Sunday, May 26, 2013

కపిల రాంకుమార్|| నకిలీలలు||

కపిల రాంకుమార్|| నకిలీలలు||

దొంగ తొడుగు
తగిలించుకుని
ముఖపత్రంలో
అవాకులు చవాకులు రాసే వారు
కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చి
నికార్సయిన కవనం
పచనం కాకో
వారికి వంట పట్టకో,
భాష, భావం జీర్ణించుకులేని
కుహనా కవులు కొందరు,
అసూయ, ఉక్రోషాలతో
పచ్చి బూతుల పంచాగంతో తమ (ప్ర)వచనంగా
బురదచల్లే ప్రక్రియ
నిరాఘాటంగా కొనసాగిస్తూ
అర్థం కాని పదాలకి
వక్రభాష్యం చెబుతూ
పది మంది వందిమాగధులను వెంటేసుకుని
స్వైరవిహారం కావిస్తూ
స్నేహానికి కళంకం తెచ్చే
పుకారుల తేరుపై షికారు చేస్తూ,
దుర్వాసన వ్యాప్తింప చేస్తూ
‘ ఎయిడ్స్‌ ‘ కంటే ప్రమాదకారులవుతూ
వ్య్వస్థను భ్రష్టు పట్టిస్తున్నారు
వారికి నచ్చనివారి కవితలను ఇష్టపడితే
రంకు అంటకట్టచూస్తారు
మౌనంగా వుంటే
స్పందనలేని వారికింద
జమకట్టి నపుంసకులంటారు.
బట్టతల మోకాలికి జడలల్లి
రోత పుట్టిస్తారు.
పైపెచ్చు జాగ్రతలంటూ
హెచ్చరికలు జరీచేస్తారు
అవినీతి రాజకీయ అభిమానులుగా
తమను తాము పరిచయం చేసుకొని
గోడలమీదా రాస్తామంటారు
మాతో పెట్టుకుంటే పచ్చడౌద్దంటూ
తొడగొ్ట్టి తోక జాడిస్తుంటారు
ఎదురుదాడిని తట్టుకోలేక!
నీతులు వల్లిస్తూ,
గురివింద గింజలా తమ క్రిందనున్న
నలుపుని కప్పిపుచ్చుతూ
ఎంత ఎర్రగా వున్నామో అని
కృత్రిమ సోషలిస్టు వాదనలతో
కంఠ శోష పెడుతుంటారు.
తెలుగు కవిత్వంలో
ఓనమాలుకూడ రాని బోగస్ పండితుల్లా
గ్లోబల్ ప్రచారం చేస్తూ నలుగురిలో
ప్రముఖంగా కనబడాలని
వంటిమీద ఆచ్చాదనలు లేకుండా
టాటూలతో అందాల భామల్లా
మీసాలు లేని మగధీరుల్లా
కయ్యానకి కాలుదువ్వుతూ
ఎదురుదెబ్బ తగలగానే
పలాయనం మంత్రం వల్లిస్తూ
మరొక రూపంలో
మరొక వేదికపై
కసువులూడుస్తూనే
కసుగాయలమమంటారు
పిస్నిగొట్టు యెత్తుగడలతో
అసలురూపం భౌతికంగా చూపే దమ్ములేక
యెల్లినో మల్లినో అడ్డుపెట్టుకొని
కాలం వెళ్ళబుచ్చుతారు
ఎప్పుడో ఒకప్పుడు కాల గర్భంలో కలుస్తారు!
నకిలీల లీలకు – కీలెరిగి శీలలు కొట్టకపోతే
లోకాన్నంతా  మాచేతిలోని లోలకం మంటారు
తస్మాత్ జాగ్రత …..
నకిలీ లీలలు కనిపెట్టి
మసలండి!
 26.5.2013 సాయంత్రం 4.27

No comments: