Tuesday, March 24, 2015

కపిల రాంకుమార్ || ఉద్యోగి ||

కపిల రాంకుమార్ || ఉద్యోగి ||
ప్రభుత్వ ఉద్యోగి కెన్ని ఆశలో
పి.ఆర్.సి.లో జీతం పెరుగుతుందని
అర్హతకు తగిన పదోన్నతి వస్తుందని
నిజాయితీకి పనిచేసి అధికారుల మెప్పు పొంది
ఆరోపణలు లేని పదవీ విరమణ కలగాలని
సజావుగా బతుకు నడపాలనుకుంటే
కుదరొచ్చు, కుదరకపోవచ్చు
కొన్ని స్వార్థ నాయకులవలనో
అవినీతి పాల్పడిరావటమో!
కొంత మంది అధికారుల నిర్లక్ష్యానికో
కక్కూర్తికో రావలసిన పదోన్నతి రాకపోవటమో! 
తీరా విరమణ వయస్సు పెంచడం ద్వారా
పదోన్నతి  రాకపోగా చేరిన పదవితోనే
దిగాలుగా దిగిపోవటమో
తలుచుకుంటే మనసు కలచివేస్తుంది!
పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు
గుండెలమీద కుంపట్లు
వయసు రీత్యా ప్రేమించే రోగాలు
ఎన్‌.జీ.ఓ బతుక్కి  ఎన్ని జీ.వోలు
ప్రాణం పోస్తోయో? తీస్తాయో?
గిట్టుబాటు ధరలేక, అప్పు తీర్చలేక
ఉరేసుకున్న రైతుల జాబిత సరసన చేరిన
నిర్భాగ్య జీవుల  గణాంకాలు ఏమైనా వున్నాయా?
హంస ఎగిరిపోతే దిక్కులేని పక్షులైన
కుటుంబాలెన్నో గమనిస్తుంటే
ఒకింత ఆశ్చర్యం మరొకింత నైరాశ్యం
ఏమో?  ఆధారపడ్డ కుటుంబాలు తెగిన గాలిపటాలేనా?
వారికి ఆసరా, అధారం ఎవరు?
24.3.2015

Tuesday, March 17, 2015

| జై తెలంగాణ సిరుల గిరుల కోన

కపిల రాంకుమార్ || జై తెలంగాణ సిరుల గిరుల కోన ||
జై తెలంగాణ – సిరుల గిరులకోన – జై తెలంగాణ – నదుల నిధులసీమ
వడివడిగా ఎదగాలి కలలన్ని నెరవేర – సకల జనులు మెచ్చేలా మా తెలంగాణ !
గలగల మంజీర పెన్‌గంగ ప్రాణహిత- ఇంద్రావతినాట్యాన జూరాల తుంగభద్ర
కిన్నెరసాని హొయలై ఉరకెత్తే గోదారై, – పాలేరుతొ మున్నేరుగా కృష్ణవేణి పరవళ్ళై !
శాతవాహన కాకతీయ బహమనీ కుతుబ్‌షాహీ – రాజ్యమేలిన నేలరా! వీరులకు పుట్టిల్లురా!
కవులకు కాణాచిరా నా తెలంగాణ – జానపద కళల నెలవురా నా తెలంగాణ
నల్లమల గిరుల లోయల సహజీవనాలు – పాపికొండల రమణీయ దృశ్యాలు
నల్లపసిడికి సింగరేణి నేల కొలువు – శైవ, వైష్ణవ బౌద్ధ జైనాల ఆనవాలురా!
చారిత్రిక సురవరం – సదాశివ సంగీతం – అచ్చ తెలుగు పాలకురికి సోముడు
హలం పట్టిన భాగవతకవి పోతన – పల్లెపదాల హనుమంతు సుద్దులు
ఆడుబిడ్డల బతుకమ్మలాటతో – బంజారడప్పుల రంగేళి హోలిరా
ఆదివాసీకూనలలరారు తల్లిరా – రేలపాటలతొ పులకించు నేలరా
ఏ యోధుని కదిపినా చాలు – బందగీ ఐలమ్మ త్యాగాల కతలు
నైజాము నెదిరించి సాగినా సమరం – ఒగ్గుకథలాగ కదలాడు కనువిందు
కాలాలు గడిచినా మారని బతుకుల – నీటి మూటల గత నేత చేతలు
అరువదేండ్ల పట్టుదల సాక్షిగా – రాష్ట్రమై తెలంగాణ అవతరించెరా!
నీటమునిగే ఆటపాటల నేల – సంకటాల బారిపడకుండ
గిరిపుత్రుల సంప్రదాయ గురుతులు – పదిలింగా నిలిచేలా
పథకాల మార్పుతో పరిసరాలు పరిమళించ – కాకుల తరిమి గద్దల మేపే లోక కంటక పద్ధతులాపి
పోలవరం పేర జనపదం నీటిపాలు కాకుండ – అనవతరం పచ్చదనపు పంట సిరులవాన కురిసేలా
గతకాలపు నష్టాలను దోషపు చట్టాలను – సవరించుకు ముందుకు సాగేందుకు
ఆశలు, తీరేలా విరామమెరుగక – అనునిత్యం పోరాడుట తెలంగాణ ఆన!
అమరుల త్యాగాలు మనమున నిడుకొని – బడుగుల బతుకువీణ కొత్తరాగాలెత్త
చేయి చేయి కలిపి చేవతనమూచూపి – నిర్మించుకుందాము మనదైన తెలంగాణ!
01.06.2014/5.6.2014

Tuesday, March 3, 2015

కపిల రాంకుమార్ \\ కాన్వాయ్‌ ఎర్రబడింది \\

కపిల రాంకుమార్ \\ కాన్వాయ్‌ ఎర్రబడింది \\
భవనారంభోత్సవానికి
బడిపంతుళ్ళ హడావుడి
మంత్రిగారొస్తారని
సచివాలయ వార్తవిని!
..
తెల్ల కొంగల గుంపు
బారులు తీరినట్లు
మల్లెదండలు
చేతబూనాయంట!
..
ఉదయభానుడు
పరుగులిడుతుండె
నడినెత్తిన వేడి
మంటలిడుతుండె!
..
ఆహారం మాట లేదు
అల్పాహారం ఊసులేదు!
దూపకు ఎండే గొంతులో
దోసెడు నీటికి దిక్కులేదు!
..
గదిలో తిరిగే ఫంకాలెన్నో
జగ్గుల్లో ఐసుముక్కలెన్నో
పిల్లగాళ్ళ కడుపులో ఎలుకలు
దూసుకొచ్చే సైరన్‌కూతలు!
..
గోడ కూలే గేటు విరిగె - కంచెదాటి దూసుకొచ్చె
చిర్రుమన్న బుల్లి బుర్రలు - కర్రువాతల కాలినట్టు
సత్తువలేక కూలి - కొన్ని కళ్ళు మూతబడె!
సోయతప్పి కాన్వాయి - తివాచీని ఎర్రబరిచె!
..
లబోదిబో గోలలు
కార్లన్ని ఆగిపోయి
రోడ్డంతా స్థంభించి
కొన్ని గుండెలాగి
కెమారాల జిలుగుల్లో
టి.వీ.లో స్క్రోలింగ్‌ల్లో
సమయాన్ని పాటించని
ఏలికల నిర్లక్ష్యానికి
పసిపిల్లలు బలైతే
బ్రేకింగ్‌ న్యూస్‌ కమ్ముకుంది పొగలా
పట్టపగలు పగపట్టిన మారణ సెగలా!
..
అట్టహాస సంబురాల నీడ
వికటాట్టహాస వికృతక్రీడ
అనివార్యం చేయటమెందుకు?
లాంఛనాల మిషతో చితులెందుకు?
..
రాజకీయదర్పాలెందుకో
ఎవరిమెప్పు కొరకు ఈ
తప్పుల కొనసాగింపు
ఎమిచ్చి వేదన ఆర్పుతారు?
..
ఏ తెలివిపొంది నేతలు
ఘోరాలు నివారించుతారు?
శేషప్రశ్నలా వి.ఐ.పి. దర్జాలకు
బలిపశువులా బడిపిల్లలు?
>>>*<<<<
3.3.2015.....(అప్పుడప్పుడు జరుగుతున్న ఘోరాలకు స్పందన )

·

Monday, March 2, 2015

కపిల రాంకుమార్‌ ||'' నిదానం ప్రధానం ''||

కపిల రాంకుమార్‌ ||'' నిదానం ప్రధానం ''||
వాళిద్దరు యిష్టపడి
నాలుగేళ్ళయింది!
అలా అంకురించిన స్నేహం
పొరపొచ్చాలు లేకుండా తాపీగా!
ప్రేమ బంధంగా మారింది!

ఇద్దరి వయసుల్లో వ్యత్యాసం వుండొచ్చు
చదువుల విషయంలోనూ అంతరాలుండొచ్చు
సంయమనం, సమభావన,
అనురాగం అభిమానం
కులాంతరాన్ని పక్కనపెట్టింది!
అంతరంగమాధురిమల్లో మునిగి తేలింది!
కొనసాగింఫులో
అడుగులు తడబడకుండా
పొరపాట్లు జరక్కుండా
మొదటి అంకం చేరుకున్నారు
గుడిలో ఒకరైయ్యారు దంపతులుగా!
**
ఒక పక్షంనుంచి పూర్తి మద్దతు
మరో పక్షంనుంచి పాక్షిక మద్దతు వల్ల
ఆ మౌనపుటంగీకారాలకు
తిరుగుబాటు చేయకుండా
మరింత ఓపికతో,
ఉభయ పక్షాల అంగీకారాల మీద భరోసా
పొందాలనే నిరీక్షణ మెచ్చుకోతగ్గది!
**
రెండు నెలల తర్వాత వివాహ నమోదు అయింది
రెండో అంకం సజావుగా సంభ్రమాశ్చర్యాలమధ్య
సందిగ్ధ పరిస్థితులమధ్య! నెర్వేరింది!
**
ఆరు నెలల తదుపరి పెద్దల, బంధువుల
సమక్షంలో ఓ ఇంటివారయ్యారు
ఈ కాల ప్రవాహంలో ఎక్కడ
తేడా వచ్చినా యిబ్బందే1
కాని అలజడికి కారణమయ్యే
ఏ కురుక్షేత్ర సంగ్రామానికి
గురికాకుండా
నిదానం ప్రధానమై
ఆ అనుసంధాన్ని
విడదీయలేని బంధంగా మారింది.
**
నాలుగున్నార వత్సరాల ప్రేమ చిత్రం
సూపర్‌ హిట్‌ అయింది!
*****
( విడుదల కాని చిత్రానికి ప్రోమో)
2.3.2015