Friday, August 8, 2014

|| కపిల రాంకుమార్ || ఏది ఆదర్శమేది ఆచరణీయం?||

|| కపిల రాంకుమార్ || ఏది ఆదర్శమేది ఆచరణీయం?||

ఆదర్శాలు ఊరిస్తుంటాయి
ఆచరణలు జారిపోతుంటాయి!
మాట యివ్వటం తేలికే కాని
నిలబెట్టుకోటమే కష్టం!

పాలుతాగే పసివాడికి,
మీసాలొచ్చే కుర్రాడికి
బ్రహ్మచారికి కోరికలు
భౌతిక సహజ వాస్తవాలు!

అది ప్రేమ, కామము మధ్య,
కోరికా ఆకర్షణల మధ్య
బాధ్యతా, నిర్వహణల మధ్య
అర్థవంత అవగాహనలే ముఖ్యం!

'' వంశము నిల్పనే కదా వివాహం!''
ఒకానొక నియమబద్ధ బంధం
విశృంఖల కోరికలకు ఆనకట్ట!
దాంపత్య వ్యవసాయ చెలియలికట్ట!

గుంపు సంస్కృతినుండి
కుటుంబ సంస్కృతికి
పరివర్తన చెందిన తరుణంలో
నియమాల కట్టుబాట్ల పందిరి!

అటు యిటు తరాల అంతరాల
సంప్రదాయ సంస్కృతుల
సమ్మేళన సమతుల్యతల
అనుసంధాన విధానమే పెండ్లి!

కాలం మారలేదు
కొలమానాలే మారాయి!
ఋతువులు మారలేదు
క్రతువులే మారాయి!

నక్షత్ర రాశి గ్రహాల పేర
పెద్దలు కుదిర్చిన
కులాలవారి లగ్నాల్లో తేడాలు
అటు యిటుగా సూత్రాలన్నీ ఒకటే!

ముహూర్తానికే పెద్ద పీట
జీలకర్ర బెల్లం నెత్తిమీద పట్టు
తాళితో సహా మిగతావి
కాడితో సూత్రం వివాహ తంతే!

పొలాలవద్దో బిలాల వద్దో
పనిపాటల చదువుతోటల వద్దో
కనుల మెరుపుల సిగ్గుల మధ్య
నిరీక్షణా మాధ్యమొక సంకేతమే!

రాయబారాలుగా, ఉత్తరాలలో
సాంకేతిక పనిముట్ల హంసలా
మేఘ సందేశపు దూతలా
రుక్మిణి పంపిన అగ్నిద్యోతుడిలా
నిర్జన ప్రదేశాలు, సంకేత స్థలాలు
చాటుమాటు సందు సరసాలు
కబుర్ల గుబుర్లై, ముందుచూపుంటే
పెద్దలముందు, లేకుంటే రహస్య పెళ్ళి!

మనసు, మనువు ప్రధాన పాత్రలై
అర్థం, భావం, కార్యం కృషి
తరాజులలో తేడాలేకుంటేనే
ఉయ్యాలలూగేను సంసారం!

పందిట్లో జరిగినదైనా,
వేదికల దండలమార్పైనా
సహజీవనమైనా,
అనురాగాల ముడి
బంధాలకు ఒక దడి,
చట్ట బద్ధమైన హక్కులు
కలిగివుంటేనే సార్థకం!
లేదా నిరర్థకమే!

వంశవృద్ధి మొదలయ్యో,
వృద్ధులపై గౌరవం తగ్గో
ఆర్థిక ఒడుదుడుకుల పోట్లో,
అభిప్రాయాల చిటపటలో
చిరాకు కలిగించవచ్చు -
పరాకు తెప్పించవచ్చు
ఒకరొకరిపై నమ్మకం తగ్గొచ్చు -
కొత్త రుచులబారి పడొచ్చు
చెత్త దారులు వెతకొచ్చు -
వాదాలసెగ రగలొచ్చు
నిబ్బరంగా నిదానంగా
చేతనాస్పృహలో సమసేలాచేయాలి!

కోపతాపాలను స్వయం నియంత్రించుకోవాలి
విచ్ఛిన్నాలను నివారించుకోవాలి
పొరపాట్లు పునరవృతం కానీయకుండా
పునరనుసంధానం పొందాలి!
కాని పక్షం అంటూ వుండదు
చిత్తశుద్ధి, నిబద్ధతవుంటే!
కాదూ కూడదని పట్టుదలకు పోతే
చక్రాలు తొలగిన బండౌతుంది!

పూల పానుపులు, వెండి కంచాలకంటే
కటిక నేల పడక , మట్టిమూకుడు బువ్వలో
తృప్తిని, సౌఖ్యాన్ని పొందకలిగిననాడే
మూడుపూవులు ఆరుకాయలు!

ఆర్భాటాలకు అర్రులు చాచొద్దు
పొరుగువారితో పోల్చుకుని
చేతులు, జేబులు కాల్చుకోవద్దు
తదుపరి నలుగురిలో చులకన కావద్దు!

పెంపకాలలో, పంపకాలలో
అంపకాలలో కొంపలమీదకు
తంపుల తుంపర్లు పడనీకు
అతి చేసి, మనేది పడొద్దు!

విచక్షణ మరువకు -
వివక్షత చూపకు
విశ్లేషణ వీడకు -
వైరుధ్యం రానీకు!
గదిలోనైనా, విధిలోనైనా -
మనసు పెట్టి మసలు!
మదిలోనైనా, చేతల్లోనైనా -
కల్మషాలు దరి రానీకు!

వయసులో కలివిడిగా వున్నట్లే
సదా ముదిమిలోను
తోడు వీడక నీడలా వుంటేనే
పరిపూర్ణం, లేదా బతుకు ఉభయ భ్రష్టత్వం!

**
ముక్తాయింపు:
ఏ ఆదర్శం వల్లె వేస్తారో తెలీదు కాని
పామరుడి మాటపై చూలాలుని శీల పరీక్ష నెరపినవాడా?
ఆలుబిడ్డల తాకట్టుపెట్టిన మహారాజా?
వాస్తవం దాచి అమ్మమాటతో ఐదుగురు పతులైన వారా?
వళ్ళంతా కళ్ళతో కాముకుడైన వాడా?
తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడేనా ప్రశ్నకు జవాబీయలేని వాడా?
మునివాటికలో చేపట్టిన దానిని మరచిపోయే మహారాజా?
ఉద్యమాలకు అడ్డని నిస్సంతుగా పేరొందిన ప్రజానేతా!
మనకెవరు ఆదర్శం!!

No comments: