Tuesday, May 7, 2013

|''ఇంకొమ్మ ''||

కపిల రాంకుమార్||''ఇంకొమ్మ ''||

నాన్న ఇంకొమ్మని ( ఇంకో అమ్మని) చూపినప్పుడు
మా బుగ్గలపై కన్నీరింక మరింత ఉబుకొచ్చింది!
నెమ్మదిగా బెరుకు తీరి దగ్గరవటానికి ఆమె!
చేరాలా వద్దా సందేహాలతో మేము!
దగ్గరవుతున్నా మనుకున్నంతలోనే
ఇంకొమ్మ సీమంతానికి పుట్టింటికెళ్ళింది.
నీళ్ళాడినావిడ పొత్తిళ్ళలో బాబుతో తిరిగి
మా వద్దకే వచ్చింది!
చానాళ్ళ తరువాత మాతో ఆడుకోటానికి
తమ్ముడొచ్చాడని సంబరమైంది
ఎంత కొత్త భాద్యత వచ్చి పడినా
తమ్ముడితో సమానంగా మా
ఆలనా పాలనా తానే చూసింది!
మా తోబుట్టువులం ముగ్గురం మగ, ఇద్దరు ఆడ .
ఐతేనేం వాడితో కలిపి ఆరుగురం కలిసిమెలిసేవున్నాం!
మాకు పెళ్ళిళ్ళు అయినాయి-పిల్లలు కలిగారు
వాళ్ళు మాట్లాడం మొదలెట్టినతరువాత
ఆమె నాయనమ్మైనా ..అందరూ ' ఇంకొమ్మ ' అంటూనే పిలిచేవారు
ఆవిడ పెద్దదైంది...కాలంతో పాటు అవ్వ అయింది
అయినా ఇంకొమ్మ గానే ఊరూ పిలిచేది!
కొద్దికాలానికే ఆమె గంగా భగీరథీ సమానురాలైంది
మేము నాన్ననీ కోల్పోయాం!
మేమెమ్వరమైనా గ్రామాంతరం వెళితే
తాను ఇంటికి తాళం కప్పలా అతుక్కుని ఉండేది.
మా ఇంట మంచి చెడుల్కు ఆమె పెద్ద దిక్కు
యెంతమందికో ఆమె దీవెనలిచ్చింది,
పెళ్ళిళ్ళు చేసింది-పురుళ్ళు పోసింది
మునిమాపు వేళ ఊడల మర్రిపై దెయ్యం ఉంటుందన్న,
భయాలనెవరైనా వ్యాపింపచేస్తే,
పిచ్చి తండ్రుల్లారా అదేం లేదంటూ,
పదండి! దాని భరతం పడదామంటూ
మూఢనమ్మకాల్ను కొట్టిపారేసేది!
ఇంటి చాకిరీతో ఆమె చదువు అటకెక్కి పుష్కరాలు దాటినా
ఆడపిల్లల్ని సైతం చదివితీరాల్సిందే అని అందర్ని
ప్రోత్సహించింది! కాలచక్రం లో మరో కొన్ని బాదావత్సరాలు దొర్లాయి.
కాలం నైజం గమనమే కదా
ఒకరోజు ఆమే తలాపు దిక్కుకు దీప పెట్టారని తెలిసి
కర్ణం గారి ఇంకొమ్మ గారు కాలంచేసారట చూసొద్దం పదండి! అంటూ
తిరునాలగా వచ్చారు, ఇసుకేస్తే రాలనంత చుట్టుపక్కల నాలుగువూళ్ళ జనం!
ఆ వీధిలో వెళ్ళే ప్రతీ బాటసారి ఆమె చేతి దాహం తాగిన వారే
అరుగుమీద పీటవేసుకుని వచ్చేపోయేవారందరిని పిలిచి
చల్ల తాగి దాహం తీర్చుకోరా సన్నాసీ అంటూ ఆప్యాయంగా అందించిన
మజ్జిగ లోటా, తరువాణి కుండకి కూడ పూలదండ వేసి
తమ భక్తిని చాటుకున్నారు!
శోక సముద్రంగామారిన శోకపుటలల్ని చూస్తే
యెంతటి కరుకు రాతిగుండె ఇట్టే కరిగిపోవాలె!
ఇంకొమ్మ గారి లేని లోటు యెవరు తీర్చగలరు?
డొక్కా సీతమ్మలాగ యెంతమందికి కడుపు నింపిందో
ఆ మాటలు చాలు, ఎన్ని కోట్ల ఆస్తులుంటే సమానమౌతాయా ఆమె
అనుబంధానికి ఆప్యాయతకి!

7.5.2013 సాయంత్రం 6 గం.

(కొత్తమ్మ చదివిని తరువాత -మమతల మందారం మా ''ఇంకొమ్మ '' గుర్తుకొచ్చింది
కొత్తమ్మ స్వభావాలు వేరు - ఇంకొమ్మ గారి స్వభావం వేరు. ఆ అమృత ధార తాగిన అనుభూతికి
కవితా రూపం! ఇది పోటి కాదు, పేరడీ అంతకంటే కాదు ఒక స్మృతి కవిత మాత్రమే)

No comments: