కపిల రాంకుమార్|| ఆగంతకుడు||
ఆ ఆగంతుకుడు
యేన్ అన్‌నోన్ ఆర్ యు.ఎఫ్.ఓ లాగ
ఆరడుగులుంటాడు.
ముఖం చాటేసుకుని
ముచ్చట్ల పేర కామశాస్త్రాన్ని
నిత్యపారాయణంలా స్తోత్రం చేస్తుంటాడు!
చతుర్దశ విద్యలు చదువుకున్నాటంటాడు కాని
సంస్కారం మాత్రం బొత్తిగా లేదు
ఉప్పులేని కూరలాంటోడు!
ఎన్నిసార్లు గెంటేసినా కుంటిసాకులతో
చిన్నోడి మంచితనాన్ని బుట్టలో పడేసి
భుజాలెక్కి కూర్చుంటాడు దిగనంటూ!
సిగ్గులేక మన గడపముందే
ఆంధ్ర నాట్యంచేస్తానంటాడు
ఆరంగేట్రంనాడే బూతు చిందులేస్తూ
అదే తన జాతి గౌరవమంటాదు
రెచ్చగొడతాడు,
చిచ్చుపెడతాడు,
చూపులో క్రౌర్యం, భాషలో కాఠిన్యం
గుండె మెత్తగావుంటే
బలమైన గుండుతో
గునపంలా ఒదేస్తాడు!
కవిత్వమంటే , కొత్త భాష్యం చెప్పచూస్తాడు
చెంపదెబ్బలు తాకినా - దులుపుకుపోతాడు,
జంకులేకుండా - రంకుకట్టే సంకుచిత ధోరణితో
సాత్విక వేషంతో - ఘాతుకాలు సలుపుతాడు,
అమాసకి, పున్నానికి - పిచ్చిలేచి
విరుచుకుపడుతూ
విశ్వవిఖ్యాత నటసార్వభౌముని వారసుడనని,
చౌడప్పని, ముద్దుపళనిని ఆదర్శంగా
కొక్కోకం బోధింపచూస్తాడు
కనపడితే కాలిచివేత ఉత్తర్వులున్నా
ఖాతరుచేయడు!
అప్రమత్తత లేకపోతే - మిమ్మల్నే కాటేస్తాడు,
వాడు సైకో కన్నా, ఉగ్రవాది బిన్‌లాడెన్ కన్నా మిన్న!
ఇక మీ చేతిలోని పెన్ను - గన్‌లా మారాల్సిందే!
లింగధారుడ్నంటూ లింగోద్భవవేళకి
కామకేళికి ఆడదైతేచాలు
వయసుతో వరసతో నిమిత్తంలేదు
చొంగకార్చినంత తేలిగ్గా, కళని దిగకార్చేస్తాడు
సంస్కృతీ యోనుల్నికాల్చి, నేనో యోగిపుంగవుణ్ణంటాడు
వాడి మూలాలతో సహా
ఆనవాళ్ళేమీ మిగలకుండా
పెకిలించితేనే మనకు మనశ్శాంతి
లేదా మనలనే బలిచేస్తాడు!
జాగో !యారో!...మారు వేషాలతో తిరుగుతుంటాడు
తస్మాత్ జాగ్రత! జాగ్రత!
No comments:
Post a Comment