Thursday, April 9, 2015

|| రాజ్యహింసా? హత్యా? ? ||

కపిల రాంకుమార్‌ ||  రాజ్యహింసా? హత్యా? ? ||

ఆదాయం
ఇబ్బడి ముబ్బడి కావాలంటే
దొడ్డిదారి సంపాదన ఉండాలి
ఒకడిని తొక్కి పైకి వెళ్ళడమే
వారెంచుకునే మార్గం
తమ కోసం ప్రాణాలిచ్చేవారిని
కూలీలుగా, కమీషన్‌ దారుగా
స్మగ్లింగ్‌కు తోస్తారు
వారు భవంతుల్లో
ఏసి గదులో మందుకొడుతూంటే
వీళ్ళు అడవుల్లో
కష్టాలను భుజాన తగిలించుకుని
కడుపుమట చల్లార్చుకునేందుకు
చెప్పింది చేస్తూ
తోలుబొమ్మల్లా ఆడుతూ
ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు
**
నిఘా నేత్రాలు
కూలీల ఆచూకి చెప్పుతాయే కాని
అసలు మారాజులను పట్టలేవా
కక్కుర్తిపడకుండా వుంటే వాళ్ళు
వలలోనే చిక్కేవారు, కాని
వాటికి అక్కడో రిమోట్‌ వుంటుందేమో
దొరికిన వాడే దొంగ లేదా స్మగ్లర్‌
దొరకని వాడు దొరగారే కదా!
వాళ్ళ నెలవారి కేసుల లక్ష్యాలు చేరటానికో
బాగా పనిచేస్తూ అక్రమాలను అరికట్టుతున్నామని
మెప్పుపొందటానికో
పప్పులో కాలేసి
ఇలా అమాయకులను కాల్చేసి
కనీస విచారణ చేయాలనే మానవ హక్కును గాలికొదిలి
వాళ్ళప్రాణాలను గాలిలో ఒదిలేసి
చేతులుదులుపుకుంటే
సభ్య సమాజం చేతులు కట్టుకుని కూచుంటుందా!
ముక్త కంఠంతో ఖండించి్ ఎలుగెత్తుతుంది
మీ చేతకాని తనాన్ని ఎండగడుతుంది
**
చేతనైతే, చేవ వుంటే
ఇలాంటి దగుల్బాజీ పనులు
చేయించే నాయాళ్ళను పట్టుకోండిరా!
పొట్టకూటిగాళ్ళను పొట్టనుపెట్టుకోటంకాదు!
అందుకే బూటకపు ఎన్‌కౌంటర్లతో
రాజ్య హింసలు హత్యలు చేస్తే
సుప్రీం కోర్ట్‌ కలుగచేసుకోదా?
మానవహక్కుల కమీషన్‌ నిలదీయదా?
ఎందు నాలుక కరుచుకుంటారు?
నిజాలను దాచాలని తంటాలు పడతారు!
తస్మాత్‌ జాగ్రత - సామాన్యుడు తిరగ బడకముందే
మీ చేతివాటపు చేష్టలను, దుందుడుకు చర్యలను
సవ్యం చేసుకోండి!
లేదా
మీరోనాడూ ఇలాగే హవనం బారి పడాల్సివస్తుంది
జనాలకు జవాబుదారుగా మెలగండి
దొరలకు ఊడిగంచేస్తూ కాదు!
**
9/4/2015

No comments: