Sunday, May 26, 2013

అంతర్వేదన -కవిత్వం-మెరాజ్ ఫాతిమా

అంతర్వేదన -కవిత్వం-మెరాజ్ ఫాతిమా

అంతర్వేదన -కవిత్వం-మెరాజ్ ఫాతిమా   Image
           రచయిత్రి వివిధ పత్రికల్లో తన కవితల  ద్వార పరిచయమయి, ఈ మధ్య కాలంలో అంతర్జాల కవిత్వంలో తనదైన  స్థానాన్ని పొందటం గమనింవచ్చును. ఆమె కవిత్వంలో ఒక  స్త్రీ సహజమైన భావనలు,  అణచివేతకు గురౌతున్న సందర్భాలు,  వివిధ స్థాయిల్లో వారి అలోచనలు, బాల్య, యౌవన, కౌమార, వార్థక్యాలు, తదనంతర జీవన సహజ పరిణామాలు ఊహలు, మానసిక సంఘర్షణలు, అనురాగాలు, అనుభవాలు, ఆప్యాయతల లేమి, ప్రేమ, భావ కవిత్వ ధోరణి చక్కగా అక్షరీకరించడంలో సఫలం చెందారనటంలో యెటువంటి సందేహంలేదు.  అంతర్వేదన  కవితా సంకలనాన్ని రెందు భాగాలు చేయటంతోనే ఆమె తన సాహితీ కృషీవలత్వం కనబడుతోంది.   స్త్రీ సహజ సమస్యలే కాక, సామాజిక స్పృహ కలిగిన కోణాన్ని కూడ ఆమె స్పృసించింది.  లోక రీతులు, సమాజ స్థితిగతులు, అన్యాయం, దోపిడి, వివిధ వ్యవస్థల్లోని లోపాలు యెత్తిచూపటంలోనూ  విజయం సాధించింది, తనదైన గొంతుకతో.
             పుస్తకానికి ముందుమాటలోనే  రాచపాళెం  చంద్ర శేఖర రెడ్డి, కితాబు పొందటమే ఒక గీటురాయి, వారి మాటల్లో ”ఆమె నిర్మించిన పదాల చతురత సహజ సౌందర్యమైనవే, కాక అందరికి అర్థమయ్యే లలిత పదాల సొబగులున్నాయని, కఠిన శిలా సదృశమైనదిగా కాక, మృదు మధురంగా, లాలిత్యంగా వున్నాయని, తనదైన కవితా నిర్మాణ కౌశలత కేవలం  ఫాతిమా సొంతమని, ఆమె శిల్పం ఆమెదే ” నని అన్నారంటే అంతకంటే కవికి ప్రోత్సాహం ఇంకేం కావాలి, మరొక కావ్యాన్ని ఆరంభించడానికి?
   
             మరొక సాహితీ  ప్రముఖుడు శాంతి నారాయణ అనునయ వాక్యాల  ద్వారా ఆమె కవిత్వం యేపాటిదో   మనం ఒక అవగాహనకు రావొచ్చును.  ప్రత్యేకంగా అమెను  నిత్యం ప్రోత్సహించి, మెచ్చుకోలు దీవెనగా ” ప్రవహిస్తున్న  లావా, ఫాతిమా కవిత్వం “  అన్నారంటే అదే పెద్ద సర్టిఫికేట్….సాహిత్యంలోకి తొంగి చూడ్డానికి ఫాతిమాకి ఈ కావ్యం వొక కొత్త గవాక్షం. ఈ గవాక్షం ద్వారా ఆధినిక తెలుగు కవిత్వమార్గాలనూ, గమనాలనూ, కాంతులనూ దర్శించి ముందుముందు తనదైన కవితా స్థానాన్ని సుస్థిరపరచుకోవాలని కోరుతూ కొత్తగొంతును ఆశీరభినందమలతో, సమాదరించడానికి మనలనందరిని కోరారు.
           మొదటి ప్రకరణంలో 42 : కవితలు
మాయావిలో:- ” గొంతునుండి గుబులు బయటకు రానీక/మాటలకు మమకారపు రంగు వేస్తుంది/యెదురుపడి వేదనను వెళ్ళగక్కే సమయానికి/అభిమానపుటాభరణం అరువుగా యిస్తుంది
గెలిచిన స్వప్నంలో :-” హంస వడగట్టిన పాలవు నీవు, హింసను వీడిన పరమ హంసవు నీవు ”  అంటుంది.
సఖా హాలికా!:- ” యువత – విద్యాలయాలు, విదేశాల బాట పడితే/యువరాజులా ధరణి ఎదపై దరఖాస్తు పెట్టుకుంటావు/హలంతో పొలం పుటలు తిరగేస్తూ/విత్తనాల అక్షరాలు ముచ్చటగా చల్లుతూ” రైతును సఖుడుగా పేర్కొనడం మట్టిని ప్రేమించే తత్వం, ” మరీ కృషీవలుడైన నీకు కులకాంతను కావాలి/ సఘజీవివైన నీకు సహచరిని కావాలి ” అనట ఆమె
నిరాడంబర  ప్రణయ తత్వం రైతుయెడ కలిగివుందని మనం ఆనందపడవలసిందే. సాహిత్యం కూడ సేద్య సమానమేకదా! అది  సాహితీ నైజంగా ఫాతిమా వ్యక్తీకరణకు నిర్వచనంగా నిలిచినందుకు మన:పూర్వకంగా చదివిన వారు అభినందనలు తెలుపవల్సిందే!
 చిన్నారి:- బాల్యాన్ని మనముందు పరిచారు ” నా నట్టింట నడయాడే చిన్ని దేవతవు నీవు/బ్రహ్మ సృష్టివి నీవు/ మాకు జన్మనిచ్చే ప్రతి సృష్టివినీవు ” కసుకందుల యెడ అభిజాత్యపు తల్లి ప్రేమను ఆవిష్కరించారు కవయిత్రి.
ఒక్కసారి:- ఎదురుచూపులు దాచుకుంటూ దొరికిపోయిన, నీ తడబాటునూ – చూడనీ ఒకసారి/కోటి వీణలు మీటినట్లు నీ పలుకు కంఠాన్ని దాటి రావటం విననీ ఒక సారీ’  యెదురుచూపులోని తన్మయత్వం పరిచారీ కవితలో.
మరీచిక:-”ఎదలో వున్నాను, వెతుకమన్నావు/ మది గదిలోవున్నాను, బతుకమన్నావు/ పగలంతా నా అడుగులకు తడబాటువై/రేయంతా నా పలవరింతల అలవాటువై” భావుకత చక్కగా పండింది.
అద్వైతం:- ” నావూహలకి ఊపిరివి/ నా ఊసులకి సరిగమవి ” చక్కటి పద చిత్రీకరణ.
సాక్షులు:- ఎలా వుంటారో ” హంస  కనలేదా మన అలకని/ హరిణి వినలేదా మన అలసటని ” అడిగమంటుంది ఫాతిమా ఈ కవితలో
నా చెలికాడు:- ” కలతలేని ఆ నిరాడంబరం/ కళ్ళెం లేని ఆ దానగుణం/ శత్రువుని యెదిరించే ఆ శూరత్వం/ యెల్లలు చెరిపేసే ఆ ధీరత్వం…కల చెలికాడు కావాలి ,,,చేపట్టిన వాడు కావాలి అలాంటి వానితోనే జీవన యానమంటుందీ రచయిత్రి….ఎందరికా భాగ్యం కలుగుతుందో కదా!
ప్రకృతి కాంత లందరిని మన యెదుట క్యాట్ వాక్ చేయించారు తన కవిత ‘ ప్రకృతి కాంత ‘ లో
నామది : ఆవిష్కరిస్తూ  ” నీ నిరశన రుచి చూచిన నా మది/అడవిగాచిన వెన్నెలలా,  నీ విరహం రుచి  చూచిన నా మది /వెన్నెల యెరుగని సోమునిలా
నీ ఆగమనం చూచిన నా మది/నర్తించిన మయూరం లా …..తన మది అవస్థలను చక్కటి కవన మయూర నృత్యంలా చూపెట్టారు.
మార్పు: అక్కడక్కడ అస్తవ్యస్తంగా వున్నా ఒక విస్పోటన ధృతి కనబడుతుంది తెలుగు కవితా హారానికి ఒక ఆంగ్ల పద తోక తగిలించి.  (కొంచెం హడావుడి పడినట్లు కనబడుతుందీ కవితలో..ఇంకా చిక్కగా రాయవచ్చు, నా సూచన మాత్రమే…యిలాగే వుండాలనే నియమం లేదనుకోండి)మొత్తానికి బావుంది
నిన్నేమనుకోను! నిన్నేమనుకోను? ( యేదైనా గుర్తు పెట్టితే యింకాఆకర్షణీయంగా వుండేది) ” దిగులు  సంద్రాన మునిగిన నాకు, చిరుహాసంలా చేరువయ్యావు!/పట్టుకొని అధరంపై అడ్డుకునేలోగా.. నిట్టూర్పువై నిష్క్రమించావు!”
అనడంలో భావం చక్కగా త్యోదకమయ్యేలా పాదాల విన్యాసం జరిగింది.( అక్కడక్కడ అక్షర దోషాలు ప్రూఫ్ లో సరిచూసుకోవలసివుంది)
తోడు:- అనే కవితాప్రారంభంలో ” మాసిపోయిన పసితనం/మరచిపోయిన హసితం/రుతువులు మారుతున్న వేళ/మనసున నాటుకున్న ముళ్ళు ” చక్కటి యెత్తుగడతో నడిచింది చివరిలో..” నీవే నా సాహసానివి, నీవే నా సైన్యానివి/ నీవే నా గతివీ – నీవే నా ధృతివీ”  సంప్రదాయకతపై తనకున్న విశ్వాసాన్ని ప్రకటించింది ఫాతిమా.
బంతిపూల బాసలు :-గ్రామీణ వనిత పట్నమెళ్ళిన పతికై యెదురుచూస్తూ ” నండూరి యెంకి ని గుర్తు చేసేలా చక్కటి జానపద యాసను సమపాళ్ళలో రంగరించిన ఫాతిమా- నిరీక్షీంచే  పడతి మానసిక అంతర్వేదనని   కొట్టవచ్చినట్టు కవిత్వీకరించింది.
అంతర్వేదన:-కవితా సంకలనానికి తలమానికమైన కవిత  ” జీవన పయోనిధిలో అంతరంగ రతంగాల ఆటుపోట్లను, ఎదుర్కొనే వోటు పడవనై,  నిరంతరం నీ ధ్యాసలో అలమటిస్తూ  ఆఖరి శ్వాస వరకు నీకై నిరీక్షించే అభిసారికనై, సమస్యలూ, సంధిగ్దాలూ, అనుమానాలు, అలసటలు, బాధలు, బాధ్యతలు, కష్టాలు, కలతలూ, వెతలు వేదనలూ,యేమీలేవనుకే  భవితాకాంక్షనై, బ్రతికేయాలనుకునే భావుకురాలై దోసిట అక్షరాలతో మోకరిల్లుతున్నా ” అంటు తనదైన కవితావేశం, నికార్సైన భావుకతను తెరచిన పుస్తకంలా ప్రతిపాదించింది కవయిత్రి నిజాయితీగా. చదవబోతూ రుచి  యెందుకుకాని ఇంకా   మొదటి  ప్రకరణంలో , అంతర్లాపి, ఎలా చెప్ప్ను, ఎంత బావుంటుంది, పూవనిలో ఆమని, ప్రతిస్పందన, అందని ప్రేమ, అతివ అంతరంగం, కల, స్వప్న కెరటం, అరణ్య రోదన, అనుకోని అతిథి, అంతరాన, నిరీక్షణ, నీ తలపుల్లో, శ్వేతపత్రం, ఎప్పుడొస్తావు, నిన్నే తలచుకుంటూ, భావన, ఓదార్పు , ఏమి చెప్పను, ఇలా చేస్తాను, మనసా కవ్వించకే. వ్యథ, దీపపు పురుగు, కోకిల మొదలగు కవితలున్నాయి.
               ఇక రెండవ ప్రకరణంలో 23 కవితలు మనల్ని పలుకరిస్తాయి. మొదటిగా ” మట్టి మనిషిని ” అన్న కవిత యిటు పాఠకుడ్ని, అటు విమర్శకుడ్ని కట్టిపడేస్తుంది. నేటి రైతు బతుకెలా అధ్వాన్నమయిందో కళ్ళకు కనపడేరీతిలో యెన్నో భావ చిత్రాలు, పద చిత్రాలు కనులముందు కదలాడి హృదయాన్ని కదిలిస్తాయి, కంటిని చెమరింపచేసి అందుకు కారణభూతమైన సర్కారును, వికటింపచేసే ప్రకృతిని , మోసపూరిత వ్యాపార వ్యవస్థను నిర్మొహమాటంగా తూర్పార పట్టిన తీరు ” హాట్సాఫ్ ‘  ఫాతిమా అనిపిస్తుంది!  అంతే కాదు  చక్కటి భావ చిత్రాలు, పద చిత్రాలున్నాయి ఈ కవితలో ‘  నారుమడులన్నీ పసుల పోరగాడి తొర్రి పళ్ళలా  నంగి నవ్వులు నవ్వుతూ నన్నెక్కిరిస్తున్నాయని ‘ అనే ఉపమానం హైలట్! ముఖ్యంగా  ”మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో పాకి, మట్టినే కప్పుకుని, మట్టిలో కలసిపోయే పేదరైతును – నీ ఆకలి తీర్చటం తప్ప అన్నెంపున్నెమెరుగని అమాయకపు అన్నదాతను ” అందుకు నిలువెత్తు నిదర్శనమై ఆలోచింపచేసే కవితాపూర్వక ప్రశ్నల పరంపర ప్రతీ కవితలో మనకు కనపడతాయి. ‘ బందీ ‘  అనే కవితలో ; ఇంతకీ  నీ వెవరూ? నీకైనా తెలుసా?…….ఓడిపోతూ, క్రుంగిపోతూ, ఒక బంధం కోసం వేయి బంధాలముందు /ఓడిపోయిన అవిజేయుడివి ..జీవితాన్ని కుదువపెట్టిన వివాహితుడివి! ” ఆరోజు వస్తుంది” అనే కవితలో భవిష్యత్తుపై నమ్మకాని వ్యక్తపరిచిన తీరు, ‘ అతుకు అక్షరం ‘ లో బడికి, జీవిత పాఠశాలకి మధ్య వారథి  అక్షరమంటుంది ఫాతిమా ‘ తోలు బొమ్మలు ‘ శ్రమైక జీవులు బతుకు పోరాటంలో వారు ఆగ్రహిస్తే దోపిడిదారుల పునాదులు పెకిలిస్తారు అనే హెచ్చరిక, ‘ఏం చేద్దాం ‘ అంటూనే    …’ఆడపడుచులను ఆదుకోవాలన్న ఆలోచన రావాలి, అప్పటివరకు నేనిలా ఘోషిస్తూనే వుంటా ‘- అనే భరోసా ‘ దీన దీపికలు ‘,  ‘ నీ..నా’ ,తో పాటు   ‘ గురువు ‘ లో- ఆచార్య దేవో భవ  స్థానం  పూజార్హమని,మనమెన్నటికైనా’ కన్నీటి చారిక ‘ తుడవాలని ‘ గ్రంథం’ పదిమందికి దారి చూపాలని, ” నాణేనికి ఆవలి జీవితం ” వుందని అది  ‘ కంటి దోషం ‘ కాకూడదని, నిరంతరం ‘ మౌన రణం ‘ చేయాలని, యెల్లపుడు ‘ పాప నవ్వు ‘  హాయి కలిగించాలని,  ”కలలకి ఆకారమయిన చిరుమొలకని, కష్టాల కొమ్మకి చిక్కుకున్న గాలిపటానివి ” అంటూ  ‘ నిరుక్త ‘ అనే కవితలో రాసినా, ” ఆశ ” గా వ్యథలు నిందిన మనస్సు, యెదిగే వయస్సు, యెన్నాళ్ళు యీ తపస్సు, వస్తుందా నేనాశించిన ఉషస్సు ” అని తలపోసినా, ” అంధకారం అలముకోకముందే, అవివేకాన్ని అణిచివేద్దాం, వెలుగు వివేకాన్ని ఆహ్వానిద్దాం” అంటూ ” నవజీవనం ‘ కొనసగాలని కోరుకున్నా, ” ఇస్తున్నారా ? దోస్తున్నారా? దాస్తున్నారా? అని చెండాడుతూ ఇదండీ నేను నిత్యం చూసే (మీకు చూపే) కరెంట ‘ ఫైర్స్‌’ చదరంగాన్ని వ్యంగంగా చెద రంగమంటూ, పదాల తూటాలతో హెచ్చరిక చేసినా ప్రశాంతంగా,సామరస్యంగా  ‘ నివేదన ‘ అందించినా,  అక్కరలేని బిడ్డలను కని కడతేర్చే సామాజిక వ్యతిరేక  అకృత్యమేమిటని ‘ శిశుగీతా” న్ని ఆలపించినా మూర్తీభవించిన మాతృవేదన, సహజమైన స్పందన కవిత్వంలో తొణికిసలాడినా,
” మదిచింతన ” చేసినా,  ” ఎవరు దోషుల”ని  నిలదీసినా,….ప్రతీ కవితలో, ప్రతీ పాదంలో ఫాతిమా అక్షర విన్యాసం,
పదాల పరుగులు మనల్ని (పాఠకుల్ని) నిరంతరం వెంటాడుతూ ఒక సంతృప్తికరమైన, న్యాయమైన అంతర్వేదనని కలిగిస్తుంది.     మరింత బిగువైన, దిటవైన, నికార్సైన  ప్రక్షాళనకు నాందికాగల మరొక సంకలనాన్నీ చి.సౌ. ఫాతిమా మెరాజ్ నుండి మనసారా కోరుకుంటూ, చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ…….
                                              కవితాభినందనాశీసులతో
                                              కపిల రాంకుమార్, ఎం.ఏ., బి.యిడి,
                                              బి.వి.కె.   గ్రంథాలయ నిర్వాహకుడు,
                                              ( సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు )
                                              సుందరయ్య భవన్‌ ఖమ్మం
                                              507 002  : 9849 535 033  26.5.2013

2 comments:

Meraj Fathima said...

మీ ప్రశంస పొందటమే నా భాగ్యం అనుకుంటాను సర్.

Unknown said...

” ప్రవహిస్తున్న లావా, ఫాతిమా కవిత్వం “ it is true