Monday, April 13, 2015

కపిల రాంకుమార్ || ముందడుగేస్తే ||

కపిల రాంకుమార్ || ముందడుగేస్తే ||
వాడు తిట్టాలనుకుంటే
మాటల కరువులేదు
తెచ్చి పెట్టినట్టుండవు
వచ్చి పడ్డట్టుంటాయి!
వాడు కొట్టాలనుకుంటే
కత్తులు కటారులక్కర్లే
మెత్తగావున్నట్టుండే
కత్తిలాంటి చూపులు చాలు!
వాడు పట్టాలనుకుంటే
పట్టకారులక్కర్లేదు
పట్టుదొరికించుకోగల
పట్టుదలే వాడి మూడోచేయి!
లోకంలో జరిగే అక్రమాలు
తూకాలు వేయలేం
తోకలకత్తిరించగ
చిత్తశుద్ధి వాడికుంది!
తిరిగుబాటు పాఠాలు
తీయగాను చెబుతాడు
జనాల మనసు నొవ్వ కుండ
కదనానికడుగులిస్తాడు!
మనసుంటే మార్గముందని
మన యింటినుండి పనిని
మొదలిడితే చాలంటాడు
మన వూరికి అదే మేలంటాడు.!
వాడి ఊహలను చేతలను
కుదేలు చేసే కుతంత్రాల
మాయగాళ్ళ డేగకళ్ళు
నిత్యమడ్డుకోచూస్తాయ్‌
అనుక్షణం కుయుక్తులతో
విలయాలను సృష్ఠింస్తే
దీటుగా తొడగొట్టి
తుత్తునియలు చేయగలడు
జనంతా ఒక్కటిగా
చేయిచేయి కలిపి
ముందడుగేస్తే
సాధ్యమే విజయమన్నది!
దాని వెనక వున్న నమ్మకం
దాని ముందున్న లక్ష్యం
దాని అమూల్యపు తెగింపు
తరతరాల ఎర్రబాటది!
అందుకే మార్క్సిజం
అజేయమమేయం!
తొలిపొద్దు లేకిరణాల
అరుణారుణోదయం! /....12.4.2015/13.4.2015

No comments: