Saturday, June 28, 2014

కపిల రాంకుమార్ ||రండి-పదండి||

కపిల రాంకుమార్ ||రండి-పదండి||

బొక్కసాలు నిండి
పొర్లిపోయేలా
వీధులు, వాడలు
వాసనొచ్చేలా
మానవత్వం
మంటకలిసేలా
మృగ సంచారాలకి
పచ్చ జెండా ఎత్తిన వేలంపాటల్లో
తలపండినవారే కాదు
నవ యువకులు పోటీ పడి
మద్యవిక్రయాన్ని
అందిపుచ్చుకోవాలని
ఆబగా అంగలార్చుకుంటున్నారు
యెలాగైనా దక్కించుకుని
ఆదాయపు ఆలంబన చేసుకుంటున్నారు
బడుగులను మెట్లగాచేసుకుని
అంతస్ఠులందుకోనున్నారు!
**
మరో ప్రక్క
ముంపు మండలాలు మాత్రం
గ్రామ సభల స్థాయిలోనే
మద్యం వద్దని తీర్మానిస్తున్నారు.
జనాలని మత్తులో వుంచి
ఖజానా నింపుకోటమే
తమ జనానాలకు పసందు భోజ్నాలు
ఓటేసిన జనాలకు ఓటి బతుకులు
మద్యం మహమ్మారిని తరిమేదెలా అని
మరో దూబకుంట ఉద్యమానికి
కొంగులు నడుము చుట్టుకోచూస్తున్నారు!
**
తాగ నీరు లేదు కాని
తాగ బీరు పోస్తామన్నట్టుంది
సర్కారుల తీరు!
**
మెతుకులకు సైతం అల్లాడే
కరువు వాత పడాల్సిందే
జనం రోదన చెవిటివాని శంఖనాదం కాకూడదని
గురితప్పని గిరిజన శరమవ్వాలని
అక్షరాల కత్తులు
నూరుతున్నాను.
సుక్షేత్రంలో పోరాట
విత్తులు నాటుతున్నాను.
సేద్యం చేద్దాం రండి
చేవ చూపుదాం పదండి.
***
28.06.2014

No comments: