Saturday, May 31, 2014

కపిల రాంకుమార్ ||కొన్ని కటువులు ||

కపిల రాంకుమార్ ||కొన్ని కటువులు ||
**
అందం ఆస్వాదించు కాని
ఆబగా దోచుకోవాలనుకోకు!
నోటిని దురుసుగా వాడకు!
అదుపు తప్పి కలాన్ని వదలకు!
చేతితో కరవాలమైనా, కార్యస్పూర్తిగానైనా
చక్రం తిప్పటంలో అశ్రద్ధ వద్దు!
మగతనముందని విర్రవీగకు!
దేనినైనా ఉపయోగించే ముందు
అలోచనాల మథనం జరగాలి!
**
నిప్పుల వానలో తడవకుండా
తప్పించుకోగల మాద్రికుమారుడవైనా కావాలి!
రుధిర సంద్రపు ఔపోసన పట్టగల శక్తికి
అగస్త్యముని శిష్యరికమైనా వుండాలి!
జ్వాలాముఖ ప్రవేశం చేయడానికి
జలధరుని సౌదామినీ దుప్పటి వుండాలి!
అత్యాచారాల అభినివేశ నిపుణతలో
చుట్టాలకు, చట్టాలకు చిక్కని చక్కని
పథక రచయితవ్వకలగాలి
లేశమైనా అనావాళ్ళ జాగిలాలకి
చిక్కకుండా పూడ్చగల తవ్వుకోల
కలిగుండాలి !
**
పాలకుల పాలకడలి
పాపాల నివారిణి కాకూడదు
చాటుమాటు వ్యవహారాలు
చక్కబెట్టే వేశ్యాగృహంలో
అధికారపు మబ్బులచాటున
ఘీంకారాలన్నివేళల సాగవు!
**
చుండూరు నేరగాడు
నిర్దోషిగా బయటపడినా
జాతీయ రహదారిమాత్రం
ప్రమాదంపేర మరణశిక్ష
పొందలేదా? కాకతాళీయమైనా
కాకి మాత్రం పిండాలనే కోరుతుంది కదా!
**
31.05.2014

Friday, May 9, 2014

కపిల రాంకుమార్ || వేసవితో వాదం!||

కపిల రాంకుమార్ || వేసవితో వాదం!||

వేసవితో వాదం
అందరి తరఫున వకాల్త పుచ్చుకున్న
నేలతల్లికి వందనం!
'' ఎంత తీక్షణుడవైతే
క్షణం కూడ వ్యవధివ్వకుండా
నాలోని జలరాశిని ఆసాంతం ఆపోసనపట్టి
నీవొక్కడివే లాగేసుకుంటే యెలా?
జీవరాశుల దప్పిక రోదన చూడవయ్యా
సప్తారథగమనానంద పురుషుడా! ''
దాడికి లేదా వాదానికి దిగింది ధరిత్రి!

'' తాపానికి తాళలేక,
నా వేడికి నేనే చావలేక
దాహంతో ఆస్వాదించినా,
నా పిడికెడు పొట్టలో ఆ కడివెడు పట్టవుగా
వల్లూ చల్లబరచుకుని మిగిలినది
జలధరుడితో పంపుతాలే పో
ఈ లోగా యేం కొంపలు మునగవు! ''
అంటూ పొగరుగా వడగాలి జవాబు!

'' జనాలకు గొతెండుతోంటే ఎకసెక్కంగా వుందా
బాబ్బాబు పార్వతి చాలు గంగను విడువమనగానే
కరుణించిన శివుడే నయం!
నువ్వు మరీ పడమటి దేశపు గాలిసోకినవాడివికదా!
మరీ మండిస్తున్నావు! నిద్రించేది సహ్యాద్రిలోనే కదా!
గ్లొబరీకరణతో కిరణాలు ప్రపంచీకరించబడ్డయిగా!
ముసలీ ముతక, లేలేత మొగ్గలనీ పాడెక్కిస్తున్నావు ''
ధరిత్రీ ధర్నా మొదలెట్టింది!
**
దాని ప్రభావం -
మారుతం షికారు ప్రారంభమైంది కామోసు
ఆకాశంలో నల్లటి మబ్బు దబదబా గుండెలు బాదుకుంటోంది
ఎవరో చేసిన హడవుడికి నాకేమీ తెలియదన్నటు
బిక్కమొగమేసి, చెల్లాచెదరై
దారి తప్పి జారిపడితున్నాయి సన్నగా చినుకులు!
తలలూపుతూ తరువులూ కిలకిలనవ్వుతూ,
నేలంతా పులకింత మట్టివాసన నలుదిశలా
జీవరాశి కేరింత!
పోరాటం అనివార్యం ఎప్పుడైనా ఎక్కడైనా!
**
8.5.2014

Saturday, May 3, 2014

కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||


కపిల రాంకుమార్ ||నమోబాబుకళ్యాణం||
**
కంచు మోగునట్లు కనకంబు మోగదని
వేమన మాట అక్షరాలా నిజమని తెలుస్తుంది
న.మో. రాజకీయ రంకెలు ఆలకిస్తే.
దేశానికే కళంకమంటించిన హత్యాకాండలో
తడిసిన చేతులు రుద్రాక్షలతో
జతగటితే పవిత్రమైనట్టు
కాల్పనిక ఉదాహరణలే అభివృద్ధంటూ
ఎన్నికల ప్రచారాలపై ఊరేగుతున్నారు.
తిరుగులేని నాయకుడైనట్టు
స్వార్థపరుల అండతో
అస్తిత్వాన్ని కాపాడుకోగలమనుకోవడం,
వీరోక్తుల గాలి భజనలో పరవశించి పోవడం
అంతా ప్రహసన ప్రాయం.
పర్యటనా ప్రసంగాలలో
ఊకదంపుడుపన్యాసాలలో,
ఇదే వైరుధ్యం ప్రత్యక్షమవుతుంది.
రాష్ట్ర విభజన తమ వల్లనేనని చెప్పుకునే
ఈయన '' తల్లిని చంపి బిడ్డను బతికించాల '' ని
మాటలు చెప్పడం ఎవరిని నమ్మించడానికి?
మతాల మంటలు పెట్టడంలో ఆరితేరిన నేత
పదేపదే విభజన రాజకీయాలు తగవని
చేసే హితబోధ పుర్రెలతో భగవన్నామస్మరణ
చేసే కుహనా సాధువులా బహిరంగ రంగ ప్రదర్శన
చేస్తూ '' కోడలికి బుద్ధిచెప్పి అత్త తెడ్డు నాకిన చందమే ( చంద్రమే) '' కాదా?
**
అధికారం కోసం తహతహలాడుతూ
కాంగ్రెస్‌పై విమర్శించటం అర్థమైనదే కాని
ఆ సాకుతో మతతత్వాన్ని
బాబు నెత్తినెత్తుకోవడం ఎలా సమంజసం?
తెలుగువారి ఆత్మగౌరవం సంగతి
అటుంచి దేశం ఆత్మగౌరవానికే
ఇది తప్పనిసరిగా భంగకరం.
తనను విస్మరించినా పట్టుకు వేళ్లాడే దుస్థితి
అవకాశవాదమే కాదు
తప్పిదపు స్వయం కృతాపరాధం కూడ
ప్రభంజనం ఇక్కడ ఎంత ప్రహసన ప్రాయంగా
ముగిసేదీ త్వరలోనే విదితమవుతుంది.
**
25.4.2014 **/ 3.5.2014 ( ఒకానొక విశ్లేషణకు స్పందన)