కపిల
రాంకుమార్
||కర్రుకాల్సి వాతెయ్యాలిరా తమ్మీ!!||
ఉద్యమం మాంచి-కాకమీదున్నపుడు
కుర్ర్కారుకు వెర్రెక్కించి
అరసేతి ఐకుంఠ పదవుల
పందేరం వెట్టి
తీరా ఒడ్డుచేర్నంక
దుడ్డుతిరగేసే
చెర్నకోలమోతేందిరా బాయ్!
సేతులూపుడు, తలూపుడుతో,మనం సేతులు
ముడువబట్టే
ఆ బాడ్కావునాకొడుకులు,
యిప్పుడు మాయమాటల్త
బోర్లాకొట్టిస్తున్నరుగదా
గారడీవోనిలెక్క మోళీ చేసి బెదిరిస్తున్నరేందే,
తాయాత్తు కొనమంటూ!
యింటనున్న నలుగురికి
పీటేసి మస్తుగా కుశాలుచేసుకుంట
చుట్టాపోల్లకి మాత్రం చెట్లకింది కాపురమెట్టమంటున్నరు
గదేమి యిచిత్రమోగాని,
శాటువు సెప్పినట్టు
కాకులకొట్టి గద్దలకేసిన తీర్ల
గోడదూకొచ్చినోన్ని
గద్దెమీద కూకోవెట్టి
పుట్టినసంది జెండామోసి
బుజం తీపుపెట్టి
అలమటించే మూగ జీవుల్ని
గడ్డికూడ విదల్చక
గదిమి తరిమికొట్టుడేంది?
అయినా నాకు తెల్వకడుగుతా
మన జనం మరీంత పిచ్చోళ్ళైతన్నరేందే?
నారుకూ నీటైన గింజలేకపోయినా,
నోటికాడికొచ్చేలోగా
గంజి దాకలి బళ్ళుమన్నా
దొరక్కదొరికిన ఆందానితో
అప్పు తీర్చేలోంగా
మిత్తి ఆసాంతం కట్టలేదని
కత్తిపెట్టి జులుంచేస్తావుంటే
రైతన్న దీపమైతన్నాడేందే?
కడకంటా సాగాల్సిన ఎవసాయం
మద్దెలోనే బుడగ మాదిరి పేల్తావుంటే
పల్లెల్లో సావు డప్పులు – జాతరమాదిరి కొనసాగుతుంటే
కళ్ళుండి సూడలేని,
చెవులుండి యినలేని
సర్కారిదిల్చే సాయానికీ
యెగనామమెట్టడానికెన్ని సాకులో
దీనమ్మ రైతు బతుక్కిదా నాయళ్ళిచ్చే
యిలువ?
సకలం యిచ్చిన్నమై మట్టిపాలౌతుంటే యాగాలంటరేందివారి!
యెనకటికెవడో నీరోరాజుమాదిరి ఫిడేలు
సంబురాలెంది...
గిసుమంటివి
మతుండిచేసే పనులేనా?
అందుకే యీయేల పతోడికి
కిందపైనా తెగకాల్తోంది వారి!
ఒకరినుండి ఒకరికి బుకారోలె
రాజుకుంటేకాని బడబాగ్నివుట్టదు!
మనమిప్పుడు కేకలేసుడుకాదు
గద్దెకిందకాకవెట్టాలె!
నేల తల్లి దద్దరిల్లెలా,
కూష్మాండం బద్దలయ్యేలా
కొమ్ము బూర, డోలు డప్పు,కంజీర మద్దెల
మిర్మిట్ట్లుకొలొపేలా మోగాల మార్మోగాల!
తిండి మీద ఆనంటడొకడు!
ఉండనీకి నీడలేదంటడొకడు!
ఊర్కుంటే కాదు
ఉరికించి గదమాలె!
వూరిపొలిమేరల్ల పోరుజెండాలెత్తాలె!
No comments:
Post a Comment