Wednesday, March 20, 2019

||కపిల రామ్‌కుమార్ ||'రాకీయులారా పూనకాలొద్దు!''
మీసాలు మెలేసినంత మాత్రాన
మీ తాతల సాలొస్తదా!
సాలు సాలుకు బుద్ధులు మారక
వంకరటింకరలు పోతుంటే
సాలిరవాలు సాధనచేయకపోతే
యెగసాయం సంకనాకి,
కుంటువడ్డట్టేనన్నారు మన పెద్దలు!
గతంలోని చేదు అనుభవాలను
యాదుంచుకోకుండా
గుడ్డెద్దు చేలోవడ్డట్టు దిక్కు విడిచి పౌఅనమైతే
అన్నీ ఎదురు దెబ్బలే
తగిలినవి గుర్తులేదా, మేకపోతు గాంభీర్యాలు వీడండికనైనా!
ప్రయోగాలపేరుతో
జనాలకిష్టంలేని జట్లుకట్టి
అయోమయంలో పడేసి
కూటముల పేరుతో పాతాలలోతుల్లో బొక్క బోర్లపడిన
పార్టీలెన్ని చూడలేదు!
కనుమరుగైనవారెందరు లేరు!
ఇగ
కొత్త సాలులోనైనా
జనాలకేమికావల్నో నాడితెలుసుకుని నడుచుకోకపోతే
జెండాల రంగులు వెలిసిపోటం ఖాయం!
అజెండాల రాతలన్ని ఆనవాయితీ మొక్కుబడులే ఐతే
పెట్టుబడులూ దండగే కదా!
అపహాస్యం పాలు కాక గతకాలపు సాలింక రాదు కదా!
నిన్నో జెండా, ఇవాళో అజెండా
రేపో లాభసాటి చొక్కా తొడిగేవారు,
తాత్కాలిక లాభాలతో హీరోలు కావొచ్చేమో కాని,
భవిష్యత్తులో జీరోలవటం నిక్కం!
పట్టిన జెండాను
కట్టె కాలేవరకు నిలపగల నిబద్ధత వుంటేనే
రాజకీయాలలో రాణింపు!
లేదా జనం నోట్లోనాని
ఎప్పటికైనా ఏవగింపు పొందడమే ముగింపు!
మీ వర్తమాన నిర్ణయాలు
భవిష్యత్తులో సత్ఫలితాలు పొందాలనే ప్రతిన పూనండి!
పాలకవర్గ ప్రలోభాల పూనకాలు పొందకండి!
జనాలని నట్టేట ముంచకండి!

No comments: