Tuesday, March 24, 2015

కపిల రాంకుమార్ || ఉద్యోగి ||

కపిల రాంకుమార్ || ఉద్యోగి ||
ప్రభుత్వ ఉద్యోగి కెన్ని ఆశలో
పి.ఆర్.సి.లో జీతం పెరుగుతుందని
అర్హతకు తగిన పదోన్నతి వస్తుందని
నిజాయితీకి పనిచేసి అధికారుల మెప్పు పొంది
ఆరోపణలు లేని పదవీ విరమణ కలగాలని
సజావుగా బతుకు నడపాలనుకుంటే
కుదరొచ్చు, కుదరకపోవచ్చు
కొన్ని స్వార్థ నాయకులవలనో
అవినీతి పాల్పడిరావటమో!
కొంత మంది అధికారుల నిర్లక్ష్యానికో
కక్కూర్తికో రావలసిన పదోన్నతి రాకపోవటమో! 
తీరా విరమణ వయస్సు పెంచడం ద్వారా
పదోన్నతి  రాకపోగా చేరిన పదవితోనే
దిగాలుగా దిగిపోవటమో
తలుచుకుంటే మనసు కలచివేస్తుంది!
పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు
గుండెలమీద కుంపట్లు
వయసు రీత్యా ప్రేమించే రోగాలు
ఎన్‌.జీ.ఓ బతుక్కి  ఎన్ని జీ.వోలు
ప్రాణం పోస్తోయో? తీస్తాయో?
గిట్టుబాటు ధరలేక, అప్పు తీర్చలేక
ఉరేసుకున్న రైతుల జాబిత సరసన చేరిన
నిర్భాగ్య జీవుల  గణాంకాలు ఏమైనా వున్నాయా?
హంస ఎగిరిపోతే దిక్కులేని పక్షులైన
కుటుంబాలెన్నో గమనిస్తుంటే
ఒకింత ఆశ్చర్యం మరొకింత నైరాశ్యం
ఏమో?  ఆధారపడ్డ కుటుంబాలు తెగిన గాలిపటాలేనా?
వారికి ఆసరా, అధారం ఎవరు?
24.3.2015

No comments: