Wednesday, April 15, 2015

కపిల రాంకుమార్‌ \\ కొత్త పొద్దు పొడవాలి \\

కపిల రాంకుమార్‌ \\ కొత్త పొద్దు పొడవాలి \\

అబద్ధాల పునాదులపై
అద్దాల భవంతి కట్టి
అల్పసంఖ్య ఒట్లతో
అధిక స్థానాలు పొంది
కుక్కతోక వంకరలాంటి
పాలకవర్గ బుద్ధి మారాలంటే,
కష్టమే మరి!
మంది బలంతో
యావన్మందిని మభ్యపెట్టి
వాగ్దానాల భంగమే లక్ష్యంగా
నిత్యం జరిగే మానభంగాల సాక్షిగా
ప్రజావ్యతిరేకత పోగుచేసుకుంటున్నది!
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటంలో
గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వర్ల్డ్‌ రికార్డ్‌  బద్దలుకొట్టి
వడివడిగా బడుగుల ఆశలపై
నీళ్ళేకాదు నిప్పులు జల్లే క్రమంలో
అడుగులు వేస్తున్నది
ఒక్క కేంద్రమే కాదు
మన తెలుగు రాష్ట్రాలు ఏం తక్కువ తినలేదు
వాటిదీ అదే వరస!
వాళ్ళ సిద్ధాంతాలు వేరైనా
రాద్ధాంతాలు పెట్టి
పబ్బంఅ గడుపుకోటానికి
ఒకే వర్గస్వభావం
ఒకే రకపు రక్తకణాలతో
ఊళ్ళను ఊడ్చేయటం
నోళ్ళను నొక్కేయటం
భద్రత పేర వీరభద్రులవటం
రక్షణపేరిట భక్షకులవటం
వితరణపేర నొప్పి తగలకుండా
లాఠీదెబ్బకనబడకుండా లూఠీ చేయడం
సంక్షేమం పేర సంక్షోభాలకు తెరదీయటం
ఖజానాపూడ్చటానికి చౌకబారు ఎత్తుగడలతో
బారుల్లాంటివి రుద్ది జనాల జేబులు కత్తిరించటం
నల్లపూసల్ని మట్టిలో కలిపేసి
చల్లని విడిది గృహాల్లో విందులుచేసుకోటం
రాయితీలిస్తామని
జిరాయితీ భూముల్ని సైతం మింగి
అరచేతి వైకుంఠాలు పొందలేనివార్ని
అరదండాలతో అణగతొక్కటం
సొంత సొరుగులు నింపుకోటానికి
బెరుకులేని అవినీతిని జాతీయవృత్తిగా స్వీకరించడం
మానవ విలువలు నాశనమౌతున్న దశలో
మెరుగుపరచకపోగా
మరింత మురుగుకాల్వలోకి తోసేయటం
స్వచ్చ భారత్‌ సాకుగా
ఫోటోలు దిగటమే కాని
కుళ్ళుకొట్టే రాజకీయ క్షాళనకు తిలోదకాలిచ్చి
పైపై మెరుగులతోనే,
కాలయాపన చేసే
ఈ దిక్కుమాలిన రాజకీయ పాలకవర్గాలకు
దిమ్మతిరిగే సమాధానమియ్యాలంటే
యావద్బాధితులంతా ఏకతాటిపై
సమరశీల పోరాటపు కొత్తబాట ఎన్నుకోవాల్సిందే!
ప్రపంచీకరణ, గ్లోబలీకరణ, తీవ్రవాద,
మతతత్వ ఉగ్రవాదాలకతీతమైన
కొత్త పొద్దులోని లేవెలుగుల అరుణకాంతులకై
కదం కదం కదిపి పిడికిలి బిగించేందుకు
అనివార్యం మరో ఉద్యమమిప్పుడు !
15.4.2015

No comments: