Thursday, November 30, 2017

కపిల రామ్‌కుమార్‌ || పంచాగం బద్దలు కావాలి||

కపిల రామ్‌కుమార్‌ || పంచాగం బద్దలు కావాలి||
అద్దం మీద వాలి
ముక్కుతో పొడుస్తున్న చందంగా
అతివల కుచాలపై కీచక గోళ్ళు
వికారంగా గాట్లు పెడుతున్నచప్పుడు
పాడే విషాదరాగమెవరికీ వినిపించదు
ఎత్తి కుదేసి బలంగా ఒదేసిన గునపపు రాపిడికి
నరాల స్వరాలు చిట్లిపోయి
గుంతలోంచి పైకి చిందిన బురదలా
లావాలారక్తస్రావమౌతున్నా
ఎవరి మనసూ చలించదు
వశమై, వివశమై పోరాడి శవమై
కళ్ళు తేలేసినపుడు మాత్రం
కామగర్వంతో వికటాట్టహాసం చేస్తూ
రవంత భయపు పొరకమ్మకపోగా
మగాడిననే కాలపుకౌర్యపుకేతనం ఎగరేస్తుంటే
పొగరు దించడానికి
అపరకాళిక కావాలి, లొంగి ఒరిగిపోవటం కాదు,
ఒంగి పంచాగాన్ని బద్దలుచేయడమే నేర్వాలి
పిరికితనపు మేలిముసుగు తొలగించి
చురుకైన శౌర్యాన్ని చూపడమే నేటి నారీ కర్తవ్యం
30.11.2017

Tuesday, November 28, 2017

కపిల రామ్‌కుమార్ || ప్రేయసి అలక ||

కపిల రామ్‌కుమార్ || ప్రేయసి అలక ||
దగ్గరకు రా అన్నప్పుడల్లా
ససేమిరా కాదంటూనే
ఆమడదూరం పరిగెత్తేది తను
ముద్దపెడతానంటే పరుగన వచ్చేది
ముద్దిస్తానంటే మాత్రం
ఏమైంది అంటే
పెదవులు ఎంగిలైనా పర్వాలేదు కాని
యెదపొంగులు నలిగితే
శరీరం ఎంగిలైతే ఒప్పుకోనుగా అంది
ఇన్నాళ్ళ ప్రయాణం
ప్రణయంకాదా
కావొచ్చు - మరో ప్రళయం కాకూడదంటూ
గాలిలోనే ఓ ముద్దిచ్చి తుర్రుమంది
అమలిన శృంగారదేవతగానే
మనో ఫలకంపై నాట్యమాడే
కవితా చెలి.
గ్లోబలీకరణ ప్రభావంతో శీలం చెడగొట్టుతావేమో
లోభాలకు లొంగి ప్రజావ్యతిరేకుడవౌతావేమో
సవాలక్ష సవాళ్ళను నా మెదడులో జొనిపి
ఎగిరిపోయింది ఊహాలకు, ఉద్దేశాలకు
ఆశయాలకు
ఆచరణకు
వైవిధ్యం, వైరుధ్యం లేని నాడు
నీ ఒడిలో వాలిపోతానంటూ
28.11.2017

Saturday, July 15, 2017

కపిల రాంకుమార్ || నిప్పురవ్వ ||

కపిల రాంకుమార్ || నిప్పురవ్వ ||
పలకే
జై్లు గోడ
బొగ్గు ముక్కే
అగ్గిరవ్వ
రుద్రవీణలు లిఖించి
పలికిన
తెలంగాణ
నవ వైణికుడు దాశరథి!
కొత్తపుంత తొక్కించిన వైతాళికుడు
ధిక్కార స్వరంలో
ధూర్జటిలా
రాజును లోకానికి బూజులా
నిర్భీతిగా దులిపిన
అభ్యుదయ పథగామి దాశరథి!
శాస్త్ర, సాంకేతిక, సామాజిక పరిణామ క్రమాన్ని 
విశ్వరహస్యాలను
నేటికీ సాగే కులదురహంకార అకృత్యాలను
గాయపడిన హృదయంగా
గేయమయం చేసిన వాడు
రాయబడని  కావ్యాలుగా
కోటి రతనాను  వీణమీటిన వాడు
యాత్రస్మృతి అందించినవాడు
ఆధునిక దాశరథి శతకంలో
బడుగుల ఆకలి కేక వినిపించిన వాడు
బలిసిన డబ్బున్నవాళ్ళ కొట్టుకుచచ్చే జబ్బును
విదితంచేసిన వాడు దాశరథి!
ముందు తరాలకు
రాజ్యానికి వ్యతిరేకంగా నినదించవలసిన
ఆవశ్యకతను గుర్తుచేసిన వాడు
కలాలు గర్జించే గళాలై
అనధికార శాసనకర్తలు కావాలని
దారిచూపిన వాడు  దాశరథి!



కపిల రాంకుమార్‌ ||గరగపర్రు ||

కపిల రాంకుమార్‌ ||గరగపర్రు ||
గొంతులో గరగర
గరగపర్రు కషాయం!
కళ్ళలో మిరమిర
గళాల శబ్ద ధూళి !

కపిల రాంకుమార్ || ఆ రోజులు ||

కపిల రాంకుమార్ || ఆ రోజులు ||
ఒరే దూరం
దాన్ని ముట్టుకోకు
దాన్ని కుక్క ముట్టుకుంది
అక్క బహిష్టయితే అమ్మమ్మ  వ్యాఖ్య
**
పిల్లా నీ కంచం గ్లాసు కడిగి
బాత్‌ రూమ్‌లో పేట్టు
అన్నింటిలో కలుపకు
చాప, చెంబు దుప్పటి జాగ్రత్త
ఎవరికీ తగలనీకు
**
ఒరే అబ్బీ
నువ్వూ స్కూలునుండి రాగానే
బట్టలు మార్చి వేరే పెట్టు
దానికి నీళ్ళయ్యేదాక నువ్వు దూరమే
అంటే అర్థంకాని వయసు నాది
**
అమ్మమ్మ  పూజ చేసుకునేటప్పుడు
కాని
వంటపని అయ్యేవరకు
ఎదురు రాకూడదు
కనపడిందా శాపనార్థాలే
ఆచారం లేదు, సంప్రదాయాం తెలీదంటూ
ఇల్లూ బజారు ఏకం చేస్తారీ కుర్రకుంకలంటూ
ఇలా ఐతే రేపెలా నెగ్గుకొస్తారాఓ అత్తారింట్లో అని
తిట్టుకుంటూ ఆవిడ మళ్ళి స్నానం చేసేది
**
గుడ్డలు జాగ్రత్త!
ఎక్కడపడితే అక్కడ పడేయకు
ఉతికి జాగ్రత్త పెట్టుకో
ప్రతీ సారి నా చీరలెన్ని చింపి యివ్వాలి
( నాప్కిన్‌/ వానిటీ షీట్లు ఆ రోజులకు రాలేదు )
**
ఆ మూడు రోజులు
అక్కకు నరకమే
అక్కతొ పాటూ నాకు పరీక్షే
కడుపునొప్పి అంటే
ఏదో కషాయం యిచ్చేది
అది ఏడుస్తునే తాగేది
నేల పడక
దోమల వేట !
**
అలా గడిచింది అక్క బాల్యం- యవ్వనం
కొన్నాళ్ళకు అమ్మమ్మ తెలుసుకుంది
లోకంతో పాటూ మారాలని అనుకుంది
లేకపోతేనా...
అక్క ఆరోగ్యం ఏమైయ్యేదో
బతికిపోయింది  చైతన్యం పొందిన అమ్మమ్మం వల్ల
**
అందుకే ఇప్పటికి
అన్ని యిబ్బందులు అప్పుడు పడినా
అక్క పెళ్ళికి అమ్మమ్మ చేసిన
సాయం అంతా ఇంతా కాదు
అమ్మమ్మ అంటే అక్కకూ ప్రాణం.
**
ఆ రోజుల్లో అలా వుండేవి
అంతే...
ఆరోగ్యానికి సవాలుగానే
గడిచినా
దరిమిల్లా సాఫీగా సాగిపోయింది కాలం
**
కపిల రామ్‌కుమార్‌ \\ ఎంత తేడా జెండా మోతలో \\
వాడు
భుజాన జెండా
కడదాకా మోయాలనుకున్నాడు
భుజం మీద దెబ్బలు పడినా
జెండా కర్ర విరిగినా
కొసను పట్టుదలగా నొక్కిపట్టి
ప్రాణం పోయినా వదలనన్నాడు
పార్థివ శరీరం మీద కప్పేవరకు
>>
వీడు
భుజాన జెండా
అజెండా కొత్తగా మారినపుడల్లా
చొక్కా మార్చేస్తాడు
జనాలను ఏమార్చేస్తాడు
జెండాలను మార్చేస్తాడు
పొట్ట గడవటం కాదు
మార్పిడిలో సొంత కట్టడం
కట్టుకోడానికి
>>..5.7.2017
రోటిలో తలదూర్చాక
ఎన్ని పోటులైనా
జి.యస్‌.టి పన్నులైనా
భరించాల్సిందే!
...
ఆలోచించడానికి
లోచనాలున్నాయి.
ఆచరించడానికి
చరణాలు కదలాలి కదా!

...
ఐ లవ్యూ చెప్పినంత
తేలిక కాదు
ఐ ఓవ్యూ అని
కొనసాగటం!

...

1.కపిల రాంకుమార్ || శత్రువెవరు ? ||

1.కపిల రాంకుమార్ || శత్రువెవరు ? ||
ఏ జనమైనా
ప్రభంజనమై
బహుజనమై
గర్జించాలసిందే
ఏవరిమీద!
కనబడే దాష్టికంపైనా?
కనబడని దుష్టుడిపైనా?
ఆ దాక్కునివున్న
శత్రువెవరో కనిపెట్టండి
వాని ఆట కట్టించగ
ఒక్క తాటి సమకట్టండి
ఐక్యతగా ఉద్యమించండి
2.కపిల రాంకుమార్ || ఆత్మీయం||
సంతానం
మన సొంతం లేదా
సామర్థ్యం అనే భ్రమలు వద్దు
సాధించిన
ఫలితాలే
మనకు ముద్దు
గురువుగా ఎందరినో
ఎదిగేలా చేసానని ఉబ్బిపోకు!
ఉన్నతంగా ఎదిగినా
ఆ కొందరిలో
నీ ముందు ఒదిగిన
విద్యార్థి అధికారైనా, రాజకీయనేతైనా
నీ బిడ్డే అని గర్వపడు!
అపుడే తల్లి దండ్రులకైనా
గురువు కైనా
గర్వ కారణం!
అత్మీయమైనా
పదిలపరుచుకునే
జ్ఞాపకమైనా
ఆ క్షణాలే ఉద్విగ్నమైనవి!

కపిల రాంకుమార్ || మినీలు వానా కాలం ||

 కపిల రాంకుమార్ || మినీలు వానా కాలం ||

1.కథ కాటికి
వ్యథ కంటికి
భావం ముద్రై
కాలనాళికైంది -
**
- కథకుని స్మృతిలో
2.ఎత్తి చూపటం
ఇష్టముండదు
బూజు దులిపితే
కష్టముండదు
3.నా తలపులలోనుండి
తొలిగిపోయాక
నీ తలుపులు తెరిచి వుంచి
ఫలితంలేదు నేస్తమా!
మనసు మలుపు తిరిగి పోయాక
అన్నీ మరుపులేగా
గతాన్ని విసిరేసిన
మాయని మరకలేగా!!
4.గుబురుల్లో
కబుర్లు
ముసురుకు
తడిసాక
మొలకెత్తిన
అంకురం
ప్రేమెనా!
5.ముషాయిరాలో
మురిపాలున్నా
వాయిదాల్లో
ఫాయిదా వుండదు!
6.గడుసరి
ప్రేమకి
డాబుసరి
ముగింపా?
7.సంసారమైనా
సంగీతమైనా
సంగతులు
తప్పనంతవరకే
గమకాలు పలికినా
గమనాలపైనే ఆధారం!
8.పదవిలో వున్నాడని
పొదివిపట్టుకున్నావు
పెదవి కొరికినపుడు
కాండ్రించి వుమ్మావు

--- జర పైలం బిడ్డా
మగాడు మృగాడు కదా!

||కపిల రామ్‌కుమార్ ||నిశ్శబ్దం బద్దలవ్వాలి||

||కపిల రామ్‌కుమార్ ||నిశ్శబ్దం బద్దలవ్వాలి||
అవును
మౌనాన్ని మూలకి నెట్టి
మూలాన్ని వెలికితీసి
మూలకాన్ని మించిన
క్షిపణి ఒకటి
పేల్చాల్సిన సమయం వచ్చింది
చాప కింద నీరులా
మౌఢ్యపు భావాల్ని వ్యాపింపచేసే
అదృశ్య యంత్రాంగాన్ని కనిపెట్టాం
అది విశ్వరూపం చూపేలోపే
జాఢ్యం మూలవాసులను నాశనం చేసేలోగా
మూలాలతో సహా పెరికివేసి
విధ్వంశం చేయాల్సిన అవసరమేర్పడింది
తినేతిండిని నియంత్రిస్తూ
ఉండే గూటిని కూల్చేస్తూ
గుమిగూడి సమాలోచనచేయనీకుండా అడ్డుకునే
కుతంత్రపు శక్తుల యుక్తులను
బట్టబయలు చేసి బట్టలూడదీసి తన్ని తరిమే
పని ఒక్కటే మిగిలింది!
ఎన్నో భ్రమల మాయాజాలంతో
ముచుకొస్తున్న ఉపద్రవాన్నాపాలంటే
కలాలు గళాలెత్తాలి
ఉక్కు పిడికిళ్ళై నిబద్ధతా కొడవళ్ళై
సమూలంగా మట్టుపట్టె తరుణ ఆసన్నమైంది!
అవును
చిన్న పెద్ద మగ ఆడ తేడాలేక
సమరానికి సిద్ధం కావాలి!
అదుగో నగారా మోగుతోంది!
మౌనాన్ని బద్దలు కొట్టండి!
సకల జనుల ఐక్య ఉద్యమం ఉప్పెనవ్వాలి!
ఆధిపత్య వర్గాలకు భరత వాక్యం పలకాలి!
తక్షణమే ఒక విస్ఫోటనం
ఒక విప్లవం జమిలిగా
పురాతన పన్నాగాలు పునరుద్భవించే అవకాశంలేని
మార్పు రావాలి!
సామాజిక రాజ్యం కొరకు
నిత్యకృత్య అకృత్యాలకంతం పలికే దిశగా
మదాంధుల గురుతులు తెగిపడేలా
మరో దక్ష యజ్ఞం జరగాలి!
అవును
అందుకే మౌనం బద్దలవ్వాలి

కపిల రాంకుమార్‌ || అస్పష్ట జ్ఞాపకం||

కపిల రాంకుమార్‌ || అస్పష్ట జ్ఞాపకం||
అట్లతద్ది ఆటల్లో
చెట్టుకొమ్మన ఊయల్లో
బాల్యపు ఊసూలెన్నో కలబోసుకుంటూ
మగ ఆడ తేడలేకుండాచెట్లమ్మటి గుట్లెమ్మటి
తోసుకుంటూ గిచ్చుకుంటు
ఊహతెలియని జతకట్టుకుంటూ
వాగులెమ్మటి ఇసుకలో దుదుంపుల్లలాడుకుంటూ
అమ్మా నాన్నలాడుకుంటూ
గువ్వలమై ఎగిరిన రోజులు
గునగునమంటూ యాదిచేస్తుంన్నాయి!
**
పండుగలకు పబ్బాలకు
కలసికట్టుగ సామాగ్రితెచ్చిన రోజులు
తొక్కుడు బిళ్ళ, గుడుగుడు కుంచం గుండేరాగాలాడిన రోజులు
ముక్కుడు గిల్లులాట, చేలగట్ల పరుగులెత్తిన రోజులు
కలువపూలకోసం ఒక గుంపు
తామరపూల కోసం ఒక గుంపు
పోటీపడి ఈదులాడిన రోజులు
**
దీపావళి ఉప్పు పొట్లాలు
గోగుకాడ దివిటీలు
నాగులచవితికి దాచుకున్న రోజులు
కార్తీకపున్నమికి ఎగరేసిన తారాజువ్వలు
పోటీపడి కాల్చిన రోజులు
**
పరీక్షల హడావుడికి
కొత్త కలాలకోసం దెబ్బలాడుకున్న రోజులు
ఉదయాన్నే చద్దన్నంలో ఆవకాయతో వెన్నముద్దలేదని
గడ్డ పెరుగు పోయలేదని మారాము చేసిన రోజులు
పుస్తకాలు ముందేసుకుని
ఒకరికొకరం వల్లెవేయించుకున్న రోజులు
**
మాయదారి వయసులొచ్చి
లంగావోణీల్లో ముద్దబంతి పూవులైన నేస్తగాళ్ళతో
ఆ ఆటలు బందయినా
స్నేహ బంధం నిలుపున్న రోజులు 
ప్రేమలు దోమలు అంటూ చదువు చెడకొట్టకండంటూ
పెదనాన్న మందలింపులు
చిన్నత్త సలహాలు, చెవి మెలిపెట్టి తీయించిన గుంజీలు
**
ఇక ఉద్యోగాల్లో కొందరు
ఇతరేతర వ్యాపకాల్లో కొందరు
చెల్లా చెదరైనా
వయసు పక్వానికొచ్చి అత్తారింటికి కొందరు
పిల్లలతో కుటుంబాలతో బిగించబడినా
సంవత్సరానికొకసారైనా కలసి నెమరేసుకున్న రోజులు
ఉత్తరాలు రాసుకునేవాళ్ళం
తరువాత ఫోనులు చేసుకునేవాళ్ళం
ఇక యిపుడైతే మెసేజీల పాలై
ఆనాటి అనుబంధాలు దూరమైనట్లనిస్తుందని
సరోజ, సుజాత, వెంకటీ, కృష్ణమూర్తి
ఫేసుబుక్కులో మొత్తుకున్నారు
**
ఆ రోజుల్లో జాజిపందిరికింద కందిరీగ కుట్టి
ఒక కన్ను పోయిగోలపెట్టిన  గౌరి
పొలంగట్టున చెట్లకింద ముంజెలు తింటూ గట్టుజారిపడి
విరిగిన కాలుతో  వెంకటి
కళ్ళముందు మెదిలే ఎల్లని, నల్లని మబ్బుదొంతరల రోజులు
గుర్తుకొస్తుంటే మసక కళ్ళను కన్నీరు కడుగుతున్నది
మనవళ్ళతో పాత అస్పష్ట జ్ఞాపకాల తెర!

Sunday, April 2, 2017

l5.(.ఆ) టుమ్రీలు

l5.(.ఆ)   టుమ్రీలు
1. మనసు రాయైతే......
మాటలు కాదు...
తాటలు తీసే
తూటాలౌతాయ్‌
2. తలలు బోడులైన.
తలపులు బోడులౌనా..
తలుపులు మూసినా
తలపులు ఆగునా
3.మనసు చైతన్యంగా
వుండాలే గాని
ఎన్ని భావాలైనా పలికిస్తుంది,
ఒలికిస్తుంది
4.మరచిపోయినవారికి
గుర్తుచేయగలం
కాని
గుర్తించటం మానేస్తే
మరలించటం ఎలా
5.నగవులే
ఎదురొస్తే
తగవులన్నవి
పారిపోవా!
6.పెదవులే
మరులైన
పృధివిలో
ఆనందమే!

||కపిల రాంకుమార్|||హేళనెందుకు హేవిళంబి ||

||కపిల రాంకుమార్|||హేళనెందుకు హేవిళంబి ||
దుర్ముకి ఏం వెలగబెట్టలేదని
వెక్కిరించకు –
చిట్టా విప్పుతున్నా కాసుకో
జనాల్ని ముప్పు తిప్పలు పెట్టి
ఒక్క నోటు రద్దుతో
అంతా అతలాకుతం చేసి
ఎందరినో పొట్ట పెట్టుకుంది!
ఎందరినో అనర్హుల్ని అందలమెక్కించింది
దీనమ్మ జీవితమని విసుగుపుట్టించింది
జనాల అంచనాలను తలకిందులు చేసి
తాను మాత్రం రయ్యిమని
ఆకాశాన విహరిస్తోందని ఉడుక్కోటం కాదు
నువ్వేమైన పెద్ద తోపువా చెప్పు !
పైకెళ్ళిన ధరల్ని దింపుతావా!
20 నిముషాలకొక సారి నిత్య కృత్యంగా
జరుగుతున్న మాన భంగాలని ఆపుతావా!
బడుగు జీవులకు బతుకులో
మెతుకు భరోసా యిస్తావా!
రాజకీయ అవినీతి కుంభకోణాలు
వరుస మరచిన సంబంధాల ఎన్నికల వివాహాల్ని
గాడితప్పిన ఆర్థిక వ్యవస్థని
ఏమైనా సరిచేయగల దమ్ముంటే
హేళన చేసేందుకు అర్హత వుంది
..
ఉత్తరాన జెండా ఎగరేసిందిగా
అని సంబరపడకు
ఉత్తర చూసి ఎత్తర గంప –
జొన్న పంటకు నానుడైతే
గత్తర బిత్తర రాజకీయ ప్రక్షాళనకు
జనం జెండలెత్తి తిరుగడతారు
ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా మీరందరు ప్రభవ మొదలుకొని
ఒక తాను ముక్కలే-ఒక గూటి పాటే పాడుతారు
కోయిలను స్వేచ్ఛగా గానం చేయనీరు
బాధలను చెప్పుకునేందుకు
జనాలకు అవకాశాం యివ్వరు
ఎందుకమ్మా పండుగలా వచ్చి
దండగమారి వరాలు కుమ్మరించి
అరచేతి వైకుంఠాలు చూపిస్తారు
ఇక్కడ ఎవరి చెవుల్లో కాబేజీలు లేవు
నీ దారి చూసుకొని గడువు కాగానే వెళ్ళు చాలు
నువ్వొచ్చి ఒరగ పెట్టేది లేదు
మా చింకి సొరుగులు నిండేది లేదు
ఏ పూటకాపూట శ్రమ చేయందే
కూలోడికి కడుపు నిండదు
మా వాడే అనుకున్న ప్రధానే
మన నెత్తిన
సరళను నెత్తిమీద పెట్టాను
ఒకరి తరువాత ఒకరు కొనసాగించారే కాని
గ్లోబలిని తరుమలేదు కదా
మరింత దానికి గాఢ పరిష్వంగంలో దూరిపోయి
సార్వభుమాధికారాన్నే తాకట్టుపెట్టి
ఒట్లేసిన జనాల సంక్షేమం గాలికొదిలి
గాలి గాళ్ళ దారిలో గాలిపటాలెగరేస్తూ
అంబారీలూగుతూ,
రియల్గా చెప్పాలంటే ఊడిగం చేస్తూ
పబ్బం గడుపుతున్నారుగా
ఏవరెట్ట చస్తే మాకెందుకు
రైతైనా, మగువైనా, చదువైనా
మా కుర్చీలు కదలకుంటే చాలనుకునే వాళ్ళే కదా
మీ అరవై మంది
వెళ్ళవమ్మా వెళ్ళు
ఎటకారాలు మాని నీ పని చేసుకో
జనాలకు కాక రాకముందే
జన నేతలకు కళ్ళు తెరిపించు సంతోషిస్తాం
పందుగ రోజు కషాయం ఉగాది నాడే కాదు
యుగాదిగా రోజూ సేవిస్తూనేవున్నాం
చాలు నాకు నీతో మాట్లాడే మక్కువలేదు
కలం కాండ్రించి ఉమ్మే ముందే
నీతులు చెప్పడం మాని వెళ్ళూ!
---------------------------------
29 మార్చి 2017 ఉగాది కవిత

వారసత్వం

ఈ లెక్కన బ్రొటన వేలే కాదు
ఏ అంగమైనా బలి ఔతుంది!
దక్షిణగానో,
అశాస్త్రీయ శిక్షాస్మృతిగానో
--
(ఆధిపత్యాలే మనువు వారసత్వం!)

|| కపిల రాంకుమార్‌ ||మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?||

మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?
'' అన్నదాతా సుఖీభవ ''
కంచం ముందు చేయికడిగినప్పుడల్లా
యాది చేసుకుంటున్నది సత్యం!
సుఖ జీవనమన్నది మృగ్యముతున్నదీ నగ్న సత్యం!!
**
వరైనా, మరేదైనా
దినదినగండం నూరేళ్ళాయుసులా
పంట కొరకెన్ని తంటాలో
పెంట వేస్తే పంటొస్తాది
అది సాగు ధర్మం
ఎరువులు బరువులై విత్తులకు
ఎత్తుల చిత్తులలో
మిత్తి మీదేసుకుంటే
చివరకు  నెత్తి మీద గుడ్డకూడ మిగలదేమి?
పుట్టుదలకొరకు కాళ్ళరిగినా
పుట్టినదానికి చెలక తనఖాపెట్టితేకాని
సాలిరవాలు దుక్కులు
అదును పదునుకోసం దిక్కులు చూడక తప్పదు
మడినారు వడలిపోవుండా
ఆకుల ఆశ్రమం కట్టి సాదుకుంటేనే
తరుణ వయసులో మొక్కనాటితేనే
పూత, పింది కాయలొచ్చేది
ఆకు ముడత రాకుండా సశ్యరక్షణ్ చేసి
కైలు చేయ కూలీల వెతుకులాట
మండే ఎండలు, ధరలు పోటీలో
తనూ కుటుంబంతో చేయి వేస్తేనే
ఎర్రబంగారం గంపల చేరి
కళ్ళంలో తివాసీగా మారేది.
రంగు పోకుండా పెళపెళ మన్నపుడే
మంచుపదునులో గోనెలోకి చేర్చాఅలి
మొదటి కాత కొచ్చేది నాణ్యమైనదే అయినా
మార్కెట్‌ మాయాజాలంలో రవాణా మోతతో
గిట్టేదెంతో, చేతిలో పడేదెంతో
గుమ్మంకాడే కాసుక్కూచున్న షావుకారి వాటాపోటే
మిగిలేనో లేక
మడిసి మాత్రమే కుమిలేనో ?
ప్రపంచంలో ఉత్పత్తీ అయ్యే సరుకులన్నీ
తయారీ దారుడే ధర నిర్ణయిస్తే
ఈ ధరలో మాత్రం రైతు ఉత్పత్తికికి మాత్రం
ధర నిర్ణయ హక్కెందుకు లేదో
ఆ పెరుమ్మాళకెరుక!
తులనాత్మక ఆదాయం రాక
తులాభారంలో మొగ్గలేక
తలాపున దీపమెట్టించుకునే
గతికి కారణమెవరు?
శ్మశానాలలో ఖాళి లేక పెరటిలోనే
భస్మమయ్యే వ్యవసాయ కమురు కంపు
ముక్కుకు సోకలేదా?
రైతు నిష్క్రమణలకు ఎవరిని శిక్షించాలో
పంట అనుభవదారులూ తేల్చి చెప్పండి
అన్నం తిన్నపుడె కాదు
నిత్యం సుఖీజీవుడుగా రైతును బతికించండి!
ఎర్ర బంగారం/ తెల్ల బంగారం
కళ్ళార చూడలేక కళ్ళు మూసేసుకుంటున్న
కల్లం యజమాని గోడు పట్టించుకోండి!

కపిల రాంకుమార్‌

Thursday, February 23, 2017

టుమ్రీలు 14

టుమ్రీలు 14
కీలెరిగి
వాత పెట్టడం
ఏలేవాళ్ళకే కాదు
కూలోళ్ళు అనుకునే వారికి తెలుసు

టుమ్రీలు -13

టుమ్రీలు -13

మరులు
మరలిపోయిన
మరలిరావటం
అరుదు

|తాగి కసిగా తిట్టుకుంటున్న యువకుని ఆత్మ ఘోష ||

కపిల రాంకుమార్ ||తాగి కసిగా తిట్టుకుంటున్న యువకుని ఆత్మ ఘోష ||
అరవై ఏండ్ల కష్టాలకు
చరమగీతం పాడాలని
ఏ వర్గాలైతే ఇన్నాళ్ళు
దోచుకున్నాయో
ఆ వర్గ నేత యెనకాల
గొర్రెల్లా భుజాలెగరేసుకుంటూ
తిరిగినా
బుర్ర రామకీర్తన పాడినా
సర్రున వాతలు పడినా
ఎర్రని మంటల్లో కాలిపోయినా
సమిధల్లా దూగిన గుంపులో
యువకులు, విద్యార్థులు
బలిదానం చేస్తే!
ఒరిగిందేమిటి ?
సానుభూతి వొలకబోసి
మీరే రాబోయే నిర్ణేతలంటే
నిజమే కామోసు అనుకుని
ఇల్లు వాకిలి చదువు చట్టుబండ
ఉద్యోగాలు వదులుకుని
ముందేమిటోసూడకుండ లాఠీల దెబ్బలు మంటవెట్టినా,
కేసులంటూ ఠాణాలెమ్మటి తిరుక్కుంటూ
కోర్టూ వాయిదాలకు కాళ్ళరిగినా
రాజ్యం మనదేనని నమ్ముకుంటే ఏం జరిగింది
ఓ పాలి యెనక్కి తిరిగి చూడండి!
మీ వోడే గద్దెనెక్కేదంటూ
మీ అర చేతిలో వైకుంఠం చూపినారా
తీరా కడకొచ్చినంగ అంజనం వేసిన మాట
జమ్మిచెట్టుకే కట్టేసి థూ నాబొడ్డు లెక్కన
తరిమికొట్టింది యాదికొస్తలేదా
సామాజిక తెలంగాణ కావాల్నని మొత్తుకుంటే
వినవడలే....వెనవెనకనే దూరి
తాయిలాలకమ్ముడుబోయి
మూతబడ్డ నోర్లు ఇకనైనా తెరువుండ్రి
పంచె లూడగొట్టాలె
ముక్కు నేలకు రాయాలన్నోడు
ఈడ నగరం మండుతవుంటే
ఆడ బంగారం దానం చేస్తండు
సొమ్ము మనది, పేరు ఆయనది
సుఖం ఆయనది కష్ట నష్టాలు మనయి
థూ! నీ బతుకుచెడ!
అని మనకి మనమే బండనూతులు తిట్టుకోవాలె
దీనమ్మ జీవితాన్ని ఆరి యెనక కాక
సబ్బరచెప్పే నీల్‌ లాల్‌ జెండా లెనక
దిరిగినా జనం మెచ్చుకునేటోరు
పదవులుచ్చుకుని పాచిమాటలు మాటాడబోకండ్రి
జనం యెట్ట సత్తే మనకేం
మన జనానా మెచ్చుకుంటే చాలకునే
కొత్త పదవీ బిచ్చగాళ్ళారా
నోటికి యేసిన కుట్లు తెంపుకు వస్తారో
జనం ఉమ్మేసే వరదలో కొట్టుకు పోతారో తేల్చుకోండి

Saturday, February 11, 2017

Tumrees 10 to 12

Feb 07, 2017 9:45am
టుమ్రీలు  10
ఆచారం
గోడ కాకూడదు
అత్యాచారం
క్రీడ కాకూడదు
Feb 07, 2017 9:39am
టుమ్రీలు 11
స్వరాల రాగాల్లో
సత్యం
నరనరాల రక్తంలో
అసత్యం
Feb 07, 2017 8:41am
టుమ్రీలు - 12
నిజం
గజం దూరం
అసత్యం
అనునిత్యం
**
మాట విసరగానే
సరికాదు
సూటిగా తూటా అయ్యిందా! లేదా!
**
లక్షణం
ఏదైతేనేం
ఛేదించే లక్ష్యం
ముఖ్యం
**

Tumrees 9

సాలెగూడులో పొదిగిన వాన నీటీ ముత్యాలు 
మెరిసి పోతున్నపుడు,
దాచుకోలేని నీ చిరునవ్వు ...
ఇంకా ..ఇంకా! మనసు బల్ల మీద 
ఇంకా జాగర్తగా మడత పెట్టబడే ఉంది !

కపిల రాంకుమార్...ఎచ్చరిక ...

కపిల రాంకుమార్...ఎచ్చరిక ...
కొట్లాడి సాధించుకున్నం కదా తెలంగాణ. 
గిట్ల బొక్కబోర్లపడ్డవేంది 
మనోడిని పదవిలో కూకోపెడతనుకుంటే
బూర్లమూకుడు నెత్తినపెట్టిండా
గోచిగుడ్డ ఊడేలా ఎగిరి గంతేసినవ్
ఎగిరి యే తానవడ్డదో యెతకబోయె
మా ఈరిగాడు...దొర్కలే
దొరమాటతో పాటు గదీ గాలికి కొట్టకపాయె
కమ్మరి చక్రం కూలబడె.
కంసాలి కొలిమి సల్లవడె
కులవృత్తులు ఈడ్చకపాయె
పాడి గేదెలు పాడెక్కె
యవుసాయం కాటికి కాళ్ళు జాపె
ఇంకా యెన్ని సంకనాకి పోవాల్నో
యెన్ని పీనుగులు కమురుకంపు కొట్టల్నో
మాయలమరాఠోలె ముక్కూపుకుంట
అరసేతి యైకుంటాలెన్ని సూడాల్నో వారి
ఈతలు. తాళ్ళు మోతాదులతోసహా
సెదలువట్టి ముంతలు ముండవోసినయ్
ఇంకా నమ్మబలికితే సెవులో పూలు లేవు
ఎంతమందుసురు తగల్తదోకాని.
రా యీ పాలి యే ముచ్చటి సెప్పి
ఓట్లడుగుతవో సూతం
పిచ్చోళ్ళమనుకుంటున్నవ
పెజలంటే
సెప్పిందిని. పెట్టింది తినేటందుకు
వెర్రిపప్పలంకాదు
మా వాటా మాకిచ్చేదంక
తంట్లాడుతాం
నీతోనే - నీ తొత్తులతోనే
నీలి యెర్రజెండాలందుకున్నాం
నైజామునే తరిమి కొట్టినం
నువ్వెంత..జర పైలం బిడ్డా
నీ అడ్డాకదుల్తది
కూసాలిరిగి కుర్సీ కూలబడ్తది
గుంజకు కట్టి గంజికూడ దొరకకుండ జేస్తం
పేదోడికి కోపం వత్తే
కోటలే కూలినయాని సదూకోలే...
దినాలెట్టే దినాలు దాపుకొచ్చే
సందెటేలకేతప్పులుదిద్దుకో
లేదా దినవారాలకు
బయలెల్లే దినం దాపులోనే వున్నాది
కపడ్దార్...దుగ్ధగీతం పాడుకుంటా
దగ్ధమయ్యే పోగాలమొస్తాంది
ఆడోళ్ళని అలుసు సేస్తివంటే
చర్మ వొలిసి డోలు వాయిస్తరు,
బతుకమ్మం లాడించుడు కాదు
నీకే బతుకులేకుంట సేత్తరు
జనంతో పెట్టుకుంటే
యే జనానా కాని. నీ జనాలు కాని
ఆదుకోలేరు. నీ జమానా ఖతమై
జన రాజ్యం వస్తాదని హెచ్చరిస్తుండాం.
10.2.2017

Wednesday, January 25, 2017

Tumrees 8

ప్రేమ దొరకటమే
చాల కష్టం
జారవిడుచుకుంటే
చాల నష్టం
తర్వాత ఎంత
మదనపడినా
ఫలితం శూన్యం
మనం ప్రేమించే వ్యక్తి
దొరకేకంటే
మనల్ని ప్రేమించే వ్యక్తి
దొరకటంలో ఎంతో ఆనందం!

Tumrees 7

మౌనం
ఆరోగ్యానికి మంచిది కాదని.
అది మనసును
ఇంకా వ్యధల్లోకి నెట్టివేస్తుందని తెలుసుకో
స్నేహాన్ని వదులుకుంటే
ఆ బాధ తీర్చాలంటే
ఎవరి తరం కాదు.

Tu\mrees 6

కొన్ని జ్ఞాపకాలు 
మనసును వీడవు 
కొన్ని జ్ఞాపకాలు 
మనసును చేరనీయవు..

Tumrees 5

kapila Ramkumar Tumrees 5

అద్దం. హృదయం..
పగిలితే. అతకవు...
బింబం వ్రక్కలయినట్లు.
ప్రేమ ఛిద్రమయినట్లు...భావించాలి
కపిల రాంకుమార్ || లే - కదులు ఆవాజ్ దో! ||
పాటు పడేవాడికి
సాపాటులేదు!
పోటు పొడిచే వారందరికి
కూటికి కొదువలేదు!
కష్టం చేసి దాచుకున్నా
కన్నం వేసి దోచుకునే వాళ్ళే ఎక్కువ
ప్రతీ అర - క్షణం
అరక్షణంగా
బతుకీడ్చేలోకంలో
నీతి నిజాయితి ఒట్టి కాకమ్మ కబుర్లే
గోడల మీద రాతలే కాని
మెదడులోకి మాత్రం దూరవ్
అడగాలంటే భయం
అడుగు వేయాలంటే భయం
అడుగుకి పడిపోతున్నామంటే లేదు
అభయహస్తం!
సామెతలు ఎన్నో వున్నా
అవి ఇవాళ ఔట్ డేటెడ్
ఉపయోగించావా
ఎట్రాసిటీ కేసు
నీ మెడకు చుట్టుకున్నట్టే
సుద్దులు చెప్పలేవు,
బుద్ధులు చెప్పలేవు
పెద్దల మాట వెనకటికి చద్దిమూటే కాని
నేడు కుదరదు
నీ మాటవినే వాడెవ్వడూ లేడు!
వద్దన్న పనే చేస్తారు
బోర్ల పడ్డా,
దెబ్బలు తిన్నా
ఆ ఊబిలోంచి బయటకు రారు
మళ్ళీ అవే పొరపాట్లు
చేస్తూనేవుంటారు
సంఘటనలకు
ఏదో మొక్కుబడికి స్పందించినా
పునరావృమవుతున్నా
పట్టించుకోని సర్కారులాగ మౌనం వహిస్తూ
నేరాన్ని ప్రోత్సహిస్తారే కాని
జాగు చేస్తూనేవున్నారే కాని
నివారించడానికి కదుల్తలేరు
నేత బాగాలేదు సరే,
నేతన్నల బతుకే బాగాలేదని తెలుసా!
నేతలకు పట్టడంలేదేమని అడిగావా!
జరుగుతున్న అన్యాయాలెన్నో,
అకృత్యాలెన్నో
అరాచకాలెన్నో
మౌన ప్రేక్షకుడిలా
ఎన్నాళ్ళుంటావ్
కుళ్ళు కంపు కొడుతున్నా
కళ్ళప్పగించి చూస్తావేగాని
పూచికముల్లు స్పర్శకూడ తెలియని
మంద చర్మమా నీది!
మూగ నోము వీడు
జనం ఘోష చూడు
మనిషీ మేలుకో
తిరిగబడే గొతులతో
పిడికిళ్ళతో
సామూహిక యాత్రలో
కదం కదుపు
లేక పోతే చరిత్ర హీనుడవే
యదార్థ వాది లోక విరోధి అన్నారని
సత్యాన్ని వెలుగులోకి రాకుండా చేస్తావా!
లే!...కదులు!
ఆవాజ్ దో!
24.1.2017
(విమల సాహితి సమితి - త్యాగరాయ గానసభ హైదరబాద్‌ - కవిసమ్మేళనంలో చదివినది)

Tumrees 4

kapila raamkumar Tumrees 4
మనసులోనే
మదనపడకు
మనసున్న వారితో
అరమరికలేక
మనసు విప్పుకో!
తేలిక పడుతుంది
దిగులు
పారిపోతుంది
స్వాంత్వన కలిగి
మది తేలిక పడుతుంది!
లోలోపలే ఆణచి వేస్తే
సరిచేయలేని
కణితౌవుతంది
మనసును కృంగతీస్తుంది

Saturday, January 14, 2017

Mini poem January

' సన్‌ ' ( son) క్రాంతులు 
రాజకీయాలైనాయ్‌
' సమ్‌ ' ( sum)క్రాంతులు 
బయటకు రానంటున్నాయ్‌
' సమ్‌ ' ( some) క్రాంతి తోనే 
సంక్రాంతి జరుపుకో
వాస్తవాన్ని చూసి మురిపో:
గతాలతో మాత్రం తూచకు
తూలి పడతావ్‌!
15 జనవరి 2007

Tuesday, January 10, 2017

కపిల రాంకుమార్‌ || టుమ్రీలు జనవరి ||

కపిల రాంకుమార్‌ || టుమ్రీలు జనవరి ||
నీ ' అడుగు '
అట్టడుగెందుకయ్యిందని
అడుగు!
**
విసుగు చూపటం కాదు
కసిగా గురిచూసి
మసిచేయటమే లక్ష్యం కావాలి
**
నిజాలు తెలిసినా
అహాలు వీడని బతుకెందుకు
నిజం నిప్పైనపుడు
మోహాల్ని కాల్చదెందుకు !
**
దుందుడుకు కాదు
దుముకే అడుగులో స్పష్టతుండాలి
కనిపించేది శత్రువు కాదు
అందలంలో దాక్కుంది చూడు!
**
శకునం చూసే కదిలాడు
పిచ్చిది దానికేం తెలుసు
పిక్కపట్టింది
తిక్క కుదిరింది!
**
అలవాటు పడ్డవాళ్ళు,
అలవోకగానే పెడ్డలేస్తారు
బులపాటం తీరగానే
అలకలు పూనుతారు!

జనవరి 10, 2017 ఉదయం 10.23