Friday, October 26, 2012

పాలగుమ్మి విశ్వనాథం


పాలగుమ్మి విశ్వనాథం (1919-2012)
More articles by పుస్తకం.నెట్ »
Written by: పుస్తకం.నెట్
Tags: Palagummi Viswanatham
palagummi

ప్రముఖ లలిత సంగీత కళాకారులూ, గేయ రచయితా అయిన పాలగుమ్మి విశ్వనాథం గారు అక్టోబర్ 25, గురువారం నాడు కన్నుమూశారు.

“ఆకాశవాణి” ద్వారా ఆయన తెలుగు ప్రజానీకానికి సుదీర్ఘ కాలంపాటు వివిధ సంగీత రూపకాలు అందించారు. ఎందరో గొప్ప కవుల పాటలకి స్వర కల్పన చేశారు, స్వయంగా గానం చేశారు. తెలుగు లోగిళ్ళలోకి లలిత సంగీతాన్ని తెచ్చిన వారిలో ఆద్యుడిగా ఆయన్ని గురించి చెప్పుకుంటారు. బాలమురళీకృష్ణ, ఎస్.పి.బాలు, పి.బి.శ్రీనివాస్, ఎమ్మెస్ రామారావు వంటి ప్రముఖులు ఎందరో ఈయన శిష్యరికం చేసినవారే.

1919లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన ఆయన బాల్యంలోనే సంగీతాసక్తి తో వీణ అభ్యసించారు. తరువాత కొన్నాళ్ళు సినిమాల్లో కూడా పనిచేశాక, 1955లో ఆల్ ఇండియా రేడియో లో చేరి, స్థిరపడ్డారు. కాలక్రమంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎందరో కవుల రచనలని తమ సంగీతం రూపంలో జనాల మనసులో నిలిచిపోయేలా చేశారు. తెలుగు యూనివర్సిటీ వారి లైట్ మ్యూజిక్ విభాగ స్థాపనకూ, సిలబస్ రూపకల్పనకూ కూడా చేయూతనందించారు. అలాగే, వారికోసం లలిత సంగీతం పై పుస్తకాన్ని కూడా వ్రాశారు. కొన్నేళ్ళ క్రితమే ఆయన జీవిత, సంగీతానుభవాలను చెప్పుకున్న ఆత్మకథను సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు పుస్తకంగా ప్రచురించారు.

ఆయన తొంభైయవ పుట్టినరోజు సందర్భంగా సిలికానాంధ్ర వారు ప్రచురించిన వ్యాసం ఇక్కడ చదవండి.

ఆయన ఆత్మకథను సంకలనం చేసిన జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి గారే ఆయన గురించి హిందూ పత్రికలో గత ఏడాది రాసిన వ్యాసం ఇక్కడ చదవండి. ఈ కథనాన్నే తెనిగిస్తూ బ్లాగర్ నెమలికన్ను మురళిగారు పాలగుమ్మి విశ్వనాథం గారి గురించి చెప్పిన వ్యాసం ఇది.

“లలిత సంగీత స్వరాలకు ఆదిగురువు పాలగుమ్మి” అంటూ ఆయన గురించి చెప్పిన సూర్య పత్రిక వ్యాసం ఇది.

ఆయన రాసి, స్వరపరచగా వేదవతీ ప్రభాకర్ గారు పాడిన “అమ్మ దొంగా..” యూట్యూబు లంకె ఇక్కడ. ఆయనే రాసి, స్వరపరచి పాడిన “మా వూరు ఒక్కసారి పోయి రావాలి” పాటని “సరిగమలు” బ్లాగులో ఇక్కడ వినవచ్చు.

విశ్వనాథం గారు సంగీతం కూర్చిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి నాటకాలు – శర్మిష్ట, వేణుకుంజం లలోని పాటలని ఈమాట పత్రిక ద్వారా ఇక్కడ వినవచ్చు.

No comments: