Saturday, May 31, 2014

కపిల రాంకుమార్ ||కొన్ని కటువులు ||

కపిల రాంకుమార్ ||కొన్ని కటువులు ||
**
అందం ఆస్వాదించు కాని
ఆబగా దోచుకోవాలనుకోకు!
నోటిని దురుసుగా వాడకు!
అదుపు తప్పి కలాన్ని వదలకు!
చేతితో కరవాలమైనా, కార్యస్పూర్తిగానైనా
చక్రం తిప్పటంలో అశ్రద్ధ వద్దు!
మగతనముందని విర్రవీగకు!
దేనినైనా ఉపయోగించే ముందు
అలోచనాల మథనం జరగాలి!
**
నిప్పుల వానలో తడవకుండా
తప్పించుకోగల మాద్రికుమారుడవైనా కావాలి!
రుధిర సంద్రపు ఔపోసన పట్టగల శక్తికి
అగస్త్యముని శిష్యరికమైనా వుండాలి!
జ్వాలాముఖ ప్రవేశం చేయడానికి
జలధరుని సౌదామినీ దుప్పటి వుండాలి!
అత్యాచారాల అభినివేశ నిపుణతలో
చుట్టాలకు, చట్టాలకు చిక్కని చక్కని
పథక రచయితవ్వకలగాలి
లేశమైనా అనావాళ్ళ జాగిలాలకి
చిక్కకుండా పూడ్చగల తవ్వుకోల
కలిగుండాలి !
**
పాలకుల పాలకడలి
పాపాల నివారిణి కాకూడదు
చాటుమాటు వ్యవహారాలు
చక్కబెట్టే వేశ్యాగృహంలో
అధికారపు మబ్బులచాటున
ఘీంకారాలన్నివేళల సాగవు!
**
చుండూరు నేరగాడు
నిర్దోషిగా బయటపడినా
జాతీయ రహదారిమాత్రం
ప్రమాదంపేర మరణశిక్ష
పొందలేదా? కాకతాళీయమైనా
కాకి మాత్రం పిండాలనే కోరుతుంది కదా!
**
31.05.2014

No comments: