Saturday, January 23, 2016

కపిల రాంకుమార్‌ ||హెచ్చరిక కావాలి||

కపిల రాంకుమార్‌ ||హెచ్చరిక కావాలి||
ఎందెందు వెతికినా అందందె కలదు వివక్ష
నిత్య కృత్యమై - నగ్న సత్యమై
వికటాట్టహాసం చేస్తూ
దక్షయజ్ఞంనాటి సతిని 
నరికిన బీభత్స తాండవ శివుడిలా
కరాళనృత్యమై
బడుగులును బడితపూజచేసి
అడుక్కి తొక్కాలనే దమనకాండ
అనునిత్యం పతాకశీర్షికై
ఎగురుతూనేవుంది!
మనం తిప్పికొట్టిన ప్రతీసారి
మరోరూపంలో
భూతంలా,ప్రేతంలా
నిశీథిలోనేకాదు
పట్టపగలే పగపట్టి
పిచ్చికుక్కలా స్వైర విహారం చేస్తూ
బూజుపట్టిన ధర్మాలను వల్లెవేస్తూ
కుంటిసాకులు చెబుతూ
అభూతకల్పనల ఘనాపాఠీలై
పలకవర్గ కొమ్ముకాసే బాకాలే కాదు
కొలువవున్న బాబాలు సైతం
మనువును వకల్తాపుచ్చుకుని
దాడిచేస్తూనేవున్నారు!
నిత్యాగ్నిహోత్రంలా
దహనకాండ నెరపుతూ
దమననీతి పాటిస్తూ
ఈ దగుల్బాజీలు
జబ్బలు చరుచుకుంటూ
మమ్మల్ని మీరేమీ పీకలేరన్నట్లు
గప్పాలు కొడుతూనేవున్నారు!
శవాలుగా మారుతున్న మనవాళ్ళసాక్షిగా
ప్రతి సవాలు విసరటమే మన ధ్యేయంకావాలి!
మనతిండి తిననివ్వని
మనం మనంగా బతకనివ్వని
చదువుకోనివ్వని
పుండాకోరునాయాళ్ళని
ఎలా వూరుకుందాం?
మనమేమైనా ఓట్లుమాత్రమే కాసే చెట్లమా?
అదిని చూచు కాటేసే బుల్లట్లవ్వాలింక!
చులకనచేసే బట్టేబాజుగాళ్ళ భరతం పట్టాలంటే
చదువు  పట్టాలేకాదు - కొలువు పట్టాలే సాధిద్దాం!
మనలోని వైషమ్యాలను
వాళ్ళు వాడుకోకుండా సమిష్టిగా గళమెత్తాలి
పిడికిలి బిగించాలి!
కదం తొక్కాలి!
మరో స్వతంత్ర్యపోరాటం మాదిరి
వాళ్ళ పుచ్చెలదిరేలా
మోగించే యీ నగారా
హెచ్చిరిక  కావాలి! 

Friday, January 15, 2016

శిథిలాలలో మొలిచిన అక్షరాలు - కవిత సంకలనం

Tuesday, January 12, 2016

కపిల రాంకుమార్‌|| కల చెదిరింది ||

కపిల రాంకుమార్‌|| కల చెదిరింది ||
అదాటుగా నెత్తిమీదబడ్డ
కొబ్బరికాయదెబ్బకి
అబ్బా అన్న నన్ను
కలవరిస్తున్నారా! అంటూ
మా ఆవిడ తట్టిలేపింది!
కళ్ళు నులుముకుంటూ
ఇన్నేళ్ళుగా క్యాంపులో వుండి
అపురూపంగా పెంచుకున్న
చెట్లు చేమల్ని తలుచుకుంటు
పడుకున్న నాకు
ఇలా స్వప్న విఘాతం కలిగింది!
నిత్యం పూచే నందివర్థనం, నూరువరహాలు
ఎర్రమందారచెట్టు
శాపనార్థాలుపెడుతున్నట్టు
నాలుగు  రకాల గులాబీపూలు
గుబాళించటం మానేసి
గుర్రుగా చూస్తున్నట్టు
ఆకాశమంత యెత్తు ఎదిగిన అశోక వృక్షాలు
అవకాశమొచ్చినప్పుడల్ల కసురుతున్నట్టు
దోరకాయలుకోసుకుతిన్నజోరు
మమ్మల్ని విడిచిన పిదప యేమయిందంటున్న జామ చెట్టు
అలిగినట్టున్నాయి కామోసు
కొబ్బరికాయను నాపైకి వుసికొల్పి వుంటాయి!
అందుకే నెత్తిమీద విన్యాసం చేసి
పీడనపు తాడనం కలిగించింది!
క్యాంపువాళ్ళ పుణ్యమా అని
ఖాళీ చేసిన మర్నాడే
కూలిపోతున్న యింటి ఆక్రందన వినలేకనో
ఏ మూలో పేగుల్ని మెలిపెట్టి పిండినట్టుంటుందని తీపో
తెలియదుకాని తిరిగి కన్నెత్తి చూడకపోవటం
నా ఘోరతప్పిదమన్నట్టుగా
మమతల సంకెళ్ళలా వదలవు కామోసు
ఇలా యిలలో కలను ఆసరా చేసుకుని
నాపై చేసిన దాడికి 
చెప్పొద్దూ కళ్ళు చెమర్చాయ్ సుమా!
సర్కారుని
దాని కాపలా కుక్కల్ని
కసితీర తిట్టుకున్నాను!
మౌనంగా యిలా అక్షరాలను ఒంపేసాను !
నేను నిర్దయుడ్నని
దుర్మార్గుడని,
విశ్వాసంలేనివాడినని
తీర్మానించాయి
ఒకప్పుడు నేను పెంచుకున్న చెట్లు !
12.1.2016

Sunday, January 10, 2016

'' ఇళ్ళ గోష ''

కపిల రాంకుమార్‌ || '' ఇళ్ళ గోష '' ||
ఉద్యోగంలో చేరగానే
కొద్దిపాటి సౌకర్యాలతో
ప్రభుత్వ వసతిగృహం
కేటాయించడం
కడుపులో చల్ల
కదలకుండా
విధులు నిర్వహించుకోటంలో
సాగిన ప్రయాణం
ఒకటా రెండా ముప్పై మూడు
పదవీ విరమణైనాకూడా
అద్దె చెల్లించే ప్రాతిపదికపై
హాయిగ జీవనం సాగిస్తున్నాం!
ప్రభుత్వ ఉద్యోగికి
పదవి విరమణ నాటికి
స్వంత గృహం ఏర్పాటుచేయడం
మా విధానమని
గత పదేళ్ళుగా ప్రభుత్వాలు
తమ విధానాల్ని
యధావిధంగా నినదిస్తూ
ఆశలు రేపుతూనే వచ్చాయి!
అరచేతి వైకుంఠాల్ని చూపిస్తూనేవున్నాయి!
పట్టణ పరిథిలో ఎక్కడా
స్వంత యిల్లు లేదు
సంఘాలవాళ్ళెవరు యిళ్ళస్థలమూ
చూపలేదు సరికదా పైపెచ్చు
పదవి విరమణ చేసిన వాళ్ళలో
ముక్కుకు సూటిగాపోయే
కొందరి పేర్లు తొలగించారు.
గడ్డివాము కాడ కుక్క తను తినదు
ఇంకొకరిని తిననీయదూ అంటూ కుంటిసాకులు చెప్పారు
శాఖాపరమైన నిర్వహణ బాధ్యతలనుండి
తప్పించుకునేందుకే నిధుల కొరతతో
వసతిగృహాల గదులు నలతచెందితే
నివాసముంటున్నావారికి తప్పదుకదా
సొంత ఖర్చులతో మరమత్తులు చేసుకుని
కాపురముంటున్న దశలో
సర్కారుకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా
సచివాలయంలో కదలని ఫైలు
రిమార్కులతో కిందికి
సమాధానాలతో పైకి పరుగులే తప్ప
ఉరిమే మేఘం వర్షించనట్ట్లు
నీరుకార్చే ప్రయత్నాలు కొందరివి.
ఇలా జరుగుతున్న సమయంలో
ఒకటో రెండో నివాసమెవరూ వుండని
ఇండ్లనుండి తలుపులు, కిటికీలు
ఎవరికి అందినవి వారు
నొక్కేస్తే బలంలేనివి వానాకాలం నాని కూలిపోతే
వంక లేనమ్మకు డొంక దొరికిందన్న చందంగా
ఇవి ఎప్పటికైనా కూలిపోయేవి కాబట్టి
రక్షణలేని ఇళ్ళు ఖాళీ చేయాలంటూ
గత మూడేళ్ళుగా తాకీదులిస్తూనే
అవసరమైన వారికి గృహాలుమాత్రం కేటాయిస్తూనే
ద్వంద్వ వైఖరి పాటించి
ఒక్కసారి ఉపద్రవం ముంచుకొచ్చినట్ట్లు
ఓ తెల్లవారు ఝామున బుల్డోజర్లు తెచ్చి
రెవిన్యూ, పోలీసు, ఇరిగేషన్‌
అప్రకటిత యుద్ధం
ప్రకటించి కూలగొట్టే యాగం మొదలెడితే
చెట్టుకొకరు. పుట్టకొకరు అన్నట్లు
గత అనుబంధాలు, ఆప్యాయతలు
విడిచి చెల్లాచెదురైన ఆ నేల చూస్తే
కళింగయుద్ధం తరువాత
వైరాగ్యంతో బౌద్ధం పుచ్చుకున్న అశోకుడిలా
భారత్‌లో ఓ వెలుగు వెలిగి
మాయమైపోయినట్లు
లెక్కా పత్రం లేకుండా
హీనకాచి నక్కలపాలైనట్లు
రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్లు
పాత యినుము బడుగుజీవుల కూటికి ఆసరా అవుతుంటే
శాఖాపరమైన నిబంధనలు ఎటుపోయినట్లు?
మరి పైకి రాలేని ఏ అవినీతి బావిలో కూరుకుపోయారో
మరొకపక్క ఎప్పుడో కట్టిన గృహకల్ప భవనాలు
అమ్ముడుకాకపోగా వాటినేదో అంటగట్టాలని యత్నం
విసిరేసినట్లుండే ఆ భవనాల ధర ఆకాశంలోనే
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ధరలకంటే ఎక్కువే
అమ్మ పెట్టదు, అడుక్కు తిన నివ్వదన్నట్టుగా
ప్రవర్తిస్తూ చదును చేసిన స్థలాన్ని వేలంద్వారా
అమ్ముకోవాలనే యత్నంలో
ఆ స్థాయికి పోటిపడలేని పదవీ విరమణ ఉద్యోగి
సొంతయింటికల నిరాశే కదా!
=================