Monday, June 10, 2013

సాహిత్యంలో కవయిత్రుల చురకలు

కపిల రాంకుమార్||  సాహిత్యంలో కవయిత్రుల చురకలు||
రాజుల కాలంలో పుట్టినదైనా, నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో , దుష్పరిపాలనలకు
అధికార వ్యామోహాన్ని, అధికారంతమున యెలావుండగలదో అని చెప్పేచాటు పద్యం
'' విధి సంకల్పమునచె నాకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువచూపు తక్కువ సదా భాషల్ దురుక్తుల్ మనో
వ్యథతో మత్తతతోడ దుర్వ్యసన దుర్వ్యాపారతన్‌ జెందు, న
య్యధికారాంతమునందు చూడవలదా యాయయ్యసౌభాగ్యమున్‌''

కవి ఎవరైనా, కాలం యెప్పటిదైనా, నిత్య ప్రయోజనంగల పద్యమొకటి
'' వాసనలేని పువ్వు, బుధవర్గలేని పురంబు, నిత్య వి
శ్వాసములేని భార్య, గుణ్వంతుడుగాని కుమారుడున్‌, సదా
భ్యాసములేని విద్య, పరిహాసములేన్మి ప్రసంగవాక్యమున్‌
గ్రాసములేని కొల్వు, కొఱగానివి, పెమ్మయ సింగ ధీమణి! ''

మరొక మచ్చుతునకను పరిశీలిద్దాం.
'' ఆడిన మాటలు దప్పిన
  గాడిదకొడకంచందిట్టగా, విని, యయ్యో
  వీడా, నా కొడుకని,
  గాడిదయేడ్చెందగదన్న ఘనసంపన్నా''
తిట్టులో హాస్యం - హాస్యంలో లౌకికం ప్రతిబింబించడం చాటువుల
లక్షణంగ చూడచ్చును.వ్యంగ్యం, కోపం, హాస్యం, తిరుగుబాటు తత్వ
కవిత్వ ధోరణి, అటు స్త్రీవాద కవిత్వంలొనూ మనము చూడవచ్చు.
మచ్చుకుకొన్ని మీ ముందుంచుతాను.

శ్రీమతి కె. సీతాపిరాట్టమ్మ వ్రాసిన ఈ కవితను చూడండి.
యజ్ఞయాగాది నిత్యాగ్నిహోత్రములెల్ల జుట్ట్ బీడిల్లో చుట్టబడియె
వేదపురాణముల్ విపరీతములటంచునండఱి భావంబులమరియుండె
భక్తివిజ్ఞానముల్ పరిపూర్ణమై తలన్‌ గ్రాపు రూపంబుతోగ్రాలుచుండె
నేయింటిపైజూడ '' నింగ్లీషు'' భాషలో బేర్లను చెక్కించిపెద్దలైరి ''
అన్యభాషపై మోజు ప్రభావం యెలావుంటుందొ వివరించిన ఈ కవయిత్రి
1934 నాటి సామాజిక చిత్రాన్ని మనకు చూపారు.
స్వాతంత్ర్య కాలంలోనో, తరువాతి యితర ప్రజాఉద్యమాలలో, సామాజికచైతన్యం
కోసం కలాలతో నిరసన తెలిపిన మరి కొందరి కవిత్వాన్ని ని రేఖా మాత్రంగా తడుముతాను.

'' రండదొరల రజాకార్ల జూసారూ!
  ప్రజలు నడుంకట్టి రణ్మందు దూకారూ
 ముసలమ్మలు, ముసలయ్యలు లేచారూ
 వారిచేతికందిన కర్రబడితెలే బట్టారూ ''
తెలంగాణా రైతాంగ సాయుధపోరాటకాలంలో ' కమల' అన భర్త అప్పన్నతో కలసి రాసి,
పాడిన గీతంలోనిదీ భాగం.

'' వృత్తి విభజనజేసి - ఊడిగము మనకిచ్చి
పురుషవర్గము వారు బులిపొంచివేసారు
ఆర్థికముగాస్త్రీల, ఓ సోదరి - అణగదొక్కేసారూ'' అంటారు వట్టికొండ  విశాలాక్షి  తన తిరుగుబాటు
స్వరం వినిపిస్తూ.

'' మేలుకో మేలుకో చెల్లెలా - మేలుకోకుంటే చిట్టి చెల్లెలా
ఉన్నవాళ్ళ యిళ్ళలోనా - ఊడిగాలే చేసుకుంటూ
పరులకోసం సొంత సుఖముల మరిచిపోయున చెల్లెలా
అమ్మగారీ కానుపైనా - అయ్యగారి పానుపైనా
అన్నిపనులు నెత్తినేసుక అణిగిపోయిన చెల్లెలా ''
అంటూ శ్రామిక మహిళల లైంగిక దోపిడిపై గళమెత్తిన గుజ్జుల సరళాదేవి కవిత చురకత్తిలా దూసుకెళ్ళింది.

'' నా దేశం బూర్జువాలని భుజాలమీద మోస్తూ
అమ్మమెరుగని వెర్రిజనాన్ని కాళ్ళకింద కసాబిసా తొక్కేస్తూ
ప్రగతిప్రగతంటూ పొలికేకలు  పెడుతోంది '' అని అత్తలూరి రాజ్యలక్స్మి పాలకవర్గాన్ని తూర్పారబట్టారు

'' కాంతను చూడగానే కన్నుగీటే
కామాంధులకు కారుచిచ్చునునేను
ఆడవారంటె ఆటబొమ్మలనుకునే
వారికి తోకచిచ్చునునేను '' అని తోకలంటించారు వాసా ప్రభావతి

'' పీడిత ప్రజా పోరులో సగాన్ని కదనంలో నిలిచిన కామ్రేడ్ ని
ఆదిమ గణాలకు నాయకత్వం నెరపిన ఆదిమానవిని ''
 అంటూనే...'' ఒళ్ళంతా కళ్ళుండాల్సింది
అహల్యకు, వరూధినులకే
ఇంద్రుళ్ళకి, చంద్రుళ్ళకి కీచకులకీ కాదు ''  అంటూనే
'' ఒళ్ళంతా కళ్ళే కాదు, మూళ్ళుండాలి
రోమరోమాన సిస్కాగ్రాఫులుందాలి '' అని తనదైన ఉద్యమ ధోరణిలో, వైప్లవ్య
చేతనాపూరిత కవితను  తీక్షణమైన ప్రతీకలతోపూరించారు రత్నమాల!

'' తొలిపొద్దు చీకట్లో, వాల్ పోస్టర్ల్ అతికించివచ్చి
నువ్వు తలుపు మీటిన జ్ఞాపకం
తలుపు తెరచిన నుదుటిమీద
ఉద్యమానికిపట్టిన చెమటను
చీరకొంగుతో అద్దిన జ్ఞాపకం '' ..స్త్రీవాద విప్లవ తత్వాన్ని పుణికిపుచ్చుకున్న
ముస్లింవాద కవయిత్రి  మహజెంబీన్‌ అంటారు. ఆవిడే ,మరో కవితలో
'' రాజ్యం తల్లి లాంటిది
అన్నలు తోడపుట్టినవాళ్ళు
అణిచివేత
యే రాజ్యానికి శోభనివ్వదు!..''

అంతటితో వూరుకోక మరొక చోట '' మాటలు రానపుడు యేమోగాని
పోరాటంచేయ కలసినపుడు
చేతులు కట్టుకు కూర్చోడం యికపై నా వల్లకాదు '' అని కూడ నొక్కి చెప్పింది మెహజన్‌బీ.

'' రంగుల్ని (వర్ణలను)చీపురు కట్టతో ఊడ్చి
రోడ్డవతల పారబోస్తా!
ఈ పుండు పగలకోసి మందేసి  కట్టి కట్టడమే,
యిపుడు నా కర్తవ్యం '' అంటారు ఎం.సీతాలక్ష్మి   అంబేద్కర్ కులనిర్మూలన దిశవైపు పయనిస్తూ.

'' అమ్మకి సేవ చేసినప్పుడు,
అమ్మవంటిదే అయిన జన్మ భూమి కోసం పనిచేసినపుడు
డబ్బులు ( ఫించన్‌)తీసుకుంటావా?  '' అని ప్రశ్నిస్తారు - కళాసహాని ఒక కవితలో

'' ప్రేమ యిపుడొక అంటువ్యాధి
నాగరికుల నెత్తురు  తోడుతున్న క్యాన్‌సర్,
నిన్నటి బానిస యివాళ నాగరికాత్మ కోసం వెంపర్లాడుతున్నాడు
ఓ రాబందు నీడ భూతలంపైన గిరికీలు కొడుతోంది '' - అని జమీలా నిషాత్  కవితాగ్రహం వెళ్ళకక్కారు.

'' వంటింటి సామ్రాజ్యానికి
మా అమ్మే మహారాణి,
అయినా వంటింట్లొ గిన్నెలన్నిటిపైనా
మా నాన్నపేరే? ' పురషాధిక్యతను వ్యంగ్యంగా నిలదీసారు కొనకంచి శారదాదేవి.
'' నేను పుట్టిన దేశంలో
రాజ్యాలేలిన రమణులున్నారు
రాళ్ళల్లే బతికిన రమణులూ వున్నారు
అసిధారపై అడుగులు అలవోకగా వేయనేర్చిన వాళ్ళున్నారు
మా యిళ్ళ అడపడుచులు సమస్యలే
తొలిశ్వాసగా వుపిరి తీయ నేర్చిన వాళ్ళున్నారు '' అని వివరణ్నిచ్చారు సి. వేదవతి తన కవితలో

తనదైన తీవ్ర నిరశన స్వరంతో శీలా సుభద్రాదేవి ఒక కవితలో యేమన్నారో చూడండి
 '' నన్ను ఆడదాన్నని అనకు!
నేను యెక్కడదాన్ని కావాలనుకోటం లేదు
అంతా నిండివుండే దాన్ని!
సంపూర్ణమైన వ్యక్తిగా మాత్రమే గుర్తించు!
నన్ను నారీ అని మురిపించకు!
ఆదర్శాల కిరీటం ధరించి శిరో భారంతో

నీముందు తలవంచుకు నిల్చోలేను '' ఖరాఖండిగా స్త్రీని నిలబెట్టాలని కలాన్ని ఝళిపించారు.

జ్యోతిరాణి ఓక సవాలు
'' అబలను నేనా? సబలనని నిరూపించుకోలేనా?
ఆపదలకు దడిసానా? మానవతను మరిచానా?
నాటికి, నేటికి - నేనే ఆరని జ్యోతిని '' అంటారు.

సమయం, విస్తరణ, సంక్షిప్తత, దృష్టిలో పెట్టుకొని,  కవితా అనంత సాగరంలో ఓక చెంచాడు
తీసుకుని రుచి చూడమనాను, శుచినిపొందమన్నాను.  యిలాంటి  సాగరాన్ని మరింత మథించి,
యెందరో మన వర్థమాన కవయిత్రులు చక్కటి, చిక్కటి పదసంపదను
సమకాలీన సమస్యలపై తూణీరాలను సంధిస్తూనేవున్నరు. యెందరో యెన్నిరకాలుగానో తమ వాణిని
బాణిని నిత్యం వినిపిస్తూనేవున్నారు. వారందరికి కవితాభినందనలు తెలుపుకుంటున్నాను.
అటువంటిని వారిని వెతికి వారి కవితాపాదాలను పరిచయం చేసుకోవాలని కోరుకుంటూ....
10-6-2013 ....ఉదయం 10.35




   




No comments: