Tuesday, December 22, 2015

||కర్రుకాల్సి వాతెయ్యాలిరా తమ్మీ!!



కపిల రాంకుమార్
||కర్రుకాల్సి  వాతెయ్యాలిరా తమ్మీ!!||

ఉద్యమం మాంచి-కాకమీదున్నపుడు
కుర్ర్కారుకు వెర్రెక్కించి
అరసేతి ఐకుంఠ పదవుల
పందేరం వెట్టి
తీరా ఒడ్డుచేర్నంక
దుడ్డుతిరగేసే
చెర్నకోలమోతేందిరా బాయ్‌!
సేతులూపుడు, తలూపుడుతో,మనం సేతులు ముడువబట్టే
ఆ బాడ్కావునాకొడుకులు,
యిప్పుడు మాయమాటల్త
బోర్లాకొట్టిస్తున్నరుగదా            
గారడీవోనిలెక్క మోళీ చేసి బెదిరిస్తున్నరేందే,
తాయాత్తు కొనమంటూ!



యింటనున్న నలుగురికి
పీటేసి మస్తుగా కుశాలుచేసుకుంట
చుట్టాపోల్లకి మాత్రం చెట్లకింది కాపురమెట్టమంటున్నరు
గదేమి యిచిత్రమోగాని,
శాటువు సెప్పినట్టు 
కాకులకొట్టి గద్దలకేసిన తీర్ల
గోడదూకొచ్చినోన్ని
గద్దెమీద కూకోవెట్టి
పుట్టినసంది జెండామోసి
బుజం తీపుపెట్టి
అలమటించే మూగ జీవుల్ని
గడ్డికూడ విదల్చక
గదిమి తరిమికొట్టుడేంది?
అయినా నాకు తెల్వకడుగుతా
మన జనం మరీంత పిచ్చోళ్ళైతన్నరేందే?



నారుకూ నీటైన గింజలేకపోయినా,
నోటికాడికొచ్చేలోగా
గంజి దాకలి బళ్ళుమన్నా
దొరక్కదొరికిన ఆందానితో
అప్పు తీర్చేలోంగా
మిత్తి ఆసాంతం కట్టలేదని
కత్తిపెట్టి జులుంచేస్తావుంటే
రైతన్న  దీపమైతన్నాడేందే?
కడకంటా సాగాల్సిన ఎవసాయం
మద్దెలోనే బుడగ మాదిరి పేల్తావుంటే
పల్లెల్లో సావు డప్పులు జాతరమాదిరి కొనసాగుతుంటే
కళ్ళుండి సూడలేని,
చెవులుండి యినలేని
సర్కారిదిల్చే సాయానికీ
యెగనామమెట్టడానికెన్ని సాకులో
దీనమ్మ రైతు బతుక్కిదా నాయళ్ళిచ్చే యిలువ?
సకలం యిచ్చిన్నమై మట్టిపాలౌతుంటే యాగాలంటరేందివారి!
యెనకటికెవడో నీరోరాజుమాదిరి ఫిడేలు సంబురాలెంది...
గిసుమంటివి
మతుండిచేసే పనులేనా?
అందుకే యీయేల పతోడికి
కిందపైనా తెగకాల్తోంది వారి!
ఒకరినుండి ఒకరికి బుకారోలె
రాజుకుంటేకాని బడబాగ్నివుట్టదు!
మనమిప్పుడు కేకలేసుడుకాదు
గద్దెకిందకాకవెట్టాలె!
నేల తల్లి దద్దరిల్లెలా, 
కూష్మాండం బద్దలయ్యేలా
కొమ్ము బూర, డోలు డప్పు,కంజీర మద్దెల
మిర్మిట్ట్లుకొలొపేలా మోగాల మార్మోగాల!
తిండి మీద ఆనంటడొకడు!
ఉండనీకి నీడలేదంటడొకడు!
ఊర్కుంటే కాదు
ఉరికించి గదమాలె!
వూరిపొలిమేరల్ల పోరుజెండాలెత్తాలె!

Thursday, December 3, 2015

|| యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||

|యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||'శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వర్లు - పరిశీలన వ్యాసం నుండి||
***రచయితలలో అగ్రాసనం కవిది. ఇటీవల వాడుకలోకి వచ్చిన మాట రచయిత, పూర్వం కవిగానే సర్వత్ర వ్యవహారితం. సాహిత్య ప్రక్రియలలోకవిత ఆద్యం, సర్వ సాహిత్యాలలో తొలిపూత కవితే అని చరిత్ర తెలుపుతోంది. కావ్యాస్వాదన పాఠకుని సహృదయతను మెరుగుపెట్టి, నాగరికుణ్ణి చేస్తుంది. మనసుపైన సత్కవిత వేసే ముద్ర ఎన్నటికి చెరగనిది. దాని తావి తరుగులేనిది.2015 మే 6 నాటికి దిగంబర కవిత్వోద్యమం యాభై వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అంటే దిగంబరకవుల మొదటి సంపుటి 1965 మే 6న తెలుగు సాహిత్య రంగంలో ప్రవేశించింది ఈ సందర్భంగా ప్రపంచ సాహిత్య రంగంలో కూడ యిలాంటి ధోరణులు, లేదా తీక్షణమైన కవితాసృజన జరిగిందేమోనని గమనిస్తే ఈ క్రింది విషయాలు దృష్టికి వచ్చాయి. మన దిగంబరకవిత్వానికి దాదాపుసమకాలీన సాహిత్యం సృజన చేసిన వారిలో 1. సాన్ఫ్రాంసిస్కోలో ని బిట్నిక్కులు, 2. బ్రిటన్కు చెందిన యాంగ్రీ యంగ్మన్ 3. హంగేరికి చెందిన - గాయపడిన యువకులు 4. రష్యాకు చెందిన ఎతుషెంకో అనూనాయులు 5. హాలెండ్లోని - ప్రోవో ఉద్యమం, ఇక మన దేశంలోనే '' కలకత్తా లో ఆకలితరం కవులు '' ఉత్తర ప్రదేశ్లో అనామ కవిత్వోద్యమకారులు, మహారాష్టలోని ఆఫ్వర్గం వారి సాహిత్య ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దిగంబర కవులపై ఉండివుండవచ్చునని ఆచార్య కాకర్ల వెంకట్రామ నరసింహ్వం గారు తమ ''ఆధునికాంధ్ర కవితా సమీక్ష'' లో పేర్కొన్నారు. ఈ ఆరుగురిలో చెరబండరాజు, జ్వాలాముఖి దివగంతులుకాగా, కొన్ని కారణాంతరాల వలన 1971 తరువాత సాహిత్య ప్రపంచాన్నుంచి తప్పుకుని మహాస్వప్న నెల్లూరు జిల్లా లింగ సముద్రంలోనూ, భైరవయ్య విజయనగరంలోను స్థిరపడ్డారు. నిఖిలేశ్వర్, నగ్నముని హైదరబాదులో వుంటూ సాహిత్య లోకంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.. మిగతా కవులకు భిన్నంగా వారి పేరుమీద వారాలని: స్నేహ వారం, విశృంఖల వారం, క్రాంతివారం, సృజన వారం వికాసవారం, అనంత వారంగా పేర్కొన్నారు. ఋతువులను ఆశఋతువు, తపన ఋతువు, అశ్రుఋతువు మదిర ఋతువు, విరహ ఋతువు, విషాద ఋతువులుగాను, సంవత్సరాలను నగ్న నామ సంవత్సరం నిఖిలేశ్వరనామ సంవత్సరం, జ్వాలాముఖినామ సంవత్సరం, చెరబండనామ సంవత్సరం, భైరవ నామ సంవత్సరం మహాస్వప్న నామ సంవత్సరాలుగా ప్రకటించడంద్వారా సాహిత్యంలో ఒక నూతన ఒరవడిగా మొదలైనట్లు భావించవచ్చు. వాటి క్రమంలో 6 సంపుటాలుగా వెలువరించాలని వారు మొదట భావించినా మూడు సంపుటాలను మాత్రమే పరిచయంచేసి అర్థంతరంగా అనివార్య కారణాల వల్ల ఆపివేయటం కొంత నిరాశ కలిగించినదని చెప్పవచ్చు.
** మొదటి సంపుటం ''ఇతి శాసనం'' లో దిగంబరశకం, నగ్ననామ సంవత్సరం ఆశఋఉతువు (సరిగ్గా క్రీ.శ.1965 మే)న ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్న ప్రప్రధమంగా తాము దిగంబర కవిలమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చేయడానికొస్తున్న నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, భైరవయ్య, చెరబండరాజు, మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా, స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని పేజీల్లో పట్టుకోవడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ అంటూ వాళ్ళ ఆగమనాన్ని తెలియచేసారు.
రెండవ సంపుటం '' దిక్లు-30'' దిగంబరశకం, నిఖిలేశ్వరనామ సంవత్సరం, మదిర ఋతువు (సరిగ్గా క్రీ.శ.1966 డిసెంబర్) లో ఇంకా భయంభయంగా బానిసత్వంగా దుర్భరంగా, హేయంగా, ఛండాలంగావున్న ఆంఢ్రదేశమనే మురిగ్గుంటలోంచి నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్నలు పలికిన కవిత దిగంబర కవితాప్రచురణ సమర్పిస్తున్నది అని దిగంబరశకాన్ని తెలియచేసారు.
మూడవసంపుటం: ప్రజల అవిద్యని, అజ్ఞానాన్ని, అశక్తతని, ఆసరాగా తీసుకుని దేశాన్ని దోచుకు తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాలవాళ్ళు నేడు ప్రజలపై రుద్దుతున్న '' కుష్టు వ్యవస్థ''ని ఎదుర్కొంటూ దిగంబరకవులు పలికిన జ్వాలానామ సంవత్సరం, విషాద ఋతువు (సరిగ్గా క్రీ.శ. 1968 జూన్) లో దిగంబర కవితా ప్రచురణ వినిపిస్తున్న్నది అని తెలియచేసారు. ఈ దేశంలో ఈ ఇరవైయేళ్ళ స్వాతంత్ర్యంలో భయంకరంగా, విజృంభించిన కులమత దురహంకారానికి, ధనమదంతో యధేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్న గుండాయిజానికి సినిమా రొంపిలో ఈదులాడుతున్న యువతరం బలహీనతకి, స్తోత్రపాఠాల కుడితిలో పడిపోయిన పత్రికాలోకం పడుపు జీవనానికి, అతీత జీవనంతో తప్పించుకు బతుకుతున్న మేథావుల అనాసక్తతకి, నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి, నేటి ఈ కుష్టువ్యవస్థకి క్రూరంగా బలైన కంచికచర్ల కోటేశు స్మృతికి ఈ మూడో సంపుటం అంకితం చేసారు. ( ఇది హర్షించదగ్గది) దిగంబరకవులు తమ మొదటి సంపుటిలో ఒక విషయాన్ని స్పష్టం చేసారు. తమ కవితా ప్రక్రియని వచన కవిత్వం అనమని, అననివ్వమని అన్నారు. ఇకనుండి దిగంబరకవులు తమ కవితా ఖండికను 'దిక్' అనే ఖండికలను దిక్కులనీ వ్యవహరిస్తారు. జబ్బుపొరల్ని చీల్చి కాస్మిక్ మార్గాన్ని నిర్దేశించేవి దిక్‌లు . మానవత్వపు విలువలే వీటిహద్దులని చాటారు…
**…
( ఇంకా వుంది - స్థలాభావం చేత సంక్షిప్త సమాచారం తీసుకున్నాను)
6-5.2015/3.12.2015

Wednesday, December 2, 2015

కపిల రాంకుమార్‌ || అస్తవ్యస్తమైన మనోచిత్రం ||

కపిల రాంకుమార్‌ ||  అస్తవ్యస్తమైన మనోచిత్రం ||
అక్కడకెళ్ళిన తరువాత
ఎందుకొచ్చానానని ఏడ్చాను,
మరుక్షణమే నిబ్బరించుకున్నాను
గతకాలపు మైలురాళ్ళను పాతిన
జిగినీదోస్తులెవరైనా
మాటల మరమరాలందిస్తారని!
నాలుగడుగులేసాను
నివ్వెరపోవటమే నా అంతు!
మామిడి చెట్టు కూలిపోయెంది
కొబ్బరిచెట్టు మాడిపోయింది!
శ్మశానంలో సమాధిలా పాత పెంకుటిల్లు!
తెలిసందప్పుడే కాలానికి ద్యాదాక్షిణ్యం లేదని
గొంతెత్తి ఆందోళన చేసినందుకు
కఠినచట్టపు చట్రంలో నలిగిపోయుంటారని
గ్రహించడానికి దాదాపు అర్థగంట పట్టింది!
ఎప్పుడూ కబుర్లాడుకునే చోట కాక
మస్తాను భాయ్‌ చాయడ్డాకాడికెళ్తేకాని
గతంలోని జెండా దిమ్మ పక్కనే
మరొక ఎర్రజెండా దిమ్మ కన్నీళ్ళెట్టుకున్న సవ్వడి
డికాషన్‌ బాయిలర్‌లో కుతకుత చప్పుడుకు
భిన్నంగా పలకరించింది!
అప్పుడుకాని లోకంలోకి రాలేదు!
అస్తవ్యస్తమైన మనోచిత్రాన్ని తొలగిస్తూ,
స్మారక స్థూపాన్ని చూసి విలపించడం కాదు
వారిలా మనమూ స్వరం వినిపించాలని
దిక్కులు పగిలేలా నినదించాలని
సందేశమిస్తున్నట్లనిపించి
పిడికిలి బిగించి, వందనం కావించి
కర్తవ్యం యేమిటో కనులముందు ఆవిష్కరించుకుని
కలానికిలా కలకలం సృష్టించే పనిపెట్టాను.
ప్రశ్నించడం
సమాధానం రాబట్టమే
మన లక్ష్యం కావాలి!
2.12.2015