Friday, April 11, 2014

ఓటుబద్ధ హెచ్చరిక

కపిల రాంకుమార్|\ ఓటుబద్ధ హెచ్చరిక ||

పార్టీ మారిన నేతకెన్ని కష్టాలో
దుమ్మెత్తిపోసేటప్పుడు జాగ్రతలెన్నో
తీసుకోక పాత పాటే పాడితే
ఓట్లు రాలకపోగా తాటతీసి తన్ని తగలేయగలరు
యింటికి పంపుతారు జనాలు
మారేటప్పుడు వళ్ళు దగ్గరపెట్టకున్నా
ఇప్పుడుమాత్రం జర భద్రం!
సీటు గెలవాలంటే!
**
గుర్తు తప్పు చెప్పినా
అధినాయకుడి పేరు మర్చిపోయినా
ప్రస్తుతాన్ని స్తుతించిక పోయినా
ఏ యెండకా గొడుగు పట్టకున్నా
సమావేశాల్లో, ప్రెస్ మీట్లో నోరు పారేసుకున్నా
జోరువాన పడ్డట్టు
చెప్పులు పడొచ్చు
కుర్చీలు మీద పడొచ్చు
అలో లక్ష్మణా అని
తప్పించుకోలేక
యే సోదరి కోక కట్టుకోక తప్పదు!
ఆకట్టుకోక తప్పదు!
**
ఇన్నాళ్ళు నమ్మిన జనాన్ని
మోసగించడానికి
సిగ్గు తీసి ఇంట్లోపెట్టి
మనస్సాక్షిని హత్యచేసిన రక్తపు చేతితో
రెండు వేళ్ళూపుతూండాలి
అవలక్షణాలన్నీ వంటబట్టకున్నా
మనుగడకే తిప్పలొస్తాయి
మళ్ళీ కొత్త గెంతు వేయాలి !
**
తెలివైన కుందేలు ముతరాసోని వలలో పడ్డట్టు
మతతత్వమంటూ రంకెలేసి
మఠాధిపతుల ఒళ్ళో వాలాలి కదా
కాలు విరగ్గొడతానన్నవాడివి
వాని కాళ్ళకాడికే చేరాలికదా
యేమొ
జనం తెలివితో
ఓటిది కాని ఓటుతో
బలంగా ఓ పోటు పొడిస్తే
కాటుకు తట్టుకోలేకపోతే
గోచి సర్దుకుని గోడ దూకటానికి సిద్ధపడాలి కదా!
**
దాదాపు పార్టీలన్ని
బారులు తెరిచి బార్లా తెరిచి
అహ్వానిస్తాయని యెల్లపుడు కలగనకు!
ఒక్కొక చోట గడీలమించిన
అడ్డుగోడలు లోపలిలి రానీవు
అప్పుడు నీగతి అధోగతి
పేడకళ్ళు, చీపురు దెబ్బలు
తప్పించుకోకలగాలి
మద్దతిచ్చే పర్టీలు
ముద్దకుడుములు పెడతాయనుకోకు
బూడిదలో పన్నిన కుక్క వైరాగ్యంలా
పాతవి గుర్తుకొస్తే
మడత పేచీలు పెట్టి
నీ బతుకు సంకరం చేసి
శంకరగిరిమాన్యాలు పట్టిస్తాయి!
**
పదవే పరమావధికాదు
ప్రజలకొరకు పనిచేయ
నియమబద్ధ, నిబద్ధత కలిగి
నాయకత్వం వహిస్తే చాలు
గౌరవాలు పొందటానికి
అంతే కాని వంకలేనమ్మ డొంకట్టుకు
యేడ్చినట్లు కబుర్లు చెప్పకు!
అజెండాలకు నీళ్ళొదిలి
జెండాలట్టుకు తిరుగకు!
ఇది ఓటుబద్ధ హెచ్చరిక!
**
11.4.2014 సాయంత్రం 5.55

No comments: