Wednesday, July 16, 2014

కపిల రాంకుమార్‌|| సాహిత్యవ్యాసం - కొ.కు. ||

కపిల రాంకుమార్‌|| సాహిత్యవ్యాసం - కొ.కు. ||

''.....  కళా ప్రమాణాలతో పోట్లాడం రెండు కారణాలవల్ల
జరుగుతుంది. ఒకటి కావ్య వస్తువు రుచించటం, రచనా విధానం మీద
విరుచుకు పడట! రెండు గుడ్డిగా కొన్ని కళా ప్రమాణాలు మనసులోపెట్టుకుని
వాటితొ తప్ప ఏ కావ్యాన్ని చూడలేకపోవటం/చదవలేకపోవటం! ఈ రెండు
అభ్యుదయ వాదులు నిరసించతగినవే ''.....

'' ఆధునిక సజీవ సాహిత్యం రచించదలుచుకున్నవాళ్ళు వర్తమాన సాహిత్యంలో
సజీవమైన ధోరణి యేదో, ఏ ధోరణులను ముందుకు తీసుకుపోవాలో స్పష్టంగా
తెలుసుకోవాలి. అందుకుగాను  జీవితం గురించి, జీవనం గురించి, సమగ్రమైన
అవగాహన యేర్పరుచుకోవాలి.  నిత్యం కనిపించే అసంఖ్యాకమైన సంఘర్షణల్లో
ముఖ్యమైన వైరుధ్యాలను గమనించాలి. ధనవంతుడు పన్ను ఎగ్గొట్టచూడటం,
పేదలు తమ ఆలు బిడ్డల పోషించడానికి పడే బాధలు - ఆ రెంటి మధ్య కుర్ర
కారు అపరిమిత యౌవన చేష్టలు, జీవితంలో అశాంతి, అలజడి ప్రబలినకొద్దీ
పెరిగే వైషమ్యాలు బేరీజు వేయాలి.(పాలక వర్గాల దమనకాండ, వర్గ ప్రయోజనాలు,
శ్రామిక వర్గ స్పృహ, అంతే కాదు కుల,మత, ఆర్థిక, వ్యవసాయ,
సంక్షోభాలు ..ఉటంకింపు నాది ) సమాజ జీవన పురోగమన, తిరోగమనాల మధ్య  ఊగిసలాడే
సంస్కృతీ సంప్రదాయాలు వగైరానన్నిటినీ అధ్యయనం చేయాలి. ఒక అస్పష్టత
యేర్పడి, యికముందు జీవించటం దుర్లభం అని, తమ వల్ల కాదు అని/సాధ్యం
కాదు అని అనుకొన్నప్పుడు ప్రజలు విప్లవోన్ముఖులౌతారనేది స్పష్టం ''

'' ఈ నాటి మధ్య తరగతి జీవితం వ్యంగ్య సాహిత్యానికి గొప్ప ముడి సరుకు అనడంలో
అందులో కపట అభ్యుదయ వాదులున్నారు. పాము పడగ నీడ బట్టకప్పుగాళ్ళున్నారు.
వొట్టిగొడ్డు అరుపుల వాళ్ళున్నారు. కీర్తి కండూతిగాళ్ళున్నారు. ఆచరణలో తోక పీకుడు
గాళ్ళున్నారు. (అవార్డులు, బహుమతులు, పదవులు, ఆశించిన వాళ్ళు, సాహిత్యాన్ని
తాకట్టుపెట్టినవాళ్ళు, రాజకీయ వ్యభిచారానికి ప్రలొభపడినవాళ్ళు, ..ఉటంకింపు నాది)
ఎందరో వున్నారు.  వీళ్ళందరిని బట్టబయలుచేయటం అవసరం కదా. ఆభ్యుదయోద్యమం
తెల్లని వన్ని పాలని నమ్మి నడుచుకున్నది. అదే దాని అథోగతికి మార్గమేసింది ''

'' కొందరి అభ్యుదయ రచనలకు, రచయితలకు తేడా చూడటంలేదు. మహాప్రస్థానం
నాటికి ''శ్రీశ్రీ'' మార్క్సిస్టు కాడు. ఆనాడు తాని అభ్యుదయ రచయితననీ చెప్పుకోలేదు.
అభ్యుదయ రచయితలలో మార్క్సిస్టులమని చెప్పుకోని వారు కూడా జీవితాన్ని సరిగా
అవగాహనచేసుకున్నమేర అభ్యుదయరచనలు చేయవచ్చు. అటువంటివారు అభ్యుదయ
రచన అనిపించుకోలేని దానిని రాయవచ్చు. అభ్యుదయ రచయత తప్ప మిగతావారు
అభ్యుదయ రచన చేయలేరని, అభ్యుదయసాహిత్య సృష్టి వారిగుత్తాధికారమని ఎవరూ
ఏనాడూ అనలేదు. అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో ప్రవేశించిన వాడు కనీసం
అభ్యుదయ వ్యతిరేక రచనలు చెయ్యకుండా ఉండేందుకే '' మార్క్సిజం '' తెలుసుకుని
ఉండాలనేది మాత్రం అక్షర సత్యం! అందులో అక్షేపించడానికేమున్నదో నాకు అర్థం కాలేదు ''

'' శ్రీశ్రీ'' రాసినా ''కొ.కు.'' రాసినా అవి  మార్క్సిస్టు అవగాహనతో కూడుకున్న
రచనలే కనుక అందరికీ నచ్చాయి, కనుకనే ఇతర భాషల్లోకీ తర్జుమా అయినవి. ఒక వేళ
సరదాకి రాసివుంటే ఏనాడో అవి గాలికి కొట్టుకుపోయేవి. మేలైన రచనలు చేసినవారిలో
అభ్యుదయరచయితలున్నారు, ఆ సంఘంలో సభ్యులైనా, కాకపోయినా వారు అభ్యుదయ
రచనలు చేసారు. వారికి మార్క్సిజం తెలిసివుండవచ్చు, తెలియకపోవచ్చు. కాని
వారి రచనలలో అనివార్యంగా వస్తు, భావ రీత్యా ' మార్క్సిజం ' తొంగి చూచింది.
కాబట్టి ' కమ్యూనిస్టు ' కాని వాడు కూడ అభ్యుదయ రచనచేయవచ్చు. చాల మందికి
ఈ అభిప్రాయంతో పేచీలేదు.(ముందే చెప్పుకున్నట్టు మహా ప్రస్థానం రచనాకాలం
నాటికి శ్రీశ్రీ కమ్యూనిజం కాని, మార్క్సిజం కాని తెలియదు.) ''
 
(సృజన ప్రచురణలు) 15.7.2014



No comments: