Wednesday, December 2, 2015

కపిల రాంకుమార్‌ || అస్తవ్యస్తమైన మనోచిత్రం ||

కపిల రాంకుమార్‌ ||  అస్తవ్యస్తమైన మనోచిత్రం ||
అక్కడకెళ్ళిన తరువాత
ఎందుకొచ్చానానని ఏడ్చాను,
మరుక్షణమే నిబ్బరించుకున్నాను
గతకాలపు మైలురాళ్ళను పాతిన
జిగినీదోస్తులెవరైనా
మాటల మరమరాలందిస్తారని!
నాలుగడుగులేసాను
నివ్వెరపోవటమే నా అంతు!
మామిడి చెట్టు కూలిపోయెంది
కొబ్బరిచెట్టు మాడిపోయింది!
శ్మశానంలో సమాధిలా పాత పెంకుటిల్లు!
తెలిసందప్పుడే కాలానికి ద్యాదాక్షిణ్యం లేదని
గొంతెత్తి ఆందోళన చేసినందుకు
కఠినచట్టపు చట్రంలో నలిగిపోయుంటారని
గ్రహించడానికి దాదాపు అర్థగంట పట్టింది!
ఎప్పుడూ కబుర్లాడుకునే చోట కాక
మస్తాను భాయ్‌ చాయడ్డాకాడికెళ్తేకాని
గతంలోని జెండా దిమ్మ పక్కనే
మరొక ఎర్రజెండా దిమ్మ కన్నీళ్ళెట్టుకున్న సవ్వడి
డికాషన్‌ బాయిలర్‌లో కుతకుత చప్పుడుకు
భిన్నంగా పలకరించింది!
అప్పుడుకాని లోకంలోకి రాలేదు!
అస్తవ్యస్తమైన మనోచిత్రాన్ని తొలగిస్తూ,
స్మారక స్థూపాన్ని చూసి విలపించడం కాదు
వారిలా మనమూ స్వరం వినిపించాలని
దిక్కులు పగిలేలా నినదించాలని
సందేశమిస్తున్నట్లనిపించి
పిడికిలి బిగించి, వందనం కావించి
కర్తవ్యం యేమిటో కనులముందు ఆవిష్కరించుకుని
కలానికిలా కలకలం సృష్టించే పనిపెట్టాను.
ప్రశ్నించడం
సమాధానం రాబట్టమే
మన లక్ష్యం కావాలి!
2.12.2015

No comments: