Wednesday, April 23, 2014

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? |

కపిల రాంకుమార్|| దీనికి సమాధానం ఏది? ||
ఊళ్ళో పెళ్ళైతే
కుక్కలకు హడవుడని
ఎందుకన్నారో కాని
కాట్లాడుకుంటున్నప్పుడు
కుప్పతొట్టి రణరంగమైంది
అయినా అది
నాకు ఆశ్చర్యమనిపించలేదు!
పక్కనేవున్న సర్కారీ హాస్టలు పోరగాళ్ళు
ఫంక్షన్‌హాలు గేటువద్ద
పడిగాపులు కాస్తూ బతిమాలుకుంటుంటే
వాచ్‌మన్‌ పొండిరా పొండని అరుస్తుంటే
ముక్కున వేలుపడింది!
సర్కారు వాళ్ళ కడుపులను
అర్థాకలి గురిచేసి
మిగిలిన దానిని అర్థంగా మార్చి
బొక్కసానికి బొక్కపెట్టి
తమ బొక్కసం నింపుకుంటున్నపుడు
ఆశ్చర్యమేసింది!
అందుకేనేమో
ఆ పోరళ్ళప్పుడప్పుడు
బడికెళ్ళే దారిలో వంకర చూపులతో
ఇండ్ల దొడ్లో కొబ్బరికాయలకో
జామకాయలకో గోడలు దూకి
రాళ్ళు రువ్వుతుంటే గమనించాను
కొండకచో గద్దించే వాడిని!
పల్లెటూళ్ళో అమ్మ అయ్య
వీరి బాగుకోసం తాపత్రయంతో
హాస్టల్‌కు తోలితే
అజమాయిషీ లేని వీళ్ళు
యిలా అర్థాకలితోనో
బాల్య చాపల్యంతోనో
పొరుగువాడి వస్తువులపై
కన్నేస్తున్నారంటే.... ఏమటర్థం?
సంక్షేమం ఇలా
సంక్షోభాల్ని
సంక్లిష్టతలని
పురుడుపోసుకుంటుంటే
సమాధానం ఎక్కడ దొరుకుతుంది!
రేపు బాల నేరస్తులగానో,
కరుడుగట్టిన నేరగాళ్ళైతే
సమాధానం ఏది?
23.04.2014

Sunday, April 20, 2014

వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం|

కపిల రాంకుమార్|| వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం||

ఆమని '' ఉగాది కవితా సంపుటాన్ని ప్రముఖ కవి, నాటక రచయిత, దర్శకుడు బాణాల కృష్ణమచారి చేతుల మీదుగా ఆవిష్కరించిన పిదప సంపాదకత్వం వహించిన బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ మాట్లాడారు. . జయనామ వత్సరానికి స్వాగతం పలుకుతూ '' మన తెలుగువారికి ప్రధానమైన సంస్కృతీ సంప్రదాయాలలో భాగంగా కుటుంబ యావత్తు ఆనందంగా కోటి ఆశలతో, కొత్తపథకాల రూపకల్పనతో కొంగ్రొత్త ఆలోచనలతో నూతన నిర్ణయాలతో జరుపుకునే పర్వదినం ' ఉగాది ' కి విశిష్ట స్థానం వుంది అని '' తదనంతరం, కపిల రాంకుమార్ తన సంపాదకీయాన్ని కొనసాగిస్తూ '' మన భాషా సంస్కృతులు, మానవ సంబంధాలు ప్రస్తుతం పడమటిగాలి వడదెబ్బ కు సోలిపోకుండా, ప్రపంచం మొత్తం ఆవహించిన మత ఛాందస వాదానికి, ఉగ్రవాదానికి,ప్రపంచీకరణ ముసుగులో ముంచుకొస్తున్న గ్లోబలీకరణకి తట్టుకుని నిలబడాలనే తలంపుతోనే భావ సారూప్యం కల కవులు, కళాకారులు 1999 జనవరి 26 తేదీన ఖమ్మం పట్టణంలో సాహితీ స్రవంతిని ఒక వేదికగా ఏర్పాటుచేసుకుని గత 15 సంవత్సరాలు అనుబంధాన్ని పెంచుకుంటూ,కేవలం ఖమ్మంలో ఆవిర్భవించి నా, రాష్ట్ర షాయి సంస్థగా ఏర్పడటానికి, అంతేకాక, దాని ఆధ్వర్యంలో సాహిత్య ప్రస్థానం అనే సాహిత్య మాస పత్రికగా జనాదరణ పొందటానికి కొద్దో గొప్పో ఖమ్మం పాత్ర గణనీయమైనదేనని చెప్పుకునేందుకు నయంగానే గర్వపడుతున్నామని, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహిస్తూనే ఒక గుర్తింపు పొందామని, దానిని నిలబెట్టుకోవాలని, అందుకు నిబద్ధత, నిమగ్నత కలిగిన సాహితీ కార్యకర్తల కృషి అవసరం ఎంతైనావుందని, కొత్త వారిని ప్రోత్సహించటం. మెలుకువలు నేర్పటం సదస్సులు, శిక్షణాతరగతులు నిర్వహించటంలాంటి కార్యక్రమాలు చేస్తూనేవున్నామని,. ఇంకా మరిన్ని అలాంటివి కొనసాగించాలనే కృత నిశ్చయంతో వున్నామని, అందులో భాగంగానే గత సంవత్సరం జూలై నెల నుండి మూడవ ఆదివారంలో ప్రతి నెల సాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తూ, దాదాపు 20 నుండి 35 మంది దాక హాజరవుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక, కవిత్వ పఠనం, చర్చ, సాహిత్య ప్రసంగములు నిర్వహిస్తున్నామని, ఇది ఒక అపూర్వ ప్రయోగంగానూ, ఉపయుక్తంగానూ, వుందని తెలిపారు.ఈ సంవత్సరం సాహితీ స్రవంతి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సాహితీ సంచిక ప్రత్యేకంగా తేవాలని అనుకుంటున్నామన్నారు . ఆప్రయత్నంలో భాగంగానే ఈ జయనామ ఉగాదికి ఎంపిక చేసిన కవితలను మీ ముందుంచుతున్నానని, సలహాలు, సూచనలు కోరారు. ఇందులో సమకాలీన, సామాజిక రాజకీయ అంశాలతో పాటు పండుగ నేపథ్యాన్ని మిళితం చేసి, షడ్రుచుల సమ్మిశ్రితంగా కవితలు, పద్యాలు, గేయాలు, మీకు దర్శనమిస్తాయని, వీటిని ఒక చోటికి తేవటం సంకలనపరచడం కత్తిమీద సామైనా సాహితీ స్రవంతి కార్యకర్తల తోడ్పాటుతో ఈ చిన్న రూపం తేవడంలో యేమాత్రం సాఫల్యం చెందామో కాని, ఒక చిన్న సంతృప్తి మాత్రం కలుగుతోంది. ఆదరించి, అహ్వానించిన వెంటనే స్పందించి కవితలు పంపినవారికి, సహకరించిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుముందు కూడ ఇలానే ఇదే స్ఫూర్తితో తోడ్పడాలని వేడుకుంటూ, పేరుకే సంకలనకర్తనే కాని యిది అందరి సమిష్టి కృషి అనిమాత్రం చెప్పక తప్పదు. మరొక్కమారు అందరికి నూతన సంవత్సర అభినందనలు తెలియచేసారు.ఈ సమావేశానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి అధ్యక్షత వహించగా, సాహితీ స్రవంతి జిల్లాకార్యదర్శి రౌతు రవి, అతిథులను వేదికపకి అహ్వానించి తన నివేదిక సమర్పించచారు
ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మానికి చెందిన సీనియర్ కవులను, సాహిత్యాభిమానులను సన్మానించారు. బాణాల కృష్ణమాచారి, కోటీ శశిశ్రీ, కపిల రాంకుమార్, వురిమళ్ళ సునంద, టి.ఎల్. లక్ష్మీనరసయ్య, డా. పొత్తూరి సుబ్బారావు, డా.కావూరి పాపయ్య శాస్త్రి, డా.కవితాంజనేయులు, మొదలగు వారు సన్మానంపొందిన వారిలోవున్నారు. తదుపరి కన్నెగంటి వెంకటయ్య, సునంద, కపిల రాంకుమార్, నిర్వహణలో కవి సమ్మేళనం కొనసాగింది. ఇరవైరెండు మంది కవితలను పుస్తకరూపంలో సంకలనం కావించగా, వీరు కాక, మరో పదిహేనుమంది తమ కవితలను చదివి వినిపించారు. మాజీ మునిపల్ చైర్ పర్సన్‌ అఫ్రోజ్‌ సమీనా, సి.ఐ.టి.యు నాయకులు ఎర్రా శ్రీకాంత్, ప్రముఖ రంగస్థల కళాకారుడు అద్దంకి కృష్ణప్రసాద్, బి.వి.కె. డిప్యూటి జనరల్ మేనేజర్ కందాడై శ్రీనివాసులు మొదలగు వారు సందేశమిచ్చారు.

పండుగ బలహీనతని రాజకీయ నాయకులు ఎలా అవకాశంగా తీసుకుని సామాన్యుని అవసరాలపై ఎలా వల వేస్తారో, ఆశపడి, బోర్లపడిం సామాన్యుని వేదన తన కవితలో రాంకుమార్, ఆరు ఋతువులు సమ్మేళనం ఈ ఉగాది అంటూ సునంద, మానవాళి మేలుకొరకు మరింత వెలుగులు నింపాలని ఆశతో శైలజ, ఏది ఏమైనా కోయిలా ఒట్ల పండుగని వెంటేసుకుని వొచ్చావులే అంటూ కన్నెగంటి చమత్కరించగా, కాలాన్ని నిర్వ్చిస్తూ చక్కటి చమత్కార కవిత గిరి నరసింహారావు, శిసిరంలో రాలిన పండుటాకుల్ని లెక్కిస్తూ, తొక్కేస్తూ ఋతువుల క్రమాన్ని తన కవితలో బంధించిన వనం తేజశ్రీ, ఎన్ని ఉగాదులొస్తేనేం, మనిషి మనసుని మార్చగలవా అని ప్రశ్నిస్తూ పోట్ల సుధారాణి, '' జయాలనిచ్చే ఉషోదయానికై '' అంటూ గేయ రూపంలో ఉగాదిని స్వాగతించిన సంపటం దుర్గా ప్రసాదరావు, పండుగ సంబరమొకరోజే కాని సాలు పొడుగునా వైఫల్యాలెన్నో ఇన్నేళ్ళ ఉగాదుల వెంట వస్తూనే వున్నాయంటూ చావా జయప్రద, ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుమంకున్న ఉగాదే అంటూ చతుర్తలు కూడిన కవితతో మేడగాని శేషగిరి, కలవరపడకే కోయిలా అంటూ హెచ్చరిస్తూ కంచర్ల శ్రీనివాస్, కోకొఇల స్వరాలకు బదులు కాకుర స్వరాలు.. పల్లెల్లోనూ, గల్లీల్లోనూ వినిపిస్తున్నాయంటూ కవితాంజనేయులు, స్వాగతం కవితతో బూడిద అరుణ గౌడ్, షడ్రుచులతో కృష్ణవేణి, కొత్త ఆశలతో సీతారామారావు, పాడవే కోయిలా గొంతెత్తి యుగగీతి గేయంతో రౌతురవి, జయ ఉగాది పై చక్కటి సంప్రదాయ వృత్తాలతో డా.పొత్త్రి సుబ్బారావు, డా. పాపయ్య శాస్త్రి, తాగుబోతోడి శ్రీమతి తంటాలను చమత్కారంగా పావే రావు, పండుగ హడావుడి - హాస్య రూపకాన్ని రౌతు కడలి, ఎన్నికల వేళ మతంరంగు పులుముకుని దాడిచేయబోయే వాడిని గుర్తుపట్టానంటూ బండారు రమేష్, ప్రతీ దానినీ నిశితంగా, నిజాయితీగా చూడటం నేర్చుకోవాలని కె. ఆనందాచారి, బతికేవున్నామని ఓ ఐదేళ్ళకోసారి గుర్తుచేసుకోవటమేనా - ఎన్నీకలంటే అంటూ తీవ్ర స్వరం వినిపించిన పోతగాని, పర్వదిన్నం పేరుతో నైనా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవటం యెంతో అవసరమని గజేంద్ర సైదులు. ఇచేఏ పైసలకు ఆశపడితే పడ్డావు కాని, ఓటు మాత్రం అర్హత కలిగిన వాడికే వెయ్యాలి సుమా అంటూ ఆలేటి పరంజ్యోతి కవితలు అందర్ని అలరించాయి. వివిధ ప్రజా సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగ సంఘనాయకులు, పట్టణంలోని ప్రముఖ న్యాయవాదులు, వ్యాపారస్తులు , మహిళాసంఘ నాయకులు, ఆదివారం మీ కోసం అధ్యక్ష, కార్యదర్శులు మొదలగువారు పాల్గొన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహార వచ్చిన వారందరికి పండుగ ఆతిథ్యాన్ని అందించారు. ఎం.శేషగిరి , కన్నెగంటి వెంకటయ్య, మరియు కళానిలయం బృందం వారు తమ గీతాలాతో అలరించారు.
**
--కపిల రాంకుమార్ 9849535033 (4.4.2014/19-4-2014)

సుత్తి కొడవలి చుక్క -దారిచూపు వేగు చుక్క|


కపిల రాంకుమార్ || సుత్తి కొడవలి చుక్క -దారిచూపు వేగు చుక్క||

అనునిత్యం పోరుబాట వెన్నుదట్టు అమ్మమాట
ఆశయాల పెనుకోట త్యాగధనుల పూదోట
ఎరుపంటే వెలుగె ఎరుపంటే జయమే
ఎరుపంటే పతాకం విజయానికి సంకేతం

సుందరయ్య ఆచరించి బంధుత్వం కలిపాడు -
కూలిరైతు సంఘాలకు ఒక మార్గం నెరిపాడు

బెదిరే జింకలను కుమిలే జనాలను -
ఆపదల ఆగడాల తట్టుకోను బలమిచ్చి
ప్రశ్నించే తత్వాన్ని కొనసాగే ధైర్యాన్ని -
చీకటిని పారదోలే ఎర్రజెండా మనకిచ్చి

అరకపట్టి చెమెటోద్చే పనివాడిదే పొలమంటూ -
చాకిరిలి సరిపోయే రూకలు పొందాలంటూ
ఆరుగాలపు కష్టాన్నీ బుర్ర మీసం దోచుకునే -
పాతకాల దొరతనం కలకాలం సాగదని

అతివలు అనాథలు బడుగులు బలహీనులు -
హక్కులకై ఉద్యమించ ఎలుగెతే గళమిచ్చి!
కదం కలిపి నడిచేలా ముందువరుస తానుండి -
లాఠీలకు తూటాలకు వెరవులేక ఎదురొడ్డగ

జనం తెరువు కొరకు బతుకు వెలుగు కొరకు -
పొద్దు పొడిచిన సూరీడై ఆదరించు చెలికాడై
సుత్తికొడవలి చుక్కరా దారిచూపు వేగు చుక్కరా! -
వేలు పట్టి నడిపించే కన్నతల్లి చేయిరా!

కపిల రాంకుమార్ - 20.4.2014

Friday, April 11, 2014

ఓటుబద్ధ హెచ్చరిక

కపిల రాంకుమార్|\ ఓటుబద్ధ హెచ్చరిక ||

పార్టీ మారిన నేతకెన్ని కష్టాలో
దుమ్మెత్తిపోసేటప్పుడు జాగ్రతలెన్నో
తీసుకోక పాత పాటే పాడితే
ఓట్లు రాలకపోగా తాటతీసి తన్ని తగలేయగలరు
యింటికి పంపుతారు జనాలు
మారేటప్పుడు వళ్ళు దగ్గరపెట్టకున్నా
ఇప్పుడుమాత్రం జర భద్రం!
సీటు గెలవాలంటే!
**
గుర్తు తప్పు చెప్పినా
అధినాయకుడి పేరు మర్చిపోయినా
ప్రస్తుతాన్ని స్తుతించిక పోయినా
ఏ యెండకా గొడుగు పట్టకున్నా
సమావేశాల్లో, ప్రెస్ మీట్లో నోరు పారేసుకున్నా
జోరువాన పడ్డట్టు
చెప్పులు పడొచ్చు
కుర్చీలు మీద పడొచ్చు
అలో లక్ష్మణా అని
తప్పించుకోలేక
యే సోదరి కోక కట్టుకోక తప్పదు!
ఆకట్టుకోక తప్పదు!
**
ఇన్నాళ్ళు నమ్మిన జనాన్ని
మోసగించడానికి
సిగ్గు తీసి ఇంట్లోపెట్టి
మనస్సాక్షిని హత్యచేసిన రక్తపు చేతితో
రెండు వేళ్ళూపుతూండాలి
అవలక్షణాలన్నీ వంటబట్టకున్నా
మనుగడకే తిప్పలొస్తాయి
మళ్ళీ కొత్త గెంతు వేయాలి !
**
తెలివైన కుందేలు ముతరాసోని వలలో పడ్డట్టు
మతతత్వమంటూ రంకెలేసి
మఠాధిపతుల ఒళ్ళో వాలాలి కదా
కాలు విరగ్గొడతానన్నవాడివి
వాని కాళ్ళకాడికే చేరాలికదా
యేమొ
జనం తెలివితో
ఓటిది కాని ఓటుతో
బలంగా ఓ పోటు పొడిస్తే
కాటుకు తట్టుకోలేకపోతే
గోచి సర్దుకుని గోడ దూకటానికి సిద్ధపడాలి కదా!
**
దాదాపు పార్టీలన్ని
బారులు తెరిచి బార్లా తెరిచి
అహ్వానిస్తాయని యెల్లపుడు కలగనకు!
ఒక్కొక చోట గడీలమించిన
అడ్డుగోడలు లోపలిలి రానీవు
అప్పుడు నీగతి అధోగతి
పేడకళ్ళు, చీపురు దెబ్బలు
తప్పించుకోకలగాలి
మద్దతిచ్చే పర్టీలు
ముద్దకుడుములు పెడతాయనుకోకు
బూడిదలో పన్నిన కుక్క వైరాగ్యంలా
పాతవి గుర్తుకొస్తే
మడత పేచీలు పెట్టి
నీ బతుకు సంకరం చేసి
శంకరగిరిమాన్యాలు పట్టిస్తాయి!
**
పదవే పరమావధికాదు
ప్రజలకొరకు పనిచేయ
నియమబద్ధ, నిబద్ధత కలిగి
నాయకత్వం వహిస్తే చాలు
గౌరవాలు పొందటానికి
అంతే కాని వంకలేనమ్మ డొంకట్టుకు
యేడ్చినట్లు కబుర్లు చెప్పకు!
అజెండాలకు నీళ్ళొదిలి
జెండాలట్టుకు తిరుగకు!
ఇది ఓటుబద్ధ హెచ్చరిక!
**
11.4.2014 సాయంత్రం 5.55

Thursday, April 10, 2014

కపిల రాంకుమార్|| మినీలు|\

కపిల రాంకుమార్|| మినీలు|\
1. ఆపదలో - ఆదుకునేందుకు
బురద బాధించదు!
అపవాదు మీదపడ్డపుడు
మనసు దేనిని భరించదు!

2. పుట్టుకతో వచ్చిన బుద్ధులు
పుడకలతో కాని పోవు!
వ్యక్తిత్వానికి పడ్డ మచ్చలు
గతించినా తొలగవు!
10.4.2014 సాయంత్రం 6.30

Thursday, April 3, 2014

|ఎన్నికల కన్నెర్ర పూల గుసగుసలు

కపిల రాంకుమార్ ||ఎన్నికల కన్నెర్ర పూల గుసగుసలు||
**
అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు గుబులెన్నో
అంతులేని నేతల గొంతెమ్మ కోరికలెన్నో!
**
పనితనం బేరీజులో నూటికినూరు సున్నాలే
ఎవరి పుస్తకం తెరిచినా మసిబారిన పేజీలే!
**
లాభ సాటి స్థానం శక్తికి మించినదే
గెలుపు మేతకు యుక్తిలెన్ని పన్నాలో!
**
గతచరిత్ర విలువ మచ్చుకైనా లేకపోయె
చీకటి కోణపు కతలన్నీ చూస్తే తన్నులే!
**
ధనం మద్యం ముందు ఉద్రేకం ఆవేశం పనిచేస్తాయా?
ఉపాయం అలోచన శూన్యం కుర్ర, కర్ర పెత్తనం గెలిస్తుందా?
**
జుట్టు రంగు మారిస్తే జట్టుకు హంగులొస్తాయా?
బట్టతల ఎత్తుగడలకు పుట్టగతులున్నాయా?
**

తిట్టిన వాని పక్కనె చేరి జైకొట్టాలన్నా!
పెంచినవాణ్ణి నెట్టగ గోడలెన్నో దూకాలి
**
సిగ్గులెగ్గులొదిలేయాల్సిందే సీటుకై
తొడుగు విముఖమైనా చేరాల్సిందే!
**
వంటలు చేసో బట్టలుతుకో
కాళ్ళు పిసికో కాయం శ్రమించాల్సిందే!
**
చేరిన వాడి అవినీతి మచ్చ గోప్యమవుతుంది
వాడుకొట్టిన దెబ్బ మానుతున్న మచ్చవుతుంది!
**
వచ్చినవాడి నాలుక (నోరు) నరంలేనిదైనా
ఇచ్చవచ్చినట్లు మాట కుట్టేయాల్సిందే!
**
పార్టీ చెక్‌లలో బొక్కపెట్టి చక్కగ చెక్కులు ఫోర్జరీ భోజ్యం
కోటావాటా చాటుమాటైనా సూటుకేసులు సర్దే లౌక్యం!
**
నిలబడతానని మాటిచ్చి రాబట్టాల్సినదంతా నొక్కేసి
చివరిక్షణంలో వెధవ్వేషం త్రేంచుకుంటూ పలాయనం!
**
బతిమాలితే బిర్ర బిగుస్తారు
అర్థణాకి చెల్లనోడు బోషాణం కోరుతాడు!
**
రాష్ట్రం బ్రష్టు పడ్డా నాకేమి కేంద్రం చేరితే చాలు
వక్రమార్గం నడవాలంటే చక్రం తిప్పేది అక్కడే!
**
అమ్మకు అన్నంపెట్టనోడు అత్తకు మంచం వేస్తాడు
ఆలికి అన్యాయం చేసైనా అంగడిబొమ్మ చేరతాడు!
**
పార్టీలు మారేటోడికి జాతి లేదు! నీతి లేదు!
గెలిచామా లేదా అంతే ఎవరేమనుకుంటే ఏమి?
**
కట్టి పడేస్తే వెట్టి చాకిరి
మెతకవహిస్తే అసరుకెసరు!
అసలు సరుకే కొసరు మోసం!
పిల్లి పెసరతో పాల ఫాక్టరి!
**
ఐకమత్యం అందమైన నినాదం!
రంగులోరంగు ఆనదని
(రం) గులతో ఆరంగ్రేటం!
ఓటేసేటోళ్ళు ఓటి వెధవలా?
నోటాతో నోటుని, నోటిని సాగనంపరా!
**
3.04.2014 11.06 am

|| గాదికింది పందికొక్కు ||

|| గాదికింది పందికొక్కు ||

సుప్రభాతవేళ కోకిల పాట కోసం
మావిడిచెట్టుకేసి చూసా!
కర్ణకఠోరంగా ప్రహరీగోడమీద
కాకి గోల మాత్రం చికాకు పెడుతోంది!
కిటికీ భళ్ళున మూసిన శబ్దం విని
'' కాకి అరుపు విన్నారుగా -
ఇక ఎవరో కొంపకు దిగేటట్టున్నారు!''
మా ఇంటావిడ శరసంధానానికి
'' అదొక్కటే తక్కూవైంది మనకి,
నా మొహాన కాస్త టీ నీళ్ళు పోస్తావూ ''
అన్నమాట వినిపించుకోకుండా
'' పండుగ నెత్తిమీద పడింది దాని సంగతి
దేవుల్లాడరా? '' ఎదురు దాడి టీ తోనే!
'' అందుకోలేనంత ఎత్తులో ధరలున్నపుడు
కొన్నింటిని పక్క వారినుండి అడుక్కోక తప్పదు గాని -
సంచి యిటు యివ్వు '' అన్నా
అడుగునబడ్డ బడుగు జాతి వాళ్ళం కదా
అడుక్కోటానికి సిగ్గులొదిలేసిన వాళ్ళం కూడ!
ముక్తసరిగా ముగించి టీ చప్పరించి
రోడ్డెక్కాను కొనేవి యేమిటి, అడుక్కునేవేమిటి
నెమరువేసుకుంటూ
'' వేప పూవు, మామిడాకు, మామిడిపింది
బెల్లం ముక్క, చింతపండు '' ఉగాది ప్రసాదానికి!
''ఈ మాయదారి పండుగలు
నెలాఖరునే రావాలా? వేతన జీవుల వెతలు మాటటుంచితే
బోడి విశ్రాంత బడుగుజీవి గతేమిటీ '' అనుకుంటు
మోహనరావు అంగడి చేరాను
అడగలేక చేతులు నలుపుకుంటుంటే
'' పాత బాకీ ఎప్పుడు చెల్లుబాటు
పండగ సరుకులకు పొద్దున్నే దాపురించారు?''
మునిసిపాలిటీ వారి ఇంటిపన్ను నోటీసులా!
లేని నవ్వు తెచ్చుకుని '' నిజమే దండగే అదే పండగ ''
నా సంజాయిషి పూర్తికాకుండా, నా మీద జాలో,
నానుండి అతను వసూలు పెరుగుతందనే ఆశో! నాకు తెలీదు కాని
'' పట్టండి తప్పుతుందా. .’’ విసుక్కుంటూ యిస్తుండగా
నా దృష్టి మాత్రం ఇంకెక్కడో..... అటు పక్కో జీపు యిటుపక్కో జీపు
''మాతో వస్తే 100 రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యాని పొట్లం ''
చెరో పక్కనుంచి నన్ను లాగుతున్నటనిపించింది!
'' ఆఁ...మాతో వస్తే 100 రూపాయలు, రెండు
బిర్యాని పొట్లాలు ''
ఎన్నికల ప్రచారానికి కూలివాళ్ళ వేటలో నా దగ్గరకే వచ్చినట్టుంది!
'' ఇటు చూస్తే బాదం హల్వా అటు చూస్తే ఇడ్లీ సాంబారు ''
ఎదో అవే మాటలు శ్రీశ్రీ అన్నట్లు గుర్తుకొచ్చి,
సంచి అందుకుంటూండగా
'' ఈ బాకీ, పాత బాకీ చెల్లింపు ఎప్పుడు.''
వెంటనే జవాబు చెప్పలేను......ఎదురుగావున్న అహ్వానాన్ని
అందుకుని, మౌనంగానే ఇంటి ముఖం పట్టాను!
చలపతి దొడ్లోంచి మామిడాకులు, మామిడిపిందెలు,
వెంకట్రావు దొడ్లో వేపపూవు సేకరించి
హడవుడిగా అడుగుపెట్టానో లేదో
ఇల్లు కడిగిన బురదలో జారి బొక్క బోర్లపడ్డాను
సరుకులన్నీ బురద, రెండు బిర్యాని పొట్లాలు వెక్కిరిస్తూ!
దులుపుకుని లేచాను, హతవిధీ అనుకుంటూ,
పండుగ సంబరం మాట అటుంచి
అటు వెతికి, యిటు వెతికి (పోపుల డబ్బా, చెక్కా బీరువా వెతకగా)
యాభై జమకూడితే సరితా క్లినిక్‌కు వెళ్ళి
ఇంజెక్షన్‌ చేయించుకుని
మంచం మీద విశ్రాంతి తీసుకుని
నిద్రలోకి ఎప్పుడు జారుకున్నానో కాని
'' నాన్నా! పండుగపూట దెబ్బలు తగిలాయా? ''
అంటూ మా అమ్మాయి పలుకరింపుతో
నా బాధలు, నొప్పులు మటుమాయమైనాయంటే నమ్మండి
అలా పలకరించిన మా అమ్మాయి అభిమానానికి
అన్నీ చికాకులు మటుమాయమయ్యాయి!
''పరామర్శలు ఆపితే ఉగాది పచ్చడి తీసుకొని
అన్నం తిందురుగాని రండి '' హోం మినిస్టర్ కేకతో
ఒక్కొక్కప్పుడు గాదికింది పందికొక్కు శబ్దాలు కూడ
సుమధుర కోకిల స్వరాలవుతాయని నన్ను నేను
సముదాయించుకున్నాను! **

కపిల రాంకుమార్ 9849535033