Wednesday, March 20, 2019

మునాసు వెంకట్...కవితాసంపుటి పరిచయం...యెదను దోచే మెద కవితల సంపుటి
.......................
మెదలోని కవితలు యెదలోతుల్లోకి జొరబడ్డాయనేదన్నది పచ్చినిజం. సత్తెపెమానకంగా
సెప్పుతున్నానన్నట్టు. నల్గొండ జిల్లాలోని అచ్చమైన పల్లెటూరు కవి మునాసు వెంకట్‌ కైతల బొక్కు నిన్ననే సదివినా. పుస్తకం మొగదలలోనే ''అ.సు.ర'' యెల్లబెట్టినట్టే ఉన్నదన్నట్టు. సోచాయించేపనిలేదు. మంచి దావత్‌ పొందినట్టు, తాడి తోపులకెల్లి అప్పుడే దింపిన లొట్టిలోని నికార్సైన వెచ్చటికల్లు తావినట్టున్నది. తియ్యగా, జర కొంత మత్తుగ మట్టివాసంతో. దోస్తులందరు సదివితీరాల్సిందే. దక్షిణ తెలంగాణా నల్గొండ జిల్లా బేస్తల యింట బుట్టిన మునాసు వెంకట్‌ చేతిలోని కవితాచేతన చందమామగా రూపెత్తి, యింటి భాషలో ముచ్చట్లు పెడ్తవుంటె సెవులకు సమ్మగుంటయన్నమాట ఆచార సత్తెం అందుకు అంబటి సురేంద్ర రాజు సరిగానే జోకిండన్నట్టు. ఈ కితాబుకిట్టి కితాబిచ్చినాయనకు, అత్తొత్తించిన వెంకటికి అభినందనలు. నెనరులు. శెనార్తులు.
ఇగ కైతల ఫలారం పంచుతా రండ్రి.
'' నిజమె ముందుగాల చెబుతున్నాం
అన్నింటికి ముందునుండి ఆగమైనోళ్ళం
కొడుకుని పోగొట్టుకొని,
కొరివిపెట్టి - మనసు కోదసండమేసుకున్నోల్లం'' అని మొదలిడి తెలంగాణ అస్థిత్వ పోరాటం యెన్నటికీ కొనసాగాలనే తీవ్రకాంక్షతో
'' మళ్ళీ యెలక సచ్చిన వాసన రాకముందే
అణగారిన ఆటపాటలతో ఈ నేలంతా అలుకుతూనే వుంటం!
యేకమై ఏలికైన దాకా'' - సామాజిక తెలంగాణ పీఠం పొందేవరకు అనే మర్మగర్భపు భావన ప్రస్ఫుటం ఐతన్నది యీ కవితలో 6చలిని వర్ణించే కవితలో ''ఇగం'' నింపి
వణికిపోతున్న చెట్లన్ని
మంచు దులుపుకుని
యెండపొడకొచ్చి నిలబడ్డై'' యెంత సునిశిత పరిశీలనో చలికి గజగజలాడే చెట్లు, జీవాలు, వాటి స్థితి అచ్చమైన యింటి భాషలో ఎరుకపరిచాడీకవి.
''నీటి పుట్టుక సాచ్చిగా
కాసేపు నిజమే మాట్లాడుకుందాం''
ఎరుకలో అనే కవితలో '' తెల్లారింది లేస్తే అసత్యాలే పలికే
మనమిప్పుడు నిజాలే చెప్పుకోవాలంటాడు.
టపటపా రాలిపోతున్న పిట్టల్లా రైతు చావుల్ని నిరసిస్తూ '' కాలం కాలం చేసిందన్న ''
కవిత యెగసాయం పట్ల వకల్తా తీసుకున్నాడన్నట్టుంది
గుండే తడిసిస్పోయే మరో కవిత '' కయాలు''లో
''యాదికి అంతెక్కడున్నది/ యెంతెతికినా
పాతాళ గరిగెకు పానమె తగుల్తది,
బాసిగం గట్టి గీ మట్టిని అర్నాలొచ్చినట్టాయె
గుక్క బువ్వకు అయ్య తిరగని మడుగులేదు
అమ్మ పడని బాధ లేదు ''....అంటూనే
'' కానీ బిడ్డా కానీ కరువు కడుపుల బడ్డది
సొర గుంజుతుంది కాష్టందాకా కష్టం దప్పదు '' కరువు బరువును కవితలో మోసాడు మన మునాసు చాకటి, చిక్కటి యింటి పదాలాతో
కరువుకు కయాల్‌ దప్పలేదు బిడ్డా
మగనకి మండ కొట్టుకున్న ముండను
యెవరున్నారు జెప్పసెప్పుకోను
పుట్టెడు దు:ఖం, పురిటి పేగు నువ్వు దప్ప!'' అంటూ మన గుండెను మరింత తడిచేసాడు.
'' తలపైకెత్తి చూస్తే
తాటికమ్మల నెమలి
గొలపారుతుంటె
లోన పురి యిప్పిందీ''
అంటూ వొంపులతాడు మనకందించాడిలా, ముస్తాద కట్టుకుని, కత్తుల నుర్కుంటా
దినదినగండపు కల్లుగితవృత్తిని యాదిచేసిండు.అందుకే
'' గౌండ్ల సాయిలు మామ సల్లగుండాల
సిన్ననాటి నీ తోడు గుడికాడ వొంపుల తాడు ''
ఇక కైతలన్నిటి తలపాగ '' మెద'' లో
'' ఎలుమాడింది
ఎద్దు గుంజింది
పొద్దు గుంకింది
వలపొలిగిన
మట్టి మల్లేసిన
పరకలేదు
పరిగలేదు.... అంటూ లయ్బద్ధంగా కవితను మడిపిస్తాడు.
ఇలా ఎన్నో కవితలున్నాయి, అన్నింటిని తడిమితే పాఠకుల ఆనందాన్ని అడ్డుకున్నట్టవుతుంది. కొన్నింటినే నుచ్చటించాను, నాకు వంటబట్టిన తీరు.
అనుబంధంగా వున్న '' నీలి '' ఒక దీర్ఘ కవిత. 8 కవితా ఖందికలుగా వున్నా ఆరంభిస్తే కడకంటా సదివిస్తది. దీని గురించి కొద్దిగా సెప్పక తప్పదు.
మచ్చుకి వివరించినా... మిగతావి మీరు సదువుకోవాల్సిందే సుమా!
నీలి .. ఆశ్రయించే భావ కవితలో యెన్నో పద, శబ్ద చిత్రాలు
1.
'' గిక్కడే చెరువు వొద్దనే
చెవిలో గుసగుసల సంగీతాన్ని
వొంపిన ఒక లయ దాగి వుండేది '' ..శబ్ద చిత్రం
2.
నీటిమీద తెప్పలా
నీకాపిష్క కండ్లల్లో
తేలిపోతున్ననే
తెగినపతంగిలా
తెల్లారేసరికి
తేరుకుందునా! నీలి!.
నీలిని సంఓధించీ గొప్ప పదచిత్రాలెన్నో
3,
కాలం యీనిన
కర్మలెన్నివున్నా
మర్మం యిప్పి
మాటలెన్నైనా పడతా
కాని కండ్లనుంచి అలుగెల్లకే... భావచిత్రం
4.
నువ్వొస్తావని చెరువార
పండుగలావుంది
పక్షులుకూడ చేపల్ని
పలకరిస్తున్నాయి ప్రేమగా...
5.
తాలంపడ్డ తలని
పక్షి యీక తెరిపింది
లోన యీదిన గడియ
తలపై కిరీటంయేకాంత యేలికకు ....
6.
రెక్కలాడని చెరువు
రెక్కలాడే చెరువు
మధ్యలో కట్టబోసిందెవరో
నీటెంట నీటేంట
అడుగుల పాదులు
సంచార వనం
పొద్దుపొదిఉగ్న కొద్ది
పుక్కిలించిన కాల
పూనకాల గడియ
పానం వంచిన దీపం
నిగ్రహంగా ఓ విగ్రహశ్వాస
ఓ నగ్న ఆత్మ తప్ప...
యిలా బహు విధాల భావ, శబ్ద చిత్రాలను రాయడం చేయీ తిరిగిన మునాసకే సాధ్యం
7.నీట మునిగి తేలిన
పాత గుడి ఒకటి పలకరిస్తుంది
లింగమయ్యే గుండు
నంది అయ్యే గుండు
తరాలనించి నీతోనే తానమాడే
మడిలేని, ముడిలేని
తడిగుండె కదా నాది ''... అంటూ కొనసాగింపులో
'' ఒడ్డు మీద
అడ్డంగా పడుకున్న
నిద్రపూల చెట్టు
నిద్రలేవలే
నీటిని మీటే
యే చేపో
మార్మికలోకపు తాళం తీసింది
అంతరమంతా అంజనకేళి.... అంటాడు.
8.
ముక్తాయింపు ఖండికలో
'' బుడుగు బుంగ మొగుడు
చెరువుకుంటల మిండెడు
కలదిరిగొస్తున్నడె నీలి!
కడుపునింప కళ్ళమూట నిప్పి '' అంటూనే
చివరగా '' కుదురు తిరుగుతోంది
ఎలుమాడుతుంద్సి
గంగబోనమెత్తె నీలి!
కడుపు పండుతుంది!
గలమలేని యింట్లకి
గంగమ్మ పిలుస్తుంది
నీళ్ళ తిరునాళ్ళలోనే! నీలి!
నీకు సారె సంబరమాయె!'' అంటూ ముగింపు హృద్యంగమంగా వుంది.
నీలి - దీర్ఘ కవితలో నేను ఎంపిక చేసుకున్నవి మాత్రమే మచ్చుకు ఉదహరించాను.
కొన్ని పదాలు ( మాటలు ) మనమెన్నడు సదవనివీ, సూడనివి కండ్లబడ్తయిందులొ.
అసుమంటివి ఒక అనుబంధంగా చేర్చి అర్థాలు తెలిపే పదకోశం పెడితే బావుండేది.
అందునా తెలంగాణ భాషా సౌందర్యమందరికి అందుబాటులోకి వచ్చివుండేది. ఈ సంకలనం భాషా పరంగా మరీ వివరణాత్మక పరిశోధనకు అర్హమైనదిగా భావిస్తూ
పరిశోధకులు దీనిని ఒక చూపు చూస్తే యెంతో మేలు చేసినవారవుతారు.
మంచి సరుకున్న కితాబిది.'' నాగుండె నింపిండి!
గుండే పిండింది!
గుండె తడిపింది!
మరింత స్పందన కలిగించింది! అందుకే నిండైన మనసుతో అభినందనలు తెలుపుతున్నాను, ఒక సూచన తప్పనైసరి అనిపించింది,, అక్కడక్కడ గ్రాంధిక పదాలను
రానీయకుండక్వుంటే బావుండేది. యింటి భాషలోనే రాయడానికి అవకాసం వుంది.
అచ్చమైన మట్టి భాషలోనే '' మెద '' ను అందించిన మొనాసు వెంకట్‌ తెలంగాణాకే గర్వకారణమైన కవి. సందేహంలేదు.

No comments: