Wednesday, April 23, 2014

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? |

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? ||
ఊళ్ళో పెళ్ళైతే
కుక్కలకు హడవుడని
ఎందుకన్నారో కాని
కాట్లాడుకుంటున్నప్పుడు
కుప్పతొట్టి రణరంగమైంది
అయినా అది
నాకు ఆశ్చర్యమనిపించలేదు!
పక్కనేవున్న సర్కారీ హాస్టలు పోరగాళ్ళు
ఫంక్షన్‌హాలు గేటువద్ద
పడిగాపులు కాస్తూ బతిమాలుకుంటుంటే
వాచ్‌మన్‌ పొండిరా పొండని అరుస్తుంటే
ముక్కున వేలుపడింది!
సర్కారు వాళ్ళ కడుపులను
అర్థాకలి గురిచేసి
మిగిలిన దానిని అర్థంగా మార్చి
బొక్కసానికి బొక్కపెట్టి
తమ బొక్కసం నింపుకుంటున్నపుడు
ఆశ్చర్యమేసింది!
అందుకేనేమో
ఆ పోరళ్ళప్పుడప్పుడు
బడికెళ్ళే దారిలో వంకర చూపులతో
ఇండ్ల దొడ్లో కొబ్బరికాయలకో
జామకాయలకో గోడలు దూకి
రాళ్ళు రువ్వుతుంటే గమనించాను
కొండకచో గద్దించే వాడిని!
పల్లెటూళ్ళో అమ్మ అయ్య
వీరి బాగుకోసం తాపత్రయంతో
హాస్టల్‌కు తోలితే
అజమాయిషీ లేని వీళ్ళు
యిలా అర్థాకలితోనో
బాల్య చాపల్యంతోనో
పొరుగువాడి వస్తువులపై
కన్నేస్తున్నారంటే.... ఏమటర్థం?
సంక్షేమం ఇలా
సంక్షోభాల్ని
సంక్లిష్టతలని
పురుడుపోసుకుంటుంటే
సమాధానం ఎక్కడ దొరుకుతుంది!
రేపు బాల నేరస్తులగానో,
కరుడుగట్టిన నేరగాళ్ళైతే
సమాధానం ఏది?
23.04.2014

No comments: