Sunday, October 30, 2016

కపిల రాంకుమార్ |||దీపాళైతది గాదె ||

కపిల రాంకుమార్ |||దీపాళైతది గాదె ||
చిటచిటపటలాడుతూ కాకరొత్తిలా
కోరికల చిట్టావిప్పిన మా ఆవిడకు
నా సమాధానం నచ్చనందుకే 
ఆ చిరుశబ్దాలు సుమీ!
సరదా సునామీలు లేకపోతే
సంసారమే కాదు కదా!
కొత్త బట్టల పండుగ యీనాం
యివ్వలేదని
ఆముదమెక్కువై ఆచి తూచి వెలిగే
మతాబు మా పెద్దోడు!
రేపు యింటి బాధ్యత వాడు చూసుకోవాలి కదా
కడు నెమ్మదస్తుడేనండోయ్‌!
ఆకాశానికి సైతం నిచ్చెన వేసి
చిచ్చుబుడ్డిలా కాసేపు
నెక్లెస్‌ కొనివ్వలేదని
నెక్లస్‌రోడ్‌లో ధర్నా చేస్తనని బెదిరించే
లక్ష్మీ టపాసు లాంటి మా పుత్రికా రత్నం!
నా ఓపికకు పరీక్ష పెడ్తుందన్నమాటే గాని
అసలు అలగని జాతిరత్నం కదండీ
అసలేమి కోరికలు కోరకుండా
అత్తవారింట్లో హాయిగా పెట్టింది తిని,
అందరిలో కలసిపోయే మా అల్లుడుగారంటే
పక్కింటావిడికి యెంత కుళ్ళో!
అయ్యయ్యో! ఆ రోజుల్లో అల్లుళ్ళే వేరంటూ
సన్నాయి మేళంలా చరిత్రలన్నీ తిరిగేసి
చిన్న సైజు కచేరి వినిపిస్తుంది
తారాజువ్వలా ఆ యింటికి యీ యింటికి
దూసుకుపోతూండే మా పని మనిషి కబుర్లతోనూ
ఊళ్ళో జరిగే చాటు భాగోతలన్నీ నాకే తెలుసంటూ
మొక్కుబడికోసం అందరికీ శుభాకాంక్షలేగాని
ఆశలు అణగారిన తెలంగాణ అందించిన సర్కారీ తీరుకు
ఆకాశ వీధిలో విహరించే సరుకులు సంచెడు పైసలకు
గుప్పెడెంత కూడ రాకపోతే గెట్టనయ్యా నెట్టుకొచ్చేటిది!
కాలి, బూడిదవుడు మాటటుంచి దుమ్ము, ధూళి
వున్న కశ్మలానికి మరికొంత జత జేసుడెందుకు?
బుకార్ల వడుడెందుకు?
ఫక్తు కాల బెడ్తానికి వందలు కర్సు వెడ్తరుకాని
గదే వందనోటు కాల్సమనుండ్రి సూద్దాం!
మడిసిలోని అహం కాలబడాలె!
సోచాయించుడెదగాలె!
దీపం వెలుగిస్తనేవుంటది కాని కింద సీకటుంటది
సమురు వున్నంతవరకే గదా!
చేతి సమురెందుకు వదిలియాలే
కడుపుకింత తినుడు
పక్కోనికింత వెట్టుడు
చల్లని మనసుతో ముచ్చట్లు వెట్టి
పసందుగుండాలంటే
బడుగులు బతుకుల్ల సీకటి తొలగి వెలుగెన్నడొస్తదో
గదేనే వరుసగ కాంతులిచ్చే దీపాళైతది గాదె
వెళ్ళొస్తా!
30.10.2016

No comments: