Friday, October 5, 2012

చెకుముకి/

కపిల రాం కుమార్// చెకుముకి//

రాయి రాయి రాపిడిలో నిప్పు పుట్టినా
వెదురు పొదల గాలి చేరి పాట పుట్టినా

అవసరాలు తీరుటలో సాధనాలు ముఖ్యం
సాధనాల పుట్టుకయే విజ్ఞానపు గమ్యం!

నీటిలోని చేప - నేల మీద జీవి
చెట్టుపైన కోతి - కోతి నుండి మనిషి
రాతి యుగం లోహయుగం - మానవ పరిణామ క్రమం
పరికరాల సంపాదన - విజ్ఞానపు ప్రగతి పథం!

గాలి ధూళి - ఎండ వాన - ప్రకృతిలో సహజం
జీవరాశి వయసు తెలుప శిలాజాల నైజం!
అనుమానపు భ్రమలు తీర్చు - వివరించును విజ్ఞానం
అనుసరించ లేకపోతే మింగివేయునజ్ఞానం!

మోసగాళ్ళ చేతిలో కీలుబొమ్మ దైవం
వ్యాపారపు సరళిలో ప్రజలనుండి దూరం!
నోట మంట మింగటం నిప్పులపై నడవటం
మహిమలేమి కావులే కృషివుంటే సాధ్యములే!

కాటిలోని కొరివి చూసి కలవరాలు వీడు
బొమికలోని భాస్వరం గాలి చేత మండు!
భూభ్రమణపు క్రీనీడలు సూర్య చంద్ర గ్రహణాలు
మినుకు మినుకు తారలన్ని నింగిలోని తోరణాలు

నేల మీద చెట్లుంటే - నింగి నుండి నీరు
లేకుంటె కాలుష్యం - జీవనమే కన్నీళ్ళు!
సాధనాల వినియోగం సమాజాన కళ్యాణం
గాడి తప్పి పయనిస్తే - జీవకోటి వినాశం!

తేనెపూత కత్తులేమొ కుత్తుకలను తెంపును
నిజమెపుడు చేదు మాత్ర - రోగాలను తుంపును!
చీకటిలో పయనించకు - నిను నీవే నిందించకు
మేలుకొలుపు పాటలతో విజ్ఞుడిగా మసలుకో!

4-10-2012

No comments: