానవులకు
ద్రోహం చేయడమేమిటి?


అక్షరాలను నేర్చిన పాఠశాలనే
పాంథశాలగానో, పానశాలగానో మార్చటమేమిటీ?
గురువులకే వంగి నమస్కరించిన వాడే
పంగనామాలెట్టడమేమిటి?

ప్రజల మద్దతుతో పదవులందుకొని
ప్రజలను నట్టేట ముంచడమేమిటీ?
అమ్మ పాలు కమ్మగా తాగి
రొమ్ములు కోసే నైజమేమిటీ?
గ్రామస్థాయి నుండి పార్లమెంటు మెట్లెక్కి
గ్రామసింహ స్థాయికి దిగజారుడేమిటి?
అంటే వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడేనా?

సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పక్షాన అత్యున్నత స్థాయికెదిగి
చొక్కా మార్చిన చందాన పార్టీలు మార్చి
నిన్న పొగిడి,
నేడు తెగనాడు వాడు
లం........కొడుకు కంటె హీనమగుటేమిటి?

చెట్టుపేరు చెప్పుకొని,
తాతల ప్రవరలు చెప్పుకొని
పబ్బం గడపటానికి ఈ వేదికే దొరొకిందా!
నిత్య కృత్య రాజకీయ వ్యభిచారమాచరిస్తూ
నికృష్ట బతుకులో
పందిలాగ బురదలో పొర్లుతూ
నీతి సూత్రాలు వల్లించుటేమిటి?

ఓటేసే ప్రజలు దేవుళ్ళంటూ దేవురించి
గట్టేక్కిన పిదప గద్దెక్కి వాళ్ళ
కూడు, గూడు, గుడ్డ గుంజుకుని
వివస్త్రులుగా, నిర్వాసితులుగా, ఆకటి కేకలకెరచేయుటేమిటి?

ఎత్తిన జెండా కడకంటా
మోయండం గొప్ప!
చచ్చిన పిదప కప్పించుకునే
గౌరవం పోగొట్టుకుంటే ఎలా?

ఇది రాజకీయమా?
అరాచకీయమా
''రా''క్షసంగా ''జ''నాలకు ''కీ''డుచేయు ''యం''త్రాంగ నైపుణ్యంతో
పదవీ కామ ప్రకోపాన
ప్రతాపాలు చూపువారు లం............కొడుకులు!

21.3.2014

|\అక్షర క్షిపణి|\

కపిల రాంకుమార్|\అక్షర క్షిపణి|\
ఓ అక్షరానికి మరో అక్షరం పేర్చటం కాదు
అది క్షిపణిలా పేలినపుడే కవిత్వం!
పళ్ళగొర్రుతో దమ్ము చేసిన చేలో వరినాట్లు
చదరంగపు గళ్ళున్నట్టుండాలి!
గాలికి వూగే జొన్నకంకులమీద వాలిన పిట్టలాగుండాలి
మబ్బులను అహ్వానిస్తూ ఆకాశంలో విన్యాసం చేసే తూనీగల్లాగుండాలి!
కొండరాళ్ళ మధ్య సెలయేటి సవ్వడిలా
నాట్యమయూరి సిరిమువ్వల ఝరిలా
యుద్ధభేరీ నినాదంలా వుండాలి కవిత్వం!
నైపుణ్యం సంతరించుకున్న శిల్పంలా
విప్లవ శంఖంలా
వసంతకాలపు వెచ్చని సూర్యోదయంలా
శారద రాత్రుల మలయ మారుతంలా
కొబ్బరిచెట్టునీడలో వాల్చిన పడకుర్చీలా
గండుతుమ్మెద రెక్కల సవ్వడిలా
పొగరెక్కి పొలంగట్టుమీద రంకేలేసే ఒంగోలు గిత్తలా!
ఎలకోయిల మధుర గానంలా!




జామాకు వగరులా!
వేపాకు చిగురు అనుపానంలా!
చెరుకుపానకంలో అద్దుకునే మినప రొట్టెలా!
రోమాంచిత సాహితీ స్పర్శలా!
వీర తిలకం దిద్దే పత్నిలా!
ధైర్యపు  భుజంమీది సంధించిన ఆయుధంలా!
శత్రు స్వప్న  సింహంలా !
జతగూడే అక్షరమే జతగాడౌతుంది!
పదాలతో పదాతిదళానికి మొనగాడైన అధిపతౌతుంది!
అసమర్థిని ఎంపికకు విరోధి అవుతుంది!
సమర్థునికి జయకేతనమౌతుంది!
నిత్య ప్రకాశ సత్యమై
నిబద్ధత కలిగివుంటుంది!
జన చైతన్య వికాసమై
ఎగిరే ఎర్రజెండాలా
భూతకాలపు జల్లెడై
వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ

భవిష్యత్తరుణ పతాకమౌతుంది.!

సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక |

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక ||
ప్రతినెల మూడవ ఆదివారం సాహితీ స్రవంతి అధ్యయన వేదిక సమావేశం బి.వి.కె.  గ్రంథాలయంలో కపిల రాంకుమార్ మాట్లాడుతూ కవిత్వం - శిల్పం అధ్యయనంలో భాగంగా సుధామ వ్రాసిన  చిత్రగ్రంథి సంకలనం నుండి వివరన అనే కవితను  వినిపించారు. ఈ సమావేశం కపిల రాంకుమార్ అధ్యక్షత వహించగా డా.పొత్తూరు వేంకట సుబ్బారావు అతిథిగా విశ్లేషణ చేయటానికి, చర్చను కొనసాగించటానికి కన్నెగంటి వెంకటయ్య, రౌతు రవి వేదిక అలంకరించారు. చర్చను ప్రారంభిస్తూ డా.సుబ్బారావు గారు సుధామ కవిత్వం చిత్రగ్రంథి అనేపేరే శిల్పానికి సంబంధించినదని, శ్రీహర్షుడు  తన హర్ష నైషధంలో గ్రంథిస్ అనే పదాన్ని ఉపయోగించాడని, అది యోగవిద్యకు సంబంధించదని తెలిపారు. కవికి ప్రతిభ, ఉత్పత్తి పుష్కలంగా వున్నపుడు అద్భుతమైన కవిత్వాన్ని సృష్టిస్తాడని, లోక దృష్టి, లోక స్వభావం తెలుసుకోటం ద్వారానే అటువంటి అసమాన సృజన జరుగుతుందని తెలిపారు. పఠన, పాఠనం  ద్వారానే  సాహిత్యాన్ని సృష్టించకలుగుతాడని తెలుసుకోవాలన్నారు. సంవిధానం(శిల్పం)లో శ్రీశ్రీ దిట్ట. 
పద లక్షణాలు సుష్టుగా ఉపయోగించగలనేర్పరి కాబట్టి ఆయన పఠన, పాఠనాన్ని బాగా అల్లగలిగాడు. బ్రహ్మ గ్రంఠి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి  అనేవి మూడు యోగానికి చెందినవి. ఒక కవి యొక్క పూర్వాపరాలు తెలుసుకుంటే ఆ కవి హృదయలోకి మనం వెళ్ళవచ్చు, రూపం, బాహ్యం రసం అంతర లక్ష్యణం. రూపం అనేది భావాన్ని బట్టి వస్తుంది. కవిత్వం లోకానికి అద్దం వంటిది. అందుకే లోకాన్ని కవి నిశితంగా పరిశీలించాలి. అప్పుడే వస్తువుకు తగ్గ సరియైన 
రూపాన్ని ఇచ్చినపుడే మంచి కవిగా రాణిస్తాడు. ఆశ్చర్య చకితులను చేసేదే చిత్రం అంటాము ( రూపమే శిల్పం కదా) నీది కాని విషాదం లేదా ఆనందాలను నీలో ప్రేరేపింపకలిగించడమే కవిత్వం, లేదా కవిత్వ గొప్పదనం.  ప్రతిభ కవికి, చిత్రకారుడికి, గాయకుడికి వుండాలి. Imaginations are two  అందులో ఒకటి primary రెండోది secondary .  ఆకారమును చూసి మోసపోకూడదని  అని మనం గుర్తించాలి. అందుకే కవి అనధికార శాసనకర్త అని
 కూడా నిర్వచించారు. జీవితం మీద ప్రేమను పెంచాలి కవిత్వం.   స్వాంతనమైన సాంత్వనము కలిగించాలి ( ఓదార్చే హృదయాన్ని) అంటూ చక్కటి సోదాహరణలతో వారి విశ్లేషణ ముగిసింది. కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ చిత్రగ్రంథి పై చక్కటి విశ్లేషణ చేసారు. మాకు తెలియని విషయాన్ని విడమర్చి చెప్పారు. చాల కొత్త విషయాలను కూడా సుబ్బారావు గారి ద్వారా తెలుసుకోగలుగుతున్నామని అంటూ కవి లక్షణాలు, కవిత్వ లక్షణాలు వివరించిన ర్తీరు బావుందని శిల్పంపైనే ఇవాళ చర్చ బాగ జరిగిందని అభిప్రాయం తెలిపారు.చర్చలో పాల్గొన్న సాహితీ స్ర్వంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి '' చిత్ర గ్రంథి ' పై చక్కటి విశ్లేషణ చాల బావుంది అంటూ '' మాక్సిమ్‌ గోర్కీ '' చెప్పినట్లు అవబోధనా శక్తి, బోధనాశక్తి ప్రతి మనిషిలో వుంటాయని, అవి మనిషి తనను తాను కాపాడుకోటానికి, పరిశీలనకు, మరింత లోతైన అవగాహనకు దోహదపడటాయని చెప్పాడన్నారు.   ఊహించటం,  అనుభూతిగా మార్చుకోటం, సత్యంగా ఆవిష్కరించడం ఎవరు నేర్పుగా చేస్తారో వారు తమ కవిత్వం ద్వారా లోకాన్ని ప్రభావితం చేస్తారని, జీవితం నవనవోన్మేషaగావుండే రీతిలోనే శిల్పానికి వుండే ప్రధాన్యత తెలుసుకొని బాగా అభ్యాసం చేయాలని, నిత్యం మారుతున్న సమాజాన్ని నిశితంగా పరిశీలించనిదే సజీవ సాహిత్యం రాదని తన చర్చను ముగించారు.  చర్చపై  సునంద,  సంపటం దుర్గా ప్రసాద్, బండారు రమేష్, డా. ఆంజనేయులుం ఎం. శేషగిరి,  శైలజ, బషీర్ మొదలగు వారు తమ తమ అభిప్రాయాలు చెప్పారు.  సంపటం దుర్గా ప్రసాదు వందన సమర్పణ చేస్తూ 31.1.2014 ఉగాది కవి సమ్మేళనం ఉదయం 10 గంటలకు నిర్వహించాలని అనుకుంటున్నామని. సమాచారాన్ని త్వరలో తెలియపరుస్తామని, సాహితీ అధ్యయన వేదిక ఈ సమావేశం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాత జరుపుకుంటున్న మొదటి సమావేశమని అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

Wednesday, March 5, 2014

జన విజయం: ఆయువు తరగని ఆకలి బూచి!

జన విజయం: ఆయువు తరగని ఆకలి బూచి!: బూచి..! పుట్ట్టల్లో,పిట్టల్లో,పువ్వుల్లో,నవ్వుల్లో కలిసిపోయి ఆడుకుంటూ..., గాలిలో,దూళిలో కలతిరుగుతూ, పావురంలా,పాలపిట్టలా ,గా...

|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! ||

కపిల రాంకుమార్|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! ||
రక్తం సూర్యుడ్ని ఆవిష్కరించి, చర్యల ప్రతిచర్యల పరిష్వంగంలో నేత్ర ధనుష్ఠంకారం చేసి, భారమితి తో తులనాత్మకం చేసి, మోహనమైన కవిత్వాన్ని భూనభోంతరాలు దద్దరిల్లచేసిన కవిత్వ సంపుటిని తన మాటలతో సంజాయిషి తనకు తానే యిచ్చి, కవి ప్రపంచాన్ని మెప్పించి, ఎందరో నూతన కలాలకు చక్కటి ఒరవడ్డి దిద్దే ఆంగ్లోపాధ్యాయుని తెలుగు కవితా విశ్వరూపం అలా ఓ చిన్న నేతిబొట్టులా కవితా భోజన ప్రియులకు అందిస్తున్నాను......
'' రక్తం /చుక్క
వీగిపోయి / చెమట
చుక్కగా రూపందింది
చెమట చుక్క్క తకెత్తదు!
ప్రశ్నించదు!
నమ్మకంగా పంజేస్తుంది ''
**
'' కాని
సిరా చుక్కవుంది చూశావ్
విద్యుదాగారంవిప్లవా వాసం!
సిరా చుక్క స్పర్శ
చెమట చుక్కని రక్తం చేస్తుంది
కల్తీ లేని కణకణలేని / నిప్పులాంటి రక్తాన్ని చేస్తుంది! '' అందుకే / రక్తం సూర్యుడు! రక్తం ప్రతిచర్య!
**
శివారెడ్డి ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టడం కోసమో, లేదా మెప్పు సంపాదించటానికో కవిత్వ రాయలేదు. తనని తాని చీల్చుకుని, మధించి, మదించి, విశ్లేషించి, దహించికొని, పుటం పెట్టుకొని, నికార్సయిన సమాధానంలా, ఒక నిజాయితీ నింపుకొన్న, ధర్మంగానే రాసానన్నారు. తాను నమ్మకుండా, ఆసాంతం దాని లోతు తెలుసుకోకుండా, ప్రలోభాలతోనో, ఊసుపోకో మాత్రం రాయలేదంటారు. తరిచి, శోధించి, పరీక్షించి, ఫలితం వస్తుందన్న నమ్మకం కలిగిన తరువాత కవిత్వంతో అడుగుల పిడుగులు కురిపించారు. తన చిన్నతనంలో పడిన జీవన వాస్తవాల ఒడుదుడుకులను, బాల్యంలోని అన్ని అవస్థలను మరిచిపోలేదు కాబట్టే, ఆ ప్రభావం తన కవిత్వంలో పారదర్శకంగా చూపించకలిగారు. అమ్మ గతించిన బాధకాని, పల్లెటూరి పిల్లగాడి సహజ భయాలు, ఆందోళనలు జ్ఞప్తికి తెచ్చుకుని, జానపదులు పాడిన కీర్తనలు, తత్వాలు, బుడబుక్కలవాని ఆటపాట, గారడీవాని జిమిక్కులు, తొలకరి వానజల్లుల్లో తడిసి జలుబు చేసిన రోజులు, పశులకొట్టంలోని పేద, గొడ్లు తొక్కిన గడ్డి, రొచ్చు, అక్కడక్కడ తాను చూచిన ఎత్తు అరుగుల వాకిళ్ళు, కిచకిచమని సవ్వడిచేసే పిచుకలు, తాడిచెట్ల విహారం, వాగుల్లోని యిసుకతిన్నెలపై కట్టుకున్న గుజ్జగూళ్ళు, బడికి వెళ్ళేరోజుల్లో చేసిన అల్లరి, పడ్డ వేదనలు, రాత్రుల్లో గుడిసెలో కిటికి వద్ద ఎగిరే మిణుగురుల వెలుగు, వెన్నెల రాత్రులు, ఉక్కపోతల మండువేసవి, కాలువల్లో ఈతలు, అనాధ బాల్యాలు పరిశీలనలు, ఏకాకితనాలు, కేరింతలు, ఏడుపులు, ఫిర్యాదులు, యెన్నో అంతర్లోకాన్ని గుర్తుతెచ్చుకుంటూ, వాటి తాలూక శకలాలు వెంటాడాయి కాబట్టే మనకు ఇలాంటి కవిత్వాన్ని అందించాడేమోననిపిస్తుంది. ఒక దశలో ఆంగ్ల కవులను చదివినా, అప్పకవీయం ఔపోసన పట్టినా, ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యాలను సమాంతరంగా సవసాచిలా నడిపినవారు శివారెడ్డి.అందులో అతిశయోక్తిలేదు. '' చర్య - ఇన్నాళనుండి చావిట్లోనేవుందట! పుట్టిన దగ్గరనుండి మేకుకు కట్టేయబడేవుండట!
కోడేదూడ!
బయట కట్టేద్దామని తీసుకొస్తుంటే ఓక గుద్దు గుద్ది ఎత్తిపడేసి దేశాలమీద పాడిందట!....
స్వేచ్చలో స్వేచ్ఛగా స్వేచ్చకై ....
కట్టెయటమంటే - తెంపుకుపొమ్మనే....
అణిచిపెట్టటమంటే ఎదురుతిరిగమనే ....
అసంకల్పిత ప్రకార చర్యని చాల హృద్యంగా చెప్తారు '' చర్య '' లో.
పరిశీలనం, జ్ఞాన సముపార్జనం, తులనాత్మకం కవనానికి అవసరం ప్రపంచపు పోకడేమిటి? ఎటుపోతోంది? మానవుడి స్థితి గతేమిటీ? రష్యా యేమిటి, చైనా యేమిటి, రాజకీయాలమేటీ, అన్యాయాలేమీటి, నిజాయితీ యేమిటీ. ఆర్థిక సంక్షోభాలేమిటి, ధంస్వామ్యం యేమిటీ, భూస్వామ్యం యేమిటీ, చరిత్ర, రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, నష్టాలు, మతాలు, కులాలు, హిందూ, బౌద్ధ, జైన, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య బోధనలేమిటీ. రాహుల్ సాంకృత్యాయం ఎవరు? యిలాంటి ప్రశ్నలు, సందేహాలు తీర్చుకోలేకపోతే కవిత్వానికి సరుకెక్కెడిది? అందుకేనేమో అధ్యయనం అవసరమని నొక్కి చెబుతారు. ఆర్థిక విధానాలు మిశ్రమ ఆర్థిక విధానాలు, స్వాతంత్ర్యం ఎందుకు, దాని లక్ష్యం యేమిటీ ఇలాంటి పెక్కు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకబుచ్చుకోవాలి కదా కవి అన్నవాడు. క్రాంతి దర్శకుడు కావాలి కదా! సాహిత్యంలో వస్తున్న విభిన్న ధోరణులెందుకు ఉత్పన్నం అయ్యాయి. ఒక దానిని మించి యింకొకటా? ప్రత్యామ్నాయమా? వక్రధోరణా, అరసం యేమిటీ, విరసం యేమిటీ, కవిత్వాభివృద్ధికి యేది దోహదపడుతుంది. యిలా తర్జమ భర్జన పడితేనే నికార్సయిన సాధన ద్వారానే కలకాలం నిల్చేకవిత్వం తిక్కన లాగ గురజాడలాగ, వేమన లాగ శ్రీశ్రీ లాగ, ఆరుద్రలాగ, కుందుర్తిలాగ, సృజనచేసే ప్రజ్ఞాపాటవం అలవడాలంటే నిరంతర అధ్యయనం, అనుసరణ, అవగాహన యెంతో అవసరం అంటారు శివారెడ్డి.
భారమితి - కొలమానం కావొచ్చు - మరేదయినా కావొచ్చు కాని - '' కవిత్వానికి కాలం చెల్లిందనో, ఇది కవిత్వానికి కాలం కాదనో, అంతా స్థబ్దత యేర్పడిందనో.....చాలా మంది చేతులెస్తేసారట..... కాని శివారెడ్డి ఒప్పుకోరు కాబట్టే చేత్తో తలుపుమీద గుద్దటం కవిత్వం అంటారు. బోర్లా పడుకుని భూమిని వాటేసుకుంటే కవిత్వం, ముక్కుతో గాలిని వలేసి పట్టడం కవిత్వం, అప్రయత్నంగా చేయి మీసం మీదకి వెళ్ళి, గడ్డాన్ని సవరించుకోటం కవిత్వం, లేదా ఎర్రబడిన ఉదయం, శ్రీకాకుళ పోరాటం, జగిత్యాల జముకల కథ, శిర్సెత్తిన ధర్మపురి, అర్కాటి జిల్లాల్లో నినదించిన వాహకం కవిత్వం.... ముడి యినుము నల్లని రేయిని ఎర్రగా కాల్చి సాగ్గొట్టిన ఆయుధం చేస్తున్న అరణ్యమూ కవిత్వమే అంటూ చేతులన్నీ ఒక్కసారి లేచి ' ఇంక్విలాబ్ ' అంటే ఆకాశమంతా కవిత్వమే, ఈ విశ్వంలోని గాలి, భూమి కవిత్వమే! అంటారు శివారెడ్డి. ఏ విషయాన్నైనా కుండ బద్దలకొట్టి నిర్భయంగా చెప్పటం శివారెడ్డికి అలవాటు. తాను ఏ వామపక్ష పార్టీ సభ్యుడు కాకపోయినా శ్రీశ్రీ మాటల్లోంచి మంచి కమ్యూనిస్టుగాను, మార్క్సిస్టుగాను ఒప్పుకుంటారు. కమ్యూనిజం పట్ల యితర సభ్యులకంటే అపారమైన అవ్యాజ ప్రేమ, గౌరవం వుందని చెబుతారు.. తాను నమ్మాడు కాబట్టి ఒకరి మెప్పుకోసమో, ప్రేరేపించడానికో సంతోషపెట్టడానికో కాకూండా, అధ్యయన మాత్రాన మాత్రమే ప్రపంచ రాజకీయాల్ని లోతుగా పరిశీలించిన ఫలితంగానే తన వాజ్ఙ్మూలం ఇచ్చారు శివారెడ్డి.
మోహనరాగం ఆలపించన శివారెడ్డి
'' నాకింద పక్కలాగో / నావకింద నీళ్ళలాగో / కళ్ళకీంద నీడలాగో / ఆకాశంకింద పక్షి లాగో/ ఆకు సందుల్లో నర్తించే కిరణపుంజంలాగో / ఎండాకాల గాలి నుండి పైకి లేచినప్పుడు నువ్వుకనబడతావు/ వీధిలో ఎర్రటి సూర్యుడు రాయి నెత్తిమీద పడ్డప్పుడు నువ్వు వినబడతావు ''.....అంటూ తనకవితలో /'' చేదైనా వేపచెట్టు చిగురించిన వసంత కాలంలా నువ్వు అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురు వనంలా నువ్వు '' అంతకుముందు కవితలలో నిప్పులు కురిపించిన శివారెడ్డి లాలిత్యమైన పదాలను మోహనా! మోహనా! అంటూ కొత్త కోణం ఆవిష్కరించారు. '' దయలేని విధి నిర్వహణలో / రోజుకో అంగం తర్పణ గావించాలికదా /బతుకు మోహనా బతుకు! /బతకటాన్ని ఓ పెద్ద పాపకార్యం చేసిన / బతకటాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన / బతకటాన్ని ఓ బడా వ్యాపారం చేసిన ఈ సుందరమయ వ్యవస్థలో బతుకు మోహనా! బతుకు!........తన ఆశంసను వ్యక్తపరచటంలో సఫలీకృతుడైనారు. తన పరిమితులకు లోబడి ఉద్యమాలలో తన కున్న సంబంధాల పరిమితులకు లోబడి తన శక్త్యానుసారం, సమాజ సందర్భంగా తాను తనను వ్యక్తీకరించుకుంటానంటూ, చేసే ప్రయత్నమే శివారెడ్డి కవిత్వం! ప్రజలకేనిటో చెప్పేప్రయత్నమే తన కవిత్వం! తన జీవితం నుండి తనను విడదీసినా, ఈ సమాజం నుండి కాని కాలాన్నుండి కాని విడదీసినట్లైతే తన కవిత్వమే మిగలదని, తనకవిత్వమే కాదు అసలు యే సాహిత్యమూ మనజాలదు, మిగలదు. అందుకే వారి మాటల్లోనే
'' నా సోదరులకి కళ్ళిచ్చాను
నా కామ్రేడ్స్‌కి చేతులిచ్చాను
నా దేశానికి నా దేహానిచ్చాను
కాదు నాదేశమే నాదేహం ''
నేను తుడుం తయారు చేసే వాణ్ణి, నేను ఆయుధాలు తయారుచేసే వాణ్ణి, నేను పాటలు కట్టేఏ వాణ్ణి. మీ అనేకానేక కాంక్షలకి, ఆశలకి, ఊహలకి తగినట్టుగా పాటలు కట్టే వాణ్ణి
- నేను పాటలు కట్టే వాణ్ణి...కె. శివారెడ్డి. ''

ఇది శివమెత్తిన కె. శివారెడ్డి గురించిన స్వల్ప పరిచయం
4.3.2014