Saturday, January 23, 2016

కపిల రాంకుమార్‌ ||హెచ్చరిక కావాలి||

కపిల రాంకుమార్‌ ||హెచ్చరిక కావాలి||
ఎందెందు వెతికినా అందందె కలదు వివక్ష
నిత్య కృత్యమై - నగ్న సత్యమై
వికటాట్టహాసం చేస్తూ
దక్షయజ్ఞంనాటి సతిని 
నరికిన బీభత్స తాండవ శివుడిలా
కరాళనృత్యమై
బడుగులును బడితపూజచేసి
అడుక్కి తొక్కాలనే దమనకాండ
అనునిత్యం పతాకశీర్షికై
ఎగురుతూనేవుంది!
మనం తిప్పికొట్టిన ప్రతీసారి
మరోరూపంలో
భూతంలా,ప్రేతంలా
నిశీథిలోనేకాదు
పట్టపగలే పగపట్టి
పిచ్చికుక్కలా స్వైర విహారం చేస్తూ
బూజుపట్టిన ధర్మాలను వల్లెవేస్తూ
కుంటిసాకులు చెబుతూ
అభూతకల్పనల ఘనాపాఠీలై
పలకవర్గ కొమ్ముకాసే బాకాలే కాదు
కొలువవున్న బాబాలు సైతం
మనువును వకల్తాపుచ్చుకుని
దాడిచేస్తూనేవున్నారు!
నిత్యాగ్నిహోత్రంలా
దహనకాండ నెరపుతూ
దమననీతి పాటిస్తూ
ఈ దగుల్బాజీలు
జబ్బలు చరుచుకుంటూ
మమ్మల్ని మీరేమీ పీకలేరన్నట్లు
గప్పాలు కొడుతూనేవున్నారు!
శవాలుగా మారుతున్న మనవాళ్ళసాక్షిగా
ప్రతి సవాలు విసరటమే మన ధ్యేయంకావాలి!
మనతిండి తిననివ్వని
మనం మనంగా బతకనివ్వని
చదువుకోనివ్వని
పుండాకోరునాయాళ్ళని
ఎలా వూరుకుందాం?
మనమేమైనా ఓట్లుమాత్రమే కాసే చెట్లమా?
అదిని చూచు కాటేసే బుల్లట్లవ్వాలింక!
చులకనచేసే బట్టేబాజుగాళ్ళ భరతం పట్టాలంటే
చదువు  పట్టాలేకాదు - కొలువు పట్టాలే సాధిద్దాం!
మనలోని వైషమ్యాలను
వాళ్ళు వాడుకోకుండా సమిష్టిగా గళమెత్తాలి
పిడికిలి బిగించాలి!
కదం తొక్కాలి!
మరో స్వతంత్ర్యపోరాటం మాదిరి
వాళ్ళ పుచ్చెలదిరేలా
మోగించే యీ నగారా
హెచ్చిరిక  కావాలి! 

No comments: