Wednesday, March 20, 2019

కపిల రాంకుమార్.||ఎన్నికలలో ఎన్ని కలలో మరెన్ని కల్లలో||
రాష్ట్రానికేదో గత్తరొచ్చినట్టు
జనాల గుండెలు అవిసేలా
అలసిపోయేలా ఒకటే రణగొణ ధ్వని
ముందస్తు ఎన్నికలంటూ ముసళ్ళ పండగలా
ఇద్దరో ముగ్గురో ఐతే పరవాలేదు
అంతకుమించి పోటీచేస్తు పలురకాల ముసుగులు తగిలించుకుని
వాళ్ళ తాతలు నెయ్యి తాగారు మా మూతులు వాసన చూడమనే వారొకరు
గతంలోని పాలకులు పొడిచిందేమిలేదంటూ
చారిత్రిక అంకెలు తారుమారు చేస్తూ
గారడీవిద్యలలో ఆరితేరిన వాగాడంబరాలతో చెవుల్లో కాబేజీ పూవులెడుతున్నారు
ఎన్నికల ప్రణాళిక సాకు చూపి మాదెంత పొడుగో చూడమంటూ
మేమెంత సాధించామో చెప్పే అబద్ధాలకు అంతేలేదు
ఇప్పటి పాలక పార్టీయైనా,
గతంలో చచ్చుబడిన పార్టీయైనా
సామాన్యుని ఆశలు కుప్పకూల్చిన వారే తప్ప
నిజాయితీగా ఈ మేలు చేసామనేవి మచ్చుకు కూడ లేవు.
ఒకటో రెండో అరకొరగా చేసినవి
కొన్ని దాదాపు శిథిలావస్థకు చేరుకున్నవే
మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయ్‌
నిలిచివున్నవిమాత్రం వారి అనునాయీలకు కట్టబెట్టినవే!
రోడ్ల అధ్వాన్నం జిల్లా కేంద్రాల్లోనే
కాదు రాజధాని నడిబొడ్డులోనే వానొస్తే
చెరువులను తలపిస్తూంటాయ్‌
ఓట్లు పడవనే నెపంతో తొలగించిన మోసాలెన్నో
మన నగరంలో ఋజువుగా ఎన్‌.ఎస్‌.పి. కాలనీ వాసుల
పేర్లెన్నో మాయమైనాయ్‌!

ఇప్పుడు ఏ వర్గం తృప్తిగాలేదు
తాబేదార్ల అనుకూల వర్గం తప్ప
పొత్తులపై అనవసర రాద్ధాంత చేస్తూనే,
గతంలో తామూ అలాంటి
మురికి గుంటల్లో పొర్లింది మరచినట్టు నాటకాలాడుతున్నారు
ఓటమి భయాలు పట్టుకుందేమే వ్యక్తిగత దాడులు, బెదిరింపులు,
కిడ్నాపు డ్రామాలకు వెనుకాడటంలేదు
నిస్సిగ్గుగా పోలీసుల పహారాలోనే జనాలకు పైకం పంచే అవినీతి పనిని
ప్రచారం మాటున జెండా చాటున పంపకాల జరుపుతూనే
కళ్ళు మూసుకున్న పిల్లి మాదిరి ఎవరూ చూడరనుకుంటున్నారు
ఎర్ర పార్టీలు సైతం తక్కువ తినలేదు
పక్కరాష్ట్రంలో జాతీయ ప్రత్యామ్నాయమంటూ ఫోజులు కొడుతూ
ఈ రాష్ట్రంలో మాత్రం వేరుకుంపటి పెట్టుకుని
వామ పక్ష ఐక్యతను నీరుకారిస్తూ తమ రంగు వెలిసిపోయేలా
ప్రధాన శత్రువులతో జతకట్టారు, గత బంధాలను వీడలేక కామోసు
సామాన్యుడు ముక్కు మీద వేలేసుకొని
ముందుకు రాబోయే రెడ్డెవరో రాజెవరో
ఎవరెక్కువ ముట్టచెబితే వారికే ఓటును అమ్మేసుకుంటున్నారు
గతంలో ఓటేసినా గెలవని వారికంటే
గెలిచే గుర్రాలే నయమనుకుంటూ
అమ్ముడుపోయి మరో ఐదేళ్ళు బానిసలవుతున్నామని
తెలుసుకోలేక మత్తులో జోగుతున్నారు!
హెచ్చరించబోయేవారిని పిచ్చోళ్ళంటూ!.
నిజాయితీగా ఓటేయమనటం పిచ్చితనమా!
ఆలోచించండి … ఇదిలాగే కొనసాగాలా!
సమయం మించిపోలేదు - వారం రోజులుంది
మార్పు తేవటానికి -
ప్రజలకొరకు పోరాడేవారికి గెలిపించుకుని
రాజ్యం, భోజ్యం బహుజనులకే
ఆ దిశగా చూపుడువేలుపై సిరా చుక్క
వేసుకునేలా జనాన్ని నడిపించాల్సిందే
కవులే......కష్టజీవులకిరువెంపులా నిలబడాల్సింది మనమే!

No comments: