Tuesday, March 3, 2015

కపిల రాంకుమార్ \\ కాన్వాయ్‌ ఎర్రబడింది \\

కపిల రాంకుమార్ \\ కాన్వాయ్‌ ఎర్రబడింది \\
భవనారంభోత్సవానికి
బడిపంతుళ్ళ హడావుడి
మంత్రిగారొస్తారని
సచివాలయ వార్తవిని!
..
తెల్ల కొంగల గుంపు
బారులు తీరినట్లు
మల్లెదండలు
చేతబూనాయంట!
..
ఉదయభానుడు
పరుగులిడుతుండె
నడినెత్తిన వేడి
మంటలిడుతుండె!
..
ఆహారం మాట లేదు
అల్పాహారం ఊసులేదు!
దూపకు ఎండే గొంతులో
దోసెడు నీటికి దిక్కులేదు!
..
గదిలో తిరిగే ఫంకాలెన్నో
జగ్గుల్లో ఐసుముక్కలెన్నో
పిల్లగాళ్ళ కడుపులో ఎలుకలు
దూసుకొచ్చే సైరన్‌కూతలు!
..
గోడ కూలే గేటు విరిగె - కంచెదాటి దూసుకొచ్చె
చిర్రుమన్న బుల్లి బుర్రలు - కర్రువాతల కాలినట్టు
సత్తువలేక కూలి - కొన్ని కళ్ళు మూతబడె!
సోయతప్పి కాన్వాయి - తివాచీని ఎర్రబరిచె!
..
లబోదిబో గోలలు
కార్లన్ని ఆగిపోయి
రోడ్డంతా స్థంభించి
కొన్ని గుండెలాగి
కెమారాల జిలుగుల్లో
టి.వీ.లో స్క్రోలింగ్‌ల్లో
సమయాన్ని పాటించని
ఏలికల నిర్లక్ష్యానికి
పసిపిల్లలు బలైతే
బ్రేకింగ్‌ న్యూస్‌ కమ్ముకుంది పొగలా
పట్టపగలు పగపట్టిన మారణ సెగలా!
..
అట్టహాస సంబురాల నీడ
వికటాట్టహాస వికృతక్రీడ
అనివార్యం చేయటమెందుకు?
లాంఛనాల మిషతో చితులెందుకు?
..
రాజకీయదర్పాలెందుకో
ఎవరిమెప్పు కొరకు ఈ
తప్పుల కొనసాగింపు
ఎమిచ్చి వేదన ఆర్పుతారు?
..
ఏ తెలివిపొంది నేతలు
ఘోరాలు నివారించుతారు?
శేషప్రశ్నలా వి.ఐ.పి. దర్జాలకు
బలిపశువులా బడిపిల్లలు?
>>>*<<<<
3.3.2015.....(అప్పుడప్పుడు జరుగుతున్న ఘోరాలకు స్పందన )

·

No comments: