Thursday, August 21, 2014

కపిల రాంకుమార్||సామ్రాజ్యవాదం||

కపిల రాంకుమార్||సామ్రాజ్యవాదం||
మానవ రక్తపు రుచి మరిగినవాడికి
దేహమైనా, పార్థివదేహమైనా ఒక్కటే
వెచ్చగావుంటే చాలు!
దేశ,కుల,మత,లింగ, వయో తేడాలతో పనిలేదు
రక్త దాహమే తీరనికోరికైన ఒక వ్యసనం, అభ్యాసం!
చమురు దేశాలైనా
చివురు వనాలైనా
పాడిపంటల సుక్షేత్రాలైనా
ఖనిజ స్వర్గాలైనా
ప్రకృతి వనరుల అంబోధులైన ఒకటే లక్ష్యం
చమురు దొరికితే చాలు!
వేదాలు వల్లిస్తూనే
ఉపనిషత్తులు చెబుతునే
ధర్మ సంస్థాపనాయ అనే సాకు ఒక్కటి
మాస్కులా తగిలించుకుని
ఎవరి గుండె గదిలోకైనా వచ్చేస్తాడు!
సుడిగుండాలు సృష్టించడానికి
ఎవరి దేహంలోకైనా
ఏ దేశంలోకైనా
ఇట్టే సునాయాసంగా చొరబడతాడు!
రక్తదాహం తీర్చుకోటానికి!
ఆఖరికి ఖండాంతర ఆంతరంగిక వ్యవహారాల్లోకైనా దూరేస్తాడు!
తన జార తనాన్ని, జాణతనాన్ని
ప్రదర్శించి లోబరచుకుంటాడు!
తాయిలాలు అందించి, మభ్యపెట్టి
మానాలను మట్టుపెడతాడు!
వాడు చేసే యాగానికి, పాడు యాగికి
పిచుక నుండి నెమలి వరకు
పసికందు నుండి ముదుసలి వరకు
రూపసి నుండి కురూపి వరకు
బడి, గుడి, పంట మడి, తేడాలుండవు!
లేడికి లేచిందే వేళలా
కోరిక కలిగితే చాలు
ఎక్కుపెట్టిన విల్లులా
కార్చిచ్చులా అల్లుకుపోతాడు!
విధ్వంసం చేస్తాడు
కళేబరాల శయ్యపై పరుండి
క్రూరంగా సంగమించే మదోన్మాదుడిలా
రక్త స్నానం, పానం, చేస్తుంటాడు!
కాళ్ళకింద మెత్తలా స్తనాలదిండ్లు
మంచంకోళ్ళులా పిక్కటెముకలు
హుక్కా పీల్చేందుకు అమాయకుల పుర్రెలు
వాడి విశ్రాంతి గదిలో అలంకరణలు!
ప్రపంచ దేశాలలో వాడి వాడిగోరు గుచ్చని నేలలేదు
క్యూబా,వెనుజులా లాంటి లాటిన్‌ దేశాలు తప్ప!
చిత్రమైన పచ్చి నెత్తురు పత్తరులలో
దిగంబర సాధువులా అఘోరాలను మించిన
క్షుద్రపూజారిలా నరమేథం చేస్తున్నాడు
వాడికి చమురు కావాలి!
అందుకు ఎవరిదైనా ఉసురు తీయాలి!
తనకెవరూ ఎదురులేరని, రారని
ఒకే ఒక్క కండకావరం వాడ్ని నడిపిస్తున్నది!
చిన్నదేశాల ధిక్కార స్వరం వాడి చెవులకు సోకవు
కంటిలో నలుసుగా మాత్రం మిగిలిపోతాయి!
పక్కలో బల్లెంలా కలవరపెడుతుంటాయి!
వాడికి లెక్కలేదు
మెజారిటి ప్రపంచం వాడి మోకాలికి మోకరిల్లుతున్నా
మైనారిటీ ప్రజ కునారిల్లుతున్న సజీవ చిత్రం
కలచివేస్తున్న కలాలు కదలనివ్వని కర్కశత్వం వాడిది
కళలను సైతం అణగ తొక్కే నియంతృత్వం వాడిది!
ఇప్పుడిప్పుడే
అక్కడక్కడా అంకురించే ఏ చిన్న తిరుగుబాటు కణమైనా
విశ్వరూపం దాల్చి
వాడి ఆయువుపట్టుపై సంధించే సమయంకోసం
ప్రజా తంత్ర శక్తులు అప్రమత్తమవుతున్నారు!
బిందువునుండి సింధువుగా మారి బందూకులవ్వటానికి
వాడి రక్త దాహానికి అడ్డుకట్టావేయాలంటే
వాడి గొంతులో పచ్చి వెలక్కాయ వేయడమే1
అందుకు సిద్ధమవుదాం రండి
విందు పేరుతో రప్పించి
కందిగింజ పరిణామమైతేనేం
గొంతుకడ్డం తగిలేలా
గోతులోకి దిగేద్దాం! పదండి!

21-8-2014...మ. 12.30

No comments: